ఏ బ్రాంచి మేలు?

ఇంటర్మీడియట్‌ పాసై.. ఈఏపీసెట్‌లో అర్హత సాధించాను. సివిల్‌ లేదా మెకానికల్, ఈసీఈ... బ్రాంచీల్లో ఏది తీసుకుంటే త్వరగా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు? 

Published : 04 Jul 2024 00:10 IST

ఇంటర్మీడియట్‌ పాసై.. ఈఏపీసెట్‌లో అర్హత సాధించాను. సివిల్‌ లేదా మెకానికల్, ఈసీఈ... బ్రాంచీల్లో ఏది తీసుకుంటే త్వరగా ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు?

 పి. వైష్ణవి

 ఇంజినీరింగ్‌ ప్రోగ్రాంలను లక్షలమంది చదువుతూ ఉంటే, ప్రభుత్వ ఇంజినీర్ల ఉద్యోగాలు మాత్రం కొన్ని వేలల్లో మాత్రమే ఉంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది విద్యార్థులు కంప్యూటర్‌ సైన్స్‌ రంగానికి సంబంధించిన బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ చదవడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ లాంటి సంప్రదాయ బ్రాంచుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఒక దేశ సర్వతోముఖాభివృద్ధికి అన్ని బ్రాంచీలకు సంబంధించిన ఇంజినీర్లూ అవసరమే! మీరు త్వరగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకొంటే సివిల్‌/ ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌ బ్రాంచీలను ఎంచుకొనే ప్రయత్నం చేయండి.

సివిల్, ఎలక్ట్రికల్‌లలో ఇంజినీరింగ్‌ చదివినవారికి కేంద్రప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలూ ఉంటాయి. సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ చదివినవారు యూపీఎస్‌సీ నిర్వహించే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు అర్హులవుతారు. పైన చెప్పిన బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ చదివినవారు గేట్‌లో మెరుగైన ప్రతిభ కనపరిస్తే, మరే రాత పరీక్ష లేకుండా కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు నేరుగా అర్హులవుతారు. గేట్‌లో, ఇంటర్వ్యూలో మంచి ప్రతిభను కనబరిస్తే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు.

ఒక్కో సంవత్సరం ఒక్కో బ్రాంచిలో ఉద్యోగావకాశాలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. నూతన పెన్షన్‌ విధానం అమల్లోకి వచ్చాక ఉద్యోగ భద్రత మినహా, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల మధ్య పెద్దగా తేడా లేదు. ఎలాంటి ఉన్నత విద్యను అభ్యసించాలి అనేది ఉద్యోగం కోసమే కాకుండా మీ ఆసక్తి, అభిరుచిలకు అనుగుణంగా ఎంచుకోండి. చివరిగా త్వరగా ఉద్యోగం సాధించడమనేది మీ విషయపరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు లాంటి చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇంజినీరింగ్‌ చదివాక ఆసక్తి ఉంటే డిగ్రీ అర్హత ఉన్న కేంద్ర, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే ప్రభుత్వ పోటీ పరీక్షలు కూడా రాసే అవకాశం ఉంటుంది.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని