TS EXAMS 2022: ముల్కీ గెలిచింది!

ముల్కీ నిబంధనల పటిష్ఠ అమలుకు నాటి ప్రభుత్వం చేసిన చట్టం, అందులోని అంశాల రాజ్యాంగబద్ధతపై అనేక కేసులు నడిచాయి. రకరకాల అన్వయాలతో తీర్పులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు అంతిమ తీర్పులో ముల్కీ నిబంధనలు రాజ్యాంగానికి లోబడే ఉన్నాయని స్పష్టం చేసింది.

Updated : 18 Jun 2022 05:53 IST

తెలంగాణ ఉద్యమంరాష్ట్ర ఆవిర్భావం

ముల్కీ నిబంధనల పటిష్ఠ అమలుకు నాటి ప్రభుత్వం చేసిన చట్టం, అందులోని అంశాల రాజ్యాంగబద్ధతపై అనేక కేసులు నడిచాయి. రకరకాల అన్వయాలతో తీర్పులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు అంతిమ తీర్పులో ముల్కీ నిబంధనలు రాజ్యాంగానికి లోబడే ఉన్నాయని స్పష్టం చేసింది. దాంతో స్థానికత నియమాలు విజయం సాధించినట్లయింది. పరీక్షార్థులు ఈ వరుస పరిణామాలను జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చదువుకొని స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. లేదంటే సమాధానాలు రాయడంలో పొరపాటు పడే అవకాశం ఉంది.


ముల్కీ నిబంధనలు - కోర్టు తీర్పులు

జై తెలంగాణ ఉద్యమం (1969) అనతి కాలంలోనే ఉవ్వెత్తున ఎగసి ఊపందుకోవడానికి ముఖ్య కారణం ముల్కీ (స్థానికత) నిబంధనలను నాటి పాలకులు, అధికారులు విచక్షణారహితంగా ఉల్లంఘించడమే. తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులకు తీరని అన్యాయం చేయడమే. ముల్కీ నిబంధనల అమలుకు, వాటి రాజ్యాంగ బద్ధతకు సంబంధించి 1969 - 72 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అనేక రిట్‌ పిటిషన్లు పడ్డాయి. ఆ నియమాలపై కోర్టులు రకరకాల అన్వయాలు (ఇంటర్‌ప్రిటేషన్స్‌) చేశాయి. విభిన్న తీర్పులు వెలువరించాయి. ఈ దశలో సుప్రీంకోర్టు అంతిమ తీర్పు వరకు అనేక పరిణామాలు సంభవించాయి.

ముల్కీకి సంబంధించిన నియమాలు ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ కాలంలోనే ప్రారంభమైంది. కానీ ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ కాలంలో 1919లో జారీ చేసిన ఫర్మానా ద్వారా ముల్కీ నిర్వచనాన్ని చట్టబద్ధం చేశారు. హైదరాబాదు రాజ్యం భారతదేశంలో విలీనమైన తర్వాత 1949లో మిలటరీ పాలకుడు మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరి రూపొందించిన హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసెస్‌ రెగ్యులేషన్స్‌కు సంబంధించిన ఫర్మానాను ఏడో నిజాంతోనే జారీ చేయించారు. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందంలోనూ ముల్కీ నిబంధనలు కీలకపాత్ర పోషించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ముల్కీ నియమాల అమలుకు చట్టబద్ధత కల్పించడానికి  ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ (నివాస అర్హత) చట్టం - 1957 (Residence as to Requirement Act) ను రాజ్యాంగంలోని 16(3) నిబంధనను అనుసరించి పార్లమెంటు రూపొందించింది. దీనికి సంబంధించిన నియమాలను 1959లో జారీచేసింది. 1959, మార్చి 21న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం పదిహేనేళ్ల పాటు తెలంగాణలో నివాసం ఉన్నవారిని ముల్కీలుగా పరిగణిస్తారు. పార్లమెంటు చట్టాన్ని కూడా ఉల్లంఘించి నాటి పాలకులు, అధికారులు నాన్‌ ముల్కీలకు తెలంగాణలో ఉద్యోగాలు కల్పించారు.

1969 జై తెలంగాణ ఉద్యమం తొలిరోజుల్లో అంటే 1969, జనవరి 21న తెలంగాణలో ముల్కీ నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయడానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబరు 36ను జారీచేసింది. ఈ జీఓ జారీ చేయకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ మండలి (ఏపీఎస్‌ఈబీ) నియామకాలకు ముల్కీ నిబంధనలు వర్తించవని అప్పటి హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ కుప్పుస్వామి తీర్పునిచ్చారు. జీఓ 36 రాజ్యాంగ బద్ధతను ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ఉద్యోగులు సవాలు చేయడంతో హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఒ.చిన్నపరెడ్డి ఆ జీఓ చెల్లదని తీర్పునిచ్చారు. అంతేకాకుండా తెలంగాణ ప్రాంతంలో కొన్ని రకాల ఉద్యోగాల్లో స్థానికులను మాత్రమే నియమించాలని ముల్కీ నిబంధనలకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం - 1957, నియమావళి - 1959లోని 3వ సెక్షన్‌ చెల్లదని న్యాయమూర్తి కొట్టివేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16(3) ప్రకారం రాష్ట్రంలో ఒక ప్రాంతానికి చెందిన వారికి నివాస అర్హతను కల్పిస్తూ రూపొందించిన చట్టం చెల్లదని ధర్మాసనం పేర్కొంది.


ఆ సెక్షన్లలో ఏముంది?

పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం-1957లోని 3వ సెక్షన్‌ ప్రకారం ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో 15 ఏళ్లకు తగ్గకుండా నిరంతరంగా నివాసం ఉంటేనే రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది (కంటోన్మెంట్‌ ప్రాంతాలను మినహాయించి). ఇంకా ఇదే సెక్షన్‌ ప్రకారం సచివాలయంలోని ఉద్యోగాలు, రాష్ట్ర శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగాలు, హైదరాబాదు, సికింద్రాబాదు నగరాల్లోని ఉద్యోగాల్లో ప్రతి మూడింటిలో రెండో ఉద్యోగాన్ని తెలంగాణ వారికి కేటాయించారు. ఈ నియమాన్ని ప్రత్యక్ష నియామకాల్లో పాటించాలని సూచించారు. కానీ దానికి అదే చట్టంలోని 5వ నియమం ఒక మినహాయింపును ఇచ్చింది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 3వ నియమంలోని అంశాలతో విభేదించి స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించవచ్చు. అయితే అందుకు తగిన ప్రత్యేక కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. నాటి పాలకులు, అధికారులు ఈ మినహాయింపును అడ్డం పెట్టుకొని చట్టాన్ని తమ ఇష్టానుసారంగా ఉల్లంఘించారు.  

చట్టంలోని 2వ సెక్షన్‌ ప్రకారం తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థల్లోని వివిధ ఉద్యోగాల నియామకాలకు అప్పటి వరకు కొనసాగుతున్న నివాస అర్హత (ముల్కీ) నిబంధనలు రద్దవుతాయి(1957 చట్టం, 1959 నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి).


జీఓ చెల్లుబాటుపై...

జీఓ 36 చెల్లదని నాటి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఒ.చిన్నపరెడ్డి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నాటి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు న్యాయమూర్తులున్న (జస్టిస్‌ పింగళి జగన్‌మోహన్‌ రెడ్డి, జస్టిస్‌ ఆవుల సాంబశివరావు) డివిజన్‌ బెంచ్‌కి అప్పీలు చేసింది. ఆ బెంచ్‌ జస్టిస్‌ ఒ.చిన్నపరెడ్డి ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి జీఓ 36 రాజ్యాంగ బద్ధంగా చెల్లుబాటవుతుందని తీర్పునిచ్చింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం - 1957, నియమావళి - 1959 చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 16(3) నిబంధన రాష్ట్రం మొత్తానికే కాకుండా రాష్ట్రంలో ఏదైనా ప్రత్యేక ప్రాంతానికి కూడా వర్తిస్తుందని పేర్కొంది.

ఎ.వి.ఎస్‌.నర్సింహారావు, ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌

ఈ కేసులో జీఓ 36 రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ ద్వారా సవాలు చేశారు. ఆ పిటిషన్‌ను నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిదయతుల్లా అధ్యక్షతన అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించింది. 1969, మార్చి 28న ముల్కీ నియమాలకు సంబంధించిన జీఓ 36 ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16(3)ని రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి మాత్రమే వర్తింపజేయడమూ రాజ్యాంగానికి వ్యతిరేకమని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం - 1957, నియమావళి - 1959లోని 3వ సెక్షన్‌తో పాటు దాని ఆధారంగా జారీ చేసిన జీఓ 36 కూడా చెల్లదని స్పష్టం చేసింది.


కె.ఎన్‌. వాంఛూ కమిటీ

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నియమాలను అమలు    చేయడం సాధ్యం కాదని స్పష్టమైంది. కానీ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ముల్కీ నియమాల అమలు, జై తెలంగాణ ఉద్యమ పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కేదార్‌నాథ్‌ వాంఛూ అధ్యక్షతన 1969, ఏప్రిల్‌లో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ముల్కీ రూల్స్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పులు, సుప్రీంకోర్టు తీర్పులను అధ్యయనం చేసి తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి 1969, ఆగస్టులో సమర్పించింది. ఈ నివేదికలో సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని తొలగించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16(3)ను సవరించాల్సి ఉంటుందని చెప్పింది. కానీ గోలక్‌నాథ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రాథమిక హక్కులను సవరించడానికి వీల్లేదు. కాబట్టి ఈ కమిటీ తెలంగాణలో ముల్కీ రూల్స్‌ను అమలు చేయాలంటే ప్రభుత్వ నియామకాలను రాష్ట్రస్థాయిలో కాకుండా జిల్లా, తాలూకా స్థాయుల్లో స్థానికంగా నిర్వహిస్తే ఆంధ్ర ప్రాంతం వారు పోటీ పడకపోవచ్చని సూచించింది.

పి.లక్ష్మణరావు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1970)

ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ)లో పనిచేస్తున్న పి.లక్ష్మణ రావు అనే ఉద్యోగి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టం - 1957, నియమావళి - 1959లోని 3వ సెక్షన్‌ రాజ్యాంగ బద్ధతను అధికరణ 226 ప్రకారం హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఫుల్‌బెంచ్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కుమరయ్య అధ్యక్షతన విచారించి 1970, డిసెంబరు 9న ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమేనని తీర్పునిచ్చింది. ఎ.వి.ఎస్‌.నర్సింహారావు కేసులో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టంలోని సెక్షన్‌ 3 చెల్లదని కొట్టి వేసింది, కాబట్టి ఆ చట్టం అమల్లోకి రాకముందు ఉన్న ముల్కీ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది.

వి.వెంకట్‌రెడ్డి, తదితరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (1972)

ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఓబుల్‌ రెడ్డి అధ్యక్షతన అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించింది. 4 - 1 మెజారిటీతో ముల్కీ నిబంధనలు చెల్లవని స్పష్టం చేసింది. ధర్మాసనంలో ఇతర న్యాయమూర్తులు జస్టిస్‌ కొండయ్య, జస్టిస్‌ కొండా మాధవరెడ్డి, జస్టిస్‌ ఎ.డి.వి.రెడ్డి, జస్టిస్‌ శ్రీరాములు ఉన్నారు. అయితే ఈ అయిదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమని, చెల్లవని తీర్పునివ్వగా జస్టిస్‌ కొండా మాధవరెడ్డి మాత్రం మిగతావారితో విభేదించి ముల్కీ రూల్స్‌ రాజ్యాంగ బద్ధమని, చెల్లుతాయని తీర్పునిచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్టంలోని 3వ సెక్షన్‌ చెల్లదని సుప్రీంకోర్టు కొట్టివేయడానికి ముందు అమల్లో ఉన్న ముల్కీ రూల్స్‌ వాటంతటవే అమల్లోకి వస్తాయని జస్టిస్‌ మాధవరెడ్డి స్పష్టం చేశారు.  

హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ తీర్పుపై నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ అధ్యక్షతన అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఫుల్‌బెంచ్‌ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. ముల్కీ రూల్స్‌ రాజ్యాంగ బద్ధంగా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. జస్టిస్‌ కొండా మాధవరెడ్డి ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తూ 1972, అక్టోబరు 3న తీర్పును వెలువరించింది. దీంతో రాజ్యాంగంలోని 35(బి) ప్రకరణ ద్వారా మళ్లీ ముల్కీ నిబంధనలు ఆటోమేటిగ్గా అమల్లోకి వస్తాయి కాబట్టి వాటిని యథాతథంగా కొనసాగించాలని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పుపై అప్పీలుకు అవకాశం లేకపోవడంతో అన్ని ఆటంకాలు తొలగిపోయాయి. సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని, ముల్కీ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని నాటి ముఖ్యమంత్రి పి.వి.నర్సింహారావు ప్రకటించారు. తర్వాత కాలంలో ముల్కీ నియమాలు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లోనే కాకుండా ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో కూడా అమల్లోకి వచ్చాయి. 1972, అక్టోబరు 3న నాటి సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా 1972, అక్టోబరు 18 నుంచి ఆంధ్ర ప్రాంతంలో
జై ఆంధ్రా ఉద్యమం ప్రారంభమైంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని