TS Exams 2022: వనరులు ఉన్నా... వృద్ధి సున్నా!

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసేటప్పుడు మొదటగా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక ప్రగతికి ప్రధానమైన

Updated : 18 Apr 2022 05:45 IST

తెలంగాణ ఆర్థిక వ్యవస్థ

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేసేటప్పుడు మొదటగా ఉమ్మడి రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులపై ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆర్థిక ప్రగతికి ప్రధానమైన వ్యవసాయం, పరిశ్రమలు, నీటిపారుదల తదితర రంగాలు నాడు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. అందుబాటులో ఉన్న అధికారిక లెక్కల ప్రకారం అప్పటికి తెలంగాణ ప్రాంతంలో వనరులు ఉన్నప్పటికీ ఆ మేరకు వృద్ధి జరగలేదనేది నిపుణుల అభిప్రాయం. అభ్యర్థులు పరీక్షల కోణంలో ఆ వివరాలను అర్థం చేసుకోవాలి.

అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (1956 - 2014)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మూడు దశల్లో (1956 - 70, 1971 - 90, 1991 - 2014) అధ్యయనం చేశారు. వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, విద్యుచ్ఛక్తి రంగాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అనేక తేడాలు ఉన్నాయి.

1956 నవంబరు 1కి ముందు వరకు కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్‌ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో విలీనమై ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆలోచనకు 1905లోనే బీజం పడింది. ఈ ఆలోచన విశాలాంధ్ర ఏర్పాటుకు దారితీసింది.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ముందు ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు

* రాజధాని సమస్య

* ఆంధ్రాలో బొగ్గు నిల్వలు లేకపోవడం

* నీటివనరులు, విద్యుచ్ఛక్తి, ఖనిజ సంపద, ముడిసరకుల కొరత

లోటు బడ్జెట్‌, తలసరి ఆదాయం తక్కువగా ఉండటం

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌/తెలంగాణ పరిస్థితులకు సంబంధించి 1956 - 2014 కాలం మొత్తాన్ని మూడు దశలుగా విభజించారు.

మొదటి దశ (1956 - 1970): ఇది విలీనం తర్వాత దశ. ఈ సమయంలో 1969లో తెలంగాణ ఉద్యమం జరిగింది.  తెలంగాణ ఆర్థిక వ్యవస్థను హైదరాబాద్‌ నగరంతో కలిపి 10 జిల్లాలుగా ఉన్న భూభాగంగా గుర్తించారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడే  నాటికి తెలంగాణ భూభాగంలో 9 జిల్లాలు. అవి: మహబూబ్‌నగర్‌, నల్గొండ, హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం. 1976లో రంగారెడ్డి 10వ జిల్లాగా ఏర్పడింది.

రెండో దశ (1971 - 1990): ఈ దశలో ప్రభుత్వ రంగం ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన పాత్ర పోషించింది.

మూడో దశ (1991 - 2014): దీన్ని ఆర్థిక సంస్కరణల అమలు, సంస్కరణల అనంతర దశగా పేర్కొంటారు.  

వ్యవసాయ రంగం

హైదరాబాద్‌ రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత 1949లో జాగిర్దారీ రద్దు చట్టం అమల్లోకి వచ్చింది. భూస్వామ్య వ్యవస్థలోని జాగీర్లు, మక్తాలు, మున్సబ్‌లు రద్దయ్యాయి.1950లో వచ్చిన హైదరాబాద్‌ కౌలుదారీ చట్టంతో కౌలు రైతులకు రక్షిత కౌలు కింద యాజమాన్య హక్కులు ఖరారయ్యాయి.

రచయిత: బండారి ధనుంజయ


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

జనరల్‌ స్టడీస్‌లో భాగంగా లాజికల్‌ రీజనింగ్‌ ప్రిపేర్‌ అయ్యేటప్పుడు సులభమైన ప్రశ్నలతో మొదలుపెట్టడం మంచిది. తర్వాత కఠినమైన వాటిని ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల  ప్రశ్నలోని లాజిక్‌ను గ్రహించడం త్వరగా అలవాటవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని