TS Exams 2022: వెట్టిచాకిరి... వలసల తాకిడి!

పలు చారిత్రక, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల తెలంగాణ సమాజ నిర్మాణం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ‘సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు’ అధ్యయనంలో భాగంగా వాటిని తెలుసుకోవాలి.

Updated : 15 Apr 2022 05:39 IST

సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు, పథకాలు

పలు చారిత్రక, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల తెలంగాణ సమాజ నిర్మాణం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ‘సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు’ అధ్యయనంలో భాగంగా వాటిని తెలుసుకోవాలి. ముఖ్యంగా వెట్టిచాకిరి, బాలకార్మికులు, జోగిని వ్యవస్థ వంటివి నాడు ప్రబలటానికి దోహదపడిన పరిస్థితులను, వాటి నిర్మూలనకు జరిగిన పోరాటాలను అర్థం చేసుకోవాలి.  


తెలంగాణ సమాజ నిర్మాణం

తాబ్దాలుగా తెలంగాణలో నెలకొన్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని రకాల సమస్యలు తలెత్తాయి. భౌగోళికంగా ఈ ప్రాంతం దక్కన్‌ పీఠభూమిలో ఉంది. దాదాపు రెండు వందల సంవత్సరాలకుపైగా నిజాంల పాలన సాగింది. ముస్లిం మత ప్రభావం కూడా ఈ సమాజంపై ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఇతర ప్రాంతాల కంటే  భిన్నమైన పరిస్థితులు ఏర్పడి ప్రజాజీవనాన్ని ప్రభావితం చేశాయి. తెలంగాణ సామాజిక నిర్మాణంలో  భూస్వామ్య లేదా ఉన్నత కులాల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. వీరు తక్కువ లేదా నిమ్న కులాల వారిని రకరకాల పనుల కోసం వినియోగించేవారు.  వివిధ వృత్తులు చేసేవారిని తమ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు. ప్రతిఫలంగా తోచింది ఇచ్చేవారు. శ్రమకు తగిన ఫలితం నిమ్నకులాల వారికి అందేది కాదు. నిర్ణీత మొత్తాన్ని వాళ్లకు చెల్లించాలనే సంప్రదాయం కూడా ఉండేది కాదు. చాలావరకు ఉచితంగా పనులు చేయించుకునేవారు. ఆ వెట్టిచాకిరి, శ్రమదోపిడీ తదనంతర కాలంలో సాయుధ రైతుల పోరాటం తీవ్రంగా జరగడానికి ప్రాతిపదికలుగా మారాయి.

తెలంగాణలో మరో ముఖ్యమైన సమస్య బాలకార్మిక వ్యవస్థ. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఉన్నప్పటికీ తెలంగాణలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ జీవనం ప్రధానంగా భూమి ఆధారంగా సాగుతుంది. ఆ భూములన్నీ ప్రాబల్య కులాల చేతుల్లో ఉండేవి. వాటిలో నిమ్న కులాలకు చెందిన వారంతా కూలీలుగా పని చేసేవారు. దీంతో అత్యంత పేదరిక పరిస్థితుల్లో జీవనం సాగేది. తప్పనిసరి పరిస్థితుల్లో కూలీల కుటుంబాల్లోని పిల్లలూ పనికి వెళ్లేవారు. ఫలితంగా బాలకార్మిక వ్యవస్థ పెరిగిపోయింది.
ఆడవారిని పరోక్షంగా వ్యభిచార వృత్తిలోకి దించే సంప్రదాయం ఒకటి ఉండేది. దాన్నే తెలంగాణలో జోగిని లేదా దేవదాసి వ్యవస్థ అంటారు. ఆంధ్రలోనూ ఈ దేవదాసి విధానం ఉండేది. నిజానికి మహిళలు తమను తాము దేవుడికి సమర్పించుకోవడం జోగిని వ్యవస్థ. అంటే దేవాలయాలకు తమను అర్పించుకోవడం అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడి సేవలకు బదులుగా వారిని వ్యభిచారంలోకి దించేవారు. దీంతో పలు సామాజిక సమస్యలు తలెత్తాయి.

ఒక్కో రీతిలో... ఒక్కో చోటికి!

నాటి తెలంగాణ సమాజంలో ప్రముఖంగా కనిపించే మరో సమస్య వలసలు. దేశంలోని చాలా ప్రాంతాల్లో రకరకాల పనుల్లో భాగస్వాములుగా ఇక్కడి ప్రజలు కనిపించేవారు. పాత కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లోని చేనేత వృత్తులవారు దేశంలోని పలు ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. మన మహబూబ్‌నగర్‌ శ్రామికులు కట్టిన ఇళ్లు, రోడ్లు, ఇంకా ఇతర నిర్మాణాలు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. మెదక్‌ నుంచి వలసలు వెళ్లేవారిలో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఉండేవారు. ఈ విధంగా ఒక్కో జిల్లా నుంచి ఒక్కోరకంగా తెలంగాణ ప్రజలు వలస వెళ్లారు. అప్పట్లో వ్యవస్థీకృతమైన సాగునీటి వ్యవస్థ లేకపోవడం దీనికి ఒక ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. పంటలన్నీ వర్షాధారం. లేదంటే భూగర్భజలాలే వ్యవసాయానికి దిక్కు. దీంతో ఎక్కువమంది తరచూ నష్టాలకు గురయ్యేవారు. ఆర్థిక సమస్యలు పెరిగిపోయి, ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చేనేత కార్మికులు సాంస్కృతికంగా చాలావరకు తమ వృత్తులకే అలవాటు పడిపోయారు. వేరే పనులు చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

పాలిటీ అధ్యయనానికి సంబంధించి రాజ్యాంగంలోని అన్ని ఆర్టికల్స్‌ను పరీక్షల కోసం చదవాల్సిన పనిలేదు. అవసరమైన వాటిని కీలక పదాలతో కలిపి ఒక క్రమంలో రాసుకొని తరచూ రివిజన్‌ చేస్తే బాగా గుర్తుంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని