Updated : 04 May 2022 06:36 IST

TS EXAMS-2022:తరతరాలకూ తరగని బంధం!

సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/ పథకాలు

సామాజిక జీవితంలో అత్యంత ప్రధానమైనది కుటుంబం. మనిషి మనుగడకు మూలం అక్కడి నుంచే మొదలవుతుంది. తరతరాలకు తరగని అనుబంధాలతో సాగుతుంది. పుట్టుక లేదా వివాహంతో బంధం ఏర్పడి ఒకే ఇంటిలో నివసించే సమూహమే కుటుంబం. సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత పురోగతులకు ఇదే పునాది. ప్రపంచంలో పలు రకాల కుటుంబ వ్యవస్థలున్నాయి. వీటిలో పాటించే భిన్న ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తుల బాధ్యతలు ఆసక్తికరంగా ఉంటాయి. ‘సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజావిధానాలు/పథకాలు’ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.


కుటుంబం

కుటుంబం ఒక విశిష్ట సంస్థ. వివిధ పరిస్థితులు, సందర్భాలకు అనుగుణంగా కుటుంబం వ్యక్తిగతమైందిగా లేదా ప్రజలకు సంబంధించిందిగా మారుతూ ఉంటుంది. మన జీవితంలో అధికభాగం కుటుంబంతోనే గడుస్తుంది. మానవ సామాజిక జీవితానికి పునాది కుటుంబ వ్యవస్థ. దానికి వివాహం పునాది వేస్తుంది. ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ లేని సమాజం లేదు. వ్యక్తి, సమాజానికి కుటుంబం ఒక ముఖ్యమైన సాంఘిక సమూహం. ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు. మన జీవితం మొత్తం కుటుంబంతోనే ముడిపడి ఉంటుంది.
Family అనే పదం రోమన్‌ పదం ఫాములస్‌ (Famulus) నుంచి వచ్చింది. ఫాములస్‌ అంటే సేవకుడు. Family అనే పదం ఫెమీలియా (Famulus) అనే లాటిన్‌ పదం నుంచి ఏర్పడిందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఫెమీలియా అంటే కుటుంబం. కుటుంబానికి ప్రాధాన్యాన్నిస్తూ మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుతున్నారు. కుటుంబాలు అనే భావన గురించి మొదట చెప్పినవారు అరిస్టాటిల్‌, ప్లేటో.

నేటి సమాజంలో కుటుంబం అంటే భార్య, భర్త, వారి సంతానం మాత్రమే. 19వ శతాబ్దం తొలి రోజుల్లో ఆదిమ సమాజాల్లో కుటుంబ వ్యవస్థ ఉందా అనే చర్చ బలంగా వెలుగులోకి వచ్చింది. ఏంగెల్స్‌, కార్ల్‌మార్క్స్‌, మోర్గాన్‌ లాంటి శాస్త్రవేత్తలు కుటుంబం ఒక పరిణామ క్రమంలో బలపడిన బంధంగా భావించారు. సామాజికంగా ఆమోదం పొందిన స్త్రీ, పురుషుల ప్రత్యుత్పత్తి లేదా జీవ వ్యవస్థను కుటుంబం అంటారు. స్త్రీ, పురుషులు ఒకే ప్రదేశంలో నివసించడం వల్ల కుటుంబాలు ఏర్పడినట్లు మోర్గాన్‌ అనే సామాజికవేత్త అభిప్రాయపడ్డాడు.


లక్షణాలు

ఆర్‌.ఎం. మైకేవర్‌ తను రాసిన ‘సొసైటీ’ అనే గ్రంథంలో కుటుంబ లక్షణాలను కింది విధంగా పేర్కొన్నాడు.
* విశ్వవ్యాపితం - కుటుంబం విశ్వమంతా వ్యాపించి ఉంది.
* పరిమిత ప్రమాణం - అన్ని సామాజిక వ్యవస్థల కంటే కుటుంబం పరిమాణంలో చిన్నది.
* కుటుంబ సభ్యుల మధ్య బాధ్యత - కుటుంబ సభ్యులందరి అభివృద్ధి, సంక్షేమం కోసం బాధ్యతగా కృషి చేస్తారు.
* అధ్యయన కేంద్రం - కుటుంబం మానవుడి ప్రాథమిక పాఠశాల. సమాజంలోని పద్ధతుల్ని కుటుంబంలోనే నేర్చుకుంటారు.
* సాంఘిక నియంత్రణ -  నైతిక విలువల్ని, వ్యక్తిత్వాన్ని నేర్పుతుంది.
* శాశ్వతత్వం, పరివర్తన - కుటుంబాన్ని ఒక సామాజిక వ్యవస్థగా తీసుకుంటే, అది మానవజాతి పుట్టుక నుంచి ఇప్పటివరకు శాశ్వతంగా ఉంటూ వస్తున్న సంస్థ.


నిర్వచనాలు

1955కు ముందు కుటుంబ నిర్వచనాలను తొలి నిర్వచనాలు అని, 1955 తర్వాత వచ్చిన నిర్వచనాలను ఆధునిక నిర్వచనాలు అని పేర్కొంటారు.
తొలి నిర్వచనాలు:  వైవాహిక సంబంధాలు, బాధ్యతలు, విధులు, కలిసి నివసించడం, తల్లిదండ్రులు వారి సంతానాల మధ్య పరస్పర సంబంధాలు అనే వాటిపై ఆధారపడే సమూహమే కుటుంబం. - రాబర్ట్‌ హెచ్‌.లూయీ.
* వివాహం, తల్లిదండ్రుల విధులు-బాధ్యతలు, వారి సంతానం కలిసి నివసించడమే కుటుంబం - రాల్ఫ్‌లింటన్‌. లూయీ, లింటన్‌ల అభిప్రాయం ప్రకారం కుటుంబం ఉనికి సర్వసాధారణమైంది.
* జార్జిపీటర్‌ ముర్డాక్‌ అనే మానవ శాస్త్రవేత్త 192 సమాజాలను పరిశీలించి ఒకేచోట నివసించడం, ఆర్థిక సహకారం, ప్రత్యుత్పత్తి అనే లక్షణాలను కలిగి ఉండే సమూహమే కుటుంబమని అభిప్రాయపడ్డారు.

ఆధునిక నిర్వచనాలు:  వివాహం, చట్టబద్ధమైన పితృత్వ, మాతృత్వాలు, దంపతులు పరస్పరం ఒకరిపై మరొకరు లైంగికపరమైన ఆధిపత్యాన్ని కలిగి ఉండటమే కుటుంబం. - లీచ్‌.
* ప్రాథమిక బంధువర్గ సమూహం; లైంగిక, ప్రత్యుత్పత్తి, ఆర్థిక, విద్యాపరమైన విధుల్ని నిర్వహించేదే కుటుంబం. - మెల్‌ఫోర్డ్‌, స్మిత్‌గ్రీన్‌, ప్రిన్స్‌పీటర్‌, కాథలిన్‌ గఫ్‌.
* స్టీఫెన్స్‌ ప్రకారం వివాహ ఒప్పందం 4 ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.1) భార్య, భర్తల మధ్య ఉండే పరస్పర సంబంధం 2) కలిసి నివసించడం 3) తల్లిదండ్రుల హక్కులు 4) బాధ్యతలు


శాస్త్రవేత్తల అభిప్రాయాలు

* మైకేవర్‌: పిల్లల్ని కనడం, పెంచడం, విధుల్ని నిర్వహించడానికి, స్థిరమైన లైంగిక సంబంధాలు గల సమూహమే కుటుంబం.
* రీమాండ్‌ఫర్‌: ఈయన కుటుంబానికి త్రికోణ స్వరూపాన్ని ఇచ్చాడు. ఈ నమూనాలో ఒకవైపు భర్త, మరోవైపు భార్య, మూడో వైపు వారి సంతానం ఉంటుంది.
* బర్గస్‌, లాక్‌: వివాహబంధం, రక్తసంబంధం లేదా దత్తతతో ఏకమై ఒకే ఇంటిలో నివసించేదే కుటుంబం.
* ఐరావతి కార్వే: ఒకే పైకప్పు కింద నివసిస్తున్న, ఒకే వంటగదిలో చేసిన ఆహారాన్ని తింటూ, ఒకే ఆస్తిని కలిసి అనుభవిస్తూ కుటుంబ ప్రార్థనలో అందరూ పాల్గొంటూ, ఒకరికొకరు బంధువులయ్యే వ్యక్తుల సమూహమే ఉమ్మడి కుటుంబం.
* సమ్నర్‌, మోర్గాన్‌: వీరి అధ్యయనాల ప్రకారం పూర్వం మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉండేది.
* ఫ్రెడరిక్‌ ఏంగిల్స్‌: ది ఆరిజన్‌ ఆఫ్‌ ఫ్యామిలీ, ప్రైవేట్‌ ప్రాపర్టీ అండ్‌ ది స్టేట్‌  అనే రచనల్లో కుటుంబంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


కుటుంబం విధులు

జార్జి ముర్డాక్‌ ప్రకారం..

దైహిక విధులు: లైంగికపరమైన ఆనందం, సహచర్యం, ప్రేమానురాగాలను తృప్తిపరుచుకుంటూ సంతానాన్ని కని, వారిని సంరక్షించి, బాధ్యతాయుత సమాజ సభ్యులుగా తీర్చిదిద్దడం.
సామాజిక విధులు: సామాజిక నియంత్రణలో కుటుంబం ప్రధానపాత్ర పోషిస్తుంది. సంస్కృతిని నేర్పిస్తుంది. పరస్పర మైత్రి, అన్యోన్య సహకారం, రక్షణ, సామాజిక నియంత్రణను కలిగి ఉంటుంది.
ఆర్థిక విధులు: ఆర్థిక భద్రత ఇస్తుంది. శ్రమ విభజన కలిగి ఉంటుంది. ప్రాథమిక అవసరాలైన ఆహారం, నివాసం, వస్త్రాలు, అంతస్తు, అధికారాలను కలిగి ఉంటుంది.
లైంగిక విధి: భార్య, భర్తల మధ్య సంబంధం.. ఆమోదం పొందిన లైంగిక సంబంధానికి సాధనంగా ఉండటంతో పాటు, కుటుంబ వ్యవస్థ రూపొందేందుకు పునాది అవుతుంది. కొన్ని గిరిజన తెగల్లో మాత్రం దాంపత్య సంబంధం కుటుంబం ఏర్పడేందుకు కారణం కాకపోవచ్చు.
ఉదా:
న్యూ గినియాలోని బనారో తెగ, తూర్పు ఐరోపాలోని కొన్ని తెగలు (ఒక వ్యక్తి భార్య ఆమె మామ గారి బంధువు ద్వారా ఒక శిశువుకు జన్మనిచ్చే వరకు ఆ వ్యక్తి (భర్త) భార్యను సమీపించకూడదు).
విద్యా విధులు: కుటుంబం విద్యాపరమైన విధులను కూడా నిర్వర్తిస్తుంది.
ప్రత్యుత్పత్తి విధి: కుటుంబాల ద్వారానే ప్రత్యుత్పత్తి జరుగుతుంది. దీంతో తరతరాలకు వంశం విస్తరిస్తుంది.
సాంస్కృతిక విధి: కుటుంబం సాంస్కృతిక వారసత్వ కేంద్రంగా పనిచేస్తుంది. అలవాట్లు, పద్ధతి, జీవనశైలి, ఆచారాలు, విద్య - విజ్ఞాన అంశాలు, సాంస్కృతిక అంశాలు, కళలు, విద్యా అవకాశాలను కుటుంబం కల్పిస్తుంది. మైకేవర్‌ ప్రకారం కుటుంబ విధులు రెండు రకాలు.
ఆవశ్యకమైనవి: పిల్లల్ని కనడం, పెంచడం, సంరక్షించడం, గృహ సదుపాయం కల్పించడం తదితరాలు.
అనావశ్యకమైనవి: మత బోధన చేయడం, విద్య, ఆర్థిక, ఆరోగ్యం, వినోదం వంటివి అందించడం.


రచయిత: వట్టిపల్లి శంకర్‌ రెడ్డి


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

బాగా చదివిన తర్వాత చివర్లో మాక్‌ టెస్ట్‌లు ప్రాక్టీస్‌ చేద్దామని చాలామంది అనుకుంటుంటారు. దానికంటే మొదటి నుంచే మోడల్‌ పరీక్షలు రాయడం మంచిది. అందువల్ల ప్రిపరేషన్‌ స్థాయిపై ఒక అంచనా వస్తుంది, లోపాలూ తెలుస్తాయి. ప్రణాళికలో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని