విదేశాల్లో ఉద్యోగమా? ఒక్క క్షణం ఆగండి!
విదేశీ ఉద్యోగం
విదేశాల్లో బతకాలనే కోరికతోనో... ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతోనో.. మనలో కొందరు విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత ఖర్చయినా పర్వాలేదు, ఫారిన్ వెళ్తే చాలనుకుంటారు. ఇటువంటి వారి ఆశలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు మోసగిస్తున్నారు. ఇటీవల విదేశాల్లో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరు చెప్పి చిత్తూరుకు చెందిన యువకుడిని కంబోడియాలో బంధించి చిత్రహింసలకు గురిచేసిన విషయం అందరినీ విస్మయపరిచింది. ఇలాంటి మోసాల బారిన
పడకుండా యువత అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
సదరు కంపెనీ లిఖితపూర్వకంగా ఎటువంటి కాంట్రాక్ట్‌లు, అగ్రిమెంట్లు చేయడానికి ఇష్టపడకపోతుంటే ఇంకోసారి ఆలోచించండి.
ఆన్‌లైన్ మోసాలు, సైబర్‌క్రైమ్‌కి పాల్పడే ముఠాలు సిబ్బంది కోసం ఇలాంటి పనులకు పాల్పడుతున్నాయి.వీటి బారిన పడకుండా ఉండేందుకు అప్రమత్తతే శ్రీరామరక్ష.
‘విదేశాలకు వెళ్లడమంటే ఆషామాషీ కాదు... ఆమాత్రం ఖర్చవుతుంది మరి’ ‘పని చాలా సులువండీ... ఏసీలో కూర్చుని లక్షలు సంపాదించే ఉద్యోగం!’ ‘మీవాడికి రెండు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి కదండీ... అందువల్ల కొంచెం ఎక్కువ ఫీజు కట్టాలి’ ఇలాంటి మాటలు నమ్మి మోసపోవడం ఇకనైనా మానుకుందాం!
* బాగా చదువుకుని, స్థానికంగా పరిశ్రమల్లో పనిచేసి, ఆ అనుభవంతోనూ కంపెనీ సాయంతోనూ విదేశాలకు వెళ్లే వారికి అంతగా ఇబ్బంది లేకపోవచ్చు. ఎటొచ్చీ కన్సల్టెన్సీల ద్వారా విదేశాల్లో ఉద్యోగ జీవితం మొదలుపెట్టాలి అనుకునేవారికే అసలు సమస్య ఎదురవుతోంది.
* ప్రస్తుతం ఇలా డబ్బు తీసుకుని విదేశాలకు పంపే సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. అందులో ఉన్నతశ్రేణి, నమ్మదగిన సంస్థలూ ఉన్నాయి... మోసాలకు ఒడిగట్టేవీ ఉన్నాయి... అందువల్ల ఏ సంస్థను, ఏ వ్యక్తులను ఎంచుకుంటున్నామనేది సరిగ్గా ఆలోచించుకోవాలి. కంపెనీ గతం - దీని ద్వారా వెళ్లిన అభ్యర్థుల వర్తమానం... అన్ని వివరాలూ తెలుసుకున్నాకే ఓ నిర్ణయానికి రావాలి.
* కొన్ని కన్సల్టెన్సీలు ఎలా అయినా తమ వ్యాపారం నడవటం కోసం అభ్యర్థులను తప్పుడు మార్గాలు, నకిలీ ధ్రువపత్రాల సాయంతో పంపాలని చూస్తుంటాయి. అభ్యర్థులు కూడా తమ పని అవుతుందనే ఆశతో వారికి సహకరిస్తుంటారు. కానీ అది ఎప్పటికైనా ప్రమాదమే అనే నిజాన్ని తెలుసుకోవాలి. ఒక్కసారి ఆ దేశపు అధికారులు కనుక గుర్తిస్తే... తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది.
* ‘ఇప్పుడు కాకపోతే మళ్లీ ఇలాంటి అవకాశం రాదు, త్వరగా మీ నిర్ణయం చెప్పండి’ అంటూ తొందరపెట్టి ఏదో ఒకటి ఒప్పించేలా ఒత్తిడి చేస్తుంటే సరే అనకండి. మీకు ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా వారి వలలో పడేయడానికే ఆ ఎత్తులన్నీ!
* మీరు అడుగుపెట్టాలని అనుకుంటున్న రంగంలో.. ఇప్పటికే అనుభవం ఉన్నవారిని కచ్చితంగా వివరాలు అడిగి తెలుసుకోండి. మీరు వెళ్లాలనుకుంటున్న దేశం, అక్కడ జాబ్ ఆఫర్ చేస్తున్న కంపెనీ, చెప్పిన జీతం.. ఇలా అన్నీ వివరించి వాస్తవమేనా కాదా అన్నది చెక్ చేసుకోండి.
* నమ్మకం అన్నివేళలా మంచిది కాదు. ‘బాగా తెలిసినవాళ్లు... ఇతరులకు కూడా ఇలా ఇప్పించారు... చాలామంది వెళ్తున్నారు’ ఇలా మనకు మనమే సమాధానం చెప్పుకొని వెళ్లేందుకు సిద్ధపడటం ప్రమాదాలకు తావిస్తుంది.
* ముఖ్యంగా బ్యాక్‌లాగ్స్ పూర్తిచేయలేక పట్టా చేతిలో లేనివారు, త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నవారు ఇలాంటి వాటిపై అధికంగా ఆసక్తి కనబరుస్తున్నారు. వీరే అక్రమార్కులకు సులభమైన టార్గెట్ అయిపోతున్నారు.
* ఇలాంటి మోసాల బారిన పడకుండా మొట్టమొదట చేయాల్సిన పని వెళ్లేచోటి గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవడం. ఏ దేశం వెళ్లాలనుకున్నా, ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకున్నా, ముందు అక్కడి పరిస్థితులు, పనిచేయాల్సిన సంస్థ తీరుతెన్నులు, ఉద్యోగ ప్రకటన నిజమా కాదా, వెళ్తున్న పద్ధతి సరిగ్గా ఉందా లేదా అనేది పూర్తిగా అధ్యయనం చేయాలి... అన్ని వివరాలూ తెలుసుకోవాలి. గుడ్డిగా వ్యక్తులను నమ్మడం ఎట్టిపరిస్థితుల్లోనూ శ్రేయస్కరం కాదు.
* నమ్మబుద్ధి కాని రీతిలో జీతభత్యాలు, వసతి కల్పిస్తామని చెబుతున్నా... తక్షణ అవసరం వల్ల ఇలా రిక్రూట్ చేసుకుంటున్నాం అని నమ్మబలికినా, ప్రాసెసింగ్ ఫీజు కింద డబ్బు పంపించాలని కోరినా, ‘మీరు మాపట్ల నిజమైన ఆసక్తితో ఉన్నార’ని రుజువు చేసేందుకు డబ్బులడిగినా అనుమానించాల్సిందే. ఇవన్నీ మోసకారులు వాడే అబద్ధాలే.
* అయాచితంగా ఏదీ రాదనే విషయాన్ని గమనించాలి. డబ్బు కడితే ఉద్యోగం వచ్చేసేదానికి ఇన్ని చదువులు, ఇంత కష్టపడి ఏళ్లపాటు సన్నద్ధత ఎందుకు... మిగతావారంతా తెలివితక్కువై కష్టపడుతున్నారా... అనే ఆలోచన ఉండాలి. సులభమైన మార్గాల్లో స్థిరపడాలనే అత్యాశకు పోతే... చివరికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే జాగ్రత్త అవసరం.
ఇలా జరుగుతున్న మోసాలపై ఇటీవల కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశ యువతను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఐటీ విభాగంలో పనిచేసేవారికి మోసగాళ్లు వల పన్నుతున్నారనీ, జాగ్రత్తగా ఉండాలనీ కోరింది.
వాట్సాప్ స్టేటస్ నమ్మి తప్పు చేశా..
పుదుచ్చేరిలో గుడ్‌విల్ కన్సల్టెన్సీ అనే సంస్థను నమ్మడమే నేను చేసిన తప్పు. ఆ సంస్థను నడిపించే వ్యక్తి నాకు రెండేళ్లుగా తెలుసు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తాం అంటూ రోజూ వాట్సాప్ స్టేటస్‌లు పెట్టేవాడు. తన ద్వారా వీరంతా ఉద్యోగాలు పొందారు అంటూ ఐడీ కార్డులు కూడా పోస్ట్ చేసేవాడు. అది చూడగా చూడగా నిజమని నమ్మేసి నేనూ ఉద్యోగం కావాలని సంప్రదించాను. రూ.4 లక్షలు ఇస్తే కంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగం, పెద్ద కంపెనీ, నెలకు రూ.లక్ష జీతం అని నమ్మబలికాడు. మూడు నెలలపాటు టూరిస్ట్ వీసా మీద ఉంటే, ఆపైన వర్క్ పర్మిట్ వస్తుంది అని చెప్పాడు. తీరా అక్కడికి వెళ్లాక నన్ను వాళ్లకి 3 వేల డాలర్లకు అమ్మేసినట్టు అక్కడి ముఠా చైనీయులు చెప్పారు. అదో పెద్ద మాఫియా, ఆన్‌లైన్ మోసాలకు కేరాఫ్ అడ్రస్. సైబర్ క్రైమ్ చేసేందుకు డేటా తెప్పించేలా మమ్మల్ని ఒత్తిడిచేసేవారు. వ్యక్తుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించాలని, వ్యక్తిగత సమాచారం - చిత్రాలు రాబట్టాలని ఇబ్బంది పెట్టేవారు. మాట వినకపోతే కరెంట్ షాక్ ఇవ్వడం, కొట్టడం... ఇలా చిత్రహింసలు పెట్టారు. కొందరికైతే డ్రగ్స్ ఇచ్చి వారి అదుపులో ఉంచుకునేలా మార్చేశారు. అలాంటిచోట నుంచి తప్పించుకుని బయటపడ్డానంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. ఉద్యోగాల విషయంలో ఎవరుపడితే వాళ్ల మాటలు నమ్మొద్దు. డబ్బు తీసుకుని ఉద్యోగం ఇస్తామని చెప్పేవన్నీ మోసాలే. నాలా ఎవరూ ఇబ్బంది పడకూడదు.
- అభ్యుదయ్, ఇటీవల కంబోడియా నుంచి తప్పించుకొచ్చిన యువకుడు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IN PICS: పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా పరిశీలించిన ప్రధాని మోదీ
-
World News
Helicopters Crash: కుప్పకూలిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు: 9మంది అమెరికా సైనికుల దుర్మరణం
-
Politics News
Pawan Kalyan: కౌలు రైతుల కడగండ్లకు వైకాపా ప్రభుత్వ విధానాలే కారణం: పవన్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Sushil Modi: నా పిటిషన్‌పైనా రాహుల్‌కు శిక్షపడుతుందని ఆశిస్తున్నా.. సుశీల్ మోదీ
-
Sports News
IPL 2023: ఐపీఎల్లో ఏంటీ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్..?