TS Exams 2022: అది ఆఖరి అస్త్రమైతేనే సమాఖ్యకు సంరక్షణ!

భారత సమాఖ్యను ఏకతాటిపై ఉంచేందుకు రాజ్యాంగంలోని పద్దెనిమిదో భాగంలో  అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిలో ఆర్టికల్‌ 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేది తరచూ...

Updated : 11 Aug 2022 14:44 IST

భారత సమాఖ్యను ఏకతాటిపై ఉంచేందుకు రాజ్యాంగంలోని పద్దెనిమిదో భాగంలో  అత్యవసర అధికారాలను పొందుపరిచారు. వీటిలో ఆర్టికల్‌ 356 ప్రకారం విధించే రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అనేది తరచూ వివాదాస్పదమవుతోంది. సమాఖ్య వ్యవస్థ సంరక్షణకు ఆఖరి అస్త్రంగా మాత్రమే దీన్ని ఉపయోగించాలని నిపుణులు సూచించినా పరిణామాలు మాత్రం వేరుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాలిటీ అధ్యయనం చేసే అభ్యర్థులు ఆ ఆర్టికల్‌ను, రాజ్యాంగ వివరణలను, దాన్ని విధించినప్పుడు రాష్ట్రాల్లో ఏర్పడే మార్పులను, సుప్రీం కోర్టు తీర్పులను తెలుసుకోవాలి. 

రాష్ట్రపతి పాలన 

ఆర్టికల్‌ 355 ప్రకారం ప్రతి రాష్ట్రం రాజ్యాంగ పరంగా పరిపాలన కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి పరిపాలన సక్రమంగా లేనప్పుడు, రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్‌ 356ను ప్రయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని విధిస్తుంది.

విధింపు - కారణాలు

ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన నిర్వహించడంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని గవర్నర్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను విధిస్తారు. లేదా ఆర్టికల్‌ 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన పరిపాలనా పరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించినప్పుడు, ప్రధాని నాయకత్వంలోని కేంద్ర కేబినెట్‌ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి సంబంధిత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధిస్తారు.

రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం అంటే?

ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడం.
శాంతిభద్రతలు క్షీణించడం.
రాష్ట్రంలో రాజకీయ సుస్థిరత లోపించడం.
ప్రభుత్వాలు తరచూ పడిపోవడం.
ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడకపోవడం.

అంబేడ్కర్‌ వ్యాఖ్యానాలు

‘ఆర్టికల్‌ 356 ఏనాడూ వినియోగానికి నోచుకోని మృత అధికరణగా (Dead Article)  ఉంటుందని ఆశిస్తున్నాను’ (డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో ప్రసంగిస్తూ)
‘ఆర్టికల్‌ 356 రాష్ట్ర ప్రభుత్వాల పాలిట చావు ఉత్తర్వుగా మారింది’.  

 ఆంధ్రరాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన

ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాన నిషేధానికి సంబంధించి టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో అప్పటి గవర్నర్‌ చందూలాల్‌ మాధవ్‌ త్రివేది చేసిన సిఫార్సుల మేరకు నాటి రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. ఇది 1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 29 మధ్య 4 నెలల 11 రోజుల పాటు కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్‌లో జై ఆంధ్ర ఉద్యమం నేపథ్యంలో పి.వి.నరసింహారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో అప్పటి గవర్నర్‌ ఖండూభాయ్‌ దేశాయ్‌ చేసిన సిఫార్సుల మేరకు నాటి రాష్ట్రపతి వి.వి.గిరి ఆర్టికల్‌ 356ను ప్రయోగించి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించారు. ఇది 1973 జనవరి 11 నుంచి డిసెంబరు 10 మధ్య 335 రోజుల పాటు కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం నేపథ్యంలో ఎన్‌.కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ సిఫార్సుల మేరకు నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రాష్ట్రపతి పాలనను విధించారు. ఇది 2014 మార్చి 1 నుంచి జూన్‌ 8 మధ్య 3 నెలల 7 రోజుల పాటు కొనసాగింది.

1951లో పంజాబ్‌ రాష్ట్రంలో తొలిసారి రాష్ట్రపతి పాలనను విధించారు. అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో 10 సార్లు, కేరళలో 9 సార్లు, పంజాబ్‌లో 8 సార్లు రాష్ట్రపతి పాలనను విధించారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆర్టికల్‌ 356ను 48 సార్లు ప్రయోగించారు.

రాష్ట్రంలో సంభవించే మార్పులు

ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి వెంటనే రద్దవుతుంది.
రాష్ట్ర కార్యనిర్వహణాధికారాలు రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహిస్తారు.
రాష్ట్రపతి ప్రతినిధిగా గవర్నర్‌ వాస్తవ కార్యనిర్వహణాధికారాలను కలిగి ఉంటారు.
రాష్ట్ర శాసనసభను పూర్తిగా రద్దు చేయవచ్చు లేదా సుప్తచేతనావస్థలో (suspended animation) ఉంచుతారు.
రాష్ట్రానికి అవసరమైన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది.
పార్లమెంటు సమావేశాలు లేకపోతే రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి జారీచేస్తారు.

రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటు రాష్ట్రపతికి లేదా రాష్ట్రపతి సూచించిన అథారిటీకి అప్పగిస్తుంది.
రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది.
హైకోర్టు అధికార పరిధిలో ఎలాంటి మార్పులు ఉండవు.
గవర్నర్‌కు పరిపాలనా వ్యవహారాల్లో సహకరించడానికి ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను నియమిస్తారు. 

రాష్ట్రపతి పాలన - ప్రకటన,  పార్లమెంటు ఆమోదం

రాష్ట్రపతి ఆర్టికల్‌ 356(1) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను జారీ చేస్తారు.
ఆర్టికల్‌ 356(2) ప్రకారం రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చు.
ఆర్టికల్‌ 356(3) ప్రకారం రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంటు 2 నెలల్లోపు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే అది అమల్లోకి వస్తుంది. ఒకవేళ రాష్ట్రపతి పాలన ప్రకటన వెలువడే సమయానికి లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదంతో కొనసాగుతుంది. కానీ కొత్త లోక్‌సభ ఏర్పడిన తేదీ నుంచి 30 రోజుల్లోగా రాష్ట్రపతి పాలన ప్రకటనను లోక్‌సభ ఆమోదించాలి. లేకపోతే ఆ ప్రకటన రద్దవుతుంది.

కాలపరిమితి: ఆర్టికల్‌ 356(4) ప్రకారం పార్లమెంటు ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి పాలన 6 నెలలు కొనసాగుతుంది. ఆరు నెలలకొకసారి చొప్పున పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి పాలనను ఒక రాష్ట్రంలో గరిష్ఠంగా మూడేళ్లపాటు కొనసాగించవచ్చు.

ఆర్టికల్‌ 356 దుర్వినియోగమవుతున్న తీరు

1977లో మొరార్జీ దేశాయ్‌ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం చేసిన సిఫార్సుల మేరకు అప్పటి తాత్కాలిక రాష్ట్రపతి బి.డి.జెట్టి 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు. 1980లో అధికారాన్ని చేపట్టిన ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన సిఫార్సుల మేరకు అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్టికల్‌ 356ను ప్రయోగించి రద్దు చేశారు.
ఆర్టికల్‌ 356ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని, దీన్ని దుర్వినియోగం చేయకుండా రాజ్యాంగ సవరణ చేయాలని 2002లో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ పేర్కొంది.

ఎస్‌.ఆర్‌.బొమ్మై, యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు - 1994

ఈ కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిస్తూ ఆర్టికల్‌ 356 ద్వారా విధించే రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది.
భారత సమాఖ్యకు భంగం కలిగే విధంగా ఆర్టికల్‌ 356ను ప్రయోగించకూడదు.
రాష్ట్రపతి పాలనను న్యాయసమీక్షకు గురిచేయవచ్చు.
రాష్ట్రపతి పాలనను పార్లమెంటు ఆమోదించే వరకు రాష్ట్ర శాసనసభను రద్దు చేయకూడదు.
న్యాయస్థానం రాష్ట్రపతి పాలనను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాసనసభను పునరుద్ధరించాలి.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

అర్థశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రాథమికాంశాలను క్షుణ్ణంగా చదవాలి. ఆ సాంకేతిక పదజాలంపై అవగాహన పెంచుకుంటే ఎకనామిక్స్‌ ఎంతో తేలిక అనిపిస్తుంది.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని