నవ భారత వైతాళికుడు

సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలతో భారతీయ సంస్కృతి పతనమవుతున్న సమయంలో జాతిని మేల్కొలిపి ఆధునిక యుగం వైపు నడిపించేందుకు ప్రయత్నించిన తొలి సంఘసంస్కర్త రాజా రామ్‌మోహన్‌రాయ్‌. అర్థం లేని ఆచారాలను, మహిళల పట్ల వివక్షను విడనాడాలని ఆయన నినదించాడు.  భారతీయుల పురోగతికి, తార్కిక, శాస్త్రీయ విజ్ఞానం కోసం ఆంగ్ల విద్య అవసరమని చెప్పాడు. బ్రిటిష్‌ పాలకులతో సఖ్యంగా ఉంటూ భారత జాతి ఉద్ధరణకు పలు సంస్కరణలు అమలు చేయించాడు.

Published : 28 Jun 2022 01:32 IST

ఆధునిక భారతదేశ చరిత్ర

సాంఘిక దురాచారాలు, మూఢ విశ్వాసాలతో భారతీయ సంస్కృతి పతనమవుతున్న సమయంలో జాతిని మేల్కొలిపి ఆధునిక యుగం వైపు నడిపించేందుకు ప్రయత్నించిన తొలి సంఘసంస్కర్త రాజా రామ్‌మోహన్‌రాయ్‌. అర్థం లేని ఆచారాలను, మహిళల పట్ల వివక్షను విడనాడాలని ఆయన నినదించాడు.  భారతీయుల పురోగతికి, తార్కిక, శాస్త్రీయ విజ్ఞానం కోసం ఆంగ్ల విద్య అవసరమని చెప్పాడు. బ్రిటిష్‌ పాలకులతో సఖ్యంగా ఉంటూ భారత జాతి ఉద్ధరణకు పలు సంస్కరణలు అమలు చేయించాడు.


ఆధునిక భారతదేశం- మత, సామాజిక సంస్కరణలు

ఆధునిక భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన చారిత్రక శక్తుల్లో ముఖ్యమైంది పాశ్చాత్య సమాజంతో మనవాళ్లకు ఏర్పడిన సాంగత్యం. 19వ శతాబ్దం అర్ధభాగం గడిచేసరికి బ్రిటిషర్లు భారతదేశ పాలకులయ్యారు. ఆంగ్లేయ పాలకులతోపాటు వారి ఆహార, ఆహార్య అలవాట్లు, భాష, మతం, ఆచారాలు, విద్య, జీవనవిధానం దేశంలో ప్రవేశించి ఇక్కడి వారిని పూర్తిగా ప్రభావితం చేశాయి. ఒక దశలో భారత జాతి గత వైభవాన్ని మర్చిపోయి పరాయి సంస్కృతీ వ్యామోహంలో పడింది. మన సంస్కృతి హేళనకు గురైంది.
ఆనాటి భారతీయ సమాజంలోని అనేక సామాజిక రుగ్మతలైన శిశు హత్యలు, బాల్య వివాహాలు, సతీసహగమనం, బహుభార్యత్వం, స్త్రీ విద్య నిరాకరణ, నరబలులు, కుల వ్యవస్థ లాంటివి తీవ్ర విమర్శలకు గురయ్యాయి. వీటికి క్రైస్తవ మిషనరీల విమర్శలు తోడై భారతీయులను ఆత్మన్యూనతా భావంలోకి నెట్టివేశాయి. దీన్ని ఆసరాగా చేసుకొని యూరోపియన్‌ మిషనరీలు భారతీయులను పెద్దఎత్తున క్రైస్తవంలోకి మార్చడానికి ఉద్యమం చేపట్టాయి. ఈ నేపథ్యంలో పాశ్చాత్య విద్యావిధానంలో విద్యను అభ్యసించిన కొంత మంది విద్యావంతులు పతనమవుతున్న సమాజాన్ని సంరక్షించడానికి సంస్కరణ ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. ఆంగ్ల విద్య వారికి మానవతావాదం, తార్కిక, శాస్త్రీయ దృక్పథాలను పరిచయం చేసింది. తద్వారా తత్త్వవేత్తలు, రాజనీతి పండితులైన వోల్టేర్‌, రూసో, జేమ్స్‌ మిల్‌, జాన్‌ స్టువర్ట్‌ మిల్‌ల సిద్ధాంతాలు అవగాహన చేసుకోగలిగారు. వీటి సహాయంతో తరతరాలుగా మనలో కొనసాగుతున్న సాంఘిక దురాచారాలు, మత అంధ విశ్వాసాలు ఆనాటి యుగధర్మానికి ఎంత వ్యతిరేకమో తెలుసుకొని వాటి నుంచి జాతిని సంస్కరించడానికి నడుం బిగించారు. వీటినే ‘మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలు’ లేదా ‘సాంస్కృతిక పునరుజ్జీవనం’ అంటారు.

పునరుజ్జీవన ఉద్యమానికి ముఖ్య కారణాలు:
*
బ్రిటిషర్ల పాలనా ప్రభావం, ఆంగ్ల విద్య, ప్రాచీన భారతీయ సాహిత్య ప్రభావం.
* జాతీయత భావాలు, భారతీయ మత సమాజాలపై క్రైస్తవ మిషనరీలు చేసిన విమర్శల దాడి.
* భారతీయ సంస్కృతి అణచివేతపై వ్యతిరేకత.
ఆనాడు పుట్టుకొచ్చిన కొత్త సామాజిక వర్గాలు సంస్కరణలను ఆహ్వానించాయి. భారతీయులు ఇతర మతాల ప్రభావానికి గురికాకుండా అడ్డుకునేందుకు, హైందవ సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను నిర్మూలించేందుకు రాజా రామ్‌మోహన్‌రాయ్‌, స్వామి దయానంద సరస్వతి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి మహనీయులు సంస్కరణోద్యమాలు చేపట్టారు.


రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ (1772 - 1833)

మత, సాంఘిక సంస్కరణ ఉద్యమాలకు ఆద్యుడు, ఆధునిక భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడు రాజా రామ్‌మోహన్‌రాయ్‌. ఈయన జన్మస్థలం బెంగాల్‌లోని రాధానగరం. ఈస్ట్‌ ఇండియా కంపెనీలో కొంతకాలం ఉద్యోగిగా చేశాడు. బెంగాలీ, అరబ్బీ, పారశీకం, సంస్కృతం, ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, లాటిన్‌, గ్రీక్‌, హిబ్రూ భాషల్లో ప్రతిభ సాధించిన బహుభాషాకోవిదుడు. మొగల్‌ చక్రవర్తి రెండో అక్బర్‌ ఈయనకు ‘రాజా’ అనే బిరుదును ప్రదానం చేశాడు. క్రైస్తవం, ఇస్లాం, బౌద్ధ, జైన మత గ్రంథాలు చదివి వాటి సారాంశాలను అర్థం చేసుకున్నాడు. ఉపనిషత్తుల్లోని ఏకేశ్వర, నిరాకారతత్వాన్ని అంగీకరించాడు. మానవ సమాజంలో ఐక్యతను ఆకాంక్షించాడు. రాయ్‌ ప్రాక్పశ్చిమ ఆలోచనా విధానాలకు ప్రతినిధి. అర్థం లేని ఆచారాలతో నిభిడీకృతమై నానాటికీ  ప్రాధాన్యం కోల్పోయి నిర్జీవమవుతున్న హిందూ మతం, సమాజాన్ని సంస్కరించడానికి సంకల్పించాడు.

రామ్‌మోహన్‌ రాయ్‌ ఉపనిషత్తుల్లోని ఏకేశ్వర వాదాన్ని (దేవుడు ఒక్కడే) ప్రచారం చేయడానికి 1814లో ఆత్మీయ సభను స్థాపించాడు. ప్రాచీన వేద సాహిత్యం ఏకేశ్వర ఉపాసననే ప్రబోధించిందని నిరూపించాడు. 1828లో బ్రహ్మసభను స్థాపించాడు (తర్వాత ఇది బ్రహ్మసమాజ్‌గా మారింది). హేతువాదం, ఉపనిషత్తుల సారాంశం ఈ సమాజ మూల స్తంభాలు. రాయ్‌ ఆలోచనలే బ్రహ్మసమాజ్‌ సిద్ధాంతాలు. సమాజ్‌ సర్వ ప్రపంచానికి మూలదేవుడు ఒక్కడే అని తెలిపింది. ఏకేశ్వర ఉపాసనను సమర్థించింది. భగవంతుడు నిరాకారుడని, విగ్రహారాధన కూడదని, బహు దేవతా ఆరాధన అర్థరహితమని చెప్పింది. మతం పేరిట కర్మకాండను, పురోహిత వర్గ ఆధిపత్యాన్ని తిరస్కరించింది. ఉపనిషత్తుల్లో ఆధ్యాత్మిక భావనే మోక్షమార్గం అని ఉద్ఘాటించింది. మిషనరీలు చేసే విమర్శల జడివాన నుంచి వైదిక మతాన్ని, వేదాంతాన్ని ఈయన రక్షించాడు. బ్రహ్మసమాజ్‌ భారతీయ సామాజిక, మత సంస్కరణోద్యమంలో కీలకపాత్ర పోషించింది.

సామాజిక విషయాల్లో ఆనాటి సాంఘిక దురాచారాలపై సమరభేరి మోగించిన నవయుగ వైతాళికుడు రామ్‌మోహన్‌ రాయ్‌. స్త్రీల హక్కుల కోసం పోరాడిన ధీరుడు. భర్త చితిపైనే సజీవంగా ఉన్న భార్యను కూడా దహనం చేసే సతి అనే దురాచారాన్ని తీవ్రంగా ఖండించాడు. శిశుహత్యలు, బాల్య వివాహాలు, బహు భార్యత్వం నిర్మూలనకు విశేషంగా ప్రచారం చేశాడు. స్త్రీకి విద్య అవసరమని వాదించాడు. వితంతు వివాహాల కోసం కృషి చేశాడు. స్త్రీలకు ఆస్తి వారసత్వ హక్కులు కోరాడు. ఈయన ప్రమేయంతోనే నాటి గవర్నర్‌ జనరల్‌ విలియం బెంటింక్‌ ప్రభుత్వం 1829లో సతి దురాచారాన్ని, శిశు హత్యలను నిషేధించింది. రాయ్‌ మానవ సమానత్వాన్ని ప్రబోధించాడు. కుల వ్యవస్థను తిరస్కరించాడు. భారతీయుల్లో అంటరానితనం, అప్రజాస్వామ్యం, అమానుషమని పేర్కొన్నాడు.
సమకాలీన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను రాయ్‌ చక్కగా అర్థం చేసుకున్నాడు. భారతీయుల అనైక్యతకు  మూలకారణం కుల వ్యవస్థ అని ఉద్ఘాటించాడు. భారతీయుల పురోగతికి, పాశ్చాత్య విద్య అవసరమని గుర్తించి గవర్నర్‌ జనరల్‌ అమ్హేరెస్ట్‌ను పాశ్చాత్య శాస్త్రీయ విజ్ఞానంలో భారతీయులకు శిక్షణ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ఆంగ్ల విద్యను ప్రోత్సహించడానికి కలకత్తాలో నివసిస్తున్న డేవిడ్‌ హేర్‌ అనే స్కాట్లాండ్‌ గడియారాల వ్యాపారి 1817లో హిందూ కాలేజీని స్థాపించగా రాయ్‌ అతడిని ప్రోత్సహించాడు. తర్వాత అది ప్రెసిడెన్సీ కళాశాలగా మారింది. ఆంగ్లేయ విద్య, భారతీయ శాస్త్రాలు బోధించడానికి రామ్‌మోహన్‌ రాయ్‌ 1825లో వేదాంత కళాశాలను స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం చేపట్టిన సాంఘిక సంస్కరణలు, ఆధునిక విద్యాసంస్థల ఏర్పాటును ప్రశంసించాడు.

రామ్‌మోహన్‌ రాయ్‌ మంచి పాత్రికేయుడు, రచయిత. ఎ గిఫ్ట్‌ టు మోనోతిస్టు అనే గ్రంథంలో ఏకేశ్వర ఉపాసనను సమర్థించాడు. 1821లో సంవాద కౌముది అనే బెంగాలీ పత్రికను స్థాపించాడు. ఇది మనదేశంలో భారతీయులు స్థాపించిన తొలి పత్రిక. సాంఘిక దురాచారాలు, సతి, విగ్రహారాధనకు వ్యతిరేకంగా  ఈ పత్రిక పోరాటం చేసింది. రామ్‌మోహన్‌ రాయ్‌ బంగదూత అనే పత్రికను ప్రచురించాడు. పర్షియన్‌ భాషలో మిరాత్‌-వుల్‌-అక్బర్‌ పత్రికను స్థాపించాడు. ది ప్రెసెప్ట్స్‌ ఆఫ్‌ జీసస్‌ - 1820 (ఇంగ్లిష్‌), ది గైడ్‌ టు పీస్‌ అండ్‌ హ్యాపీనెస్‌ - 1820 (ఇంగ్లిష్‌) లను సంకలనం చేశాడు. తహజల్‌ అద్‌-ముహుద్దీన్‌ (పర్షియా)ను సంకలనం చేశాడు. తన రచనలు, పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అవిరళ కృషి చేశాడు.

రాజకీయ పోరాట యోధుడు
రామ్‌మోహన్‌ రాయ్‌ సమాజంలోని స్తబ్దత, అలసత్వం, అవినీతి పట్ల ఆవేదన చెందాడు. బెంగాల్‌ జమీందార్లు భూమిశిస్తు కోసం  రైతులను పీడించడాన్ని గర్హించాడు. కంపెనీ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించాలని కంపెనీ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. భారతీయ ఎగుమతులకు ఇంగ్లండ్‌లో కస్టమ్స్‌ సుంకం తగ్గించాలని డిమాండ్‌ చేశాడు. కంపెనీ ఉన్నత ఉద్యోగాల్లోనూ భారతీయులను నియమించాలని కోరాడు.

విశ్వమానవతావాది
మానవాళి అంతా వసుధైక కుటుంబం. అసంఖ్యాక దేశాలు, ప్రజలు ఆ కుటుంబ శాఖలే. అన్ని దేశాల మేధావులు విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని, విశ్వమానవ శ్రేయోభివృద్ధిని సాధించడంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించి వారిలో పరస్పర స్నేహ సహకారాలు పెంపొందించడానికి ప్రోత్సహించాలని రాయ్‌ ఉద్ఘాటించాడు.

మొగల్‌ చక్రవర్తి రెండో అక్బర్‌ పెన్షన్‌ పెంపు విషయం గురించి బ్రిటిష్‌ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి  ఇంగ్లండ్‌ వెళ్లిన రాయ్‌ అక్కడే బ్రిస్టల్‌ నగరంలో 1833లో మరణించాడు. దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌, ప్రసన్నకుమార్‌ ఠాగూర్‌, చంద్రశేఖర్‌ దేవ్‌, తారాచంద్‌ చక్రవర్తి, డేవిడ్‌ హేర్‌, అలెగ్జాండర్‌ డఫ్‌ లాంటివారు ఈయన ముఖ్య అనుచరులు. రామ్‌మోహన్‌ రాయ్‌ మరణానంతరం దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ నాయకత్వంలో బ్రహ్మ సమాజ్‌ కార్యకలాపాలు కొనసాగాయి. దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ తత్త్వబోధిని సభ, తత్త్వబోధిని పత్రికను స్థాపించి రామ్‌ మోహన్‌రాయ్‌ ఆదర్శాలను కొనసాగించాడు.

పునరుజ్జీవ స్వేచ్ఛా భారతం రాయ్‌ స్వప్నం: మాతృభూమి జాగృతీ వికాసంలో నిర్ణయాత్మక పాత్రను పోషించిన తొలి ఆధునికుడు, మహాసంస్కర్త రాజా రామ్‌మోహన్‌ రాయ్‌ చైతన్య భారత వినీలాకాశంలో ఎప్పటికీ ధ్రువతారే.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

నదులు, ప్రాజెక్టుల వంటి భౌగోళిక స్వరూపాల గురించి అధ్యయనం చేసేటప్పుడు అట్లాస్‌ దగ్గర పెట్టుకొని చదవాలి. మ్యాప్‌లో సంబంధిత నదుల ప్రవాహ మార్గాలను, ప్రాంతాలను ఒకటికి రెండుసార్లు చూడటం వల్ల బాగా గుర్తుండే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని