TS Exams 2022: సమగ్రతకు... సార్వభౌమత్వానికి సంరక్షణలు!

మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేందుకు, అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణలను సంరక్షించడానికి రాజ్యాంగంలో అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిని వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు లభించి దేశం ఏకతాటిపై ఉండే వీలుంటుంది. 

Updated : 20 Apr 2022 06:28 IST

భారత రాజ్యాంగం రాజకీయాలు

మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించేందుకు, అసాధారణ పరిస్థితుల్లో దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణలను సంరక్షించడానికి రాజ్యాంగంలో అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిని వినియోగించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు లభించి దేశం ఏకతాటిపై ఉండే వీలుంటుంది. ఈ అధికారాల నేపథ్యం, రాజ్యాంగ వివరణ, వినియోగించిన సందర్భాలు,  ఆ సమయంలో దేశంలో సంభవించిన మార్పులు లాంటి అంశాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.


అత్యవసర అధికారాలు 

అత్యవసర పరిస్థితి అధికారాలను మన రాజ్యాంగ నిర్మాతలు భారత ప్రభుత్వ చట్టం, 1935 నుంచి గ్రహించారు. వీటిని వినియోగించినప్పుడు పాటించాల్సిన పద్ధతులను జర్మనీ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు. కానీ వాటి అమలు సమయంలో ‘జీవించే హక్కు’ రద్దు కాకుండా ఉండే విధానాన్ని జపాన్‌ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు.  

రాజ్యాంగ సభలో అనుకూల, వ్యతిరేక వాదనలు 

రాజ్యాంగంలో అత్యవసర అధికారాలు తప్పనిసరిగా పొందుపరచాలని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టి.టి.కృష్ణమాచారి ప్రతిపాదించారు. వీటిని రాజ్యాంగంలో పొందుపరచాల్సిన అవసరం లేదంటూ హెచ్‌.వి.కామత్, కె.టి.షా, సి.డి.దేశ్‌ముఖ్‌ పూర్తిగా వ్యతిరేకించారు. 

* భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో ఆర్టికల్‌ 352 నుంచి 360 మధ్య మూడు రకాల అత్యవసర అధికారాలను పేర్కొన్నారు. 

1) జాతీయ అత్యవసర పరిస్థితి(National Emergency)- ఆర్టికల్‌ 352 

2) రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ్బ(Constitutional Emergency) - ఆర్టికల్‌ 356 

3) ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergency) - ఆర్టికల్‌ 360

జాతీయ అత్యవసర పరిస్థితి

దీన్ని ఆర్టికల్‌ 352 ప్రకారం భారత రాష్ట్రపతి రెండు రకాల కారణాలతో కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు విధిస్తారు. ఇప్పటి వరకు మన దేశంలో మూడుసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

బాహ్య కారణాలు: మన దేశంపై విదేశీ దాడి జరిగినప్పుడు లేదా మన దేశం శత్రుదేశంపై యుద్ధం ప్రకటించినప్పుడు దేశ సమగ్రతను పరిరక్షించడానికి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు.

ఆంతరంగిక కారణాలు: దేశంలో అంతర్గతంగా కల్లోలాలు  చెలరేగి శాంతిభద్రతలు క్షీణించినప్పుడు దేశ సమగ్రతను పరిరక్షించడానికి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. 


దేశంలో సంభవించే మార్పులు 

ఆర్టికల్‌ 250:  రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను జారీ చేస్తారు.

ఆర్టికల్‌ 353: రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వాహక అధికారాలపై కేంద్రం పరిమితులను విధించగలదు.

ఆర్టికల్‌ 354: కేంద్రం నుంచి రాష్ట్రాలకు బదిలీ అయ్యే వనరులను కేంద్రం నిలిపివేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక అధికారాలపై కేంద్రం పరిమితులను విధించగలదు. 

ఆర్టికల్‌ 358:  దీని ప్రకారం ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సహజంగానే రద్దవుతాయి.

 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ప్రకారం బాహ్య కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు మాత్రమే ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు సహజంగా రద్దు అవుతాయి. ఆంతరంగిక/సాయుధ కారణాలతో విధించినప్పుడు ఆర్టికల్‌ 19లో పేర్కొన్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సహజంగా రద్దు కావని, రాష్ట్రపతి జారీ చేసే ప్రత్యేక ప్రకటనల ద్వారా మాత్రమే రద్దు అవుతాయని, దీన్ని పార్లమెంట్‌ ఆమోదించాలని నిర్దేశించారు.

ఆర్టికల్‌ 359: జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో రాష్ట్రపతి ఆర్టికల్‌ 20, 21లో పేర్కొన్న ప్రాథమిక హక్కులను మినహాయించి మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ సస్పెండ్‌ చేయవచ్చు. 

 ఉన్నత న్యాయస్థానాల న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించవచ్చు. ప్రాథమిక హక్కుల అమలుకు ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు జారీ చేసే రిట్స్‌పై పార్లమెంట్‌ చట్టబద్ధమైన పరిమితులను విధించగలదు.


 జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భాలు

 1962లో భారతదేశంపై చైనా దురాక్రమణ చేయడంతో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వం సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మన దేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. ఇది 1962 అక్టోబరు 26 నుంచి 1968 జనవరి 10 వరకు అమలులో ఉంది. 

1971 డిసెంబరు 3 నుంచి 1977 మార్చి 21 మధ్య రెండోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని అమలు చేశారు. 1971లో బంగ్లాదేశ్‌ అవతరణ సందర్భంగా భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి విధించారు.

1975 జూన్‌ 25 నుంచి 1977 మార్చి 21 మధ్య మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. 1975లో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చెలరేగిన ఆంతరంగిక అల్లకల్లోలాలను నియంత్రించేందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ విధించారు. 

1975లో 38వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్‌ 352(4) ద్వారా ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించవచ్చని నిర్దేశించారు. 1975 నుంచి 1977 మధ్య మన దేశంలో ఒకే సమయంలో రెండు వేర్వేరు కారణాలతో జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించారు. 


చట్టసభల కాలం పొడిగింపు

జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలం గడువు ముగిసినప్పటికీ పొడిగించవచ్చు.

5వ లోక్‌సభ పదవీకాలం 1976 మార్చి 18న ముగిసేనాటికి ఆంతరంగిక కారణాలతో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. దాంతో ఆ లోక్‌సభ పదవీకాలాన్ని 1977 మార్చి 18 వరకు పొడిగించారు. కానీ 1977 జనవరి 18న లోక్‌సభను రద్దు చేశారు. మొత్తంగా 5వ లోక్‌సభ 5 సంవత్సరాల 10 నెలలు కొనసాగింది. 

1976లో ఒడిశా, కేరళ రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని ఒక సంవత్సరం పొడిగించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో 5వ శాసనసభ పదవీకాలాన్ని ఒక సంవత్సరం అదనంగా (1977 - 78) పొడిగించారు.


ఆమోదం - రద్దు

ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్‌ 2/3 ప్రత్యేక మెజార్టీతో 30 రోజుల్లోగా ఆమోదించాలి. 

రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసే సమయానికి లోక్‌సభ రద్దయి ఉంటే దాన్ని రాజ్యసభ ఆమోదంతో కొనసాగిస్తారు. కొత్త లోక్‌సభ ఏర్పడిన తర్వాత ఆ సభ మొదటి సమావేశ తేదీ నుంచి 30 రోజుల్లోగా ఈ ప్రకటనను ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. 

దీన్ని ఆమోదించే విషయంలో పార్లమెంట్‌ ఉభయసభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది. ఈ విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. 

పార్లమెంట్‌ ఆమోదంతో 6 నెలలకొకసారి జాతీయ అత్యవసర పరిస్థితిని ఎంతకాలమైనా కొనసాగించవచ్చు. దీనికి గరిష్ఠ కాలపరిమితి లేదు.

జాతీయ అత్యవసరస్థితిని రాష్ట్రపతి 6 నెలల కంటే ముందే ఎప్పుడైనా రద్దుచేయవచ్చు.

ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్‌ రద్దు చేయగలదు. 

44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 ద్వారా లోక్‌సభలోని 1/10వ వంతు సభ్యుల సంతకాలతో జాతీయ అత్యవసర పరిస్థితి రద్దును కోరుతూ ఒక తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్‌/రాష్ట్రపతికి అందజేయాలి. దీని ప్రకారం సాధారణ మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయవచ్చు.


విమర్శలు 

‘అత్యవసర పరిస్థితిని ఉపయోగించి నెలకొల్పే శాంతి శ్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది’ - హెచ్‌.వి.కామత్‌

‘అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపై జరిపే దోపిడీ లాంటివి’ - కె.ఎం.నంబియార్‌

‘భారత రాజ్యాంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు తనను తాను సంరక్షించుకోవడానికి వినియోగించే ఉపాయాలు అత్యవసర అధికారాలు’ - డాక్టర్‌.బి.ఆర్‌.అంబేడ్కర్‌


44వ రాజ్యాంగ సవరణ - మార్పులు 

‘ఆంతరంగిక అల్లకల్లోలాలు’ అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘సాయుధ దళాల తిరుగుబాటు’ పదాన్ని చేర్చారు. 

కేంద్ర కేబినెట్‌ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలి.

కేంద్ర కేబినెట్‌ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. ఒకసారి పునఃపరిశీలనకు పంపవచ్చు. కానీ కేంద్ర కేబినెట్‌ రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా జాతీయ అత్యవసరస్థితిని విధించాలి. 

జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంట్‌ 30 రోజుల్లోగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలి. అంతకు ముందు పార్లమెంట్‌ రెండు నెలల్లోగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించాలని ఉండేది. 


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలను వెంటనే ప్రాక్టీస్‌ చేయాలి. రివిజన్‌ చేయాలి. అప్పుడే బాగా గుర్తుంటుంది. అలా చేయకుండా కొత్త చాప్టర్లు చదువుకుంటూ పోతుంటే పాతవి మర్చిపోవడానికి అవకాశం ఉంది. 


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని