టీ ఫైబర్‌కు కేసీసీఐ పురస్కారం

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీ ఫైబర్‌)కు నాలెడ్జ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (కేసీసీఐ) పురస్కారం లభించింది. తెలంగాణలో ఇంటింటికీ, ప్రతి కార్యాలయానికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు టీ ఫైబర్‌ ఏర్పాట్లు చేస్తోంది.

Published : 22 Jun 2022 01:49 IST

కరెంట్‌ అఫైర్స్‌

తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీ ఫైబర్‌)కు నాలెడ్జ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (కేసీసీఐ) పురస్కారం లభించింది. తెలంగాణలో ఇంటింటికీ, ప్రతి కార్యాలయానికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు టీ ఫైబర్‌ ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్‌ భారత్‌లో వినూత్న పరివర్తన విభాగంలో టీ ఫైబర్‌ను కేసీసీఐ ఎంపిక చేసింది.

శ్రీలంక కేబినెట్‌ 21వ రాజ్యాంగ సవరణను ఆమోదించింది. దీని ప్రకారం అధ్యక్షుడికి ఉన్న అపరిమిత అధికారాలను తొలగిస్తూ పార్లమెంటును బలోపేతం చేసింది. 2020లో పార్లమెంటు కంటే అధ్యక్షుడికే ఎక్కువ అధికారాలు కట్టబెడుతూ 20ఏ సవరణ చేశారు. నూతన సవరణ ప్రకారం అధ్యక్షుడు పార్లమెంటుకు  జవాబుదారీగా ఉండాలి.

శత్రు దేశాల బాలిస్టిక్‌ క్షిపణులను మధ్యంతర దశ (మిడ్‌కోర్స్‌)లోనే నేలకూల్చే యాంటీబాలిస్టిక్‌ క్షిపణి (ఏబీఎం)కి సంబంధించిన సాంకేతిక పరీక్షను చైనా విజయవంతంగా నిర్వహించింది. ఇలాంటి ప్రయోగాన్ని చైనా చేపట్టడం ఇది ఆరోసారి.  

విమానాలు, అంతరిక్ష నౌకల తయారీ, సైనిక, ఇతర ఇంజినీరింగ్‌ అవసరాలకు దోహదపడే మెటల్‌ 3డీ ప్రింటర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో  ఐఐటీ జోధ్‌పుర్‌ పరిశోధకులు రూపొందించారు. ఇందులో లేజర్‌, రోబో వ్యవస్థలు మినహా మిగిలిన అన్ని భాగాలను భారత్‌లోనే రూపకల్పన చేసి ఉత్పత్తి చేశారు.

ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో సీనియర్‌ పురుషుల ఒక కిలోమీటర్‌ టైమ్‌ ట్రయల్‌ విభాగంలో భారత్‌కు చెందిన రొనాల్డో సింగ్‌ కాంస్యం గెలిచాడు. ఈ విభాగంలో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించిన సైక్లిస్ట్‌గా రికార్డు నమోదు చేశాడు. పురుషుల జూనియర్‌ 10 కిలోమీటర్ల రేసులో బిర్జీత్‌ యమ్నం (భారత్‌) తృతీయ స్థానంలో నిలిచి కంచు పతకం నెగ్గాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని