Published : 04 Jul 2022 03:34 IST

పాలకులు భూస్వాములుగా.. రైతులు కూలీలుగా!

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర

నిజాంల పాలనలో భాగస్వాములైన దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు, పైగాలు, పటేల్‌, పట్వారీ తదితరుల అధీనంలోకి లక్షల ఎకరాల భూములు వెళ్లిపోయాయి. పన్నులు కట్టలేక, అధిక వడ్డీలు భరించలేక రైతులు అనేకమంది కౌలుదార్లుగా, కూలీలుగా మారిపోయారు. ఒక దేశ్‌ముఖ్‌ ఇకపై భూములను పట్టా చేసుకోకూడదని నిజాం స్వయంగా ఫర్మానా విధించాల్సి వచ్చిదంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అదే కాలంలో హైదరాబాద్‌ రాజ్యం అవసరాల మేరకు జలాశయాల నిర్మాణాలు, ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాట్లు జరిగాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలు వెలిశాయి. అయినప్పటికీ ఆశించినంత ఆర్థిక ప్రగతి సామాన్య ప్రజల జీవితాల్లో కనిపించలేదు.


అసఫ్‌జాహీల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు

భారతదేశం మధ్యలో, వింధ్య పర్వతాలకు దక్షిణాన, సముద్ర మట్టానికి 1250 అడుగుల ఎత్తులో దక్కన్‌ పీఠభూమిలో హైదరాబాదు సంస్థానం ఉండేది. దేశంలోని సంస్థానాలన్నింటిలో హైదరాబాదే పెద్దది. 82,698 చదరపు మైళ్ల విస్తీర్ణంతో పంచకోణ ఆకృతిలో ఉండేది. అది ఈనాటి గ్రేట్‌ బ్రిటన్‌ వైశాల్యంతో దాదాపు సమానం. సంస్థానం మొత్తం వైశాల్యంలో 50 శాతం తెలుగు మాట్లాడే తెలంగాణ, 28 శాతం మరాఠీ, 11 శాతం కన్నడ మాట్లాడే ప్రాంతాలుండేవి. మతపరంగా చూస్తే హిందువులు 88 శాతం, మిగిలిన వారు ముస్లింలు, క్రైస్తవులు. మొత్తం సంస్థానంలోని ప్రజల్లో అక్షరాస్యులు కేవలం 4.8%.హైదరాబాదు సంస్థానంలోని భూమి వివిధ యాజమాన్యాల కింద ఉండేది. రాజ్యంలో వ్యవసాయానికి అనుకూలమైన మొత్తం భూమి 5 కోట్ల 30 లక్షల ఎకరాలు. ఇందులో 3 కోట్ల ఎకరాలు ప్రభుత్వ భూమి శిస్తు వ్యవస్థ కింద ఉండేది. దీన్నే దివానీ లేదా ఖల్సా ప్రాంతం అనేవారు. దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలు జాగీర్దారీ విధానం కింద ఉండేది.

సర్పేఖాస్‌: దాదాపు 10 శాతం భూమి నిజాం సొంత కమతంగా ఉండేది. ఈ భూమినే సర్పేఖాస్‌గా వ్యవహరించేవారు. ఇది 18 తాలూకాల్లో 8,100 చదరపు మైళ్లు విస్తరించి ఉండేది. హైదరాబాదు రాజ్యంలో తెలంగాణ ప్రాంత వైశాల్యం 49,502 చదరపు మైళ్లు. గ్రామాల సంఖ్య 10,095.

జాగీరు ప్రాంతాలు: ఇవి మొత్తం సంస్థానంలో 1/30వ వంతు ఉండేవి. ఈ ప్రాంతాల్లో పైగాలు, సంస్థానాలు, జాగీర్దార్లు, ఇజారాదార్లు, మక్తేదార్లు, ఈనాందార్లు, అగ్రహారీకులు అనే పేర్లతో వివిధ రకాల భూస్వామ్య వర్గాలు ఉండేవి. వీరిలో కొందరికి పన్నులు విధించి వసూలు చేయడానికి సొంత రెవెన్యూ అధికారులు ఉండేవారు. ఇవి సంస్థానానికి సామంత రాజ్యాలుగా వ్యవహరించేవి.

పైగాలు: నిజాం రాజ బంధువులకు పైగాలు అనే భూములను ఇచ్చేవారు. వీరు ఈ భూములను అనుభవిస్తూ సొంత సైన్యాలను పోషించేవారు. ఈ సైన్యాన్ని యుద్ధ సమయాల్లో నిజాం రాజుకు సరఫరా చేసేవారు. రాజ్యంలో జాగీర్లు, సంస్థానాలు, మక్తాలు, బంజర్లు, అగ్రహారాలు, ఈనాములను వివిధ సేవలకు గుర్తింపుగా ఇచ్చేవారు.

దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు: వీరు గతంలో ప్రభుత్వానికి పన్నులు వసూలుచేసి పెట్టేవారు. సాలార్‌జంగ్‌ దివాన్‌ (ప్రధాని) అయిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా రైతుల నుంచి పన్నులు వసూలు చేసేది. దీంతో ప్రభుత్వం గతంలో వీరు చేసిన సేవకు వతన్‌ లేదా మాష్‌ (ఉద్యోగ విరమణాంతర భృతి) ఇచ్చింది. దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలు పన్నులు వసూలు చేసే కాలంలో వేలాది ఎకరాల అతిసారవంతమైన భూములను ఆక్రమించి రైతులను కౌలుదార్లు, కూలీల స్థాయికి నెట్టేశారు. భూస్వాములు రైతులకు అధిక వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. వాటిని తీర్చలేని రైతుల భూములను ఆక్రమించేవారు.

పటేల్‌, పట్వారీ, మాలీ పటేల్‌: తెలంగాణలో వంశపారంపర్య హక్కులతో పటేల్‌, పట్వారీ, మాలీ పటేల్‌ లాంటి గ్రామాధికారులు ఉండేవారు. ప్రతి ఒక్కరు అయిదు నుంచి పది గ్రామాలు వతన్‌గా పొందేవారు. ఈ వతన్‌ గ్రామాలపై భూస్వాములు తమ అధికారాన్ని గుమాస్తాలు, ఏజెంట్ల (సేరిదార్ల) ద్వారా చెలాయించేవారు. వీరికి ప్రభుత్వ అధికారులకు ఉండే అన్ని అధికారాలు ఉండేవి. వీరు రైతుల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. భూస్వామికి తెలియకుండా గ్రామస్థుల మధ్య వివాదాలు కూడా పరిష్కరించేవారు కాదు.

అధీనంలో లక్షల ఎకరాలు

జన్నారెడ్డి ప్రతాపరెడ్డి: ఈయన ఎర్రపాడు దేశ్‌ముఖ్‌. ప్రతాపరెడ్డికి 20 గ్రామాల్లో లక్షా యాభై వేల ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట తాలూకాలోని ఎర్రపాడు గ్రామం నుంచి వరంగల్‌ జిల్లా కుమ్మరికుంట్ల వరకు అనేక గ్రామాలు ఈయన ఆధీనంలో ఉండేవి. ఈయన ఇకపై భూములను పట్టా చేసుకోకూడదని నిజాం అప్పట్లో ఫర్మానా జారీ చేశాడు.

* కల్లూరు దేశ్‌ముఖ్‌కు (మధిర తాలూకా, ఖమ్మం జిల్లా) లక్ష ఎకరాల భూమి ఉండేది. విసునూర్‌ దేశ్‌ముఖ్‌కు (జనగామ తాలూకా, నల్గొండ జిల్లా) 60 గ్రామాల్లో నలభై వేల ఎకరాల భూమి ఉండేది. సూర్యాపేట దేశ్‌ముఖ్‌కు   ఇరవై వేల ఎకరాల భూమి ఉండేది.

గడీలు: గడీ అనే పదం మరాఠీ పదమైన ‘ఘడ్‌’ నుంచి ఉద్భవించింది. గడీ అంటే కోట అని అర్థం. ఈ గడీలు నిజాం రాజ్యంలో పన్ను వసూలుచేసే, శాంతి భద్రతలను రక్షించే, పరిపాలనా కేంద్రాలుగా ఉండేవి. ఇవి పెద్ద రాళ్లతో నిర్మితమై కోటల మాదిరి ఉండేవి. వీటిలో నివసిస్తూ దొరలు నిజాం ప్రభువుకు ఏజెంట్లుగా ఉండేవారు. నిజాం మద్దతుతో పరిపాలన సాగిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు. హైదరాబాద్‌ రాజ్యంలో మొత్తం 200 నుంచి 250 వరకు గడీలు ఉండేవి.


నీటిపారుదల సౌకర్యాలు

తెలంగాణలో వేసవిలో నదులు ఎండిపోయేవి. దీంతో జలాశయాలు నిర్మించడం తప్పనిసరైంది. హైదరాబాదులో మీర్‌ఆలం ట్యాంక్‌ను 1810లో నాటి ప్రధానమంత్రి నిర్మించారు. ఘన్‌పూర్‌ ఆనకట్టను 1905లో మొదక్‌ జిల్లా ఘనపూర్‌ దగ్గర మంజీరా నదిపై కట్టారు. ఇది 21,625 ఎకరాలకు సాగు నీరు అందించేది. అసఫనహర్‌ ప్రాజెక్టును 1905లో నల్గొండ జిల్లాలోని నెమలికాల్వ గ్రామంలో మూసీ నదిపై నిర్మించారు. ఇది 15,245 ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కల్పించేది. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ తాలూకాలో బెలాల్‌ ప్రాజెక్టు, ఆలేరు ఉపనదిపై పోచారం రిజర్వాయర్‌ (1922) నిర్మించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టును 1931లో నిజామాబాద్‌ జిల్లా అచ్చంపేట గ్రామ సమీపంలో మంజీరా నదిపై కట్టారు. దీన్ని నవాజ్‌ జంగ్‌ అనే ఇంజినీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహాయంతో డిజైన్‌ చేశారు. ఇది 2,75,000 ఎకరాలకు సాగు నీరు అందించేది. అప్పట్లో చెరకు పంటకు నీరు అందించడంతో నిజాం చక్కెర పరిశ్రమను ఇక్కడ నెలకొల్పారు.

రాయంపల్లి రిజర్వాయర్‌ను 1924లో మెదక్‌ జిల్లా రాయంపల్లిలో నిర్మించారు. డిండి ప్రాజెక్టును నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకాలో కృష్ణానది ఉపనది డిండిపై 1943లో నిర్మించారు. మానేరు రిజర్వాయర్‌ను  సిరిసిల్ల తాలూకాలో 1945 - 1949 మధ్య కాలంలో కట్టారు.

నందికొండ - నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును  కృష్ణానదిపై నందికొండ గ్రామం (నల్గొండ జిల్లా) వద్ద నిర్మించాలని ఏడో నిజాం తన ప్రముఖ ఇంజినీర్‌ జాఫర్‌ అలీతో ప్రయత్నాలు సాగించాడు. దీంతో తెలంగాణకు అధిక నీరు వచ్చేలా కృషి జరిగింది.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

సమాజ నిర్మాణం, సామాజిక మినహాయింపు వంటి అంశాలను  ప్రిపేర్‌ అయ్యేటప్పుడు అర్థంకాని క్లిష్టమైన భాగాలను, పదజాలాన్ని మళ్లీ మళ్లీ చదవాలి. అదే విషయంపై అందుబాటులో ఉన్న ఇతర ప్రామాణిక పుస్తకాలనూ అధ్యయనం చేయాలి. కష్టంగా ఉన్నాయని వదిలేస్తే సబ్జెక్టుపై స్పష్టత ఎప్పటికీ రాకుండా పోతుంది.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts