కరెంట్‌ అఫైర్స్‌

మన దేశానికి చెందిన జీశాట్‌-24 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఉపగ్రహాన్ని న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో

Updated : 25 Jun 2022 00:25 IST

నిర్ణీత కక్ష్యలోకి జీశాట్‌-24 ఉపగ్రహం

మన దేశానికి చెందిన జీశాట్‌-24 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్‌-5 రాకెట్‌ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. ఉపగ్రహాన్ని న్యూస్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూపకల్పన చేశారు. ఇది కేయూ-బ్యాండ్‌ కలిగిన 4,180 కిలోల బరువుగల కమ్యూనికేషన్స్‌ ఉపగ్రహం. డైరెక్ట్‌-టు-హోమ్‌ సేవలు అందిస్తున్న టాటా ప్లే ప్రసారాలకు కావలసిన పూర్తి సేవలను ఈ ఉపగ్రహం అందించనుంది.

ప్రపంచ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కెనడా టీనేజర్‌ సమ్మర్‌ మెకంతాష్‌ (15) మహిళల 200 మీటర్ల బటర్‌ఫ్లైలో పసిడి సాధించింది. దీంతో 2011 తర్వాత ఈ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ నెగ్గిన 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసు స్విమ్మర్‌గా రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో తనకిదే తొలి స్వర్ణం. ఫ్లికింగర్‌ (అమెరికా), జాంగ్‌ యూఫీ (చైనా) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు.

అజూక్సాంథలేట్‌ రకానికి చెందిన ట్రంకేటోఫ్లాబెల్లమ్‌ క్రాసమ్‌, టి.ఇంక్రస్టేటమ్‌, టి.అక్యులేటమ్‌, టి.ఇర్రెగ్యులేర్‌ అనే నాలుగు ప్రవాళ (కోరల్‌) జాతులు భారత్‌లో తొలిసారిగా బయటపడ్డాయి. అండమాన్‌ నికోబార్‌ దీవుల జలాల్లో అవి కనిపించినట్లు జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌ఎస్‌ఐ) పరిశోధకులు తెలిపారు. ఇవన్నీ ఫ్లాబెల్లీడే తరగతికి చెందినవని పేర్కొన్నారు.

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా పంజాబ్‌ మాజీ డీజీపీ, ఆ రాష్ట్రంలోని 1987 కేడర్‌ ఐపీఎస్‌ అధికారి దినకర్‌ గుప్త నియమితులయ్యారు. ఈయన 2024 మార్చి 31 వరకూ ఆ హోదాలో కొనసాగుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని