దరఖాస్తుకు ముందు.. తస్మాత్‌ జాగ్రత్త!

ఉద్యోగ నియామకాలంటూ వెలువడే వాటిలో కొన్ని నకిలీ ప్రకటనలూ ఉండొచ్చు. ప్రభుత్వ విభాగాల, ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల పేర్లను వాడుతూ కొందరు స్వార్థపరులు అభ్యర్థులను పక్కదోవ పట్టిస్తూ దగా

Updated : 28 Mar 2022 06:41 IST

ఉద్యోగ నియామకాలంటూ వెలువడే వాటిలో కొన్ని నకిలీ ప్రకటనలూ ఉండొచ్చు. ప్రభుత్వ విభాగాల, ప్రముఖ కార్పొరేట్‌ సంస్థల పేర్లను వాడుతూ కొందరు స్వార్థపరులు అభ్యర్థులను పక్కదోవ పట్టిస్తూ దగా చేస్తున్న ఉదంతాలు అప్పుడప్పుడూ బయటకు వస్తూనే ఉన్నాయి. అందుకే వార్తా పత్రికల్లో, వెబ్‌సైట్లలో దేనిలో ప్రకటనలు వెలువడినా అవి మోసపూరితమైనవి కావని ధ్రువీకరించుకున్నాకే దరఖాస్తు చేసుకోవటం శ్రేయస్కరం.

ఉద్యోగ పోర్టళ్లలో సమాచారం కనపడగానే నమ్మెయ్యకూడదు. ఉద్యోగావకాశం అంటూ ఈమెయిల్‌.. ఫోన్‌ కాల్‌ ఏది వచ్చినా అది వాస్తవికమైనదేనని రూఢి చేసుకోవటం అవసరం. లేకపోతే విలువైన సమయం, డబ్బు నష్టపోవటమే కాకుండా నిరాశ, వేదన మిగులుతాయి!

ఇటీవలే జాతీయ ఆరోగ్య మిషన్‌ (నేషనల్‌ హెల్త్‌ మిషన్‌) పరిధిలో పారామెడికల్‌ సిబ్బంది, స్టాఫ్‌ నర్సుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తున్నామంటూ ఓ దినపత్రికలో నకిలీ ప్రకటన వచ్చింది. రిక్రూట్‌మెంట్స్‌.ఎన్‌హెచ్‌ఎం పేరుతో ఈ-మెయిల్‌ తయారుచేసి దానిలో దరఖాస్తు చేసుకోవాలనటంతో పెద్దఎత్తున ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు వైద్యశాఖను నేరుగా సంప్రదించటం వల్ల ఈ మోసం బయటపడింది. ఈ ఉద్యోగ ప్రకటనతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని వైద్యశాఖ స్పష్టం చేసింది. ఎవరైనా డబ్బు ఆశిస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరింది. సాధారణంగా నియామకాలు జిల్లాస్థాయిలో జరుగుతాయనీ, కలెక్టర్‌ పేరిట మాత్రమే ప్రకటనలు వెలువడతాయని వెల్లడించింది.


ఇలాంటి నకిలీ ఉద్యోగ ప్రకటనలను గుర్తించటం ఎలా?

1  ప్రకటనలో గ్రామర్‌, స్పెలింగ్‌ దోషాలు. అక్షరాలన్నీ క్యాపిటల్‌ లెటర్స్‌లో ఉండటం, పంక్చువేషన్‌ లోపాలు.

2  అనుమానాస్పద ఈమెయిల్‌ ఐడీ (ఈ మెయిల్‌ .. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఉండకుండా జీమెయిల్‌/యాహూ మెయిల్‌తో అనుసంధానమై ఉండటం).   

3  అధికారిక వెబ్‌సైట్‌ లేకపోవటం (సంస్థ ఆన్‌లైన్‌ ప్రెజెన్స్‌ లేకపోతే దాని ఉనికి, విశ్వసనీయతలను ధ్రువీకరించుకోవటం కష్టం) 

4  మెయిల్‌లో మీ పేరును వ్యక్తిగతంగా సంబోధించకపోవటం (అందరికీ వర్తించేలా గ్రూప్‌ మెయిల్స్‌ పెడుతుంటారన్నమాట) 

5  అనుభవం అక్కర్లేదు, ఆన్‌ ద స్పాట్‌ ఆఫర్‌, నో ఇంటర్వ్యూ లాంటి ఆకర్షణలు

6  చాట్‌ విండో/ టెక్స్‌ * మెసేజ్‌ సర్వీస్‌ ద్వారా ఇంటర్వ్యూ నిర్వహిస్తామనటం 

7  ఊహించనంత పెద్ద మొత్తంలో వేతనం 

8  ఉద్యోగానికి సంబంధించిన మిగతా సమాచారం కోసం/ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ కోసం కొంత రుసుము చెల్లించాలని కోరటం

9  తర్వాత రిఫండ్‌ అవుతుందనీ, ముందు డబ్బు చెల్లించాలనీ మెలిక పెట్టటం

10  రహస్యంగా ఉంచాల్సిన వ్యక్తిగత బ్యాంకు అకౌంట్‌, క్రెడిట్‌ కార్డు, ఆధార్‌, పాన్‌ వివరాలు అడగటం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని