TS Exams 2022: సమగ్ర శాసనాలకు సమర్థ సాధనాలు!

సంవత్సరంలో పరిమిత కాలం సమావేశమయ్యే పార్లమెంటుకు అన్ని అంశాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, పరిశీలించేందుకు సమయం సరిపోదు. అందుకే రకరకాల కమిటీలు లేదా సంఘాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పర్యవేక్షిస్తుంది. వాటి ద్వారా

Updated : 07 Jul 2022 06:38 IST

భారత రాజ్యాంగం రాజకీయాలు

సంవత్సరంలో పరిమిత కాలం సమావేశమయ్యే పార్లమెంటుకు అన్ని అంశాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి, పరిశీలించేందుకు సమయం సరిపోదు. అందుకే రకరకాల కమిటీలు లేదా సంఘాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పర్యవేక్షిస్తుంది. వాటి ద్వారా ప్రభుత్వాల జవాబుదారీతనాన్ని సమీక్షిస్తుంది.  సభ్యుల హక్కులను పరిరక్షించడంతోపాటు పరిధి దాటిన వారిని నియంత్రిస్తుంది. శాసన ప్రక్రియను బలోపేతం చేస్తుంది. సమర్థ పాలనకు సాయపడే శాసనాలను  రూపొందిస్తుంది.

పార్లమెంటరీ కమిటీలు/సంఘాలు

దేశానికి అవసరమైన శాసనాల రూపకల్పన ప్రక్రియలో పార్లమెంటు తరఫున నిపుణులైన కొంతమంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ కమిటీలకు విశేష ప్రాధాన్యం ఉంది.

లక్షణాలు:

ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు.

కమిటీ తన నివేదికను సభాధ్యక్షుడికి సమర్పిస్తుంది.

లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌; రాజ్యసభ ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్‌లు ఏ కమిటీలో సభ్యులుగా ఉంటారో వారే ఆ కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం.

కమిటీ సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన కనీస సభ్యుల హాజరు (కోరం) 1/3వ వంతు.

సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్‌లను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు.నీ సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లోని సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల నుంచి 2 : 1 పద్ధతిలో ఉంటుంది.

వర్గీకరణ: భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను పేర్కొనలేదు. కానీ ఆర్టికల్స్‌ 88, 105ల్లో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది. వాటిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

1) స్థాయీ కమిటీలు: ఇవి నిరంతరం కొనసాగే కమిటీలు. వీటిలో సభ్యులు మారుతుంటారు.

2) తాత్కాలిక కమిటీలు: ఇవి అవసరాన్ని బట్టి వివిధ సందర్భాల్లో ఏర్పాటవుతాయి. ఆయా సభల తీర్మానాల ద్వారా వీటిని సభాధ్యక్షులు ఏర్పాటుచేస్తారు. ఇవి తమ నివేదికలను సమర్పించిన తర్వాత రద్దవుతాయి.

ఆర్థిక కమిటీలు

ఆర్థిక పరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటులో మూడు కమిటీలు ఉంటాయి.

ప్రభుత్వ ఖాతాల సంఘం: ఇది పార్లమెంటరీ కమిటీల్లో అతి ప్రాచీన కమిటీ. దీన్ని మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919 సిఫార్సుల మేరకు 1921లో ఏర్పాటుచేశారు. ఇందులో మొత్తం సభ్యులు 22 మంది. వీరిలో లోక్‌సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి ఏడుగురు నియమితులవుతారు. కమిటీ ఛైర్మన్‌ను స్పీకర్‌ నియమిస్తారు. నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తారు. 1967 నుంచి ఈ కమిటీకి ఛైర్మన్‌గా ప్రతిపక్షాలకు చెందిన సభ్యుడిని నియమించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

విధులు: పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం జరుగుతోందా లేదా అని పరిశీలించడం. ప్రభుత్వ ఖాతాలపై పార్లమెంటుకు రాష్ట్రపతి సమర్పించే కాగ్‌ నివేదికను పరిశీలించడం.

అంచనాల సంఘం: జాన్‌మతాయ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఈ సంఘాన్ని 1950లో ఏర్పాటుచేశారు. 1921లో ఏర్పడిన స్టాండింగ్‌ ఫైనాన్షియల్‌ కమిటీ తరహాలో ఇది ఏర్పాటైంది. 1956 వరకు ఈ కమిటీలో 25 మంది సభ్యులు ఉండేవారు. ప్రస్తుతం దీనిలోని సభ్యుల సంఖ్య 30. వీరంతా లోక్‌సభ సభ్యులే. రాజ్యసభ సభ్యులకు ప్రాతినిధ్యం లేదు. ఛైర్మన్‌ను స్పీకర్‌ నియమిస్తారు.

విధులు: ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను సూచిస్తుంది. వివిధ పద్దులకు అంచనాలను పార్లమెంటులో ఏ రూపంలో సమర్పించాలో తెలియజేస్తుంది. ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘాలను ‘పార్లమెంటు కవలలు’గా అభి వర్ణిస్తారు.

ప్రభుత్వ రంగ సంస్థల సంఘం: 1964లో ప్రభుత్వరంగ సంస్థల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 1974 వరకు 15 మంది (లోక్‌సభ 10, రాజ్యసభ 5) సభ్యులు ఉండేవారు. తర్వాత కాలంలో ఆ సంఖ్యను 22 మందిగా నిర్దేశించారు. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు. ఛైర్మన్‌ను లోక్‌సభ స్పీకర్‌ నియమిస్తారు.

విధులు: ప్రభుత్వరంగ సంస్థల సామర్థ్యం, స్వయంప్రతిపత్తిని పెంపొందించడంలో భాగంగా అనుసరించాల్సిన సూచనలు ఇవ్వడం. ప్రభుత్వరంగ సంస్థల నివేదికలు, ఖాతాలను పరిశీలించడం.


సాధారణ కమిటీలు

సభా వ్యవహారాల కమిటీ: సభా కార్యకలాపాలు, సమయ పట్టికను క్రమబద్ధం చేయడానికి లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా సభా వ్యవహారాల కమిటీలు ఉంటాయి. ఈ కమిటీలకు సభాధ్యక్షులే అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. లోక్‌సభ వ్యవహారాల కమిటీలో స్పీకర్‌ సహా 15 మంది సభ్యులు ఉంటారు. రాజ్యసభ వ్యవహారాల కమిటీలో ఛైర్మన్‌ సహా 11 మంది సభ్యులు ఉంటారు. సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను ఎంపిక చేస్తారు. సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు అందిస్తూ, దానికి సరైన చర్యలు చేపట్టడమే ఈ కమిటీల విధి.

ప్రభుత్వ హామీల కమిటీ: 1953లో లోక్‌సభ, రాజ్యసభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీలను ఏర్పాటుచేశారు. లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. ప్రశ్నోత్తరాల సమయంలో వివిధ రకాల బిల్లులు, తీర్మానాల మీద చర్చ జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఈ హామీలు ఎంతవరకు అమలు జరుగుతున్నాయో ఈ కమిటీలు నిరంతరం పరిశీలిస్తాయి.

మహిళా సాధికారత కమిటీ: ఇది ఉభయ సభల సంయుక్త కమిటీ. 1997లో ఏర్పాటు చేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 30 (లోక్‌సభ 20, రాజ్యసభ 10). మహిళలకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలుతీరును పర్యవేక్షించి నివేదిక రూపొందిస్తుంది. మహిళల సమగ్ర ప్రగతి కోసం జాతీయ మహిళా కమిషన్‌ సమర్పించిన నివేదికను పరిశీలించి అవసరమైన సూచనలు, సిఫార్సులు చేస్తుంది.

షెడ్యూల్డు కులాలు, తెగల సంక్షేమ కమిటీ: ఈ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 30 (లోక్‌సభ 20, రాజ్యసభ 10). ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తుంది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లు సమర్పించిన నివేదికలను పరిశీలిస్తుంది. పౌరహక్కుల పరిరక్షణ చట్టం - 1976; షెడ్యూల్డు కులాలు, తెగల ప్రజలపై అకృత్యాల నిరోధక చట్టం - 1989కి సంబంధించిన అంశాల అమలును పరిశీలిస్తుంది.

నైతిక విలువల కమిటీ: ఈ కమిటీని రాజ్యసభలో 1997లో ఏర్పాటు చేశారు. సభ్యుల సంఖ్య 10. లోక్‌సభలో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ పార్లమెంటు సభ్యులు అనుసరించాల్సిన ప్రవర్తనా నియమావళిని, అమలుతీరును పరిశీలిస్తుంది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన సభ్యులపై చేపట్టాల్సిన చర్యలను సూచిస్తుంది.

గ్రంథాలయ కమిటీ: పార్లమెంటు సభ్యులకు గ్రంథాలయ సేవలు అందించడానికి ఈ కమిటీని ఏర్పాటుచేశారు. మొత్తం సభ్యుల సంఖ్య 9 మంది (లోక్‌సభ 6, రాజ్యసభ 3).

దత్త శాసనాల కమిటీ: ఈ కమిటీని నియోజిత శాసనాల కమిటీ అంటారు. 1953లో లోక్‌సభలో, 1964లో రాజ్యసభలో ఏర్పాటు చేశారు. రెండు సభల్లోని ఒక్కో కమిటీలో 15 మంది చొప్పున సభ్యులు ఉంటారు. పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలు, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్ధతను ఇవి పరిశీలిస్తాయి.

సభాహక్కుల కమిటీ: లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరు సభాహక్కుల కమిటీలు ఉంటాయి. లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. పార్లమెంటు సభ్యుల హక్కులను పరిరక్షిస్తూ, సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై శిక్షలకు ఈ కమిటీలు సిఫార్సు చేస్తాయి. ఇవి అర్ధ న్యాయ సంబంధమైన ్బ్స్య్చ(i ్య్ౖటi‘i్చః్శ అధికారాలను కలిగి ఉంటాయి.

ప్రైవేట్‌ సభ్యుల బిల్లులపై కమిటీ: ఇది లోక్‌సభకు మాత్రమే ఉద్దేశించిన కమిటీ. ఇందులో సభ్యుల సంఖ్య 15. డిప్యూటీ స్పీకర్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ప్రైవేట్‌ బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించి తగిన సిఫార్సులు చేయడం దీని విధి.

లాభదాయక పదవుల కమిటీ: ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 15 (లోక్‌సభ 10, రాజ్యసభ 5). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ సందర్భాల్లో ఏర్పాటుచేసే విచారణ సంఘాల్లో పార్లమెంటు సభ్యులను నియమిస్తే ఆ సంఘాల స్వభావాన్ని పరిశీలించి అవి లాభదాయక సంస్థలా, కాదా అని తేలుస్తుంది. లాభదాయక సంస్థలైతే వాటిలో ఉన్న పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించమని సిఫార్సు చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 102 ప్రకారం ఆదాయాన్ని ఇచ్చే లాభదాయక పదవిని చేపట్టిన పార్లమెంటు సభ్యులు సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు.


ప్రముఖుల వ్యాఖ్యానాలు

ఆధునిక కాలంలో పార్లమెంటరీ కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయి.

- ఉడ్రోవిల్సన్‌


వివిధ శాసనాల సామర్థ్యం, విలువలు పార్లమెంటరీ కమిటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి.

- మారిస్‌ జోన్స్‌


ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్లు, చెవులు, చేతులుగా, కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి.

- థామస్‌ రీడ్‌

https://tinyurl.com/4rryfb5n


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని