మీకు ఇంకో మెదడు కావాలి!

పొద్దున్న లేస్తే చాలు.. బోలెడన్ని క్లాసులు, పాఠాలు.. ఫోన్‌ తెరిస్తే చాలు.. లెక్కలేనంత సమాచారం... ఆసక్తిరేపే విషయాలు... ఆశ్చర్యపరిచే సంగతులు... సరికొత్త ఆలోచనలు... మరి... వీటిలో మీకెన్ని గుర్తున్నాయి? కొన్నింటిని మర్చిపోతున్నారు కదా! అందుకే మీకు ఇంకో మెదడు కావాలి!

Updated : 24 Jun 2022 12:26 IST

పొద్దున్న లేస్తే చాలు.. బోలెడన్ని క్లాసులు, పాఠాలు.. ఫోన్‌ తెరిస్తే చాలు.. లెక్కలేనంత సమాచారం... ఆసక్తిరేపే విషయాలు... ఆశ్చర్యపరిచే సంగతులు... సరికొత్త ఆలోచనలు... మరి... వీటిలో మీకెన్ని గుర్తున్నాయి? కొన్నింటిని మర్చిపోతున్నారు కదా! అందుకే మీకు ఇంకో మెదడు కావాలి!

సెకెండ్‌ బ్రెయిన్‌ అప్రోచ్‌... విద్యార్థుల ఉత్పాదకత (ప్రొడక్టివిటీ)ని పెంచే ఉద్దేశంతో తాజాగా తెరపైకొచ్చిన పద్ధతి. నేటి సమాజంలో ఒక విద్యార్థి తన రోజువారీ జీవితంలో ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాడు. తరగతి పాఠాలతోపాటు, జీవనశైలికి సంబంధించిన చాలా సమాచారం కళ్లకి కనిపిస్తున్నా... అది మెదడులో నిక్షిప్తం అయ్యేది కొన్నిరోజులే. ఎందుకంటే మనం ఆలోచనలు ఎప్పటికప్పుడు కలిగి ఉండగలం తప్ప, వాటిని ఏళ్లకేళ్లు భద్రపరచలేం.

కొత్త విషయాలు తెలిసేకొద్దీ పాత విషయాలను మన మెదడు దానికదే చెరిపేసుకుంటూ ఉంటుంది. మరి అందులో ముఖ్యమైన సమాచారం కూడా ఉంటుంది కదా! అందుకే, దాన్ని కోల్పోకుండా ఉండేందుకే ఈ ‘రెండో మెదడు’ అనే భావనను తెరపైకి తెచ్చారు.

అసలేంటిది?

సెకెండ్‌ బ్రెయిన్‌ అంటే నిజంగా మెదడేం కాదు. మన ఆలోచనలన్నీ డిజిటల్‌గా ఒకచోట పద్ధతిగా పొందుపరిచే ఒక విధానం మాత్రమే. పాతకాలంలో పెద్దలు ముఖ్యమైన విషయాలన్నీ ఒక పుస్తకంలో రాసి బీరువాల్లో జాగ్రత్తగా భద్రపరిచేవారు గుర్తుందా? అలా అన్నమాట. మనుషులు పరిణామక్రమంలో తమ గురించి చెప్పేందుకు ఎన్నో సాధనాలను ఉపయోగించారు. ఆదిమానవులు గుహల గోడల మీద చెక్కేవారు, రాజుల కాలంలో శిలాశాసనాలు వేసేవారు, తాళపత్రాల్లో రాసేవారు, కాగితాన్ని కనిపెట్టాక అది మరింత సులువైపోయింది. ఇప్పుడిది టెక్నాలజీ యుగం కాబట్టి ప్రతి విద్యార్థీ తనకు సంబంధించిన విషయాలన్నీ తానే ఒకచోట పొందుపరుచుకోవడమే ఈ విధానం. ఇందుకోసం కంప్యూటర్‌లో కొంత చోటుంటే చాలు.

ఉపయోగాలేంటి?

విధానం ప్రధాన ఉద్దేశం మనకొచ్చిన మంచి మంచి ఆలోచనలన్నింటినీ, దొరికిన ముఖ్యమైన సమాచారాన్నీ ఒక దగ్గర క్రోడీకరించి భవిష్యత్తులో వాటిని సమర్థంగా ఉపయోగించడమే. నేటి కాలంలో ఒక అద్భుతమైన ఆలోచనను మించిన ఆస్తి ఏదీ లేదు. అందుకే అలాంటి వాటిని జాగ్రత్తగా భద్రపరచడమే సెకెండ్‌ బ్రెయిన్‌ అప్రోచ్‌ ప్రాథమిక లక్ష్యం. దీని ద్వారా...

నచ్చిన విషయాలను, చేయాల్సిన పనులను జాబితాలో పొందుపరుచుకోవచ్చు.

తరగతిలో చక్కని ప్రతిభ కనబరిచేలా ప్రాజెక్టులు, ఇతర టాస్క్‌లను సమర్థంగా నిర్వహించవచ్చు.

ఉద్యోగమైనా, వ్యాపారమైనా... ఉత్తమమైన కెరియర్‌ను ఏర్పరుచుకోవచ్చు.


ఏం ఉంటుంది?

ముందీ సెకెండ్‌ బ్రెయిన్‌ను ప్రస్తుతం ఉన్న సమాచారంతో మనకు కావాల్సిన రూపంలో తయారుచేసుకోవాలి. దాన్ని అప్పుడప్పుడూ చూస్తూ ఉండాలి. రోజులు గడిచేకొద్దీ కొత్త విషయాలను జతచేరుస్తూ ఉండాలి. ఆ సమాచారం నుంచి భవిష్యత్తుకు ఉపయోగపడేలా కొత్త ఆలోచనలు సృష్టించాలి! అదే దీని తయారీలోని ఆంతర్యం.

టియాగో ఫోర్ట్‌ - ఈ సెకెండ్‌ బ్రెయిన్‌ అప్రోచ్‌ సృష్టికర్త. అమెరికాకు చెందిన ఈ రచయిత... విద్యార్థులు తమ శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోవాలనే ఆశయంతో ఈ విధానాన్ని ప్రతిపాదించాడు. దీని ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో పరిశోధించేందుకు ‘ఫోర్ట్‌ ల్యాబ్స్‌’ పేరుతో ఒక సంస్థను స్థాపించాడు. ఎక్కువమంది విద్యార్థులు, ఉద్యోగార్థులు తన విధానాన్ని అనుసరించి ప్రయోజకులు అయ్యేందుకు కృషి చేస్తున్నాడు.

ఉదాహరణకు..

వైశాలి డిగ్రీ పూర్తిచేసింది. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవ్వాలనేది తన ఆశయం. అయితే ముందు పీజీ కూడా చదవాలి

అనుకుంటోంది. అంటే రాబోయే ఐదేళ్లకు తన ప్రణాళిక సిద్ధంగా ఉంది. దానికి తగినట్టు తన సెకెండ్‌ బ్రెయిన్‌ పాయింట్ల వారీగా ఇలా ఉండొచ్చు.

పీజీలో చదువుకుంటున్న సబ్జెక్టులు, ముఖ్యమైన నోట్స్‌, అసైన్‌మెంట్లు, పరీక్షల ప్రిపరేషన్‌, కాలేజ్‌ సంబంధిత సమాచారం, స్నేహితులు, ఫ్యాకల్టీ, ఫోన్‌ నంబర్లు వగైరా.

సివిల్స్‌కు సంబంధించిన సమాచారం, ప్రిపరేషన్‌ పద్ధతి - పుస్తకాల గురించి వచ్చే అప్‌డేట్లు, నచ్చిన కోచింగ్‌ సెంటర్ల వివరాలు, ర్యాంకర్ల మనోగతంపై వచ్చే కథనాలు, ఇతర గైడెన్స్‌.

అమ్మానాన్నల ఆరోగ్యం, ఆర్థిక భద్రత, తమ్ముడి చదువుకు సంబంధించిన సమాచారం, ఇంటి రుణం ఎప్పుడు తీరుతుంది - దాని ప్రభావం వారిపై ఎలా ఉంది, తండ్రి రిటైర్మెంట్‌ తర్వాత పరిస్థితి ఏంటి...

స్నేహితులు, వ్యక్తిగత సంబంధాలు, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు - నిర్ణయాలు, నచ్చిన హాబీలు, నేర్చుకున్న నైపుణ్యాలు ఇలా...
ఇప్పుడు తనవద్దనున్న సమాచారంతో... ఈ లాభాలు పొందొచ్చు.

తాను డిగ్రీలో రాసుకున్న ఒక సబ్జెక్టు నోట్స్‌... తన సివిల్స్‌ ఆప్షనల్‌ ప్రిపరేషన్‌లో ఉపయోగపడొచ్చు.

 తండ్రి అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తీసుకున్న రిపోర్ట్స్‌... ఎప్పటికైనా ఆయన వైద్యంలో అవసరం కావొచ్చు.

ఎప్పుడో విడిపోయిన క్లాస్‌మేట్స్‌ను తిరిగి కలుసుకోవాలన్నప్పుడు వారి వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

అంటే ఒక విద్యార్థికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్‌గా ఈ సెకెండ్‌ బ్రెయిన్‌లో ఉంటుందన్నమాట! ప్రతిఒక్కరి పరిస్థితులు, అవసరాలు, ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి కాబట్టి వారు ఎవరికి వారే తమ బ్రెయిన్‌లో ఏయే అంశాలు ఉండాలనేది నిర్ణయించుకోవాలి.

ఎలా చేయాలి?

ఏయే అంశాలు ఉండాలో నిర్ణయించుకున్నాక ఏ రూపంలో కావాలనేది ఆలోచించుకోవాలి. ఇప్పటికే ప్రతి స్మార్ట్‌ ఫోన్‌లో నోట్‌ టేకింగ్‌ ఆప్షన్లు ఉంటున్నాయి. వాటితోపాటే చాలా యాప్స్‌ కూడా వచ్చాయి. ఈ భావనను బలంగా యువతలోకి తీసుకెళ్లాలని పనిచేస్తున్న కొన్ని ఆన్‌లైన్‌ సంస్థలు... ‘అల్టిమేట్‌ బ్రెయిన్‌ టెంప్లెట్‌’ వంటి ముందే సిద్ధం చేసిన ఫార్మాట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో సమాచారం వాక్యాలు, చిత్రాలు, వీడియోలు, స్కెచ్‌, మైండ్‌ మ్యాప్‌, వెబ్‌పేజ్‌, డాక్యుమెంట్‌, పీడీఎఫ్‌... ఇలా ఏ రూపంలోనైనా ఉండొచ్చు. వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువసార్లు చూసే వీలుండేలా దీన్ని తయారుచేయడం ప్రధానం. ఈ సమాచారాన్నంతా ఒకేసారి కూర్చుని రాసేయకుండా రోజుకో కొంత సమయం కేటాయించాలి. నిన్న ఏం నమోదు చేశామనేది ఇవాళ చూడాలి. దానివల్ల మన జీవితంపై, మన ప్రవర్తనపై మనకు అవగాహన పెరుగుతుంది. దీన్ని ఒక విధమైన డైరీ అనుకోవచ్చు. అయితే డైరీ జ్ఞాపకాలను భద్రపరిస్తే, సెకెండ్‌ బ్రెయిన్‌ భవితను తీర్చిదిద్దుతుంది.

చూస్తూ ఉండాలి..

కొంత సమాచారం పొందుపరిచాక ఇక అక్కడితో అయిపోదిది. మన నిజమైన మెదడులాగానే సెకెండ్‌ బ్రెయిన్‌లో కూడా ప్రతిరోజూ కొత్త కొత్త అనుభవాలు, ఆలోచనలు పోగుచేయాలి. ఏది ముఖ్యమనిపిస్తే అది రాయాలి. అప్పుడప్పుడూ దాన్ని చూస్తూ ఉండాలి. అవసరమైన విషయాలను ఒకదానితో మరికొటి అనుసంధానం (ఇంటర్‌లింక్‌) చేసుకోవాలి. తద్వారా ఎలాంటి లాభం కలుగుతుందో గమనించాలి. ఇప్పుడు ప్రతి మనిషికీ ఒక డిజిటల్‌ జీవితం ఉందనేది సత్యం. దానికి ఈ సెకెండ్‌ బ్రెయిన్‌ సహాయకారిగా ఉండాలి. చివరిగా ఈ సెకెండ్‌ బ్రెయిన్‌ మనల్ని విద్యార్థిగానూ వ్యక్తిగానూ మరో మెట్టు పైకెక్కించేలా ఉండాలి.

సెకెండ్‌ బ్రెయిన్‌ కేవలం ఐడియాలను నిల్వ చేయడం మాత్రమే కాదు, వాటిని ఆచరణలో పెట్టేలా ప్రోత్సహిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని