TS Exams 2022: అందరి అవసరాలకు... ప్రపంచ ప్రయోజనాలకు!

ఎక్కడో నంబర్లు నొక్కితే ఇక్కడ మొబైల్‌ మోగుతుంది. అక్కడెక్కడో కూర్చొని అందరికీ ఆన్‌లైన్‌లో పరీక్ష పెడతారు. విధ్వంసం సృష్టించబోయే తుపాను వివరాలు ముందే తెలుసుకుంటారు. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? అన్నింటి వెనుక ఒక సాంకేతికత పనిచేస్తోంది.

Updated : 09 May 2022 06:34 IST

జనరల్‌ స్టడీస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

ఎక్కడో నంబర్లు నొక్కితే ఇక్కడ మొబైల్‌ మోగుతుంది. అక్కడెక్కడో కూర్చొని అందరికీ ఆన్‌లైన్‌లో పరీక్ష పెడతారు. విధ్వంసం సృష్టించబోయే తుపాను వివరాలు ముందే తెలుసుకుంటారు. ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? అన్నింటి వెనుక ఒక సాంకేతికత పనిచేస్తోంది. అదే స్పేస్‌ టెక్నాలజీ. ప్రతి దేశంలోనూ ప్రజల అవసరాలను తీర్చడంలో ఇది ఇప్పుడు అత్యంత ఆవశ్యకంగా మారింది. దేశ ప్రయోజనాలు, వ్యక్తిగత అవసరాలు, పర్యావరణ పరిరక్షణ, సహజవనరుల సంరక్షణ-సద్వినియోగం దీని సాయంతోనే సమర్థంగా సాగుతున్నాయి. ఆ విజ్ఞాన విశేషాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.

అంతరిక్ష సాంకేతికత

ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రిసెర్చ్‌ (INCOSPAR)ని  1962లో  స్థాపించడంతో భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానానికి పునాది పడింది. 1969లో ఏర్పాటైన ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో)తో దీనికి మరింత బలం చేకూరింది. ఇస్రో ఆధ్వర్యంలో దేశ   వ్యాప్తంగా వివిధ అంతరిక్ష పరిశోధనా సంస్థలు అంతరిక్ష సాంకేతికతలను   అభివృద్ధి చేశాయి. విక్రమ్‌ సారాభాయ్‌ని భారత అంతరిక్ష పితామహుడు అంటారు. 

* లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టం సెంటర్‌ (LPSC), తిరువనంతపురం - ఇది రాకెట్‌లకు కావాల్సిన ప్రొపల్షన్‌ సాంకేతికతను తయారుచేస్తుంది.
* విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌
(VSSC), తిరువనంతపురం - ఇది రాకెట్‌లు లేదా వాహక నౌకల తయారీలో పాలుపంచుకుంటుంది.
* యాంత్రిక్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌
(ACL), బెంగళూరు - ఇది ఇస్రో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించే సంస్థ.  టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌, ట్రాన్స్‌పాండర్‌ల లీజు, ఉపగ్రహాలను వాణిజ్య పరంగా కక్ష్యలో ప్రవేశపెట్టడం, రిమోట్‌ సెన్సింగ్‌ అనువర్తనాలను సంస్థలకు ఇవ్వడం లాంటివి దీని విధులు.
* సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ 
(SDSC), శ్రీహరికోట (తిరుపతి జిల్లా) - వాహక నౌకల ప్రయోగ కేంద్రం. ఇక్కడి నుంచే వాహక నౌకల ద్వారా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతున్నారు.
* యు.ఆర్‌.రావు శాటిలైట్‌ సెంటర్‌
(URSC), బెంగళూరు - ఉపగ్రహాల నిర్మాణం, వాటికి సంబంధించిన టెక్నాలజీ గురించి పనిచేస్తుంది.
* నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌
(NRSC), హైదరాబాద్‌ - రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల ద్వారా సమాచార సేకరణ, సమాచార విశ్లేషణ, ప్రసారం, విపత్తు నిర్వహణకు ఏరియల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ను ఉపయోగించడం దీని విధులు.
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ 
(IIRS), డెహ్రాడూన్‌ - రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల తయారీ, విద్య, శిక్షణ కార్యక్రమాలకు జియో ఇన్ఫర్మాటిక్స్‌ను ఉపయోగించడం లాంటి విధులను   నిర్వహిస్తుంది.
* నేషనల్‌ అట్మాస్ఫియరిక్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ
(NARL), తిరుపతి - ఈ సంస్థ వాతావరణంపై పరిశోధన చేస్తుంది.  
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
(IIST), తిరువనంతపురం - ఇది ఆసియాలో మొదటి స్పేస్‌ యూనివర్సిటీ (అటానమస్‌).
* మాస్టర్‌ కంట్రోల్‌ ఫెసిలిటీ
(MCF), హసన్‌ (కర్ణాటక) - జియో స్టేషనరి కక్ష్యలో ఉన్న ఇన్‌శాట్‌, జీశాట్‌ ఉపగ్రహాల నియంత్రణ దీని పరిధిలో ఉంటుంది.
* న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ 
(NSIL), బెంగళూరు - దీన్ని 2019, మార్చి 6న స్థాపించారు. ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఆధ్వర్యంలో ఉంది. ఈ సంస్థ కన్సల్టెన్సీ సర్వీసులు, అంతరిక్ష ఆధారిత సర్వీసులు, అనువర్తనాలను మార్కెటింగ్‌ చేయడం, ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టే సేవలు, ట్రాన్స్‌పాండర్‌ల లీజు, రిమోట్‌ సెన్సింగ్‌ సేవలు లాంటి వాటిని చూస్తుంది.
* ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ 
(IN-SPACe) - ఇది డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ ఏజెన్సీ అధీనంలో ఉండే నోడల్‌ ఏజెన్సీ. అంతరిక్ష సంబంధ కార్యక్రమాలు, ప్రైవేటు రంగంలో అంతరిక్ష సాంకేతికత వృద్ధికి  సహాయపడుతుంది.

ఉపగ్రహాల రకాలు

ఉపగ్రహాలను అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. చేసే పని, ఉపయోగపడే విధానం, బరువు ఆధారంగా ఉపగ్రహాలు వివిధ రకాలుగా ఉన్నాయి.
సమాచార ఉపగ్రహాలు (కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌): ఇన్‌శాట్‌, జీశాట్‌, హెచ్‌ఎమ్‌శాట్‌, ఎడ్యుశాట్‌ లాంటివి వీటికి ఉదాహరణ.
భూపరిశీలనా ఉపగ్రహాలు (రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్‌): ఐఆర్‌ఎస్‌ - ఉపగ్రహాలు, రిసోర్స్‌ శాట్‌, ఓషన్‌ శాట్‌, రిశాట్‌, కార్టోశాట్‌.
ప్రయోగ (ఎక్స్‌పరిమెంటల్‌) ఉపగ్రహాలు: వీటిని రిమోట్‌ సెన్సింగ్‌, వాతావరణ పరిశోధన, కక్ష్యా నియంత్రణ, రికవరీ టెక్నాలజీ లాంటి ప్రయోగాల కోసం ప్రయోగించారు. ఆర్యభట్ట, ఆపిల్‌, రోహిణి శాటిలైట్‌ - 1, రోహిణి టెక్నాలజీ పేలోడ్‌ లాంటివి ఈ ఉపగ్రహాలకు ఉదాహరణ.
నావిగేషన్‌ ఉపగ్రహాలు: గగన్‌ పేలోడ్‌ ఉంచిన జీశాట్‌ - 8, జీశాట్‌ - 10 ఉపగ్రహాలు, ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం ఉపగ్రహాలు.
చిన్న ఉపగ్రహాలు: ఇండియన్‌ మినీ శాటిలైట్‌ - 1.
అంతరిక్ష పరిశోధన, శాస్త్ర విజ్ఞాన ఉపగ్రహాలు: ఆస్ట్రోశాట్‌, మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌, చంద్రయాన్‌ - 1, చంద్రయాన్‌ - 2.
యూనివర్సిటీ (అకడమిక్‌) సంస్థల ఉపగ్రహాలు: వీటిని దేశంలోని వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, ప్రొఫెసర్‌లు కలిసి రూపొందించారు.   ఉదా: ఐఐటీ బాంబే - ప్రథమ్‌, ఐఐటీ కాన్పూర్‌ - 3 కి.గ్రా. నానో శాటిలైట్‌ జుగ్ను, అన్నాయూనివర్సిటీ-అనుశాట్‌, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ- ఎస్‌ఆర్‌ఎం శాట్‌.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఉపగ్రహాలు

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1ఎ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ22 ద్వారా 2013, జులై 1న; ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1బి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ24 ద్వారా 2014, ఏప్రిల్‌ 4న; ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1సి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ26 ద్వారా 2014, అక్టోబరు 16న; ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1డి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ27 ద్వారా 2015, మార్చి 28న; ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1ఇ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ31 ద్వారా 2016, జనవరి 20న; ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1ఎఫ్‌ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ32 ద్వారా 2016, మార్చి 10న; ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1జి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ33 ద్వారా 2016, ఏప్రిల్‌ 28న; ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1ఐ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ సీ41 ద్వారా 2018, ఏప్రిల్‌ 12న కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌ - 1హెచ్‌ ఉపగ్రహ ప్రయోగ సమయంలో పీఎస్‌ఎల్వీ సీ39 విఫలమైంది.

భారతదేశ మొదటి ఉపగ్రహాలు

ఆర్యభట్ట: దీన్ని 1975, ఏప్రిల్‌ 19న రష్యా వాహక నౌక ఇంటర్‌ కాస్మోస్‌ C-1 రాకెట్‌ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది 360 కిలోల ఉపగ్రహం. ఇస్రో దీన్ని  X - ray ఆస్ట్రానమీ, సోలార్‌ ఫిజిక్స్‌ లాంటి వాటి పరిశోధనకు రూపొందించింది.  
భాస్కర-1: ఈ ఉపగ్రహాన్ని 1979, జూన్‌ 7న రష్యా వాహక నౌక ఇంటర్‌ కాస్మోస్‌
C-1 ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది ఎర్త్‌ అబ్జర్వేషన్‌, వాతావరణ సంబంధ సమాచారం కోసం  ప్రయోగించిన ఉపగ్రహం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు