సాఫ్ట్‌వేరా?సర్కారీ కొలువా?

బీటెక్‌ 2015లో పూర్తిచేసి ఆరేళ్లు మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం చేశా. సంతృప్తిగా లేక ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ కోర్సు ప్రయత్నించినా కుదర్లేదు. ఇప్పుడు జాబ్‌ మానేసి ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నాను.

Updated : 17 Jun 2024 09:15 IST

బీటెక్‌ 2015లో పూర్తిచేసి ఆరేళ్లు మార్కెటింగ్‌ రంగంలో ఉద్యోగం చేశా. సంతృప్తిగా లేక ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ కోర్సు ప్రయత్నించినా కుదర్లేదు. ఇప్పుడు జాబ్‌ మానేసి ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్నాను. ఇది సరైన నిర్ణయమేనా? సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకోనా?

కృష్ణ కోటి

  • మీరు తొమ్మిది సంవత్సరాల క్రితం బీటెక్‌ పూర్తి చేశారంటే మీ వయసు 31 ఏళ్లు ఉండొచ్చు. చాలా కేంద్రప్రభుత్వ, బ్యాంకు, పోలీసు ఉద్యోగాలకు జనరల్‌ కేటగిరీ అభ్యర్థుల వయః పరిమితి 18-32 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. సామాజిక రిజర్వేషన్లు ఉన్నవారికి మరికొన్ని సంవత్సరాల వెసులుబాటు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ ఉద్యోగాలకు అయితే జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 42/44 సంవత్సరాల వయసు వరకు పోటీపడవచ్చు. బీటెక్‌లో మీది ఏ బ్రాంచో చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు కూడా వయః పరిమితి 42/ 44 సంవత్సరాల వరకు ఉంది. కానీ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలకు విపరీతమైన పోటీ ఉంటుంది. కొన్ని వందల ఉద్యోగాలకు లక్షలమంది పోటీ పడుతున్నారు. చాలా సందర్భాల్లో ఉద్యోగ నోటిఫికేషన్‌ నుంచి ఫలితాల విడుదల వరకు చాలా సమయం పడుతుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగంపై ఆసక్తి ఉంటే కనీసం రెండేళ్లు గట్టిగా కృషి చేస్తే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది.  ఆన్‌లైన్‌లో సాఫ్ట్‌వేర్‌ కోర్సులు నేర్చుకొనే ప్రయత్నం చేసి సఫలం కాలేదని చెప్పారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో సాఫ్ట్‌ వేర్‌ కోర్సులు నేర్చుకొని ఆ రంగంలో కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయవచ్చు. మీరు ఆరేళ్లు మార్కెటింగ్‌ రంగంలో పనిచేశారు కాబట్టి డిజిటల్‌ మార్కెటింగ్, మార్కెటింగ్‌ అనలిటిక్స్‌ సంబంధిత సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేస్తే మీ ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. క్యాట్‌ లాంటి ప్రవేశ పరీక్ష రాసి, ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ / ఆఫ్‌లైన్‌ ఎంబీఏ చదివే ప్రయత్నం చేయొచ్చు. చివరిగా.. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నమా, సాఫ్ట్‌వేర్‌ కోర్సులు చేయడమా అనేది మీ వ్యక్తిగత ఆర్థిక స్థితి, పట్టుదల, పోటీపడే తత్వం, ఓపిక లాంటి చాలా అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయించుకోండి. ఏ రంగంలో అయినా ఉద్యోగాలకు పోటీ ఎక్కువే. మీలో విషయ పరిజ్ఞానం, ప్రతిభ, నైపుణ్యాలు ఉంటే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. 

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని