ఇంజినీరింగ్‌ సర్వీస్‌ సాధించాలంటే...

యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ) మూడు దశల్లో ఉంటుంది. నోెటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలు ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేశాక ప్రిలిమినరీ రాయాలి

Updated : 27 Apr 2023 05:17 IST

* ఏడాదిపాటు కృషి చేస్తే ఈఎస్‌ఈలో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంటుందా? ఎలా సన్నద్ధం కావాలి?
మోహన్‌రెడ్డి

యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్ష (ఈఎస్‌ఈ) మూడు దశల్లో ఉంటుంది. నోెటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలు ఉన్నవారు పరీక్షకు దరఖాస్తు చేశాక ప్రిలిమినరీ రాయాలి. ప్రిలిమ్స్‌లో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌, సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో రెండు ఆబ్జెక్టివ్‌ పేపర్లు మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్దతిలో ఉంటాయి. తప్పు సమాధానాలకు 0.33 చొప్పున రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రిలిమినరీలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు ఆరు నుంచి ఏడు రెట్ల సంఖ్యలో అభ్యర్ధులను మెయిన్స్‌ రాయడానికి అవకాశం కల్పిస్తారు. మెయిన్స్‌ పరీక్షలో ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌లో రెండు పేపర్లు వ్యాసరూపంలో రాయాలి. మెయిన్స్‌ పరీక్ష ప్రతిభ ఆధారంగా, ఆ సంవత్సరంలో ఉన్న ఖాళీల సంఖ్యకు రెండు రెట్ల సంఖ్యలో ఇంటర్వ్యూకి అర్హత కల్పిస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూల్లో వచ్చిన మార్కులన్నింటినీ కలిపి మెరిట్‌ లిస్ట్‌ తయారు చేస్తారు.
పరీక్ష సన్నద్ధత విషయానికొస్తే- జనరల్‌ స్టడీస్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌లో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన ప్రస్తుత సమస్యలు, లాజికల్‌ రీజనింగ్‌, అనలిటికల్‌ ఎబిలిటీ, ఇంజినీరింగ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్‌, న్యూమరికల్‌ అనాలిసిస్‌, డిజైన్‌, డ్రాయింగ్‌, భద్రత సూత్రాలు, ఉత్పత్తి, నిర్మాణంలో ప్రమాణాలు, నాణ్యతా పద్ధతులు, నిర్వహణ, సేవలు, ఎనర్జీ, పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, క్షీణత, క్లైమేట్‌ ఛేంజ్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌, మెటీరియల్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీస్‌ ఆధారిత సాధనాలు, నెట్‌వర్కింగ్‌, ఈ-గవర్నెన్స్‌, టెక్నాలజీ ఆధారిత విద్య, ఇంజినీరింగ్‌ వృత్తిలో నీతి, విలువలు లాంటి అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. పైన పేర్కొన్న అంశాలన్నీ, ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివినవారు ప్రత్యేకమైన శిక్షణ లేకుండానే పరీక్ష రాయగలిగే స్థాయిలో ఉంటాయి. కానీ, ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్న చాలామంది గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను, టెస్ట్‌ పేపర్‌ గైడ్‌లను చదివి పరీక్షల్లో ఉత్తీర్ణులవడానికి ప్రయత్నిస్తున్నందున, అన్నిపేపర్‌లకూ ప్రత్యేక శిక్షణ అవసరం అవుతోంది.
ఈఎస్‌ఈలో మంచి ర్యాంకు సాధించాలంటే ఎంతకాలం పడుతుందనేది వారి సామర్థ్యం, కృషి, పట్టుదలపై ఆధారపడి ఉంటుంది. మొదటి ప్రయత్నంలోనే సర్వీస్‌ సాధించినవారు, చాలా ప్రయత్నాల్లో కూడా సాధించలేనివారూ ఉన్నారు. ఈఎస్‌ఈలో విజయవంతం కావడానికి - మీరు పరీక్ష కోసం ఎంచుకున్న ఇంజినీరింగ్‌ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలపై గట్టి పట్టు ఉండాలి. ఇంజినీరింగ్‌  నైపుణ్యాలు, అనువర్తనాలపై చాలా ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో పాటు వ్యాసరూప ప్రశ్నలూ సమర్థంగా రాయాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకాలను చదివి సొంతంగా నోట్సు తయారు చేసుకోండి. గతంలో ఇంజినీరింగ్‌ సర్వీస్‌ పరీక్షలో విజయం సాధించినవారితో మాట్లాడి, మరిన్ని మెలకువలు తెలుసుకోండి, ఈఎస్‌ఈ సాధించాలనే మీ కల నెరవేర్చుకోండి.
ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు