TS Exams 2022: 3 భాగాలు 33 జిల్లాలు!

ప్రతి పోటీ పరీక్షకీ ముఖ్యమైన భూగోళశాస్త్రం అధ్యయనం చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి.  ఆ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను రాయగలగడంతోపాటు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలను...

Updated : 14 Apr 2022 18:38 IST

తెలంగాణ రాష్ట్ర భూగోళశాస్త్రం

ప్రతి పోటీ పరీక్షకీ ముఖ్యమైన భూగోళశాస్త్రం అధ్యయనం చేయడం వల్ల పలు ప్రయోజనాలు ఉంటాయి.  ఆ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను రాయగలగడంతోపాటు సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ అంశాలను చదివేటప్పుడు వాటిని ఒక క్రమంలో గుర్తుపెట్టు కోవడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి కాబట్టి రాష్ట్ర భౌగోళిక స్వరూపంపై అభ్యర్థులు తప్పకుండా  పట్టు సాధించాలి. దొరికిన సమాచారమంతా బట్టీ పడితే గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. పరీక్ష కోణంలో ప్రధానమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెడితే మంచి మార్కులు సంపాదించుకోవచ్చు.

తెలంగాణ భౌతిక స్వరూపాలు

నిజాం ప్రభుత్వంలో మొదటి సాలార్‌జంగ్‌ పరిపాలనా సంస్కరణల్లో భాగంగా హైదరాబాద్‌ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉండేవి. ఇందులో 8 జిల్లాలు తెలంగాణలో, 5 జిల్లాలు మరాఠాలో, 3 జిల్లాలు కన్నడలో ఉండేవి.   1948 వరకు స్వదేశీ సంస్థానాల్లో అతిపెద్ద ప్రాంతంగా ఉంటూ హైదరాబాద్‌ సంస్థానం ఒక దేశంగా ఉండేది. ఇది 1948 సెప్టెంబరు 17న భారత యూనియన్‌లో విలీనమైంది. తర్వాత పెద్దమనుషుల ఒప్పందం వల్ల ఆంధ్ర - తెలంగాణ కలవడంతో 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌గా అవతరించి ఒక ప్రాంతంగా ఏర్పడింది. 1956 - 2014 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రాంతంగా ఉంటూ అనేక ఉద్యమాల ఫలితంగా తిరిగి 2014 జూన్‌ 2న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

పరిపాలనా పరంగా...

హైదరాబాద్‌ రాష్ట్రంలో భాగంగా తెలంగాణలో 1948 నాటికి 8 జిల్లాలు ఉండేవి. 1953 అక్టోబరు 1న నూతనంగా మధిర, అశ్వరావుపేట, భద్రాచలం ప్రాంతాలతో కలిసి ఖమ్మం 9వ జిల్లాగా ఏర్పడింది. తర్వాత 1974 జిల్లాల పునర్విభజన ఏర్పాటు చట్టం ద్వారా 1978 ఆగస్టు 15న హైదరాబాద్‌ను రూరల్‌ జిల్లాగా ఏర్పాటు చేశారు. దీన్నే రంగారెడ్డి జిల్లాగా మార్చారు. పరిపాలనా సౌలభ్యం కోసం 1974 జిల్లాల పునర్విభజన ఏర్పాటు చట్టం, సెక్షన్‌ 101 ప్రకారం 2016 అక్టోబరు 11న మరో 21 జిల్లాలు, 2019 ఫిబ్రవరి 19న  రెండు జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం తెలంగాణలో 3 భాగాలుగా 33 జిల్లాలు ఉన్నాయి. ఇందులో 119 అసెంబ్లీ నియోజక వర్గాలు, 74 డివిజన్లు, 593 మండలాలు ఉన్నాయి.

భౌగోళిక పరంగా...

భారతదేశ దక్షిణ దక్కన్‌ పీఠభూమిలో తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాంతం. ఇది భౌగోళికంగా 15ా50× నుంచి 19ా51× ఉత్తర అక్షాంశాల మధ్య, 77ా15× నుంచి 81ా19× తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. తెలంగాణకు భౌగోళికంగా దక్షిణాన జోగులాంబ గద్వాల, ఉత్తరాన ఆదిలాబాద్‌, పశ్చిమాన నారాయణపేట, తూర్పున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం భూపరివేష్టిత ప్రాంతం. దీనికి ఈశాన్యంలో ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాన మహారాష్ట్ర, పశ్చిమాన కర్ణాటక; దక్షిణ, తూర్పు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నాయి.

తెలంగాణ ఆవిర్భావ సమయం నాటికి రాష్ట్ర భౌగోళిక వైశాల్యం 1,14,840 చ.కి.మీ. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 2014 యాక్ట్‌ నెం.6ను అనుసరించి, 2014 జులై 17న యాక్ట్‌ నెం.19, సెక్షన్‌ 3ను అనుసరించి పోలవరం ముంపు గ్రామాలను దృష్టిలో ఉంచుకొని సవరణ చేశారు. దీనిలో భాగంగా 7 మండలాలు, 327 గ్రామాలను (2763 చ.కి.మీ వైశాల్యం) ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. వీటిలో కూనవరం, చింతూరు, వి.ఆర్‌.పురం, భద్రాచలం (పాక్షికంగా) తూర్పుగోదావరిలో; కుకునూర్‌, వేలేరుపాడు, బూర్గంపాడు (పాక్షికంగా)లను పశ్చిమ గోదావరిలో విలీనం చేశారు. ప్రస్తుతం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ. ఇది దేశ విస్తీర్ణంలో 3.41 శాతంతో 11వ స్థానంలో ఉంది.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

జాగ్రఫీని మ్యాప్‌లు ఆధారంగా చదవితే సులభంగా అర్థం చేసుకొని, గుర్తుంచుకోవచ్చు. ఫ్లోచార్ట్‌ల సాయంతో వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్‌ చేయాలి. గణాంకాలపై వచ్చే ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని