TS EXAMS 2022:విధిస్తే విధిగా చెల్లించాల్సిందే!

ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రకరకాల పన్నులు విధిస్తుంది. ఒకసారి నిర్ణయించి, విధిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధిగా చెల్లించాల్సిందే. ప్రత్యక్ష లేదా పరోక్ష

Updated : 30 Apr 2022 05:50 IST

ప్రజల జీవన ప్రమాణాల వృద్ధికి అవసరమైన కార్యక్రమాలు, చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ఆ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి రకరకాల పన్నులు విధిస్తుంది. ఒకసారి నిర్ణయించి, విధిస్తే సంబంధిత వ్యక్తులు, సంస్థలు విధిగా చెల్లించాల్సిందే. ప్రత్యక్ష లేదా పరోక్ష మార్గాల్లో పన్ను వసూళ్లు జరుగుతాయి. మన దేశంలో అమలవుతున్న ఈ పన్నుల వ్యవస్థ, అందులో వచ్చిన సంస్కరణలు, ఇతర మార్పుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈ అధ్యాయం నుంచి పరీక్షలో తప్పకుండా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

పన్నుల సంస్కరణలు - రాబడి మార్పులు

భారత ప్రభుత్వానికి విత్త వనరులు సమకూర్చే ప్రధాన మార్గం పన్నుల రాబడి. మూడంచెల భారత ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం ఉంటుంది.

భారత రాజ్యాంగంలోని 268, 300వ అధికరణలు పన్నుల విధింపు, వసూలు అంశాలను తెలియజేస్తున్నాయి. భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం పాలనా విధులను మూడు జాబితాలుగా విభజించారు.  

1) కేంద్ర జాబితా 

2) రాష్ట్ర జాబితా 

3) ఉమ్మడి జాబితా

వీటిని అనుసరించే పన్నులు విధించే అధికారాన్ని స్పష్టం చేశారు. 

భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వివరాలను పొందుపరిచారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా 12 రకాల పన్నులు విధించి వసూలు చేస్తుంది. ఎక్కువ రాబడిని ఇచ్చే పన్నులు కేంద్ర పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 18 రకాల పన్నులు విధించి రాబడిని సమకూర్చుకుంటాయి. కేంద్ర పన్నుల రాబడితో పోలిస్తే రాష్ట్ర పన్నుల నుంచి తక్కువ ఆదాయం లభిస్తుంది.ప్రభుత్వాలు పన్నులు వేస్తే వ్యక్తులు, వ్యవస్థలు తప్పకుండా కట్టాలి.

 పన్నుల విధింపు, వసూలు రాబడి వినియోగాన్ని బట్టి పన్నులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. 

1) కేంద్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా తానే వినియోగించుకునే పన్నులు.

2) రాష్ట్ర ప్రభుత్వమే విధించి, వసూలు చేసుకొని రాబడిని పూర్తిగా రాష్ట్రాలే వినియోగించుకునే పన్నులు.

3) కేంద్రం విధించి, వసూలు చేసి నికర రాబడిని పూర్తిగా రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నులు.

స్థానిక సంస్థల పన్నులు

భారత రాజ్యాంగం స్థానిక సంస్థలకు పన్నులు కేటాయించలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో స్థానిక సంస్థలు పనిచేస్తాయి కాబట్టి రాష్ట్ర జాబితాలోని పన్నులను కొన్నింటిని వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు బదలాయించారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఈ బదలాయింపు ఒకేరకంగా లేదు. అయినా భూమి, భవనాలు, వాహనాలు, వినోదం, ప్రకటనలపై పన్ను, ఆక్ట్రాయ్‌ పన్ను, టెర్మినల్‌ పన్ను, వృత్తులు, వ్యాపారాలు, ప్రయాణికులు, సరకులు, వస్తువులు, ఆస్తి బదిలీపై పన్ను లాంటివి స్థానిక సంస్థలు వసూలు చేస్తాయి. 

ప్రభుత్వ రాబడి 

ప్రభుత్వానికి ప్రధానంగా రెండు మార్గాల నుంచి రాబడి లభిస్తుంది. 

1) సొంత పన్నుల రాబడి      

2) పన్నేతర రాబడి 

పన్నుల వర్గీకరణ 

పన్నులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 

ప్రత్యక్ష పన్నులు(Direct Taxes): ఆదాయం, ఆస్తులపై విధించే పన్నులు. 

పరోక్ష పన్నులు(Indirect Taxes): వస్తుసేవల ఉత్పత్తిపై విధించే పన్నులు.

వస్తువు విలువ లేదా పరిమాణం ఆధారంగా విధించే పన్నులు  

మూల్యానుగత పన్ను(Ad Valorem Tax): ఇది    వస్తువు విలువను బట్టి విధించే పన్ను. కొన్ని వస్తువులపై ఎక్సైజ్‌ సుంకాన్ని ఈ పద్ధతిలోనే విధిస్తారు.

నిర్దిష్టమైన పన్ను(Specific Tax): ఒక వస్తువు బరువు లేదా పరిమాణాన్ని బట్టి పన్ను విధిస్తే అది నిర్దిష్టమైన పన్ను.

కేంద్ర ప్రభుత్వ సొంత పన్నుల రాబడి

కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు

వ్యక్తిగత ఆదాయపు పన్ను (1860)

కార్పొరేషన్‌ పన్ను (1965 - 66)

వడ్డీపై పన్ను (1974)

వ్యయ పన్ను (1957)

సంపద పన్ను (1957) (ప్రస్తుతం రద్దు)

ఎస్టేట్‌ డ్యూటీ (1953)

కానుక/బహుమతి పన్ను (1958)

వస్తుసేవలపై పన్నులు: కేంద్ర ప్రభుత్వానికి వస్తుసేవల పన్ను ద్వారా అధిక రాబడి వస్తుంది. అందువల్ల ఇవి ప్రధానమైన పన్నులు. 

1) కేంద్ర ఎక్సైజ్‌ సుంకం: ఇది ఉత్పత్తిపై విధించే పన్ను. మద్యం, మత్తుపదార్థాలు తప్ప అన్ని ఇతర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకం విధిస్తుంది. ఎక్సైజ్‌ సుంకం పరోక్ష పన్ను, అనుపాత పన్ను అని రెండు రకాలు.

2) కస్టమ్స్‌ సుంకాలు: ఎగుమతి, దిగుమతుల మీద విధించే పన్నులు కస్టమ్స్‌ సుంకాలు. 

3) సేవలపై పన్ను: తొలిసారిగా ఈ పన్నును 1994 - 95లో విధించారు. 1994 జులై 1 నుంచి టెలిఫోన్, స్టాక్‌ బ్రోకర్, జనరల్‌ బీమా లాంటి సేవల మీద సేవాపన్ను విధిస్తున్నారు.

కేంద్ర అధికార రెవెన్యూ సంస్థలు

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడికి సంబంధించి రెండు రెవెన్యూ అధికార సంస్థలు ఉన్నాయి.

1) ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ(CBDT): ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని ఒక భాగమే ప్రత్యక్ష పన్నుల కేంద్ర సంస్థ. దేశంలో ప్రత్యక్ష పన్నుల విధానం, ప్రణాళికలు నిర్ణయించడమే ఈ సంస్థ ముఖ్యమైన విధి. ఆదాయ పన్ను శాఖ ద్వారా ప్రత్యక్ష పన్నుల చట్టాలను తయారు చేయడం దీని బాధ్యత.

2) ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ(CBEC): ఆర్థిక మంత్రిత్వ శాఖలో గల రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని మరొక భాగమే ఎక్సైజ్, కస్టమ్స్‌ సుంకాల కేంద్ర సంస్థ. ఇది ఎక్సైజ్‌ సుంకం, సేవల పన్నులు, పరిపాలన సంబంధిత నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. వస్తుసేవల పన్నులను అమలు చేయడం వల్ల ఈ సంస్థ పేరును సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (CBIC) గా మార్చారు. ఇది వస్తుసేవల పన్ను విధానాల రూపకల్పన అమలు, వసూలుకు సంబంధించిన అన్ని విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తుంది.

 సంస్కరణలు - కమిటీలు  

1953  - జాన్‌ మతాయ్‌ సంఘం

1956 - నికోలస్‌ కాల్డార్‌ సంఘం (వ్యయంపై పన్ను) 

1959 - మహవీర్‌ త్యాగి సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన) 

1967 - భూతలింగం సంఘం (పన్ను విధానాల ఆధునికీకరణ) 

1970 - కె.ఎస్‌.వాంఛూ సంఘం (ప్రత్యక్ష పన్నుల పరిశీలన, పన్నుల ఎగవేత, నల్లధనం) 

1972 - కె.ఎస్‌.రాజ్‌ సంఘం (వ్యవసాయం, వ్యవసాయ సంపదపై పన్ను) 

1977 - సి.సి.చోక్సీ సంఘం (ప్రత్యక్ష పన్నుల రేషనలైజేషన్‌) 

1981 - ఎల్‌.కె.ఝా సంఘం (పరోక్ష పన్నుల పరిశీలన)

 1991 - ఆర్‌.చెల్లయ్య సంఘం (పన్నుల సంస్కరణలు)

2002 - ప్రొఫెసర్‌ విజయ్‌ కేల్కర్‌ సంఘం (ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు)

2012 - పార్థసారథి షోమ్‌ సంఘం (యాంటీ ఆవాయిడెన్స్‌ టాక్స్‌). 

పంపిణీ, న్యాయం ఆధారంగా పన్నులు

అనుపాత పన్ను:  పన్ను విధింపునకు ఆధారమైన ఆదాయం లేదా సంపద విలువ లేదా వస్తువు విలువలో మార్పులతో నిమిత్తం లేకుండా అన్ని ఆదాయ స్థాయులకు లేదా విలువ స్థాయులకు ఒకే పన్నురేటును వర్తింపజేస్తే, అది అనుపాత పన్ను అవుతుంది.

పురోగామి పన్ను: పన్నుకు ఆధారమైన ఆదాయం, సంపద విలువ మారుతూ పన్నురేటు కూడా మారితే దాన్ని పురోగామి పన్ను అంటారు.

తిరోగామి పన్ను: ఆదాయం పెరిగేకొద్దీ పన్ను తగ్గితే తిరోగామి పన్ను.

డిగ్రెసివ్‌ పన్ను: ఆదాయం పెరిగేకొద్దీ పన్నురేటు పెరుగుతూ ఉన్నప్పటికీ పురోగామిత్వం క్షీణిస్తూ ఆదాయం పెరిగినంత వేగంగా త్యాగం పెరగకపోతే అది డిగ్రెసివ్‌ పన్ను అవుతుంది.

కేంద్ర ప్రభుత్వానికి పన్నేతర రాబడి

కేంద్ర ప్రభుత్వానికి పన్నుల నుంచే కాకుండా ఇతర మార్గాల నుంచి కూడా రాబడి వస్తుంది. ముఖ్యంగా రైల్వేలు, పోలీసు, అడవులు, నీటి పారుదల, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల నుంచి రాబడి వస్తుంది. దీన్ని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడి ప్రధానంగా మూడు మార్గాల నుంచి లభిస్తుంది.  

1) పరిపాలన సేవలు: పోలీసులు, జైళ్లు, కోర్టులు 

2) సాంఘిక సేవలు: విద్య, వైద్యం 

3) ఆర్థిక సేవలు: నీటిపారుదల పన్ను, విద్యుచ్ఛక్తి పన్ను 


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

ఎకానమీకి సంబంధించి ఏ ఒక్క పుస్తకంలోనూ సమగ్ర సమాచారం ఉండదు. సిలబస్‌ ప్రకారం మెటీరియల్‌ను వివిధ మార్గాల్లో సేకరించుకోవాలి. కనీసం ఒక ప్రామాణిక గ్రంథంతోపాటు తాజా సామాజిక, ఆర్థిక సర్వేలు; బడ్జెట్ల గణాంకాలను దగ్గరపెట్టుకొని చదవాలి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని