ప్రతిష్ఠాత్మక సభలో ప్రజల నేతలు

పార్లమెంటులో అత్యున్నతమైనది, అత్యంత శక్తిమంతమైనది లోక్‌సభ. ప్రజలు నేరుగా ఎన్నుకున్న నాయకులు ప్రాతినిధ్యం వహించే ప్రతిష్ఠాత్మక వేదిక. శాసన నిర్మాణంలో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రజావాణిని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రజల సభ ఎలా ఉంటుంది? ఇందులోని సభ్యులు, రిజర్వేషన్లు, సభాధ్యక్షుల వివరాలను పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు తెలుసుకోవాలి.

Updated : 14 Jul 2022 06:50 IST

భారత రాజ్యాంగం, రాజకీయాలు

పార్లమెంటులో అత్యున్నతమైనది, అత్యంత శక్తిమంతమైనది లోక్‌సభ. ప్రజలు నేరుగా ఎన్నుకున్న నాయకులు ప్రాతినిధ్యం వహించే ప్రతిష్ఠాత్మక వేదిక. శాసన నిర్మాణంలో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుంది. ప్రజావాణిని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రజల సభ ఎలా ఉంటుంది? ఇందులోని సభ్యులు, రిజర్వేషన్లు, సభాధ్యక్షుల వివరాలను పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు తెలుసుకోవాలి.

లోక్‌సభ - నిర్మాణం

పార్లమెంటరీ విధానాన్ని అనుసరించే మన దేశంలో పార్లమెంటులో భాగమైన లోక్‌సభలో మెజార్టీ సాధించినవారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సభ సభ్యులను ఓటర్లు నేరుగా, నియోజకవర్గాల ప్రాతిపదికన సార్వజనీన వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. లోక్‌సభను దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ, మొదటి సభ, అనిశ్చిత సభగా పేర్కొంటారు. దిగువ సభకు ‘లోక్‌సభ’ అని నామకరణం చేసినవారు జి.వి.మౌలాంకర్‌. అందుకే ఈయనను ‘లోక్‌సభ పితామహుడు’గా పేర్కొంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 లోక్‌సభ నిర్మాణం, ఎన్నిక లాంటి అంశాలను తెలియజేస్తుంది. ఓటు హక్కు ప్రాతిపదికన లోక్‌సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 82 ప్రకారం ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ అనంతరం లోక్‌సభ స్థానాలను పునర్‌ వ్యవస్థీకరిస్తారు. మన దేశంలో ప్రాదేశిక నియోజకవర్గాల హద్దులను నిర్ణయించడానికి నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ (Delimitation Commission) ను ఏర్పాటుచేస్తారు. ఈ కమిషన్‌ తీసుకునే నిర్ణయాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు.

1952లో మొదటి డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు నిర్ణయించిన లోక్‌సభ సభ్యుల సంఖ్య 489.  రెండో డీలిమిటేషన్‌ కమిషన్‌ (1962) సిఫార్సుల మేరకు నిర్ణయించిన లోక్‌సభ సభ్యుల సంఖ్య 525. మూడో డీలిమిటేషన్‌ కమిషన్‌ (1972) సిఫార్సుల మేరకు 31వ రాజ్యాంగ సవరణ చట్టం, 1973 ద్వారా నిర్ణయించిన లోక్‌సభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 552.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81(1)్బత్శి ప్రకారం రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్యను 530గా, ఆర్టికల్‌ 81(1)్బత్శీ ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 20గా పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 331 ప్రకారం లోక్‌సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేయవచ్చు.

మార్పులు

జమ్మూ కశ్మీర్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2019 ప్రకారం జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాన్ని జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు.

ప్రస్తుతం మన దేశంలోని 28 రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 524. ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 19.

104వ రాజ్యాంగ సవరణ చట్టం, 2019 ప్రకారం లోక్‌సభకు రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేసే విధానాన్ని రద్దు చేశారు. ఇది 2020, జనవరి 25 నుంచి అమల్లోకి రావడంతో ఆర్టికల్‌ 331 ప్రకారం లోక్‌సభకు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేసే విధానం రద్దయింది. ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్యను 543గా పేర్కొనవచ్చు.

ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది.

అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 ద్వారా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని నిర్దేశించింది.

ప్రస్తుతం లోక్‌సభ సభ్యుల సంఖ్యను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు

ఆర్టికల్‌ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, వారి జనాభా ఆధారంగా కొన్ని స్థానాలు రిజర్వ్‌ చేశారు. దీన్ని ప్రారంభంలో 10 సంవత్సరాల వరకే అంటే 1960 వరకు అని పేర్కొన్నారు. లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లను కొనసాగించేందుకు ఏడుసార్లు రాజ్యాంగాన్ని సవరించారు.
1) 8వ రాజ్యాంగ సవరణ చట్టం-1960 ద్వారా 1970 వరకు
2) 23వ రాజ్యాంగ సవరణ చట్టం-1969 ద్వారా 1980 వరకు
3) 45వ రాజ్యాంగ సవరణ చట్టం-1980 ద్వారా 1990 వరకు
4) 62వ రాజ్యాంగ సవరణ చట్టం-1989 ద్వారా 2000 వరకు
5) 79వ రాజ్యాంగ సవరణ చట్టం-1999 ద్వారా 2010 వరకు
6) 95వ రాజ్యాంగ సవరణ చట్టం-2009 ద్వారా 2020 వరకు
7) 104వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 ద్వారా 2030 వరకు

4వ డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సుల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్‌: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కుల్‌దీప్‌ సింగ్‌ నేతృత్వంలో 4వ డీలిమిటేషన్‌ కమిషన్‌ను 2002లో వాజ్‌పేయీ ప్రభుత్వం నియమించింది. షెడ్యూల్డు కులాలు, తెగల జనాభా పెరుగుదలకు అనుగుణంగా వారికి కేటాయించిన సీట్లలో మార్పులు చేర్పులు చేయాలని ఈ కమిషన్‌ పేర్కొంది. దీనికి అనుగుణంగా 2001 జనాభా లెక్కల ఆధారంగా వాజ్‌పేయీ ప్రభుత్వం 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా లోక్‌సభలో ఎస్సీ రిజర్వు స్థానాలను 79 నుంచి 84కు, ఎస్టీ రిజర్వ్‌ స్థానాలను 41 నుంచి 47కు పెంచింది. ఈ మార్పులు జరిగినప్పటికీ మొత్తం లోక్‌సభ స్థానాల్లో మార్పు లేదు.

తెలంగాణలో ఎస్సీలకు రిజర్వు అయిన లోక్‌సభ స్థానాలు 3. అవి వరంగల్‌, పెద్దపల్లి, నాగర్‌ కర్నూల్‌. ఎస్టీలకు రిజర్వు అయిన లోక్‌సభ స్థానాలు ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌ ః ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీలకు రిజర్వు అయిన లోక్‌సభ స్థానాలు 4. అవి చిత్తూరు, తిరుపతి, అమలాపురం, బాపట్ల. ఎస్టీ రిజర్వు లోక్‌సభ స్థానం అరకు.

స్పీకర్‌ వ్యవస్థ

ప్రొటెం స్పీకర్‌: లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం ఎన్నికైన లోక్‌సభ సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడానికి సభ్యుల్లోని సీనియర్‌ను ‘ప్రొటెం స్పీకర్‌’గా రాష్ట్రపతి నియమిస్తారు. లోక్‌సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు వారే సభకు అధ్యక్షత వహిస్తారు. రాజ్యాంగ నిర్మాతలు ప్రొటెం స్పీకర్‌ పదవిని ఫ్రాన్స్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు.

1952లో ఏర్పడిన మొదటి లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ జి.వి.మౌలాంకర్‌.

2014లో ఏర్పడిన 16వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ కమల్‌నాథ్‌.

2019లో ఏర్పడిన 17వ లోక్‌సభకు ప్రొటెం స్పీకర్‌ వీరేంద్రకుమార్‌.

లోక్‌సభకు ఎక్కువసార్లు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించినవారు బి.డి.దాస్‌ (4 సార్లు), ఇంద్రజిత్‌ గుప్తా (4 సార్లు).

ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే వ్యక్తి స్పీకర్‌ పదవికి పోటీ చేయాలంటే ప్రొటెం స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాలి.

స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌: మాంటేగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం సిఫార్సుల ఆధారంగా మన దేశంలో 1921లో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ పదవులు ఉనికిలోకి వచ్చాయి. ప్రారంభంలో ఈ పదవులను ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌గా పేర్కొనేవారు. బీ 1921లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి ప్రెసిడెంట్‌గా ఫ్రెడరిక్‌ వైట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా డాక్టర్‌ సచ్చిదానంద సిన్హా నియమితులయ్యారు. 1925లో దీనికి ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి భారతీయుడు విఠల్‌భాయ్‌ పటేల్‌. బీ భారత ప్రభుత్వ చట్టం, 1935 ప్రకారం సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్‌, వైస్‌ప్రెసిడెంట్‌ పదవుల పేర్లను స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌గా మార్పు చేశారు. మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పదవులను బ్రిటన్‌ నుంచి గ్రహించారు. బీ బ్రిటన్‌లో స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. మన దేశంలో అలా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ నీలం సంజీవరెడ్డి స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. వీరిద్దరికీ ప్రత్యేకంగా ప్రమాణస్వీకారం ఉండదు. స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.
స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్ల తొలగింపు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 94 లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించే విధానాన్ని తెలియజేస్తోంది. వీరు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు పదవులనూ కోల్పోతారు. లోక్‌సభ సభ్యులు ఒక సాధారణ తీర్మానం ద్వారా 14 రోజుల ముందస్తు నోటీసుతో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను తొలగించవచ్చు.

(రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీగా లోక్‌సభ సభ్యుల సంఖ్య కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.)


https://tinyurl.com/3cbd2cpe


ప్రిపరేషన్‌టెక్నిక్


ఒకే సబ్జెక్టు రోజంతా లేదా రోజుల తరబడి చదివితే విసుగుపుడుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది. రోజులో కనీసం మూడు సబ్జెక్టులు అధ్యయనం చేసే విధంగా ప్లాన్‌ చేసుకుంటే ఆసక్తి కొనసాగుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని