ఏ బోర్డు ఎంత మెరుగు?

మా అమ్మాయి ఐదోతరగతి చదువుతోంది. ఆరు నుంచి సీబీఎస్‌ఈ లేదా ఐసీఎస్‌ఈ బోర్డ్‌ సిలబస్‌లో చేర్పిస్తే మంచిదంటున్నారు స్నేహితులు.

Published : 03 Jun 2024 00:09 IST

మా అమ్మాయి ఐదోతరగతి చదువుతోంది. ఆరు నుంచి సీబీఎస్‌ఈ లేదా ఐసీఎస్‌ఈ బోర్డ్‌ సిలబస్‌లో చేర్పిస్తే మంచిదంటున్నారు స్నేహితులు. మెడికల్, ఇంజినీరింగ్‌ సీట్లే లక్ష్యంగా కాకుండా.. పరిజ్ఞానం పెంచడంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే బోర్డు ఏది?

అమూల్య

స్టేట్‌ బోర్డుతో పోల్చినప్పుడు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌.. రెండూ విభిన్నమైనవే. సాధారణంగా స్టేట్‌ బోర్డు పరిధిలో ఉన్న చాలా పాఠశాలల్లో మార్కులపై, పరీక్షా ఫలితాల శాతంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా సందర్భాల్లో విద్యార్థులు పొందే మార్కులకూ, వారికి ఉన్న విజ్ఞానానికీ పొంతన ఉండట్లేదు. పది, ఇంటర్‌లలో 90 శాతం కంటే పైన మార్కులు పొందుతున్న చాలామంది జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో కనీస మార్కులు సాధించలేక పోతున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల్లో ఎక్కువ మార్కులు పొందలేకపోయినప్పటికీ జాతీయ, అంతర్జాతీయ ప్రవేశ పరీక్షల్లో కొంతమేరకు మెరుగైన ప్రతిభను చూపగలుగుతున్నారు. ఈ బోర్డుల్లో చదివినవారిలో చాలామందికి మార్కులకంటే నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి.

విషయ పరిజ్ఞానం పెంచుకొంటూ వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడే విద్య కావాలనుకుంటే సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో చదివితే మెరుగైన ఫలితాలు లభించవచ్చు. రెండు బోర్డుల్లో, సీబీఎస్‌ఈ సిలబస్‌ కొంతమేరకు సైన్స్, మ్యాథ్స్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ, జేెఈఈ, నీట్‌ లాంటి పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉపయోగపడేలా ఉంటుంది. ఐసీఎస్‌ఈలో.. సైన్స్, మ్యాథ్స్‌లతో పాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ సబ్జెక్టులకూ ప్రాధాన్యమిస్తారు. ఐసీఎస్‌ఈ బోర్డుకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లో ఇతర బోర్డులతో పోల్చినప్పుడు ఫీజు ఎక్కువ. స్టేట్‌ బోర్డుతో సహా అన్నిరకాల బోర్డుల సిలబస్‌లు విద్యార్థి విజ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్నీ పెంచే విధంగానే తయారుచేశారు. వాటిని ఆచరించే పాఠశాలను బట్టి విద్యా నాణ్యత ఉంటుంది. కాబట్టి బోర్డుతో పాటు మంచి పాఠశాలను కూడా ఎంచుకొంటేనే మీ అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని