TS Exams 2022: జలాల పంపిణీలో జగడాలు!

నదీజలాలలను సక్రమంగా పంచుకొని, వినియోగించుకోవడంలో రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు తలెత్తుతుంటాయి. వీటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని ఏయే రాష్ట్రాల మధ్య ఎలాంటి నదీ జలాల వివాదాలు నడుస్తున్నాయో అభ్యర్థులు

Updated : 25 Apr 2022 06:43 IST

తెలంగాణ భూగోళ శాస్త్రం

నదీజలాలలను సక్రమంగా పంచుకొని, వినియోగించుకోవడంలో రాష్ట్రాల మధ్య అనేక వివాదాలు తలెత్తుతుంటాయి. వీటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ట్రైబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని ఏయే రాష్ట్రాల మధ్య ఎలాంటి నదీ జలాల వివాదాలు నడుస్తున్నాయో అభ్యర్థులు తెలుసుకోవాలి. వీటిపై పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. 

అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాలు 

దేశంలోని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య జల వివాదం తలెత్తినప్పుడు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌, 262 ఆర్టికల్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుంది. నదీ జలాలు, సరస్సులు, చెరువులు అనే పదాలను కేంద్ర జాబితాలో 56వ అంశంలో; రాష్ట్ర జాబితాలో 17వ అంశంలో పొందుపరిచారు. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టంతో అనేక రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల భారత ప్రభుత్వం 1956 అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాన్ని పార్లమెంట్‌ ద్వారా ఆమోదించింది. జలాల పంపిణీ పరిష్కారం కోసం అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌, నదీ జలాల బోర్డులను ఏర్పాటు చేసింది.  

1956 నదీ జలాల వివాదాస్పద చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1969 నుంచి 2018 వరకు దేశంలో తొమ్మిది నదీ జలాల వివాదాలపై ట్రైబ్యునల్స్‌ వేసింది. దేశంలో తొలి నదీ జలాల ట్రైబ్యునల్‌ను గోదావరి, కృష్ణా, నర్మదా నదిపై 1969లో వేయగా, చివరిది 2018లో మహానదిపై ఏర్పాటు చేశారు. 


 

 ట్రైబ్యునల్స్‌

బచావత్‌ ట్రైబ్యునల్‌: 1969 ఏప్రిల్‌ 10న భారత ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదీ జలాల వివాదంపై ఆర్‌.ఎస్‌.బచావత్‌ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైబ్యునల్‌ గోదావరి నదీ జలాలను 75% నీటి లభ్యతతో మొత్తం 2500 టీఎంసీలుగా గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1498 టీఎంసీలను కేటాయించింది. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ 308 టీఎంసీలను వినియోగించుకోగా మిగిలిన జలాలను తెలంగాణ వినియోగించుకుంటుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం, సెక్షన్‌ 84 ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్‌ 2021 జులై 15న గోదావరి నదిపై మొత్తం 71 ప్రాజెక్టులు ఉన్నట్లు ప్రకటించింది. కృష్ణా నదీ జలాలను బచావత్‌ ట్రైబ్యునల్‌ 75% నీటి లభ్యతతో మొత్తం 2130 టీఎంసీలుగా గుర్తించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలను కేటాయించింది. 2004లో బచావత్‌ ట్రైబ్యునల్‌ కాలం ముగిసింది. 

బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌: కేంద్ర ప్రభుత్వం 2004 ఏప్రిల్‌ 2న బ్రిజేష్‌ కుమార్‌ అధ్యక్షతన కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో ఆంధ్ర, తెలంగాణ అధికారుల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం మేరకు ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీల కృష్ణా నదీ జలాలను వినియోగించుకుంటున్నాయి.అపెక్స్‌ కౌన్సిల్‌ కృష్ణానదిపై మొత్తం 36 ప్రాజెక్టులు ఉన్నట్లు ప్రకటించింది. 

కేంద్ర రాష్ట్రాల సంబంధాలపై నియమించిన సర్కారియా కమిషన్‌ ప్రధాన సిఫార్సులను చేర్చడానికి 1956 అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాన్ని 2002లో సవరించారు. ఈ సవరణ ప్రకారం జల వివాదాల ట్రైబునల్స్‌ను ఏర్పాటు చేయడానికి ఒక సంవత్సరం కాలపరిమితిని, నిర్ణయాన్ని వెల్లడించడానికి మూడేళ్ల కాలపరిమితిని తప్పనిసరి చేశారు. 

భారతదేశంలో క్రియాశీలంగా ఉన్న నదీజలాల వివాద ట్రైబ్యునల్స్‌

కృష్ణానదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ -  ఖిఖి (2004) - మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌
రావి - బియాస్‌ నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ - 1986 - పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌
మహదాయిని నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ - 2010 - గోవా, కర్ణాటక, మహారాష్ట్ర 
వంశధార నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ - 2010 - ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా
మహానది నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ - 2018 - ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌

నదీ జలాల వివాద ట్రైబ్యునల్‌ ఇచ్చే తీర్పును అవార్డ్‌ అంటారు. ఈ అవార్డ్‌ అనేది అంతిమమైంది. న్యాయస్థానాల అధికార పరిధికి మించినది అయినప్పటికీ ఆర్టికల్‌ - 21 (జీవించే హక్కు), ఆర్టికల్‌ - 32 కింద ఆర్టికల్‌ 136 (ప్రత్యేక సెలవు పిటిషన్‌)ను అనుసరించి  ఆయా రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల తీర్పును మరింత క్రమబద్ధీకరించడానికి 1956 అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాద చట్టాన్ని సవరించడానికి 2017 మార్చిలో అంతరాష్ట్ర నదీ జలాల సవరణ బిల్లు - 2017ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శాశ్వత స్థాపన, శాశ్వత కార్యాలయ స్థలం, మౌలిక సదుపాయాలతో స్వతంత్ర ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని బిల్లు ప్రతిపాదించారు.     


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని