శక్తిమంతమైన చూపు!

అంతరిక్షంలో అనంత దూరాల్లో విస్తరించిన నక్షత్రాలను చూడటం, చేతివాచీలోని అతిచిన్న భాగాలను పరిశీలించి రిపేరు చేయడం, అత్యంత సూక్ష్మజీవులపై పరిశోధనలు జరపడం... ఇవన్నీ మనిషి సాధారణ కంటిచూపుతో సాధ్యమయ్యే పనులు కావు. అందుకే

Published : 02 Jul 2022 00:31 IST

జనరల్‌ స్టడీస్‌ - ఫిజిక్స్‌

అంతరిక్షంలో అనంత దూరాల్లో విస్తరించిన నక్షత్రాలను చూడటం, చేతివాచీలోని అతిచిన్న భాగాలను పరిశీలించి రిపేరు చేయడం, అత్యంత సూక్ష్మజీవులపై పరిశోధనలు జరపడం... ఇవన్నీ మనిషి సాధారణ కంటిచూపుతో సాధ్యమయ్యే పనులు కావు. అందుకే వాటి కోసం శక్తిమంతమైన చూపును అందించే కొన్ని ప్రత్యేక కటకాలను, సాధనాలను వినియోగిస్తారు. పోటీ పరీక్షల కోసం వివిధ రకాల కటకాలు, దృక్‌ సాధనాలు, వాటి వెనుక ఉన్న భౌతికశాస్త్ర సూత్రాలపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి.

కాంతి - కటకాలు, దృక్‌ సాధనాలు

మన నిత్య జీవితంలో వస్తువుల ఫొటోలను తీయడానికి కెమెరాలను, దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి దూరదర్శిని, సూక్ష్మ వస్తువులను చూడటానికి సూక్ష్మదర్శిని లాంటి దృక్‌ సాధనాలను ఉపయోగిస్తాం. ఇలాంటి సాధనాల్లో కటకాలు కీలక పాత్ర పోషిస్తాయి.

కటకం: గాజుతో తయారుచేసిన పారదర్శక పదార్థాన్ని కటకం అంటారు. కటకాలు కాంతి వక్రీభవన ధర్మంపై ఆధారపడి పనిచేస్తాయి. కటకం మధ్య బిందువును దృక్‌ కేంద్రం అంటారు. కటకాలు ముఖ్యంగా రెండు రకాలు.

1) కుంభాకార కటకం

2) పుటాకార కటకం

కుంభాకార కటకం: ఈ కటకానికి ఉండే రెండు తలాలు కుంభాకారంగా ఉంటాయి. మధ్యభాగం మందంగా, చివరల్లో పలుచగా ఉంటుంది.

వివరణ: అనంత దూరం నుంచి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించిన పతన కాంతి కిరణాలు కటకం ద్వారా వక్రీభవనం చెందిన తర్వాత ప్రధానాక్షంపై కలుసుకునే లేదా కలుసుకున్నట్లు అనిపించే బిందువునే నాభి (F) అంటారు. దృక్‌ కేంద్రం (O), నాభి (F) కి మధ్యఉన్న దూరాన్ని నాభ్యంతరం (f) అంటారు.

కుంభాకార కటకంలో వస్తు స్థానాన్ని బట్టి నిజ, మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి. ఈ కటకాన్ని కేంద్రీకృత కటకం లేదా అభిసరణి (అభిసారి) కటకం అంటారు.

అనువర్తనాలు: * దీన్ని కెమెరాలు, సూక్ష్మదర్శిని, దూరదర్శిని లాంటి పరికరాల్లో ఉపయోగిస్తారు. * వైద్య రంగంలో దీర్ఘదృష్టిని దీంతో సవరిస్తారు. * సినిమా ప్రొజెక్టర్‌ల ముందు వాడతారు. * వాచ్‌ రిపేర్‌ కేంద్రాల్లో వినియోగిస్తారు. * మానవుడి కంటిలోని కటకం కుంభాకార కటకం మాదిరి పనిచేస్తుంది.

పుటాకార కటకం: ఈ రకమైన కటకంలో రెండు తలాలు పుటాకారంగా ఉంటాయి. ఈ కటకం మధ్యభాగంలో పలుచగా, చివరల మధ్య మందంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది.

అనువర్తనాలు: * వైద్యరంగంలో హ్రస్వదృష్టి లోపాలను సవరించడానికి * ఫ్లాష్‌ లైట్లలో వీటిని ఉపయోగిస్తారు.

దృక్‌ సాధనాలు: కాంతి ధర్మాలపై పనిచేస్తూ వస్తువులను చూడటానికి లేదా వాటి చిత్రాలను తీయడానికి ఉపయోగించే పరికరాలను దృక్‌ సాధనాలు అంటారు.

ఉదా: * సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్‌), దూరదర్శిని (టెలిస్కోప్‌), కెమెరాలు. * మానవుడి కన్ను సహజ దృక్‌ సాధనం (కెమెరా).

సూక్ష్మదర్శిని

సూక్ష్మ వస్తువులను చూడటానికి ఉపయోగించే పరికరాన్ని సూక్ష్మదర్శిని అంటారు. వక్రీభవన సూక్ష్మదర్శినులను ముఖ్యంగా రెండు రకాలుగా విభజించారు.

సరళ సూక్ష్మదర్శిని: దీనిలో అల్ప నాభ్యంతరం ఉన్న ఒకే ఒక కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. దీన్ని లోహపు చట్రంలో బిగిస్తారు. ఒక హ్యాండిల్‌ సహాయంతో ఆ కటకాన్ని వస్తువు నుంచి కావాల్సినంత దూరంలో ఉంచవచ్చు. ఈ రకమైన సూక్ష్మదర్శినిని  భూతద్దం లేదా మాగ్నిఫైయింగ్‌ గ్లాస్‌ అంటారు. ఇది పెద్దదైన, మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ఉపయోగాలు: * జ్యోతిష్కులు హస్తరేఖలను చూడటానికి ఉపయోగిస్తారు.* ఎలక్ట్రానిక్‌ వస్తువుల మరమ్మతు కేంద్రాలు, ప్రయోగశాలల్లో వాడతారు. * పురావస్తుశాఖలో తాళపత్ర గ్రంథాలను చదవడానికి, శిలలపై చెక్కిన ఆకారాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

సంయుక్త సూక్ష్మదర్శిని: ఈ సూక్ష్మదర్శినిలో రెండు కుంభాకార కటకాలను ఉపయోగిస్తారు. ఫలితంగా వస్తువు ప్రతిబింబం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఈ రకమైన సూక్ష్మదర్శిని చాలా పెద్దదైన, తలకిందుల మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది.

ఉపయోగాలు: * దీన్ని రక్తాన్ని విశ్లేషించడానికి పాథలాజికల్‌ ప్రయోగశాలలో ఉపయోగిస్తారు. * ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో మానవ కణాలు, వివిధ రకాల పేపర్‌లు, శాంపిల్‌లను విశ్లేషించడానికి వినియోగిస్తారు. * విశ్వవిద్యాలయాలు, కళాశాలల ప్రయోగశాలలో విద్యార్థులు బ్యాక్టీరియాలు, మొక్కలు, జంతువుల కణజాలాలను అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు.

దూరదర్శిని

అనంతమైన దూరంలో ఉండే వస్తువులను స్పష్టంగా చూడటానికి ఉపయోగించే దృక్‌ సాధనాన్నే దూరదర్శిని అంటారు. వక్రీభవన దూరదర్శినులను రెండు రకాలుగా విభజించారు.

ఖగోళ దూరదర్శిని: ఈ రకమైన దూరదర్శిని చిన్నదైన, తలకిందుల మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని ఖగోళ శాస్త్రంలో నక్షత్రాలు, ఇతర గ్రహాలు, ఉల్కలు లాంటి వస్తువులను చూడటానికి ఉపయోగిస్తారు.

భూగోళ దూరదర్శిని: ఈ రకమైన దూరదర్శిని చిన్నదైన, నిటారు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని భూమి మీద దూరంగా ఉండే వస్తువులను చూడటానికి ఉపయోగిస్తారు. రెండు టెలిస్కోప్‌లను ఉపయోగించి బైనాక్యులర్‌ను తయారుచేస్తారు. ఈ బైనాక్యులర్‌ను ఉపయోగించి భూమిపై దూరంగా ఉండే వస్తువులను, ఒక్కోసారి గ్రహణాలు, గ్రహాలను కూడా చూస్తుంటారు.

https://tinyurl.com/3fvxx6hz


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని