మీ మాట.. ఏ తీరు?

‘మాట’కు ఇతరులను మెప్పించే, ఒప్పించే శక్తి ఉంటుంది. కానీ అదే కటువుగా ఉంటే.. ఎదుటివారి మనసును నొప్పిస్తుంది కూడా. ఆ తర్వాత క్షమాపణ చెప్పినా ఫలితం ఉండకపోవచ్చు.

Updated : 29 May 2023 04:25 IST

‘మాట’కు ఇతరులను మెప్పించే, ఒప్పించే శక్తి ఉంటుంది. కానీ అదే కటువుగా ఉంటే.. ఎదుటివారి మనసును నొప్పిస్తుంది కూడా. ఆ తర్వాత క్షమాపణ చెప్పినా ఫలితం ఉండకపోవచ్చు. విద్యార్థుల విషయానికి వస్తే.. చిన్న విషయాలకే వారి మధ్య మనస్పర్థలు వస్తుంటాయి. అవి వారి మధ్య దూరం పెంచవచ్చు. ఒక్కోసారి ఘర్షణలకూ దారితీయొచ్చు. అనాలోచితంగానో, అహంకారంతోనో తొందరపాటుతో మాట్లాడితే ఎదుటివారి మనసు గాయపడుతుంది. అది సరికాదని వివరిస్తుందీ కథ.

ఒకసారి కాలేజీ విద్యార్థులను సమ్మర్‌ క్యాంప్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం సమయంలో అందరినీ వృత్తాకారంలో కూర్చోమని.. ఆరోజు జరిగిన సంఘటనల్లో ఎక్కువగా ప్రభావితం చేసినదాన్ని గురించి చెప్పమన్నారు లెక్చరర్‌. ఎదుటి గ్రూప్‌లోని విద్యార్థి మాట్లాడిన తీరు తనను నొప్పించిందని బాధపడుతూ చెప్పింది సాత్విక. అయితే తన మాట తీరే అంత అనీ, ఆమెను బాధపెట్టాలన్న ఉద్దేశంతో తానలా మాట్లాడలేదనీ సమర్థించుకున్నాడా విద్యార్థి.

అప్పుడు లెక్చరర్‌ ఓ టూత్‌పేస్టును తెప్పించారు. విద్యార్థులంతా ఆసక్తిగా గమనించసాగారు. టూత్‌పేస్ట్‌ ఉన్న ట్యూబును నొక్కగానే కొంత పేస్టు బయటకు వచ్చేసింది. ‘ఇప్పుడు ఈ పేస్టునంతా మళ్లీ ట్యూబ్‌లోకి పంపిద్దాం’ అంటూ లోపలకు పంపాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు.

‘చూశారుగా? మన మాటల సంగతీ ఇంతేే! నోటి నుంచి బయటకు వచ్చిన మాటలను తిరిగి లోపలికి తీసుకోలేం. తొందరపాటు మాటలతో ఎదుటివాళ్లను బాధపెట్టి ఆ తర్వాత క్షమించమని వేడుకున్నా ఫలితం ఉండదు. సౌమ్యంగా, మృదువుగా, మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకుంటే ఈ సమస్య ఉండదు.’ అంటూ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని