యూకే విద్యకు సహాయం!

కామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విదేశాల్లో పీజీకి అయ్యే ఖర్చంతా పొందే వీలుంది. అయితే గమ్యస్థానం యూకే అయినవారే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ

Updated : 11 Jan 2021 06:50 IST

కామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌

కామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా విదేశాల్లో పీజీకి అయ్యే ఖర్చంతా పొందే వీలుంది. అయితే గమ్యస్థానం యూకే అయినవారే దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో ఉన్నతవిద్యను అభ్యసించాలనుకునే ఆర్థికంగా వెనుకబడినవారికి ‘కామన్‌వెల్త్‌ మాస్టర్స్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌’ ద్వారా ఏటా అవకాశం కల్పిస్తారు. 2021కిగానూ సంబంధిత ప్రకటనను కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ ఉపకార వేతనాలను యూకేకు చెందిన కామన్‌వెల్త్‌ కమిషన్‌ అందజేస్తోంది. దీనిద్వారా అర్హత ఉన్నవారికి అభ్యర్థి ఎంచుకున్న పీజీ ప్రోగ్రామ్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని అందజేస్తారు. ఏడాది వ్యవధిగల పీజీ ప్రోగ్రామ్‌లను ఎంచుకున్నవారికే ఈ అవకాశం.
ఈ ఏడాది సెప్టెంబరు/ డిసెంబరు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి భారతీయుడై, ఇక్కడ శాశ్వత నివాసం గలవారై ఉండాలి. యూకేలో సెప్టెంబరు/ అక్టోబరుల్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరంలో చేరగలగాలి. బ్యాచిలర్‌ డిగ్రీని అక్టోబరు 2021కల్లా పూర్తి చేసుకుని ఉండాలి. ఈ స్కాలర్‌షిప్‌ లేకపోతే యూకేలో విద్యను అభ్యసించగల స్థోమత లేనివారు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలను ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది.
ఇదివరకే విద్య/ శిక్షణ/ స్పెషలైజేషన్‌ నిమిత్తం విదేశాలకు స్కాలర్‌షిప్‌/ సొంత ఖర్చులతో పూర్తిచేసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ కోర్సులు ఆరు నెలలు మించకూడదు. గత వరుస రెండేళ్లుగా భారత్‌లోనే ఉండటం తప్పనిసరి. యూకే విశ్వవిద్యాలయం నుంచి 2021 సెప్టెంబరు/ అక్టోబరు ఇన్‌టేక్‌కు దరఖాస్తు చేసుకుని ఉండాలి. సెప్టెబరు/ అక్టోబరు 2020 విద్యాసంవత్సరంలో ప్రవేశం పొంది, డిఫర్‌ చేసుకున్నవారూ దరఖాస్తుకు అర్హులే.
ఆసక్తి ఉన్నవారు కేంద్ర విద్యాశాఖ, కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌ కామిషన్స్‌ ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ సిస్టమ్‌ల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వెబ్‌సైట్లు: http://proposal.sakshat.ac.in/scholarship/  https://fs29.formsite.com/m3nCYq/agyhpf9d2p/index.html

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: ఫిబ్రవరి 21, 2021.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని