TS Exams 2022: మాట తప్పారు... మళ్లీ విడిపోయారు!

పద్దెనిమిదో శతాబ్దం వరకు ఒకటిగా ఉన్న తెలుగుగడ్డలోని కోస్తా, రాయలసీమలను ఆంగ్లేయులకు ఆనాటి నిజాం అప్పగించడంతో తెలుగువారు విడిపోయారు. స్వాతంత్య్రానంతరం పెద్దమనుషుల ఒప్పందంతో విశాలాంధ్రగా  కలిశారు.

Updated : 16 Apr 2022 06:15 IST

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

పద్దెనిమిదో శతాబ్దం వరకు ఒకటిగా ఉన్న తెలుగుగడ్డలోని కోస్తా, రాయలసీమలను ఆంగ్లేయులకు ఆనాటి నిజాం అప్పగించడంతో తెలుగువారు విడిపోయారు. స్వాతంత్య్రానంతరం పెద్దమనుషుల ఒప్పందంతో విశాలాంధ్రగా  కలిశారు. ఆ సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన రక్షణలు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. దాంతో తలెత్తిన పరిస్థితులు మళ్లీ రాష్ట్రాల విభజనకు దారితీశాయి. తెలుగు ప్రాంతాలు కలవడానికి, విడిపోవడానికి ఉన్న కారణాలను అభ్యర్థులు సమగ్రంగా అర్థం చేసుకుంటే గ్రూప్స్‌, ఇతర పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయగలుగుతారు.

పెద్ద మనుషుల ఒప్పందం - ఉల్లంఘనలు

రెండు తెలుగు ప్రాంతాలను విలీనం చేసి విశాలాంధ్రను ఏర్పాటు చేసే సందర్భంలో తెలంగాణ నేతలకు తమ ప్రాంత అభివృద్ధిపై కొన్ని సందేహాలు నెలకొన్నాయి. వారి సందేహాలు తీరుస్తూ ఆంధ్ర రాష్ట్ర నాయకులు తెలంగాణకు ఇచ్చిన హామీలే పెద్దమనుషుల ఒప్పందం. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఈ ఒప్పందంలోని హామీలన్నింటినీ ఉల్లంఘించారు. 1956 నవంబరు 1న రాష్ట్రం ఏర్పడగానే రక్షణల అమలు స్థానంలో ఉల్లంఘనలు నిరాటంకంగా కొనసాగాయి.

హామీల విస్మరణ ఇలా..!

* విశాలాంధ్ర (ఆంధ్రప్రదేశ్‌) ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణ వారికి ఇవ్వాలి. కానీ మొదటి మంత్రిమండలిలో తెలంగాణ వారికి ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించారు. నాటి సీఎంనీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవిని చేతికి ఆరో వేలు లాంటిదని అభివర్ణించి కించపరిచారు. 1956 నుంచి 1971 వరకు 15 ఏళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఆంధ్రా ప్రాంతానికి చెందినవారే పనిచేశారు.  

* ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ముల్కీ నిబంధనలను ఉల్లంఘించి తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వారికి ఉద్యోగాలు కల్పించారు. ముల్కీ నియమాలకు వ్యతిరేకంగా బోగస్‌ సర్టిఫికెట్లను జారీ చేసి తెలంగాణ ఉద్యోగాలన్నింటినీ ఆంధ్ర ప్రాంతం వారికే దక్కేలా చేశారు. రాష్ట్ర సచివాలయంలో పెద్ద మొత్తంలో ఆంధ్రులే నియమితులయ్యారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ అంతటా ఆంధ్రావారినే నియమించడం వల్ల తెలంగాణ విద్యావంతులు నిరుద్యోగులయ్యారు.  

* రాష్ట్రం ఏర్పడగానే హైదరాబాద్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీని ఒప్పందానికి వ్యతిరేకంగా రద్దు చేశారు.

* ఒప్పంద ముసాయిదాలో రాష్ట్రం పేరును ఆంధ్ర - తెలంగాణ అని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్‌గా మార్పు చేశారు. ఈ విధంగా రాష్ట్రం పేరులో తెలంగాణ పదాన్ని తీసివేయడం తెలంగాణ అస్థిత్వాన్ని రూపుమాపడానికి చేసిన కుట్ర పూరితమైన చర్యగా ఇక్కడి నాయకులు భావించారు.

* జల వనరుల వినియోగంలో తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా దోచేశారు. తెలంగాణలో గోదావరి నదిపై ప్రతిపాదిత నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దుచేశారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి మొదట ఎడమ కాలువకు ప్రతిపాదించిన 132 టీఎంసీల నీటిని 89 టీఎంసీలకు తగ్గించారు. ప్రతిపాదిత బీమా ప్రాజెక్టును రద్దుచేసి ఆంధ్రా ప్రాంతానికి చెందిన తుంగభద్ర కెనాల్‌ నిర్మాణానికి నిధులను కేటాయించారు.

* పోచంపాడు (శ్రీరాంసాగర్‌)కు సంబంధించి మొదట ప్రతిపాదించిన 250 టీఎంసీల నీటిని రాష్ట్రం ఏర్పడిన తర్వాత 66 టీఎంసీలకు తగ్గించారు. మొత్తం మీద తెలంగాణలో నీటిపారుదల సామర్థ్యాన్ని 20 లక్షల ఎకరాల నుంచి 5.7 లక్షలకు తగ్గించారు.

* రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణ ప్రాంతంలోని మిగులు నిధులను ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి తరలించారు.

* 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 5 నెలల కాలంలోనే తెలంగాణలోని మొత్తం మిగులు నిధులను ఆంధ్రా ప్రాంత అభివృద్ధికి తరలించారు.

* 1956 - 68 మధ్య కాలంలో తెలంగాణ ఆదాయంలో సాలీన, సరాసరి 12.4% నిధులను ఆంధ్రకు ఖర్చుచేశారు.

ప్రిపరేషన్‌ టెక్నిక్‌

పోటీ పరీక్షల జనరల్‌ స్టడీస్‌ కోసం భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల వెనుక ఉండే సైన్స్‌ సూత్రాలను అర్థం చేసుకోగలిగిన పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది.

రచయిత: ఎ.ఎం.రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని