ఉన్నత ప్రమాణాలతో.. ఉత్తమ కోర్సులు!

విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలపై ఇప్పటివరకూ ముఖ్యదేశాల సమాచారం మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు జర్మనీ, యూఏఈ విశేషాలు కూడా చూసేద్దాం!

Updated : 18 Apr 2023 07:43 IST

విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలపై ఇప్పటివరకూ ముఖ్యదేశాల సమాచారం మొత్తం తెలుసుకున్నాం. ఇప్పుడు జర్మనీ, యూఏఈ విశేషాలు కూడా చూసేద్దాం!


జర్మనీ

ర్మనీలో ఉన్న విద్యాసంస్థలకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అందుకే ఇక్కడ సీటు పొందడం అంత సులభమేం కాదు. మంచి అకడమిక్‌ స్కోర్లతో పాటు ఎంతోకొంత పని అనుభవం కూడా ఉంటేనే ప్రాధాన్యం దక్కుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే... ఇక్కడ వసతి, ఇతర ఖర్చులు కాస్త సబబుగానే ఉంటాయి. అలాగే ఈ దేశానికి వీసా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఇక్కడ ఇంగ్లిష్‌ అధికంగా ఉపయోగిస్తూ ఉండటం వల్ల విద్యార్థులకు కాస్త సౌకర్యంగానే ఉంటుంది.


ఇన్‌టేక్స్‌

జర్మనీలో రెండు ఇన్‌టేక్స్‌ ఉన్నాయి.

సమ్మర్‌: సమ్మర్‌ ఇన్‌టేక్‌ సాధారణంగా మార్చి-ఏప్రిల్‌ నెలల్లో మొదలవుతుంది.

వింటర్‌: వింటర్‌ ఇన్‌టేక్‌ సెప్టెంబర్‌/అక్టోబర్‌లో ఉంటుంది.

* కొన్ని ప్రైవేటు యూనివర్సిటీలకు మే/జూన్‌లోనూ అడ్మిషన్లు జరుగుతాయి.

పరీక్ష సన్నద్ధత:

* ఈ దేశంలోని యూనివర్సిటీలకు ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్ష స్కోరు ఉండాలి.

* అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఎస్‌ఏటీ, బిజినెస్‌ స్కూళ్లకు జీమ్యాట్‌, జీఆర్‌ఈ స్కోరు ఉండాలి.

యూనివర్సిటీలు - కోర్సులు: ఈ దేశంలో ఉన్న దాదాపు 400 యూనివర్సిటీల్లో కొన్ని అతి పురాతనమైనవి. ఇక్కడ కాలేజీల కంటే యూనివర్సిటీలే ప్రసిద్ధం. ఇందులో మూడు కేటగిరీలు ఉన్నాయి.


ప్రైవేటు యూనివర్సిటీలు

జర్మనీలో దాదాపు 120 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయి. ఇవి ఈ మధ్యనే చాలా పాపులర్‌ అవుతున్నాయి. వీటిలో బిజినెస్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందడం అంతర్జాతీయ విద్యార్థులకు కాస్త సులభమే. కొన్నిచోట్ల హ్యుమానిటీస్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులను కూడా ఇంగ్లిష్‌లో అందిస్తున్నారు.

యూనివర్సిటీస్‌ అఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌: ఇవి ఎక్కువగా సాధనతో కూడినవై ఉంటాయి. థియరీ పరీక్షల కంటే కూడా ఇంటర్న్‌షిప్స్‌, ప్రాక్టీస్‌ మాడ్యూల్స్‌తో బోధన సాగుతుంది. శాస్త్ర సాంకేతిక విషయాలను ప్రాక్టికల్‌గా నేర్పించడంపై ఇవి ఎక్కువగా దృష్టి పెడతాయి.

టీయూ9 యూనివర్సిటీలు: ఇది జర్మనీలో ఉన్న టాప్‌ 9 టెక్నికల్‌ యూనివర్సిటీల బృందం. ఇవి విద్యార్థులను టెక్నికల్‌, రిసెర్చ్‌ ఆధారిత కెరియర్లకు తయారుచేస్తాయి. ఉన్నత స్థాయి ప్రమాణాలతో విద్యార్థులను మార్కెట్‌ అవసరాలకు దీటుగా తయారుచేయడం ఈ విద్యాసంస్థల ప్రత్యేకత.

* జర్మనీలో అధికశాతం మంది విద్యార్థులు ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, మ్యాథమెటికల్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌, బిజినెస్‌ అండ్‌ ఎకనమిక్స్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌ వంటి కోర్సులు చదవడానికి వెళ్తుంటారు.

దరఖాస్తు గడువు: జర్మనీలో ఉన్న ఇన్‌టేక్స్‌ను అనుసరించి సమ్మర్‌లో చేరాలి అనుకునేవారు జనవరిలో దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టడం మంచిది. అలాగే వింటర్‌లో చేరేవారు జులై మొదట్లో ప్రారంభిస్తే సరిపోతుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ స్కోర్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, మీడియం ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ లెటర్‌, రికమెండేషన్‌ లెటర్స్‌తో కూడిన దరఖాస్తు పంపాక... అన్నీ సక్రమంగా ఉంటే విద్యార్థికి అన్‌కండిషనల్‌ ఆఫర్‌ లెటర్‌ వస్తుంది. అది అందుకున్న తర్వాత క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి హాజరుకావాలి. అది కూడా విజయవంతంగా పూర్తిచేసినవారు యూనివర్సిటీ నిబంధనలు అనుసరించి ముందుగానే కొంత ఫీజు చెల్లించాలి. అలా చెల్లిస్తే కోర్సులో ఎన్‌రోల్‌ అయినట్లుగా విద్యార్థికి ఒక ఐడీ వస్తుంది.

* ఈ దేశంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఫీజు ఏడాదికి దాదాపు రూ.22 లక్షల నుంచి రూ.35 లక్షల వరకూ ఉంటుంది. అదే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు రూ.9 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఉంటుంది.

* కొన్ని పబ్లిక్‌ యూనివర్సిటీల్లో ట్యూషన్‌ ఫీజు లేకుండా విద్య అందించే వ్యవస్థ కూడా ఉంది. ఒక సెమిస్టర్‌కు 250 యూరోలు (దాదాపు రూ.23వేలు) అడ్మినిస్ట్రేటివ్‌ ఫీజు మాత్రమే చెల్లించి చదువుకోవచ్చు. * ఇక్కడ ఉండే విద్యార్థికి జర్మన్‌ భాష తెలిసి ఉండటం మరికొంత అదనపు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

* జర్మనీలో అంతర్జాతీయ విద్యార్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేశాక పీఎస్‌డబ్ల్యూ వీసాకి అప్లై చేయవచ్చు. ఇది 18 నెలల కాలానికి ఉంటుంది.


వీసా ప్రక్రియ

యూనివర్సిటీ నుంచి లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ వచ్చిన తరువాత విద్యార్థి వీసా ప్రక్రియ మొదలుపెట్టాలి. అవసరమైన డాక్యుమెంట్లు సబ్మిట్‌ చేసి ఇండియాలో ఉన్న జర్మన్‌ కాన్సులేట్‌ వద్ద వీసా అపాయింట్మెంట్‌ తీసుకోవాలి. ఇది ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉంటుంది. ఉదాహరణకు తెలంగాణ విద్యార్థులు చెన్నైలో ఉన్న కాన్సులేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. 4 నుంచి 12 వారాల్లో వీసా వస్తుంది.


యూఏఈ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ - ఈ దేశంలో దొరికే విద్య అత్యంత నాణ్యతతో కూడి ఉంటుంది. కోర్సుల పరిధి కూడా చాలా ఎక్కువ. ఇక్కడకు ప్రపంచంలో మూలమూలల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఆధునిక యూనివర్సిటీలకు ఈ దేశం నిలయం. ఇది విద్యార్థులను ఆకర్షించే విధంగా ‘స్టూడెంట్‌ ఫ్రెండ్లీ’ పాలసీలను అవలంబిస్తూ ఉంటుంది. ఇక్కడ వీసా రావడం కూడా కాస్త సులభమే. వాతావరణం కూడా ఏడాది మొత్తం సౌకర్యవంతంగా ఉంటుంది.


ఇన్‌టేక్స్‌

యూఏఈలో మూడు ఇన్‌టేక్స్‌ ఉన్నాయి.

ఫాల్‌: ఇది సెప్టెంబర్‌లో జరుగుతుంది. ఇదే ముఖ్యమైన సీజన్‌. అధికశాతం యూనివర్సిటీలు ఈ సమయంలో కోర్సులను అందుబాటులో ఉంచుతాయి.

స్ప్రింగ్‌: దీన్నే జనవరి ఇన్‌టేక్‌ అని కూడా చెబుతారు. ఫాల్‌ ఇన్‌టేక్‌లో చేరడం తప్పినవాళ్లు ఈ సమయంలో చేరతారు. అయితే ఇందులో కోర్సులు కాస్త తక్కువగా అందుబాటులో ఉంటాయి.

సమ్మర్‌: ఇది జులైలో ఉంటుంది. ఈ సీజన్‌లో చాలా తక్కువ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.


పరీక్ష సన్నద్ధత

* ఈ యూనివర్సిటీలకు ఇంగ్లిష్‌ ప్రొఫెషియన్సీ టెస్ట్‌ స్కోరు ఉండాలి, అలాగే యూనివర్సిటీ పెట్టే పరీక్ష పాసవ్వాలి.

* ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ పరీక్షల స్కోర్లు మాత్రమే అనుమతిస్తారు.

* కోర్సునుబట్టి ఎస్‌ఏటీ, జీమ్యాట్‌, జీఆర్‌ఈల్లో ఏదైనా స్కోరు అవసరం.


యూనివర్సిటీలు - కోర్సులు

యూఏఈలోని 111 విద్యాసంస్థల్లో 6 వర్సిటీలు క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 200 యూనివర్సిటీలుగా పేరుగాంచాయి. మరో 3 వర్సిటీలు ప్రపంచంలోని టాప్‌ 400 విశ్వవిద్యాలయాల్లో ఉన్నాయి. అన్ని కోర్సులు ఇంగ్లిష్‌లో లభిస్తాయి.

* ఈ దేశంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చదివేందుకు ట్యూషన్‌ ఫీజుల కింద దాదాపు రూ.7 లక్షల నుంచి రూ.16 లక్షల వరకూ ఖర్చవుతుంది. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ చదివేందుకు రూ.11 లక్షల నుంచి రూ.17 లక్షల వరకూ ఫీజు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టెస్ట్‌ స్కోర్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, మీడియం ఆఫ్‌ ఇన్‌స్ట్రక్షన్‌ లెటర్‌, రికమెండేషన్‌ లెటర్స్‌తో కూడిన దరఖాస్తు పంపాక విద్యార్థికి అన్‌ కండిషనల్‌ ఆఫర్‌ లెటర్‌ వస్తుంది. ఇందులో ఏమైనా పత్రాలు లేకపోతే వాటిని అందించమని అడుగుతూ కండిషనల్‌ ఆఫర్‌ లెటర్‌ ఇస్తారు. ఆ తర్వాత విద్యార్థి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి హాజరుకావాలి. అది పూర్తయితే యూనివర్సిటీ నియమ నిబంధనల ప్రకారం కొంత ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత యాక్సెప్టెన్స్‌ లెటర్‌ వస్తుంది.


వీసా సన్నద్ధత

యాక్సెప్టెన్స్‌ లెటర్‌ వచ్చాక వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. యూఏఈ స్టూడెంట్‌ వీసా అనేది రెసిడెంట్‌ వీసా. విద్యార్థి దరఖాస్తు చేసిన యూనివర్సిటీకి మాత్రమే వస్తుందది. విద్యార్థి ముందు చదువుకునేందుకు ఎంట్రీ పర్మిట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అక్కడికి వెళ్లకముందే ఈ పర్మిట్‌ తీసుకోవాలి. విద్యార్థి తరఫున విశ్వవిద్యాలయమే దీనికి దరఖాస్తు చేస్తుంది. ఇది అప్రూవ్‌ అయితే ఎమిరేట్స్‌ ఐడీ వస్తుంది. విద్యార్థి కోర్సు కాలమంతా ఈ ఐడీ యాక్టివ్‌గా ఉంటుంది.

* స్టూడెంట్‌ వీసా దరఖాస్తుకు పాస్‌పోర్ట్‌, ఫొటోలు, లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌, ఆర్థిక నిల్వల రుజువులు, ఆరోగ్య ధ్రువపత్రాలు, వసతి ఉన్నట్లు రుజువు వంటివన్నీ అవసరం అవుతాయి.

* సాధారణంగా దరఖాస్తు చేసిన 3 నుంచి 4 రోజుల్లో వీసా వస్తుంది. అక్కడికి వెళ్లాక విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఫుల్‌టైం వర్క్‌ చేయడానికి కుదరదు. వారానికి 15 గంటలు, నెలకు 60 మాత్రమే పనిచేయాలి. సెలవుల సమయాల్లో వారానికి 40 గంటలు, నెలకు 160 గంటలు పనిచేసుకోవచ్చు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని