బ్యాక్‌లాగ్స్‌ ఉంటే సమస్యేనా?

బీటెక్‌ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్నాను. సెమ్‌-1, 3, 5 బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా పరీక్ష ఫీజు కట్టలేదు. తర్వాత సెమ్‌లో మళ్లీ రాయొచ్చా? బ్యాక్‌లాగ్స్‌ రాసి పాసైతే త్వరగా ఉద్యోగం రాదని విన్నాను.

Published : 04 Jun 2024 00:21 IST

బీటెక్‌ ఆరో సెమిస్టర్‌ పరీక్షలు రాస్తున్నాను. సెమ్‌-1, 3, 5 బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. ఆర్థిక సమస్యల కారణంగా పరీక్ష ఫీజు కట్టలేదు. తర్వాత సెమ్‌లో మళ్లీ రాయొచ్చా? బ్యాక్‌లాగ్స్‌ రాసి పాసైతే త్వరగా ఉద్యోగం రాదని విన్నాను. ఈ డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించొచ్చా?

పి.శ్యామ్‌

బ్యాక్‌ లాగ్స్‌ ఉన్నాయన్నారు కానీ, ఎన్ని  సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యారో చెప్పలేదు. మీరు ఇంజినీరింగ్‌ చదువుతున్న కళాశాల ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది? ఒక్కో వర్శిటీలో ప్రమోషన్‌ నియమాలు ఒక్కో రకంగా ఉంటాయి. కొన్ని విశ్వవిద్యాలయాల్లో మూడో సంవత్సరం చదవాలంటే మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నాలుగో సంవత్సరం చదవాలంటే రెండో సంవత్సరంలో ఉన్న అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైవుండాలి. కొన్ని యూనివర్సిటీల్లో మాత్రం ప్రతి సెమిస్టర్‌లో కనీసం 50 శాతం సబ్జెక్టుల్లో పాసైతేనే తరువాతి సెమిస్టర్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బ్యాక్‌లాగ్స్‌పై గరిష్ఠ పరిమితి కూడా ఉంటుంది. మీరు చదువుతున్న కళాశాలకు సంబంధించిన విశ్వవిద్యాలయ నిబంధనలకు లోబడి మీరు ఏడో సెమిస్టర్‌ చదవడానికి అర్హత ఉంటుంది. కానీ బ్యాక్‌లాగ్స్‌ రాయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

బ్యాక్‌ లాగ్స్‌ రాసి, ఉత్తీర్ణత పొందితే ఉద్యోగాలు రావనుకోవడం అపోహ మాత్రమే. ఇటీవల ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందుతున్నవారిలో దాదాపు సగం మంది విద్యార్థులు కనీసం ఒక సెమిస్టర్‌లో అయినా సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణత సాధించినవారే! కాకపోతే వారిలో చాలామంది బ్యాక్‌లాగ్స్‌ ఉన్నప్పటికీ ఇంజినీరింగ్‌ని నాలుగేళ్లలో పూర్తి చేస్తున్నారు. మీరు కూడా బ్యాక్‌లాగ్స్‌ అన్నింటినీ నాలుగేళ్ల లోపే పూర్తిచేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కుదరకపోయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. అతి కొన్ని ప్రైవేటు సంస్థలు మాత్రమే ఇంజినీరింగ్‌ డిగ్రీని బ్యాక్‌లాగ్స్‌ లేకుండా నాలుగు సంవత్సరాల వ్యవధిలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్న నియమాన్ని పెడుతున్నాయి. చాలా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకూ, ప్రభుత్వ ఉద్యోగాలకూ ఇలాంటి నిబంధన ఏమీ లేదు. కాబట్టి మీరు నిరభ్యంతరంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. మీకు ఆసక్తి ఉంటే బీటెక్‌ తరువాత ఎంబీఏ కానీ, ఎంటెక్‌ కానీ మంచి విద్యాసంస్థలో, ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే బీటెక్‌లో బ్యాక్‌లాగ్స్‌ వల్ల జరిగిన నష్టాన్ని కొంతమేరకు నివారించవచ్చు. గతంలో జరిగిన తప్పిదాల గురించి బాధపడకుండా గుణపాఠాలు నేర్చుకొని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని