TS Exams 2022: విశిష్ట జీవన విలువలే అభిమతం!

మనిషి జీవితం సన్మార్గంలో, సమున్నతంగా సాగేందుకు సరైన జీవన విధానాన్ని అందించేదే మతం. ఇందులో అనేక విశ్వాసాలు, సంస్కారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటి ద్వారా వ్యక్తుల ప్రవర్తనలను అదుపు చేసి సామాజిక వ్యవస్థ నిర్మాణానికి మతం మార్గదర్శనం చేస్తుంది.

Updated : 04 Jun 2022 06:13 IST

సమాజ నిర్మాణం, సమస్యలు

ప్రజా విధానాలు/పథకాలు

మనిషి జీవితం సన్మార్గంలో, సమున్నతంగా సాగేందుకు సరైన జీవన విధానాన్ని అందించేదే మతం. ఇందులో అనేక విశ్వాసాలు, సంస్కారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటి ద్వారా వ్యక్తుల ప్రవర్తనలను అదుపు చేసి సామాజిక వ్యవస్థ నిర్మాణానికి మతం మార్గదర్శనం చేస్తుంది. మన దేశంలో విశిష్ట జీవన విలువలే అభిమతంగా ఏర్పడిన ఈ మతాలు, మత విభాగాలు, వాటి కార్యకలాపాల గురించి అభ్యర్థులు అవగాహన ఏర్పరుచుకోవాలి


మతం

అలౌకిక శక్తులను విశ్వసించడాన్ని మతం అంటారు. మతం ఒక సామాజిక వ్యవస్థ. ఒక విధమైన మానవ ప్రవర్తన. మతంలో మానవాతీత శక్తులకు సంబంధించిన విశ్వాసాలు, సంస్కారాలు ఉంటాయి. ఇది మానవ సంస్కృతిలో అంతర్భాగం.
నిర్వచనాలు
టైలర్‌: మతం నాగరిక సమాజాలకే పరిమితం కాదు. ఆదిమ సమాజాల్లోనూ మతం ఉంది. అది నాగరిక సమాజాల్లోని మతం కంటే భిన్నమైంది కాదు (గ్రంథం - ప్రిమిటివ్‌ కల్చర్‌ - 1871).
ఎమైలీ డర్క్‌హైమ్‌: నమ్మకాలను ఉమ్మడిగా పాటించడం (ది ఎలిమెంటరీ టీమ్స్‌ ఆఫ్‌ ద రిలీజియస్‌ లైఫ్‌).
మకైకర్‌, ఫేజ్‌: మనిషికి - మనిషికి, మనిషికి - ఉన్నత శక్తులకు మధ్య సంబంధం.
మిల్లర్‌, వైట్జ్‌: జీవితాలను శాసించే నమ్మకాలు, క్రియలను కలిగి ఉండే సాంఘిక క్రియ.
* మతం అనేది మత్తు మందు లాంటిది. - కారల్‌మార్క్స్‌
మతం - పుట్టుక
సర్వాత్మవాదం: ఆత్మను నమ్మడం అనేది అన్ని మతాలకు మూలం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ఈ.బి.టైలర్‌.
జీవాత్మవాదం: ఈ సిద్ధాంతాన్ని ఫ్రాయిస్‌, మాక్స్‌ముల్లర్‌ ప్రతిపాదించారు. దీన్ని అభివృద్ధి చేసినవారు  ఆర్‌.ఆర్‌.మారెట్‌.
ప్రకృతి ఆరాధన: ప్రకృతిని ఆరాధించడమే మతం ప్రారంభ దశ. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు మాక్స్‌ ముల్లర్‌.
టోటెమ్‌ వాదం: ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు దుర్క్‌హైమ్‌.
ప్రకార్యవాదం (నిర్మిత వాదం): మత ఆవిర్భావానికి కారణమయ్యేవి. దీన్ని వివరించినవారు మలినోస్కీ, రాడ్‌క్లిఫ్‌ బ్రౌన్‌.

హిందూమతం
హిందూమతం కొన్ని తాత్విక సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడింది. జన్మ, పునర్జన్మ, కర్మ, ధర్మం, ముక్తి, మోక్షం తదితర సిద్ధాంతాలను బోధిస్తుంది. విభిన్న విశ్వాసాలు, ఆచరణలు కనిపిస్తాయి. హిందూ మతం బౌద్ధ, జైన, సిక్కు మతాలకు జన్మనిచ్చింది. మనదేశ చరిత్ర గమనం, సంస్కృతిలో మతం ప్రధానపాత్ర పోషిస్తోంది. హిందూ సమాజం అతిపురాతనమైంది. అనేక మత సంబంధమైన సిద్ధాంతాలు, నమ్మకాలు, విలువలు, లక్ష్యాలపై ఆధారపడి ఏర్పడింది. వ్యక్తులకు ఒక క్రమబద్ధమైన జీవన విధానం, విలువలు, ప్రమాణాలను అందించి అభివృద్ధికి   పాటుపడుతోంది.
ఆశ్రమ ధర్మాలు
హిందూ సామాజిక జీవితంలో ఆశ్రమ ధర్మాలు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ప్రతి హిందువు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపడానికి ఆశ్రమ ధర్మాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆశ్రమం అనే పదం సంస్కృత భాషలోని శ్రమ అనే పదం నుంచి వచ్చింది. సాహిత్యపరంగా ఆశ్రమం అనే పదానికి అర్థం విశ్రాంతి స్థలం.
* బ్రహ్మచర్య ఆశ్రమం - 25 సంవత్సరాలు
* గృహస్థ ఆశ్రమం - 25 - 50 సంవత్సరాలు
* వానప్రస్థ ఆశ్రమం - 50 - 75 సంవత్సరాలు
* సన్యాస ఆశ్రమం - 75 - 100 సంవత్సరాలు
బ్రహ్మను చేరుకోవడానికి ఈ నాలుగు ఆశ్రమాలు 4 మెట్లు కలిగిన నిచ్చెన లాంటివని మహాభారతంలో భీష్ముడు పేర్కొన్నాడు. ఆశ్రమ పద్ధతి క్రీ.పూ.100 ప్రాంతంలో అమల్లోకి వచ్చిందని ఆల్టేకర్‌ తెలిపాడు.మొదటి మూడు ఆశ్రమాలు దాటిన వ్యక్తిని సన్యాసి అని శ్వేతాస్వతరోపనిషత్తు తెలియజేస్తోంది.

బ్రహ్మచర్య ఆశ్రమం: సర్వసాధారణంగా ఈ ఆశ్రమం ఉపనయనం తర్వాత ప్రారంభమవుతుంది. బాల్యదశ నుంచి ప్రాపంచిక విషయాలు నేర్చుకునే సమయంలో వ్యక్తి ఎలా ఉండాలి, ఏ విధమైన నియమ, నిష్ఠలతో మెలగాలో ఉపనయనం వివరిస్తుంది.
గృహస్థ ఆశ్రమం: ఇది జీవితంలో అత్యంత కీలక దశ. ఈ సమయంలో వివాహం ద్వారా కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. వివాహ లక్ష్యాలు ధర్మం, అర్థం, కామం. ధర్మాచరణ, సంతానోత్పత్తి వివాహ ప్రయోజనాలు.
వానప్రస్థాశ్రమం: కుటుంబంతో సంపూర్ణంగా, సమగ్రంగా గడిపిన తర్వాత భార్యతో పాటు అడవుల్లో నివాసం ఏర్పరచుకోవడాన్ని వానప్రస్థాశ్రమం అంటారు. ఈ దశలో వ్యక్తి సాంఘిక జీవనానికి కృషి చేస్తాడు.
సన్యాసాశ్రమం: మనుసంహిత ప్రకారం ఒక వ్యక్తి గృహస్థ ఆశ్రమం నుంచి నేరుగా సన్యాసాశ్రమాన్ని పొందుతాడు. ఇది మోక్ష సాధనకు తోడ్పడుతుంది. ఈ దశలో వ్యక్తి ఇంటిపేరు, తనపేరు త్యజిస్తాడు.

పురుషార్థాలు
ఇవి హిందూ సామాజిక వ్యవస్థ నిర్మాణంలో మార్గదర్శకంగా వ్యవహరిస్తాయి. వ్యక్తి ప్రవర్తనను అదుపు చేయడంలో తోడ్పడతాయి. పురుషార్థాలు నాలుగు.
ధర్మం: ధర్మం అంటే మహాభారతంలో దేవత అన్నారు. ఐతరేయ బ్రాహ్మణంలో మొత్తం బాధ్యతగా, ఛాందోగ్యోపనిషత్‌లో ఆశ్రమ ధర్మాలను ఆచరించడంగా పేర్కొన్నారు. వేదాలు సూచించే లేదా ఆశించిన ఫలితం లేదా ఆశయం అని జైమిని వివరించారు. పక్షపాతరహితంగా, నీతి నిజాయతీలతో, రాగద్వేషాలను విడిచి మనసావాచా కర్మణా జీవించే పవిత్ర జీవన విధానమే ధర్మమని మనుస్మృతి చెబుతోంది.
అర్థం: వ్యక్తి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే సంపద, ఐశ్వర్యం అర్థం. ఇవి మనిషి ఆశలు, ఆశయాల సాధనోపకరణాలు. అవి ధర్మబద్ధంగా ఉండాలని ధర్మశాస్త్రం బోధిస్తోంది.
కామం: మనిషి ఇంద్రియ వాంఛలను సంతృప్తి పరుచుకోవడమే కామం లేదా కోరిక.ధర్మాచరణతో కూడిన కామం అంగీకారయోగ్యం, ఉత్తమం.
మోక్షం: మోక్షం అంటే ముక్తి పొందడం. ఇది మనిషి జీవితంలో చిట్టచివరి మెట్టు. ధర్మ, అర్థ, కామాల పరిపూర్ణత ఇందులో ఉంటుంది.



హిందూ వివాహం- పవిత్ర సంస్కారం
హిందూ వివాహం అనేక సంస్కారాలతో కూడిన ఒక పవిత్ర బంధం. హిందూ వివాహ వ్యవస్థలో వివిధ రకాల మతపరమైన సంస్కారాలను ఆచరిస్తారు. దీనిలో ముఖ్యమైనవి హోమం, పాణిగ్రహణం, సప్తపది. వివాహ సమయంలో పురోహితుడు వధూవరులతో అగ్నిహోమం జరిపిస్తారు. ఈ కారణంగానే హిందూ వివాహాన్ని అగ్నిసాక్షి వివాహం అంటారు. పాణిగ్రహణం అంటే వధువు కుడిచేతిని, వరుడు తన కుడిచేతితో గ్రహించడం. ఆ తర్వాత మంగళసూత్ర ధారణ జరిగి అతి ముఖ్యమైన సప్తపది జరుగుతుంది. అంటే వధూవరులు కలిసి ఏడడుగులు నడవటం. దీని తర్వాత నక్షత్ర దర్శనంతో హిందూ వివాహ తంతు పూర్తవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని