TS EXAMS 2022: అంతటా వైవిధ్యం... అందుకే ఉపఖండం!

భారతదేశం వైవిధ్య భౌగోళికాంశాల సమాహారం. ఇక్కడ శీతోష్ణస్థితులు రకరకాలు. వర్షపాతాలు వేర్వేరు. పర్వతాలు, పీఠభూములు, లోయలూ పలువిధాలు. అందుకే  ఇదో ఉపఖండం. ఇండియన్‌ జాగ్రఫీని చదివే అభ్యర్థులు ముందుగా ఈ భౌగోళిక ప్రత్యేకతలపై అవగాహన

Updated : 30 Apr 2022 05:41 IST

ఇండియన్‌ జాగ్రఫీ

భారతదేశం వైవిధ్య భౌగోళికాంశాల సమాహారం. ఇక్కడ శీతోష్ణస్థితులు రకరకాలు. వర్షపాతాలు వేర్వేరు. పర్వతాలు, పీఠభూములు, లోయలూ పలువిధాలు. అందుకే  ఇదో ఉపఖండం. ఇండియన్‌ జాగ్రఫీని చదివే అభ్యర్థులు ముందుగా ఈ భౌగోళిక ప్రత్యేకతలపై అవగాహన ఏర్పరచుకుంటే మిగతా అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. 

భారతదేశ భౌగోళికాంశాలు

భారతదేశం విశాలమైన భూభాగాన్ని కలిగి ఉంది. ఒక ఖండానికి ఉండే భౌగోళిక వైవిధ్యాలైన భిన్న శీతోష్ణస్థితులు, వివిధ రకాల వర్షపాతాలు, జలవనరులు, పర్వతాలు, లోయలు, పీఠభూములు ఉన్నాయి. అందుకే మన దేశాన్ని ఉపఖండం అంటారు. భారతదేశం భూమికి ఉత్తరార్ధ గోళంలో 8డిగ్రీల4 నుంచి 37డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాలు, 68డిగ్రీల 7 నుంచి 97డిగ్రీల 25 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. భారతదేశం ఉత్తర కొన నుంచి దక్షిణ కొన వరకు 3214 కి.మీ., తూర్పు చివరి భాగం నుంచి పడమర చివరి భాగం వరకు 2933 కి.మీ. ఉంది. కర్కటరేఖ (ట్రాపిక్‌ ఆఫ్‌ కాన్సర్‌) మన దేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తూ దేశం మధ్య నుంచి ఎనిమిది రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తోంది. పశ్చిమ చివరి నుంచి తూర్పు చివరి ప్రదేశం మధ్య కాల వ్యత్యాసం రెండు గంటలు. దేశం మధ్య నుంచి 82 1/2డిగ్రీల  తూర్పు రేఖాంశం అలహాబాద్‌ సమీపంలోని మీర్జాపూర్‌ దగ్గరగా వెళుతోంది. గ్రీన్‌విచ్‌ కాలమానం కంటే భారత స్టాండర్డ్‌ టైమ్‌ 5 1/2 గంటలు ముందు ఉంటుంది.

విస్తీర్ణ పరంగా 32,87,283 చ.కి.మీ. వైశాల్యంతో భారత్‌ ప్రపంచంలో ఏడో పెద్ద దేశంగా ఉంది. ఇది ప్రపంచ మొత్తం వైశాల్యంలో 2.4%. ఇందులో భూభాగం 29,73,193 చ.కి.మీ. కాగా జలభాగం 3,14,070 చ.కి.మీ. సముద్ర తీర పొడవు 7516 కి.మీ. దేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. భారతదేశంతో ఏడు దేశాలు భూసరిహద్దును కలిగి ఉన్నాయి. అవి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌. హిమాలయ పర్వతాలు భారతదేశాన్ని ఆసియా ఖండం నుంచి వేరుచేస్తున్నాయి. 

2000 నవంబరులో దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి చత్తీస్‌గఢ్‌ (నవంబరు 1న), ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి ఉత్తరాఖండ్‌ (నవంబరు 9న), బిహార్‌ నుంచి ఝార్ఖండ్‌ను (నవంబరు 15న) ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. 2014 జూన్‌ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా (29వ రాష్ట్రం) ఏర్పాటైంది. 2019 అక్టోబరు 31న జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించి జమ్మూ కశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్‌ - డయ్యూ, దాద్రానగర్‌ హవేలీలను విలీనం చేసి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి (పాండిచ్చేరి). ప్రధాన పుదుచ్చేరి, కారైకల్‌ తమిళనాడులో, యానాం ఆంధ్రప్రదేశ్‌లో, మహే కేరళలో ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. 

సరిహద్దు రేఖలు

ఎల్‌ఓసీ రేఖ: భారత్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్య ఉన్న రేఖ.

ఎల్‌ఏసీ/ఎల్‌ఓఏసీ రేఖ: జమ్మూ-కశ్మీర్‌ (ప్రస్తుత లద్దాఖ్‌)లోని ఆక్సాయ్‌ చిన్‌ - చైనా మధ్య గల వాస్తవాధీన రేఖ.

ఏజీపీఎల్‌ రేఖ: భారత్‌లోని పెద్ద హిమానీనదం సియాచిన్, పాకిస్థాన్‌ మధ్య ఉన్న వాస్తవ మోహరింపు రేఖ.

రాడ్‌క్లిఫ్‌ రేఖ: భారత్‌ - పాకిస్థాన్, భారత్‌ - బంగ్లాదేశ్‌లను వేరు చేస్తుంది.

సర్‌క్రిక్‌ రేఖ: గుజరాత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌ గుర్తించిన సరిహద్దు రేఖ. ఇది 24 డిగ్రీల సమాంతర రేఖ.

డ్యూరాండ్‌ రేఖ: భారత్‌ - అఫ్గానిస్థాన్‌ మధ్య ఉన్న రేఖ (బిట్రిష్‌ కాలం నాటి ఒప్పంద రేఖ).

భారతదేశ దక్షిణ చివర ఉన్న ఇందిరా పాయింట్‌ గ్రేట్‌ నికోబార్‌ ద్వీపంలో ఉంది. భారతదేశ చురుకైన అగ్నిపర్వత ప్రాంతం మధ్య అండమాన్‌లో ఉన్న బారెన్‌ ద్వీపం. ఉత్తర అండమాన్‌లో ఉన్న అగ్నిపర్వత ద్వీపం నార్కొండం. అండమాన్, నికోబార్‌ దీవులను 10డిగ్రీల  అక్షాంశం (10 డిగ్రీల ఛానల్‌) వేరుచేస్తుంది. దక్షిణ అండమాన్, లిటిల్‌ అండమాన్‌లను డంకన్‌ పాప్‌ వేరుచేస్తుంది. గ్రేట్‌ నికోబార్, సుమత్రా (ఇండోనేషియా) దీవులను గ్రాండ్‌ ఛానల్‌ వేరుచేస్తుంది. అండమాన్, నికోబార్‌ దీవులను పచ్చదీవులు అంటారు. మినికాయ్, మాల్దీవులను 8డిగ్రీల  ఉత్తర అక్షాంశం (8 డిగ్రీల ఛానల్‌) వేరుచేస్తుంది. భారత్‌ - శ్రీలంకను పాక్‌ జలసంధి వేరుచేస్తుంది. 

దేశంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్‌ కాగా అతిచిన్న రాష్ట్రం గోవా. అతిపెద్ద మహానగరం దిల్లీ. భారత్‌తో ఎక్కువ భూభాగ సరిహద్దు గల దేశం బంగ్లాదేశ్‌ (26.95%), తక్కువ భూభాగ సరిహద్దు గల దేశం అఫ్గానిస్థాన్‌ (0.52%). నేపాల్‌తో ఎక్కువ సరిహద్దు గల రాష్ట్రం బిహార్‌. పాకిస్థాన్‌తో ఎక్కువ సరిహద్దు ఉన్న రాష్ట్రం రాజస్థాన్‌. చైనాతో ఎక్కువ సరిహద్దు ఉన్న ప్రాంతం లద్దాఖ్‌ (ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం). భారతదేశంలో ఉన్న మొత్తం దీవుల సంఖ్య 247. వీటిలో 204 బంగాళాఖాతంలో, 43 అరేబియా సముద్రం, మన్నార్‌ సింధుశాఖలో ఉన్నాయి.


మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో భూపరివేష్టిత రాష్ట్రం?

1) కేరళ  2) తమిళనాడు 3) గుజరాత్‌ 4) తెలంగాణ

2. దేశంలో సముద్రతీర రేఖ అధికంగా ఉన్న రెండో రాష్ట్రం? (మొదటిది గుజరాత్‌)

1) తమిళనాడు 2) కేరళ 3) పశ్చిమ్‌ బంగా 4) ఆంధ్రప్రదేశ్‌

3. భారత్‌లో మొదట సూర్యుడు ఉదయించే రాష్ట్రం?

 1) ఆంధ్రప్రదేశ్‌     2) అరుణాచల్‌ప్రదేశ్‌  3) తమిళనాడు   4) ఒడిశా

4. దేశంలో సముద్ర తీరాన్ని కలిగిన రాష్ట్రాలు?

1) 5  2) 7   3) 9  4) 15

5. విస్తీర్ణ పరంగా భారత్‌ ప్రపంచంలో ఎన్నోస్థానంలో ఉంది?

1) 2   2) 5   3) 6   4) 7

6. దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలు ఎన్ని?

1) 25   2) 26   3) 27   4) 28

సమాధానాలు: 1-4, 2-4, 3-2, 4-3,  5-4, 6-4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని