ఉచిత విద్యకు ఛలో జర్మనీ! 

దేశాంతరాల్లో ఉన్నతవిద్య మనకందేది కాదని మధ్యతరగతి వాళ్లు చాలామంది మౌనంగా ఉండిపోతారు. కానీ వీరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో లేదా  ఉచితంగా జర్మనీ విద్యను అందిస్తోంది. ఉద్యోగావకాశాలూ మెరుగ్గా ఉన్నాయి. లాంగ్‌ స్టే వీసా, ఇంటర్న్‌షిప్‌లు

Published : 12 Oct 2018 20:30 IST

విదేశీ విద్య 

ఉచిత విద్యకు ఛలో జర్మనీ! 

దేశాంతరాల్లో ఉన్నతవిద్య మనకందేది కాదని మధ్యతరగతి వాళ్లు చాలామంది మౌనంగా ఉండిపోతారు. కానీ వీరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో లేదా  ఉచితంగా జర్మనీ విద్యను అందిస్తోంది. ఉద్యోగావకాశాలూ మెరుగ్గా ఉన్నాయి. లాంగ్‌ స్టే వీసా, ఇంటర్న్‌షిప్‌లు అదనపు ఆకర్షణలు.  ఇక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్న 20.7 లక్షల మంది విద్యార్థుల్లో 3.4 లక్షలమంది విదేశీ విద్యార్థులే. నాణ్యమైన విద్య, ప్రామాణిక కరిక్యులమ్‌, చక్కటి మౌలిక సదుపాయాలు జర్మనీ ప్రత్యేకతలు. సమ్మర్‌ ఇన్‌టేక్‌ దరఖాస్తు ప్రక్రియకు సమయం సమీపిస్తున్న సందర్భంగా జర్మనీ విద్యాభ్యాసం విశేషాలు.. మీకోసం!నాలుగు వందలకు పైగా ఉన్న జర్మన్‌ విశ్వవిద్యాలయాలు విభిన్నమైన సబ్జెక్టుల్లో  వైవిధ్యమైన కోర్సులు అందిస్తున్నాయి. బోధన, పరిశోధనలను సమ్మిళితం చేసి, ఆచరణాత్మక విద్యతో మౌలిక ఆవిష్కరణలకు బాటలు వేస్తాయి. పరిశ్రమ- విద్యాసంస్థలకు మధ్య అనుసంధానం ఇక్కడ ఎక్కువ. అందుకే విద్యార్థుల కెరియర్‌కు నేరుగా ప్రయోజనం కల్పించే ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయి. 
విదేశీ విద్యార్థులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత విద్యను అందిస్తారు. కొన్ని యూనివర్సిటీలు ట్యూషన్‌ ఫీజును వసూలుచేసినా, అది తక్కువే ఉంటుంది. 
ఇక్కడ టెక్నికల్‌, అప్లైడ్‌ సైన్సెస్‌ అని రెండు రకాలుగా విశ్వవిద్యాలయాలుంటాయి. మొదటివి రిసెర్చి ఓరియెంటెడ్‌ ప్రోగ్రాములను అందిస్తాయి. అప్లైడ్‌ సైన్సెస్‌ యూనివర్సిటీలు ఆచరణాత్మక పరిశోధన, పారిశ్రామిక శిక్షణపై దృష్టిపెడతాయి. రియల్‌ టైమ్‌ ఉద్యోగ వాతావరణంలో విద్యార్థులను సుశిక్షితులను చేస్తాయివి. 

ఉచిత విద్యకు ఛలో జర్మనీ! 
క్యూఎస్‌ వర్‌ల్డ్‌ ర్యాంకింగ్‌ ప్రకారం- ప్రపంచ స్థాయిలో ఉత్తమ శ్రేణి విద్యాసంస్థల్లో 45 జర్మన్‌ యూనివర్సిటీలున్నాయి. టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మ్యునిచ్‌, ఆర్‌డబ్ల్యూటీహెచ్‌ ఆచెన్‌, టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ డ్రెస్‌డెన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హేడల్‌బర్గ్‌, కార్ల్‌స్రుహె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లాంటివి ప్రాచుర్యం పొందినవాటిలో కొన్ని. 
పీజీ కోర్సుల్లో అత్యధికం ఇంగ్లిష్‌ మీడియంలోనే ఉంటాయి. బ్యాచిలర్‌ స్టడీస్‌లో ఇంగ్లిష్‌మీడియం బోధన కొన్ని విద్యాసంస్థల్లోనే ఉంటుంది.

 

ప్రాచుర్యం పొందిన కోర్సులు

ఉచిత విద్యకు ఛలో జర్మనీ! 

 

 * సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ) 
* బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఏ, ఎంబీఏ) 
* మెడికల్‌ సైన్సెస్‌ (బయోటెక్నాలజీ, మెడిసిన్‌, నర్సింగ్‌. ఇవి ఎక్కువగా జర్మన్‌ మాధ్యమంలోనే ఉంటాయి) 
కోర్సును బట్టి కొన్ని వర్సిటీలు టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌/జీఆర్‌ఈ/జీమ్యాట్‌ స్కోర్లను అడుగుతాయి. 
విదేశీ విద్యార్థులు జర్మనీలో వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్‌ పని చేయటానికి అనుమతి ఉంది. జర్మన్‌ భాషా నైపుణ్యాలుంటే సులువుగా ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రాథమిక, అడ్వాన్స్‌డ్‌ స్థాయిలో జర్మన్‌ భాష నేర్పటానికి యూనివర్సిటీలు కోర్సులను అందిస్తాయి. Goethe-Instituts (Max Mueller Bhavan) /Goethe-Zentrums వద్ద ఈ భాషను నేర్చుకుని, ధీమాగా జర్మనీలో అడుగుపెట్టవచ్చు! 
పీజీని పూర్తిచేస్తే అక్కడే 18 నెలలపాటు ఉండిపోయే అవకాశం ఇస్తారు. ఇలా కోర్సు ముగించినవారు వారానికి 40 గంటల ఫుల్‌టైమ్‌ పోస్ట్‌ స్టడీవర్క్‌ చేయవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఐదు అంచెల్లో....

 దరఖాస్తు ప్రక్రియను తరగతులు ప్రారంభం కావటానికి కనీసం 6-8 నెలలముందు ప్రారంభించాల్సివుంటుంది. జర్మనీలో అడ్మిషన్ల సీజన్లు ప్రధానంగా రెండు. 
వింటర్‌: అక్టోబరు. ఈ సెమిస్టర్‌ అక్టోబరు నుంచి మార్చి వరకు ఉంటుంది. ఈ ఇన్‌టేక్‌లో చేరదల్చినవారు విద్యాసంస్థలకు జులై 15లోపు దరఖాస్తు చేసుకోవాలి. 
సమ్మర్‌: మార్చి/ఏప్రిల్‌. ఈ సెమిస్టర్‌ ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు ఉంటుంది. చేరదల్చినవారు జనవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. 
1 అవసరమైన సమాచారాన్ని జర్మన్‌ అకడమిక్‌ ఎక్స్చేంజి సర్వీస్‌ DAAD (Deutscher Akademischer Austauschdienst), ఇంటర్నెట్‌,  బ్రోషర్ల నుంచి సేకరించుకోవాలి. ఇన్ఫర్మేషన్‌ సెషన్లకూ, లేదా వెబినార్లకూ హాజరైతే పూర్తి అవగాహన వస్తుంది. ఈ కార్యక్రమాలు ఎప్పుడు జరిగేదీ www.daad.in ద్వారా తెలుసుకోవచ్చు. 
2 ఆసక్తి ఉన్న యూనివర్సిటీని సంప్రదించాలి. అర్హత, కోర్సు వ్యవధి, ఫీ, దరఖాస్తు ప్రక్రియ మొదలైనవాటికి సంబంధించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవాలి. దరఖాస్తు గడువు తేదీని గమనించాలి. 
3 యూనివర్సిటీ/ కోర్సు వెబ్‌సైట్‌.. విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియలో అనుసరించాల్సిన విధివిధానాలను సూచిస్తుంది. దానిప్రకారం దరఖాస్తును యూనివర్సిటీకి    పంపుకోవచ్చు. లేదా యూని అసిస్టెంట్‌ అనే సంస్థకు కూడా పంపుకోవచ్చు. అది దరఖాస్తును స్వీకరించి, పరిశీలించి తన సభ్య యూనివర్సిటీలకు పంపిస్తుంది. ఈ సభ్య యూనివర్సిటీలు నేరుగా దరఖాస్తులను అనుమతించవు. ఈ యూనివర్సిటీల జాబితాను ‌్ర్ర్ర.్య-i్చ((i(్మ.్ట’ సైట్‌లో చూడవచ్చు. 
4 అడ్మిషన్‌ లెటర్‌ పొందిన వెంటనే స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేయాలి. ఎందుకంటే ఆ ప్రక్రియకు 8 నుంచి 12 వారాల వ్యవధి పడుతుంది. జర్మన్‌ ఎంబసీ వెబ్‌సైట్‌ చూసి, వీసాకు ఎక్కడ దరఖాస్తు చేయాలో తెలుసుకోవచ్చు. మొదటి సంవత్సరం విద్యాభ్యాసానికి అవసరమయ్యే ఫండింగ్‌ రుజువులు అవసరమవుతాయి. 
5 కోర్సు మొదలవటానికి కనీసం వారం రోజుల ముందే జర్మనీ చేరుకోవాలి. మార్గదర్శకత్వం కోసం యూనివర్సిటీకి సంబంధించిన ఇంటర్నేషనల్‌ ఆఫీసును సంప్రదించాలి. వచ్చిన మూడు నెలల్లోపే ఫారినర్స్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసు నుంచి రెసిడెన్స్‌ పర్మిట్‌ తీసుకోవాలి.

ఉపయోగపడే వెబ్‌సైట్లు

జర్మనీలో విద్యాభ్యాసం గురించి... 
www.daad.de/international-programmes 
www.uni-assist.de 
www.university-ranking.de, www.study-in.de 
ఉపకారవేతనాల గురించి... 
www.daad.in, www.funding-guide.de

కేరాఫ్‌ మెకానికల్‌

కార్ల తయారీలో ప్రపంచంలోనే మూడో అతి పెద్ద దేశమైన జర్మనీ ..మెకానికల్‌ పరిశ్రమలకు ఎంతో ప్రసిద్ధి. దీంతో మనదేశ విద్యార్థులు జర్మనీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌, మెకాట్రానిక్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ సిస్టమ్స్‌ మొదలైన కోర్సుల్లో చేరటానికి మొగ్గు చూపుతుంటారు. ఈ కోర్సులు చేసినవారికి బీఎండబ్ల్యూ, ఫోక్స్‌వాగన్‌, సీమన్స్‌, వోల్వో, డెలాయిట్‌, సేల్స్‌ఫోర్స్‌, బేయర్‌, లుఫ్తాన్సా, అలియన్జ్‌ లాంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. 
ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌, డేటా సైన్సెస్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, రెన్యూవబుల్‌ ఎనర్జీ మొదలైన కోర్సులపై కూడా భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వీటితోపాటు మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌, హెల్త్‌ సైన్సెస్‌ కోర్సుల్లో  చేరుతున్నారు. 
మాస్టర్స్‌లో చేరటానికి ఐఈఎల్‌టీఎస్‌ 6.5 స్కోరు అవసరం. బ్యాచిలర్‌ డిగ్రీల్లో చేరాలంటే 6.0 స్కోరు సరిపోతుంది. చాలా విద్యాసంస్థలు ట్యూషన్‌ ఫీజును వసూలు చేయడం లేదు. చేసినా ఆ ఫీజు నామమాత్రంగా-  సంస్థను బట్టి రూ.7 వేల నుంచి రూ. 1.05 లక్షల వరకూ ఉంటుంది. ఇక్కడి విద్యాసంస్థలు విదేశీ విద్యార్థులకు 4-6 నెలల ఇంటర్న్‌షిప్‌ను అందిస్తూ వారు తగిన పరిజ్ఞానం, అధిక ఉద్యోగావకాశాలు పొందే అవకాశం కల్పిస్తాయి. విద్యార్థుల దైనందిన ఖర్చులకు ఏడాదికి సగటున రూ.6.5 లక్షల ఖర్చవుతుంది.

- సూర్య గణేష్‌, సీఎండీ, వాల్మీకి ఫారిన్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్

జర్మన్‌ నేర్చుకుని వెళ్తే మేలు

ఉచిత విద్యకు ఛలో జర్మనీ! జర్మనీ Darmstadt University of Applied Sciences లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఐటీలో ఎమ్మెస్సీ చేశాను. ఇప్పుడు ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. విద్యాభ్యాసానికీ, కోర్సు పూర్తిచేశాక ఉద్యోగం చేయటానికీ జర్మనీ  అనుకూలమైన దేశం. సాంకేతికంగా అడ్వాన్‌్్సడ్‌గా ఉండే ఇక్కడి విద్యాసంస్థల్లో చదివితే విద్యార్థులకు ఎన్నో అవకాశాలు లభిస్తాయి. మనదేశంలో బీటెక్‌ పూర్తిచేసి, కొంత వర్క్‌ అనుభవం సంపాదించాక జర్మనీలో చదివే ప్రయత్నాలు చేయటం మంచిది. 
జర్మనీలో అడుగుపెట్టకముందే జర్మన్‌ భాషను నేర్చుకోవాలని నా సలహా. ఎందుకంటే ఇక్కడి ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడంలో, విజయవంతంగా కోర్సు పూర్తిచేయటంలో భాష ప్రాముఖ్యం ఎంతో ఉంటుంది. వ్యక్తిగతంగా భాషలు నేర్చుకోవడంపై నాకు ఆసక్తి. పుస్తకాల ద్వారా కంటే ఇక్కడి ప్రజలతో మాట్లాడుతూ జర్మన్‌ ఎక్కువ నేర్చుకున్నాను. స్థానిక గ్రామాల్లో నివసిస్తూ సంస్కృతిని తెలుసుకుంటూ భాషను మెరుగ్గా నేర్చుకోవచ్చనేది  స్వీయానుభవం.

- వై.భరత్‌,  ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ ఇంజినీర్‌ (జర్మనీ)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని