Updated : 24 Apr 2022 06:47 IST

TS Exams 2022: కంటికి కనిపించని శత్రువులు!

జనరల్‌సైన్స్‌ బయాలజీ

కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మజీవులు మనుషులకు అనేక రకాల వ్యాధులను కలుగజేస్తాయి. నిత్యజీవిత పరిజ్ఞానంలో భాగంగా జనరల్‌ స్టడీస్‌ కోసం అభ్యర్థులు వీటి గురించి అధ్యయనం చేయాలి. పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్నారు.

సూక్ష్మజీవులు - వ్యాధులు
మన పరిసరాల్లో కంటికి కనిపించని అనేక సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మానవులకు వివిధ వ్యాధులను కలుగజేస్తాయి.

మైకోప్లాస్మా
వీటినే ప్లూరో న్యూమోనియో లైక్‌ ఆర్గనిజమ్స్‌ (PPLO) అంటారు. ఇది కేంద్రక పూర్వజీవులు, అతిచిన్న కణాలకు ఉదాహరణ. వీటికి కణకవచం ఉండదు.
మానవుడిలో కలిగే వ్యాధులు: 1) మైకోప్లాస్మా న్యుమోనియే - శ్వాస నాళానికి సంబంధించిన వ్యాధి, ట్రాకియో బ్రాంకైటిస్‌ 2) మైకోప్లాస్మా హామినిస్‌ - పోస్ట్‌పార్టమ్‌ ఫీవర్‌, పైలియోనిఫిరిటిస్‌, పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరి డిసీజ్‌ 3) మైకోప్లాస్మా జెనిటేలియమ్‌ - నాన్‌గోనోకోకల్‌ యురైథ్రిటిస్‌

క్లమీడియా
ఇవి బ్యాక్టీరియా కంటే భిన్నమైనవి. బ్యాక్టీరియా మాదిరి వీటికి పెప్టిడోగ్లైకాన్‌ కణ కవచం ఉండదు. ఇవి కణాంతర్గత పరాన్నజీవులు. గ్రామ్‌ నెగెటివ్‌గా ఉంటాయి. గుండ్రటి ఆకారం ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి స్పర్శ లేదా గాలి ద్వారా వాపిస్తాయి.
కలిగించే వ్యాధి: 1) క్లమీడియా ట్రకోమాటిస్‌ - ట్రకోమా, లైంగిక వ్యాధులు, యురైథ్రైటిస్‌ 2) క్లమీడియా న్యూమోనియే - న్యూమోనియా 3) క్లమీడియా సిట్టసి - సిట్టకోసిస్‌ (ఆర్నిథోసిస్‌)

రికెట్షియా  
ఇవి గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియా. అవికల్ప కణాంతర పరాన్నజీవులు. ఇవి ఆతిథేయి కణద్రవ్యం, కేంద్రకంలో విభజన చెందుతాయి. కణకవచం గ్రామ్‌ నెగెటివ్‌ బ్యాక్టీరియాలా ఉంటుంది. ఇవి చలించవు, స్పోరులను ఏర్పరచవు. ద్విదావిచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. మానవులకు నల్లులు, తలలోని పేలు, ఈగలు కుట్టడం ద్వారా సంక్రమిస్తాయి.
రికెట్షియా జీవి కలిగించే వ్యాధులు:  1)రికెట్షియా ప్రోవాజెకి - ఎపిడమిక్‌ టైపస్‌ 2) రికెట్షియా టైఫి - మ్యూరైన్‌ టైఫస్‌ 3) ఓరియంటియా సుసుగముషి - స్క్రబ్‌ టైఫస్‌ 4) రికెట్షియా రికెట్సి - రాకిమౌంటెడ్‌ స్పాటెడ్‌ ఫీవర్‌ 5) కెక్సిల్లా బ్రునెటి - క్యూఫీవర్‌     6) బార్టోనెల్లా క్విన్‌టానా - ట్రెంచ్‌ ఫీవర్‌ 7) రికెట్షియా కొనోరి - ఇండియన్‌ టిక్‌ టైపస్‌

ఆక్టినోమైసిటీస్‌ (ఆక్టినో బ్యాక్టీరియా)
ఇవి దండాకారంగా ఉండి గ్రామ్‌ పాజిటివ్‌ను చూపుతూ స్పోరులను ఏర్పరిచే బ్యాక్టీరియా. వీటిని బ్యాక్టీరియా, శిలీంద్రాలకు సంధానకర్తగా వ్యవహరిస్తారు. ఇవి శిలీంద్ర  తంతువులను ఏర్పరుస్తాయి. వాయుయుతంగా, వాయురహితంగా కూడా ఉంటాయి. నేలలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని జీవులు మానవులకు వ్యాధులను కలగజేస్తాయి.
ఉదా: ఆక్టినోమైకోటిక్‌ మైసిటోమా, ఆక్టినో మైకాసిస్‌

ప్లాటిహెల్మింథిస్‌ వ్యాధులు
ప్లాటిహెల్మింథిస్‌ అంటే బల్లపరుపు పురుగులు. వీటి శరీరం కొలబద్దలా (టేప్‌ ఆకారం) ఉంటుంది. కాబట్టి వీటిని బద్దెపురుగులు అంటారు. ఇవి జంతురాజ్యంలో అకశేరుకాలకు చెందినవి. వీటిలో కొన్ని మానవుడిలో వ్యాధులను కలగజేస్తాయి.

ప్లాటిహెల్మింథిస్‌ జీవి కలిగించే వ్యాధులు
1) టినియా సోలియమ్‌ (పోర్క్‌ టేప్‌వార్మ్‌) - టినియాసిస్‌/సిస్టిసర్కాసిస్‌ 2) ఇఖైనోకోకస్‌ గ్రాన్యులోసా (డాగ్‌ టేప్‌వార్మ్‌) - హైడటిడ్‌ వ్యాధి 3) సిస్టోసోమా  - సిస్టో సోమియాసిస్‌

నిమాటి హెల్మింథిస్‌ వ్యాధులు
నిమాటి హెల్మింథిస్‌ అంటే దారపు పోగుల లాంటి జీవులు. వీటిలో కొన్ని జీవులు మానవులకు వ్యాధులను కలిగిస్తాయి.

నిమాటి హెల్మింథిస్‌ జీవి కలిగించే వ్యాధులు
1) ఫైలేరియా పురుగు (వుకరేరియా) - ఫైలేరియాసిస్‌ (ఏనుగు కాలు/బోధకాలు) 2) నార పురుగు (గునియా వార్మ్‌) - నార కురుపు వ్యాధి (డ్రాకన్‌ క్యులియాసిస్‌) 3) ఆస్కారిస్‌ - ఆస్కారియాస్‌ ఎంటరోబిస్‌ - ఎంటరోబియాసిస్‌ 4) ఎన్‌కైలోస్టోమా (కొంకి పురుగు) - ఎన్‌కైలో స్టోమియాసిస్‌ 5) ఆఫ్రికా కంటి పురుగు - కలబార్‌ స్వెల్లింగ్‌.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

జనరల్‌సైన్స్‌పై ప్రతి పరీక్షలోనూ ప్రశ్నలు వస్తుంటాయి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీల నుంచి ఎలాంటి ప్రశ్నలు, ఏవిధంగా వస్తున్నాయో తెలుసుకోవాలంటే పాత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. దాని వల్ల సైన్స్‌ను ఏ మేరకు చదివితే సరిపోతుందో అర్థమవుతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని