జీవక్రియలకు జవసత్వాలు!

తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? అందుకు   కారణం వైరస్‌లు లేదా జన్యుపరమైన నిర్మాణాలే అనుకుంటున్నారా? అది వాస్తవం కాదు. తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది.

Published : 16 Jul 2022 00:39 IST

జనరల్‌ సైన్స్‌ బయాలజీ

తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? అందుకు   కారణం వైరస్‌లు లేదా జన్యుపరమైన నిర్మాణాలే అనుకుంటున్నారా? అది వాస్తవం కాదు. తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రతి సూక్ష్మపోషకం కొన్ని ప్రత్యేకమైన విధులను నిర్వహిస్తుంది. అది లోపిస్తే అనేక రుగ్మతలు కలుగుతాయి. నిత్యజీవితంలో సైన్స్‌ అధ్యయనంలో భాగంగా జీవక్రియలకు జవసత్వాలను అందించే ఆ పోషకాల ప్రత్యేకతలు, అవి లభించే పదార్థాలు, తక్కువైతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి.


విటమిన్లు

విటమిన్లలో కొన్ని మన శరీరంలో అద్భుతమైన ప్రక్రియలను నిర్వహిస్తాయి. కణాల్లో జరిగే జీవక్రియలకు, కణాల మరమ్మతుకు, వ్యాధుల నిరోధానికి ఉపయోగపడతాయి.

వాటిలో విటమిన్‌ సి, డి, ఇ, కె మరీ ముఖ్యమైనవి. ఇంకా ఖనిజ లవణాలూ అవసరమైనవే.

విటమిన్‌-సి: దీని రసాయనిక నామం ఆస్కార్బిక్‌ ఆమ్లం. ఇది గాయాలను మాన్పుతుంది. చర్మంలో కొల్లాజెన్‌ ప్రొటీన్‌ తయారీకి సాయపడుతుంది. తీసుకున్న ఆహారంలోని ఇనుము శోషణకు తోడ్పడుతుంది. వ్యాధి నిరోధకతను కలిగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే శరీర కణాల్లో ఏర్పడే స్వేచ్ఛా అయాన్లు కలగజేసే నష్టం నుంచి రక్షణ కల్పిస్తుంది. విటమిన్‌-సి ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు జమకూడటం వల్ల కలిగే అథిరోస్ల్కేరోసిస్‌ తీవ్రత తగ్గుతుంది. దీని లోపం వల్ల స్కర్వీ వ్యాధి వస్తుంది.

ఈ విటమిన్‌-సి అత్యధికంగా రోజ్‌హిప్‌ ఫలంలో ఉంటుంది. ఇంకా ఉసిరి, నిమ్మజాతి ఫలాలైన నిమ్మ, దానిమ్మ, బత్తాయిల నుంచి లభిస్తుంది. జామలోనూ ఎక్కువే. ఆహార పదార్థాలను ఎక్కువగా వేడిచేస్తే వాటిలోని విటమిన్‌ సి తగ్గిపోతుంది. దీన్ని యాంటీహిస్టమైన్‌, యాంటీస్కర్వీ ఫ్యాక్టర్‌ అని కూడా పిలుస్తారు.

విటమిన్‌-డి: దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్‌. యాంటీరికెట్స్‌ ఫ్యాక్టర్‌ అని కూడా అంటారు. ఇది డి2, డి3 రూపాల్లో ఉంటుంది. డి1 రూపంలో ఉండదు. విటమిన్‌ డి2ను ఎర్గోకాల్సిఫెరాల్‌, విటమిన్‌ డి3ను కోల్‌కాల్సిఫెరాల్‌ అంటారు. విటమిన్‌-డి సాధారణ పెరుగుదలకు, చిన్నపేగుల నుంచి కాల్షియం, ఫాస్ఫరస్‌ శోషణకు అవసరమవుతుంది. దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో రికెట్స్‌, పెద్దవారిలో ఆస్టియోమలేసియా అనే వ్యాధులు వస్తాయి.

క్యాడ్‌ చేప కాలేయ నూనె, వెన్న, పాలు, కాలేయం నుంచి విటమిన్‌-డి లభిస్తుంది. శరీరంపై సూర్యకిరణాలు పడినప్పుడు చర్మంలోని 7-డీహైడ్రో కొలెస్ట్రాల్‌ విటమిన్‌-డిగా మారుతుంది. కాబట్టి ఈ విటమిన్‌ను సన్‌షైన్‌ విటమిన్‌ (సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్‌) అంటారు.

విటమిన్‌-ఇ: దీని రసాయననామం టోకోఫెరాల్‌. దీన్ని ఫెర్టిలిటీ విటమిన్‌ లేదా యాంటీస్టెరిలిటీ విటమిన్‌ అంటారు. ఇది బీజకోశాల పనితీరుకు అవసరం. ఈ విటమిన్‌ వెరికోస్‌వీన్స్‌, అథిరోస్ల్కేరోసిస్‌ వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్‌-ఇ లోపం వల్ల మగవారిలో వంధ్యత్వం, ఆడవారిలో గర్భస్రావం లాంటి సమస్యలు వస్తాయి. వ్యాయామం చేసేవారికి, క్రీడాకారులకు ఈ విటమిన్‌ చాలా అవసరం. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

ఈ విటమిన్‌ పత్తిగింజల నూనె, ఆకుకూరలు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, వేరుశనగల నుంచి లభిస్తుంది. గోధుమ బీజకవచ నూనెలో ఈ విటమిన్‌ ఎక్కువగా ఉంటుంది. చర్మంపై మచ్చలు, గీతలు, ముడతలను పోగొడుతుంది. కాబట్టి దీన్ని బ్యూటీ విటమిన్‌ లేదా సౌందర్య పోషక విటమిన్‌ అంటారు.

విటమిన్‌-కె: దీని రసాయన నామం ఫిల్లోక్వినోన్‌. రక్తం గడ్డకట్టేందుకు ఉపయోగపడే రసాయనమైన ప్రోత్రాంబిన్‌ తయారీకి ఇది అవసరం. దీని లోపం వల్ల రక్తం గడ్డ కట్టడం ఆలస్యమవుతుంది. పరోక్షంగా ఈ విటమిన్‌ రక్తం గడ్డకట్టడానికి సాయపడుతుంది. కాబట్టి దీన్ని యాంటీహెమరేజిక్‌ ఫ్యాక్టర్‌ లేదా కొయాగ్యులేషన్‌ విటమిన్‌ అంటారు. ఆకుకూరలు, కాలేయం, సోయా, పాలు, గుడ్ల నుంచి ఎక్కువగా లభిస్తుంది.


ఖనిజ లవణాలు

నిజ లవణాలు మనశరీరానికి కావాల్సిన సూక్ష్మపోషక పదార్థాలు. శరీరంలో ఇవి కణబాహ్య, కణాంతర్గత ద్రవాల్లో భాగంగా ఉంటాయి.

సోడియం: శరీరంలో నీరు, అయాన్ల సమతాస్థితికి, నాడీ ప్రచోదనాల ప్రసారానికి అవసరం. పైత్యరసం లవణాలు ఏర్పడటానికి సోడియం ఉపయోగపడుతుంది. ఇది రక్తంలోని ముఖ్యమైన కేటయాన్‌. దీని లోపం వల్ల హైపోనేట్రిమియా కలుగుతుంది. ఉప్పు, కూరగాయలు, పండ్ల నుంచి ఇది లభిస్తుంది.

పొటాషియం: ఈ లవణం కణద్రవ్యంలో ఉండే ముఖ్యమైన కేటయాన్‌. నాడీప్రచోదనాల ప్రసారానికి, ద్రవాభిసరణ క్రమ తకు అవసరం. ఇది మన శరీరంలో తగ్గితే నాడీసంబంధ సమస్యలు, కండర సంకోచం సరిగ్గా జరగకపోవడం, గుండె వేగం తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. పొటాషియం లోపం వల్ల హైపోకాలిమియా స్థితి కలుగుతుంది. ఇది అరటి పండ్లు, కూరగాయలు, ఎండు ఫలాల్లో లభిస్తుంది.  

క్లోరిన్‌: ప్లాస్మా, కణబాహ్యద్రవాల్లో ముఖ్య ఆనయాన్‌గా ఉంటుంది. ఇది శరీరంలో ద్రవాభిసరణ క్రమతకు, ఆమ్ల-క్షార సమతుల్యతకు, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం ఏర్పడటానికి అవసరం. లాలాజలం, చెమట, కన్నీళ్లలో కూడా క్లోరిన్‌ ఉంటుంది. ఉప్పు, కూరగాయలు, వెన్న నుంచి లభిస్తుంది.

కాల్షియం: దంతాలు, ఎముకలు ఏర్పడటానికి అవసరం. రక్తం గడ్డకట్టడానికి, నాడీ ప్రచోదనాల ప్రసారానికి, కండర సంకోచానికి ఉపయోగపడుతుంది. దీని లోపం వల్ల ఆస్టియోపోరోసిస్‌ వ్యాధి (ఎముకలు బలహీనంగా ఉండి తొందరగా విరుగుతాయి), ఎముకలు, దంతాలు సరిగ్గా ఏర్పడక పోవడం, పెరుగుదల లేకపోవడం లాంటివి జరుగుతాయి. పాలు, పాల పదార్థాలు, రాగులు, కూరగాయల్లో కాల్షియం ఉంటుంది.

ఫాస్ఫరస్‌: ఎముకలు, దంతాలు ఏర్పడటానికి ఇది అవసరం. కేంద్రకామ్లాలైన డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ, ఏటీపీ (అడినోసైన్‌ ట్రైఫాస్ఫేట్‌)ల్లో అంతర్భాగంగా ఉంటుంది. దీని లోపం వల్ల ఎముకలు, దంతాలు సరిగా ఏర్పడవు. పాలు, ధాన్యాలు, గుడ్లు, చేపల నుంచి లభిస్తుంది.

ఇనుము: ఇది ఎర్రరక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌లో భాగంగా ఉంటుంది. దీని లోపం వల్ల రక్తహీనత వస్తుంది. దీన్ని పోషకాహార రక్తహీనత అంటారు. ఇది కాలేయంలో నిల్వ ఉంటుంది. ఆకుకూరలు, ఎండు ఫలాలు, గుడ్లు, కాలేయం, యాపిల్స్‌లో దొరుకుతుంది.

అయోడిన్‌: ఈ ఖనిజ లవణం గొంతు భాగంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు చాలా అవసరం. థైరాయిడ్‌ గ్రంథి స్రవించే థైరాక్సిన్‌ హార్మోన్‌లో అంతర్భాగంగా ఉంటుంది. దీని లోపం వల్ల సరళ గాయిటర్‌ వ్యాధి కలుగుతుంది. ఈ వ్యాధిలో థైరాయిడ్‌ గ్రంథి ఉబ్బుతుంది. అయోడిన్‌ లోపం వల్ల గర్భిణుల్లో గర్భస్రావం, చిన్నపిల్లల్లో మానసిక వైకల్యం వస్తుంది. సముద్ర ఆహారం, ఆకుకూరలు, పండ్లు, అయోడైజ్‌డ్‌ ఉప్పు వంటి వాటి ద్వారా అయోడిన్‌ లభిస్తుంది.

జింక్‌: ఇది కార్బన్‌ డై ఆక్సైడ్‌ రవాణాకు, విటమిన్‌-ఎ జీవక్రియకు, కంటిచూపు కోసం, గాయాలు మానడానికి అవసరం. జింక్‌ వ్యాధి  నిరోధక శక్తిని పెంచుతుంది. డయేరియాను నియంత్రిస్తుంది. దీని లోపం వల్ల శ్వాసక్రియలో తగ్గుదల, శుక్ర కణాలు సరిగా ఏర్పడకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. బీట్‌రూట్‌, గుడ్డు, వెన్న, కూరగాయల్లో ఉంటుంది.

https://tinyurl.com/2hsa5fyf


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని