TS EXAMS 2022 : తరాల అణచివేతకు సజీవ సాక్ష్యాలు!

మన దేశంలో అనాదిగా పాతుకు పోయిన కులవ్యవస్థలో కొన్ని వర్గాలు సామాజిక అణచివేతకు గురవుతున్నాయి. అందులో ప్రధాన వర్గం షెడ్యూల్డ్‌ కులాలు. తరాలుగా ఉన్నత వర్గాలు నిర్దేశించిన అహేతుక ఆంక్షలతో వీరికి అనేక ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలు దూరమయ్యాయి.

Updated : 24 Jun 2022 02:53 IST

సమాజ నిర్మాణం, సమస్యలు

ప్రజావిధానాలు/పథకాలు

మన దేశంలో అనాదిగా పాతుకు పోయిన కులవ్యవస్థలో కొన్ని వర్గాలు సామాజిక అణచివేతకు గురవుతున్నాయి. అందులో ప్రధాన వర్గం షెడ్యూల్డ్‌ కులాలు. తరాలుగా ఉన్నత వర్గాలు నిర్దేశించిన అహేతుక ఆంక్షలతో వీరికి అనేక ప్రయోజనాలు, అభివృద్ధి అవకాశాలు దూరమయ్యాయి. సమాజ నిర్మాణం-సమస్యలు, సంక్షేమ పథకాల అమలు తీరు అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు ఈ అంశంపై అవగాహన పెంచుకోవాలి.

షెడ్యూల్డ్‌ కులాలు

షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వారిని ప్రాచీన కాలంలో పంచములు, అస్పృశ్యులు, మ్లేచ్ఛులు, అవర్ణులు అనేవారు. 1931 జనాభా లెక్కల్లో వీరిని అణగారిన వర్గాలుగా పేర్కొన్నారు. 1936లో జాబితాను పునఃసమీక్షించి భారత ప్రభుత్వం కొత్త జాబితాను రూపొందించింది. రాజ్యాంగంలోని 341వ అధికరణను అనుసరించి రాష్ట్రపతి షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) జాబితాను ప్రకటించారు. 20వ శతాబ్దం ప్రారంభకాలంలో గుజరాత్‌లో నర్సింగ్‌ మెహతా అనే సాధువు షెడ్యూల్డ్‌ కులాల వారిని ‘హరిజన్‌’ అనే పదంతో సంబోధించారు. ఆ పదాన్ని మహాత్మా గాంధీ ఉపయోగించడంతో ఎక్కువ జనాదరణ పొందింది. హరిజన్‌ అనే పత్రికను కూడా గాంధీజీ నడిపారు. 1965 - 75 మధ్య కాలంలో హరిజనులను దళితులు, దళిత పాథర్లని అన్నారు. నాటి నుంచి హరిజన, దళిత పదాలను షెడ్యూల్డ్‌ కులాల వారందరికీ వర్తింపజేస్తున్నారు. 341వ అధికరణను అనుసరించి అస్పృశ్యులుగా పరిగణించిన వారందరినీ ఎస్సీలుగా పేర్కొంటున్నారు. రాష్ట్రపతి ప్రకటించిన జాబితాలో ఏవైనా మార్పులు చేయాలంటే పార్లమెంటు ఆమోదం తప్పనిసరి.

భౌగోళిక విస్తరణ

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్డ్‌ కులాలవారి విస్తరణ ప్రాతిపదికగా మూడు ప్రాంతాలను గుర్తించారు.

1) అధిక సంఖ్యలో ఎస్సీలు నివసిస్తున్న ప్రాంతాలు: ఎ) గంగా - సింధూ నదుల పరీవాహక ప్రాంతాలు బి) తీరప్రాంతం.

సారవంతమైన భూములు, మంచినీటి సరఫరా, వ్యవసాయానికి తగిన వాతావరణం ఉండటంతో గంగా - సింధూ నదీ పరీవాహక ప్రాంతంలో అధిక జనాభా ఉంటుంది. ఇక్కడ ఎన్నోరకాల పంటలు పండిస్తూ సంప్రదాయ వ్యవసాయాన్ని ప్రజలు సాగిస్తుంటారు. ఇక్కడ అధిక సంఖ్యలో షెడ్యూల్డ్‌ కులాల వారూ ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. వారికి ఈ ప్రాంతంలో వ్యవసాయపరంగా సంవత్సరమంతా ఏదో ఒక పని లభిస్తుంటుంది.

2) మధ్యస్థంగా ఎస్సీలు ఉన్న ప్రాంతాలు: దక్షిణ భారత మైదాన ప్రాంతాల్లోనూ ఎస్సీలు నివసిస్తున్నారు. తూర్పున ఒడిశా తీరం నుంచి దక్షిణంగా ఆంధ్ర, తమిళనాడు; పశ్చిమంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో వీరి విస్తరణ ఉంది. ఇక్కడ వ్యవసాయ పనులు సాధారణంగా ఉంటాయి. దాంతో ఎస్సీ జనాభా గంగా - సింధూ నదీ పరీవాహక ప్రాంతంతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కోస్తా ప్రాంతాల్లో సారవంతమైన వ్యవసాయ భూములు ఉండటంతో రైతులు అధికంగా నివసిస్తుంటారు. వ్యవసాయ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. దాంతో షెడ్యూల్డ్‌ కులాల జనాభా కూడా ఇక్కడ మధ్యస్థంగా విస్తరించింది.

3) అతి స్వల్ప ఎస్సీ జనాభా ఉన్న ప్రాంతాలు: షెడ్యూల్డ్‌ కులాలవారు మధ్య వింధ్య, చోటానాగ్‌పుర్‌ ప్రాంతాల్లో తక్కువగా ఉంటున్నారు. రాజస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు, హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వతారణ్యాలు, కర్ణాటక, మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో కొద్దిసంఖ్యలో కనిపిస్తారు.

వివిధ కులాలు

భారతదేశంలోని ఎస్సీలను వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. చమార్లు, భంగీ, నామశూద్ర, మాలి, దుసాద్‌, కోలి, మహార్‌, పాసి, ఆది ద్రవిడ, ఆది కర్ణాటక, మాదిగ, మాల లాంటి పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎస్సీల జాబితా ఉంటుంది. దేశంలో 1208 షెడ్యూల్డ్‌ కులాలు ఉన్నాయి. కర్ణాటకలో (101 కులాలు) అధికంగా, దాద్రానగర్‌ హవేలీలో (4 కులాలు) తక్కువగా ఉన్నాయి

ఎస్సీల జనాభా

2011లో షెడ్యూల్డ్‌ కులాల జనాభా 20.14 కోట్లు. దేశ జనాభాలో వీరు 16.6 శాతంగా ఉన్నారు. 1961లో ఉన్న జనాభా కంటే ఇది సుమారు మూడు రెట్లు ఎక్కువ. సాధారణ జనాభాలో షెడ్యూల్డ్‌ కులాల నిష్పత్తి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. పంజాబ్‌లో 31.9%, హిమాచల్‌ప్రదేశ్‌లో 25.2%, పశ్చిమ బెంగాల్‌లో 23.5%గా ఉంది. షెడ్యూల్డ్‌ కులాల మొత్తం జనాభాలో 84% గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, కౌలుదార్లు, ఉపాంత రైతులుగా ఉన్నారు.

రకరకాల అశక్తతలు

షెడ్యూల్డ్‌ కులాల ప్రజలు ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక రకాల అశక్తతలకు (వెనుకబాటుతనాలకు) గురవుతున్నారు. స్థూలంగా వాటిని అయిదు రకాలుగా వర్గీకరించారు.

* సామాజిక అశక్తతలు * విద్యాపరమైన అశక్తతలు * ఆర్థిక అశక్తతలు * రాజకీయ అశక్తతలు * మతపరమైన అశక్తతలు

సామాజిక అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారిని అస్పృశ్యులుగా భావించడంతో కులశ్రేణిలో అట్టడుగు వర్గంగా చేర్చారు. దాంతో వారిని తాకితే మైలపడిపోతామనే అపోహలతో సామాజికంగా వేరుచేశారు. ఉన్నత, షెడ్యూల్డ్‌ కులాల వారి మధ్య ఎంతదూరం ఉండాలనే విషయాన్నీ కులవ్యవస్థ నిర్ణయించేది. తిరువనంతపురంలో ఉన్నత కులాల వారి నుంచి ఎస్సీలు దాదాపు 40 - 80 అడుగుల దూరంలో ఉండాలనే నియమం ఉండేది. ఇంకా అనేక రకాల ఆంక్షలు విధించేవారు. షెడ్యూల్డ్‌ కులాల వారు గుర్రపు స్వారీ చేయకూడదు. విలువైన దుస్తులు ధరించకూడదు. గొడుగు వాడకూడదు. నవదంపతులు పల్లకిలో ఊరేగకూడదు. వారు తాకితే నీరు మైలపడుతుందంటూ ఊరి బావి నుంచి నీటిని తోడకూడదనే ఆంక్షలు అమలు చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో వీరు బావి వరకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ అందరికీ ఉపయోగపడే గుంటలు, జలాశయాలను మాత్రం ఉపయోగించుకునే వీలు ఉండేది కాదు.

విద్యా అశక్తతలు: కులవ్యవస్థ నియమాలను అనుసరించి వారికి విద్య లేకుండా చేశారు. ఎస్సీల పిల్లలు పాఠశాలలో చేరితే ఉన్నత కులాలవారు తమ పిల్లలను చేర్పించేవారు కాదు.

ఆర్థిక అశక్తతలు: ఎస్సీలు చెత్తాచెదారాలు, మానవ మలాలు, పశువుల మృతకళేబరాలు తీసేసే తక్కువస్థాయి వృత్తుల్లో ఉండేవారు. దీంతో ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోయారు.

రాజకీయ అశక్తతలు: షెడ్యూల్డ్‌ కులాల వారు అనేక రాజకీయ అశక్తతలకూ గురయ్యారు. గ్రామంలో లేదా బస్తీలో లేదా నగరాల్లోని పాలక వర్గాల్లో వారికి సభ్యత్వం ఉండేది కాదు. అందువల్ల సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వాములు కాలేకపోయేవారు. పరిపాలన లోనూ ఎస్సీలకు స్థానం లభించేది కాదు. ఆంగ్లేయుల పాలనలో ఓటు హక్కు కల్పించినప్పటికీ దాన్ని వారు ఎప్పుడూ సద్వినియోగం చేసుకోలేకపోయారు.

మతపరమైన అశక్తతలు:ఎస్సీలకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. శ్మశాన వాటికలు, స్నాన వాటికలను ఉపయోగించకూడదనే నియమం ఉండేది. వేదాలు, పురాణాలు లాంటి ధార్మిక గ్రంథాలను చదవకూడదనే ఆంక్షలు పెట్టేవారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని