భూమిని కప్పేసిన దుప్పటి ఏది?

తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలకు మధ్య వ్యత్యాసాలను రాయండి.

Published : 28 Feb 2020 00:36 IST

2 మార్కుల ప్రశ్నలు

 

1. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలకు మధ్య వ్యత్యాసాలను రాయండి.


 

2. ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవడానికి మీ సూచనలు తెలపండి.
జ: * ప్రకృతి వైపరీత్యాల నుంచి తప్పించుకోవడానికి ఆయా సమయాల్లో ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, హెచ్చరిక కేంద్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజలు ఆ సంస్థలకు సహకరించాలి.
* ప్రకృతి వైపరీత్యాలకు దారితీసే చర్యలను చేపట్టడం మానుకోవాలి. పర్యావరణానికి నష్టం చేకూర్చని లేదా తక్కువ హాని కలగజేసే విధంగా ప్రజలు వ్యవహరించాలి.
3. భూమిలేని గ్రామీణ కార్మికులు ఏయే అభివృద్ధి లక్ష్యాలు, ఆకాంక్షలను నిర్దేశించుకుంటారు?
జ: * ఎక్కువ రోజులు పని లభించాలని, మంచి కూలీ ఇవ్వాలని
* స్థానిక పాఠశాలలో నాణ్యమైన విద్య తమ పిల్లలకు లభించాలని
* సమాజంలో వారికి కూడా గౌరవ మర్యాదలు లభించాలని, నాయకులుగా ఎదగాలని
* తమ నివాస ప్రాంతంలో సరైన మౌలిక వసతులు లభించాలని భావిస్తారు.
4. మానవాభివృద్ధిని కొలవడానికి ముఖ్యమైన అంశాలను ఉదహరించండి.
జ: ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం ప్రచురించిన మానవాభివృద్ధిని వివిధ దేశాల్లోని ప్రజల విద్యా స్థాయి, ఆరోగ్య స్థితి, తలసరి ఆదాయాలను బట్టి పోలుస్తుంది.
* మానవాభివృద్ధిని కొలవడానికి పరిగణనలోకి తీసుకునే అంశాలు:
i) తలసరి ఆదాయం  ii) ఆయుఃప్రమాణం
iii) అక్షరాస్యత      i‌v) శిశు మరణాలు - జననరేటు
‌v) జీవనప్రమాణం   ‌vi) ప్రజారోగ్యం
5. వ్యవస్థీకృత రంగంలో పనిచేసే కార్మికులకు కలిగే సౌకర్యాలను తెలపండి.
జ: * ఉద్యోగ భద్రత   * నిర్ధారిత పనిగంటలు
* ఎక్కువ పనికి ఎక్కువ వేతనం
* జీతంతో కూడిన సెలవు  * సెలవుల్లో వేతనం
* భవిష్య నిధి * వైద్య ప్రయోజనాలు
* పింఛన్‌   * భద్రతతో కూడిన పని వాతావరణం
6. మాధ్యమిక వస్తువులు, అంత్య వస్తువులను వివరించండి.
జ: మాధ్యమిక వస్తువులు: వినియోగించే వస్తువుల తయారీలో ఉపయోగించే వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు. ఉదా: గోధుమ పిండి
అంత్య వస్తువులు: తుది వినియోగానికి సిద్ధంగా ఉన్న వస్తువులను అంత్య వస్తువులు అంటారు.
ఉదా: కారు, పెన్ను, పుస్తకం
7. సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరగడం ప్రమాదమా?
వివరించండి.
జ: 2 డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరగడం మనకు తక్కువగా అనిపించవచ్చు. కానీ వచ్చే శతాబ్దం ఆరంభం నాటికి దీనివల్ల సముద్ర మట్టం ఒక మీటరు పెరుగుతుంది. మన తీర ప్రాంతాలు చాలా వరకు ప్రభావితమవుతాయి. కోట్లాది మందిని ఇతర ప్రాంతాలకు తరలించాల్సి వస్తుంది. వీరు తమ జీవనోపాధిని కోల్పోతారు.
8. వేసవిలో కోల్‌కతా కంటే డార్జిలింగ్‌లో ఆహ్లాదకర వాతావరణం ఎందుకు ఉంటుంది?
జ: సముద్ర మట్టం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాబట్టి మైదాన ప్రాంతాల కంటే కొండ, పర్వతాల మీద ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
డార్జిలింగ్‌ ఎత్తయిన ప్రాంతంలో ఉండటం వల్ల వేసవిలో కోల్‌కతా కంటే చల్లగా ఉంటుంది.
9. హరితగృహ ప్రభావం అంటే ఏమిటి?
జ: వాతావరణం మనకు సరైన వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇది భూమిని కప్పి ఉంచే తేలికపాటి, బాగా పనిచేసే దుప్పటి లాంటిది. భూమిని చేరుకునే సౌరశక్తి అంతా తిరిగి రోదసిలోకి వికిరణం చెందకుండా వాతావరణం కొంత శక్తిని పట్టి ఉంచుతుంది. దీన్ని హరితగృహ ప్రభావం అంటారు. భూమి మీద ప్రాణి   మనుగడకు ఇది ఎంతో ముఖ్యం. భూమిపైన వాతావరణం లేకపోతే చాలా చల్లగా ఉండేది.
10. నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించండి.
జ: నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు: చెక్‌డ్యామ్‌లు, ఊటకుంటలు, చెట్లు నాటడం, రాతి కట్టడాలు.
11. హివారే బజార్‌ గ్రామంలో ఇతర నిషేధాలు ఏవి?
జ: సాగునీటికి బోరుబావులు తవ్వడం, చెరకు, అరటి సాగుచేయడం, ఇతరులకు  భూమి అమ్మడం, నీటి వినియోగంలో దీర్ఘకాలిక సుస్థిరత సాధించే అంశాలు ఈ విధానంలో ముఖ్యమైనవి. ఈ నిషేధాలు కేవలం ప్రకటనలు కాదు. ప్రజలు  ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి దోహదపడే ప్రజా నిర్మాణం. అయితే ఏదీ అంత తేలికగా జరగలేదు.


4 మార్కుల ప్రశ్నలు

1. స్త్రీలు ఇంటి బయట పనిచేసినప్పుడు లింగ వివక్షత ప్రభావం ఎలా ఉంటుంది?
జ: స్త్రీలు ఇంటి బయట పనిచేయడానికి లింగ వివక్షతకు విలోమ సంబంధం ఉంది. బయట ఉద్యోగాలు చేసే మహిళలు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఇంటిలో తీసుకునే నిర్ణయాల్లో అంటే పిల్లల చదువు, ఆరోగ్యం, పిల్లల సంఖ్య, గృహ నిర్వహణ లాంటి వాటిలో స్త్రీల మాటకు ప్రాధాన్యత ఉంటుంది.
ఉద్యోగాలు చేసే మహిళలు వివాహానంతరం తమ కూతుళ్లు ఉద్యోగాలు చేయాలనుకుంటారు. కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం సహజం. స్త్రీలు ఉద్యోగం చేయడం వల్ల ఆర్థిక స్వాతంత్య్రం, స్థిరత్వం పొందుతారు. మహిళలు సాధికారత సాధిస్తే లింగ వివక్షతకు తావుండదు.
2. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించండి.
జ: గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలు
* వ్యవసాయేతర ఉత్పత్తి కార్యకలాపాలను, స్థానిక చేతివృత్తులను ప్రోత్సహించాలి.
* పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలి.
* బ్యాంకు రుణాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉదా: పిండిమర, కిరణాషాపు, హోటళ్లు
* స్వీట్లు, పచ్చళ్ల తయారీ లాంటి వాటిని ప్రోత్సహించి దగ్గరలోని మార్కెట్లకు తరలించేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
* ప్రభుత్వ సహాయంతో కుట్టుమిషన్లను పంపిణీ చేయాలి.
* కూరగాయల ప్రాసెసింగ్‌ పరిశ్రమ, పట్టుపురుగుల పెంపకం, తేనె సేకరించి దగ్గరలోని మార్కెట్లలో అమ్మడం లాంటివి చేపట్టాలి.
3. భూగోళం వేడెక్కడం వల్ల కలిగే ఫలితాలు, కొన్ని నివారణ చర్యలను సూచించండి.
జ: భూగోళం వేడెక్కడం వల్ల కలిగే ఫలితాలు:
* భూమి ఉపరితల ఉష్ణోగ్రతల్లో అనేక మార్పులు సంభవిస్తాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది.
* ధృవ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్రమట్టాలు
విపరీతంగా పెరుగుతాయి. తీరప్రాంతాలు ముంపునకు గురవుతాయి. కాలాలు నిర్ణీత సమయానికి రావు.
* వర్షపాతం తగ్గి క్రమ రహితమవుతుంది.
నివారణ చర్యలు:
* చెట్లను రక్షించాలి, అడవులను పెంచాలి.
* శిలాజ ఇంధనాల వాడకం తగ్గించి, సౌరశక్తి, పవనశక్తి లాంటి పునర్వినియోగ సామర్థ్యం గల ఇంధనాలను ఉపయోగించాలి.
* వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించి ప్రజారవాణా వ్యవస్థను ప్రోత్సహించాలి.
* ఏసీ, రిఫ్రిజిరేటర్ల వాడకం తగ్గించాలి.
* రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను వాడాలి.
* పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యాన్ని నివారించడానికి ప్రజలు, ప్రభుత్వం నిధులు కేటాయించి, చిత్తశుద్ధితో పనిచేయాలి.
4. ఉపరితల నీటి వనరుల్లో 70% కలుషితమవడానికి కారణాలు తెలపండి.
జ: అనేక వ్యర్థాలను నీటిలోనికి వదలడం వల్ల నీటివనరులు కలుషితమవుతున్నాయి. ఈ కాలుష్యం నీటిలోని మొక్కలు, జంతువులతోపాటు వాటిని ఉపయోగించే మానవులకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ కాలుష్యం పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది.
కారణాలు:
* మురికినీరు, వ్యర్థ పదార్థాలు, చెత్త చెదారం నీటిలో కలవడం వల్ల నీరు కలుషితమవుతుంది.
* నీటి వనరులున్న ప్రాంతాల్లో మలవిసర్జన చేయడం వల్ల నీరు కలుషితమవుతుంది.
* పారిశ్రామిక వ్యర్థాలు నీటిలోకి వదలడం మూలంగా నీరు అధికస్థాయిలో కలుషితమవుతుంది.
* సముద్రంలో ప్రయాణం చేసే ఓడలు, ట్యాంకర్లు నీటిలోకి చమురును వదలడం వల్ల ఆ నీరు కలుషితమవుతుంది.
* ఆమ్ల వర్షాల మూలంగా ఉపరితల నీరు కలుషితమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని