సైకాలజీ అంటే ఇష్టం అంటోంది..

మా మనవరాలు పదో తరగతి చదువుతోంది. సైకాలజీలో కెరియర్‌ను ఎంచుకోవాలని అనుకుంటోంది. ఇందుకోసం ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ తీసుకుంటే మేలు?

Published : 07 Mar 2023 00:27 IST

మా మనవరాలు పదో తరగతి చదువుతోంది. సైకాలజీలో కెరియర్‌ను ఎంచుకోవాలని అనుకుంటోంది. ఇందుకోసం ఇంటర్మీడియట్‌లో ఏ గ్రూప్‌ తీసుకుంటే మేలు?

డి.రాఘవరావు

దో తరగతి చదివేప్పుడే సైకాలజీ లాంటి సబ్జెక్టును చదవాలని నిర్ణయించుకోవడం అనే విషయాన్ని మీరంత సీరియస్‌గా తీసుకోకండి. 14, 15 సంవత్సరాల వయసులో పిల్లలకు కెరియర్‌ నిర్ణయాలు తీసుకొనేంత పూర్తి సామర్థ్యం ఉండదు. ఇప్పుడు తీసుకొన్న నిర్ణయాలు, మరో సంవత్సరం తరువాత మారిపోయే అవకాశాలు ఎక్కువ. ఇంటర్‌లోనే సైకాలజీ కాంబినేషన్‌తో ఉన్న కోర్సులు తీసుకుంటే డిగ్రీలో ఇంజినీరింగ్‌/ మెడిసిన్‌/ బీఎస్సీ లాంటి కోర్సుల్ని చదివే అవకాశాన్ని కోల్పోతారు. కానీ ఇంటర్‌లో ఏ కోర్సులు చదివినా డిగ్రీలో బీఏ (సైకాలజీ/ ఇంగ్లిష్‌/ ఎకనామిక్స్‌/జర్నలిజం/ హిస్టరీ/ పొలిటికల్‌ సైన్స్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌/ రూరల్‌ డెవలప్‌మెంట్‌)/ బీకాం/ బీబీఏ/ ఐదు సంవత్సరాల లా కోర్సు/ హోటల్‌ మేనేజ్‌మెంట్‌/ ఫ్యాషన్‌ టెక్నాలజీ/ ఫైన్‌ ఆర్ట్స్‌ లాంటి కోర్సులను కూడా చదివే అవకాశం ఉంటుంది. మీ మనవరాలు సైకాలజీ సబ్జెక్టును ఎందుకు ఇష్టపడుతోందో, తనకు ఆ సబ్జెక్టుపై ఎంత అవగాహన ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు పిల్లలు మ్యాథ్స్‌/ సైన్స్‌ సబ్జెక్టు అర్థంకాక, ఆ సబ్జెక్టులను వదిలివేయడానికి ఇలాంటి కోర్సులను ఎంచుకొని, కొన్ని సంవత్సరాల తరువాత, తెలిసీ తెలియని వయసులో తప్పు నిర్ణయం తీసుకొన్నామని బాధ పడతారు. అమ్మాయి చదివే స్కూల్‌ ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాల్ని కూడా తెలుసుకోండి. అవకాశం ఉంటే ఆమెను మంచి కెరియర్‌ కౌన్సెలర్‌ దగ్గరికి తీసుకొని వెళ్ళండి. అన్ని రకాలుగా ఆలోచించిన తరువాతే సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు