సత్వర ప్రగతి సాధనాలు!

తాగునీరు, సాగునీరు అందిస్తాయి. అధిక వరదలను అడ్డుకుంటాయి. కరవు నుంచి కాపాడటంతోపాటు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు భారీ నీటి ప్రాజెక్టుల వల్ల సమకూరుతున్నాయి.   అందుకే వాటిని ‘ఆధునిక దేవాలయాలు’ అని మన మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించారు.

Published : 17 Jul 2022 02:29 IST

ఇండియన్‌ జాగ్రఫీ

తాగునీరు, సాగునీరు అందిస్తాయి. అధిక వరదలను అడ్డుకుంటాయి. కరవు నుంచి కాపాడటంతోపాటు ఇంకా అనేక రకాల ప్రయోజనాలు భారీ నీటి ప్రాజెక్టుల వల్ల సమకూరుతున్నాయి.   అందుకే వాటిని ‘ఆధునిక దేవాలయాలు’ అని మన మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించారు. దేశ అభివృద్ధి పథాన్ని మలుపు తిప్పడంతోపాటు మరింత వేగం చేయడంలో ఈ ఆనకట్టలు ప్రధానపాత్ర పోషించాయి.  

బహుళార్థ సాధక ప్రాజెక్టులు
భారత్‌ వ్యవసాయ ప్రధాన దేశం. సాగుకు నీరు చాలా అవసరం. ఉప ఆయనమండల ప్రాంతం కాబట్టి నీటి ఆవశ్యకత ఎక్కువ. మన వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు వర్షాలు ఎక్కువగా కురిసి వరదలు రావడం, మరికొన్నిసార్లు అతి తక్కువ వర్షాలతో కరవులు సంభవించడం ఇక్కడ సర్వసాధారణం. వర్షపాతం కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. కానీ వ్యవసాయానికి మాత్రం నిరంతరం నీళ్లు కావాల్సిందే. దీంతో ప్రాజెక్టులు, కాలువల ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు. ఆయకట్టు ఆధారంగా 10 వేల హెక్టార్ల కంటే ఎక్కువ భూమికి నీరు అందించే వాటిని భారీ నీటిపారుదల ప్రాజెక్టులనీ, 2 వేల నుంచి 10 వేల హెక్టార్లకు నీరు అందించేవి మధ్య తరహా ప్రాజెక్టులనీ, 2 వేల కంటే తక్కువ హెక్టార్ల భూమికి నీరు అందించే వాటిని చిన్నతరహా ప్రాజెక్టులని అంటారు.

దేశాభివృద్ధిలో బహుళార్థ సాధక ప్రాజెక్టులు కీలకమైనవి. మిలియన్ల హెక్టార్ల భూమికి సాగునీటిని అందించడంతోపాటు, విద్యుత్తు ఉత్పత్తి కోసం వాటిని రూపొందించారు. ఒకటి కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చడం వీటి ప్రత్యేకత. జలరవాణా, విహారయాత్ర, మత్స్యసంపద అభివృద్ధి, భూసార సంరక్షణ, కృత్రిమ వనాల పెంపకం లాంటి ఉపయోగాలు కూడా వీటి వల్ల కలుగుతాయి.
భాక్రానంగల్‌ ప్రాజెక్టు: సట్లెజ్‌ నదిపై నిర్మించారు. భాక్రా, నంగల్‌ అనే రెండు డ్యామ్‌లను కలిపి భాక్రానంగల్‌ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు. భారత్‌లో అత్యధిక గ్రావిటీ ఉన్న ఆనకట్ట భాక్రా డ్యామ్‌. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. దీని ద్వారా హరియాణా రాష్ట్రం ఎక్కువగా లబ్ధి పొందుతోంది. 1955లో శంకుస్థాపన చేయగా 1962లో పూర్తయింది. భాక్రా డ్యామ్‌ను పంజాబ్‌లోని రూప్‌సాగర్‌ (రోపార్‌) దగ్గర భాక్రా గార్జులో నిర్మించారు. ఇక్కడ ఏర్పడిన కృత్రిమ రిజర్వాయర్‌ను గోవింద సాగర్‌ అంటారు. నంగల్‌ డ్యామ్‌ పంజాబ్‌లోని నంగల్‌ దగ్గర నిర్మించారు.

దామోదర్‌లోయ ప్రాజెక్టు: దీని నిర్మాణం 1948లో ప్రారంభమై 1957 నాటికి పూర్తయింది. అమెరికాలోని టెన్నెసి రివర్‌ వ్యాలీ అథారిటీ స్ఫూర్తితో ‘దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌’ అనే చట్టబద్ధ సంస్థను ఏర్పాటుచేసి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని దామోదర్‌ నది, దాని ఉపనదులపై ఉంది. బరాకర్‌ నదిపైన తిలయ, మైదాన్‌ ఆనకట్టలు; కోనార్‌ నదిపైన కోనార్‌ ఆనకట్ట, దామోదర్‌ నదిపైన పంచట్‌ ఆనకట్టలను నిర్మించారు. వీటి ప్రధాన ఉద్దేశం వరద నియంత్రణ, నీటిపారుదల, విద్యుత్‌ ఉత్పత్తి. ఇది దేశంలో నిర్మించిన మొదటి బహుళార్థ సాధక ప్రాజెక్టు. దామోదర్‌ నదికి అకస్మాత్తుగా, అధికంగా వరదలు వస్తుంటాయి. అందుకే దీన్ని బెంగాల్‌ దుఃఖదాయిని అంటారు.
నర్మదా నదీలోయ ప్రాజెక్టు: మొదట నర్మదా నదీలోయ కార్పొరేషన్‌ ఏర్పాటుచేశారు. ఆ తర్వాత నర్మదానది, దాని ఉపనదులపైన మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇందులో 30 భారీ, 135 మధ్య తరహా, ఇంకా కొన్ని చిన్నతరహా ప్రాజెక్టులున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇందిరాసాగర్‌ (నర్మదా సాగర్‌), మహేశ్వర్‌, ఓంకారేశ్వర్‌; గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు ముఖ్యమైనవి.

సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌: గుజరాత్‌లోని కేవడియ దగ్గర నవగాం ప్రాంతంలో ఈ ఆనకట్టను నిర్మించారు. ఇది అమెరికాలోని గ్రాండ్‌ కౌలీ ఆనకట్ట తర్వాత అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ ఆనకట్ట. దీనికి 1961లో శంకుస్థాపన చేసి, 2017లో జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల గుజరాత్‌ రాష్ట్రం ఎక్కువగా లాభం పొందుతోంది. కాబట్టి దీన్ని లైఫ్‌ లైన్‌ ఆఫ్‌ గుజరాత్‌ అంటారు.
ఇందిరా సాగర్‌ డ్యామ్‌: దీన్ని మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లా, పునాస వద్ద నర్మదా నదిపై నిర్మించారు. దీన్ని ‘నర్మదా సాగర్‌ డ్యామ్‌’ లేదా ‘పునాస్‌ డ్యామ్‌’ అని కూడా పిలుస్తారు. ఇందిరా సాగర్‌ దిగువన ఓంకారేశ్వర్‌, మహేశ్వర్‌ డ్యామ్‌లున్నాయి.
బియాస్‌ ప్రాజెక్టు: ఈ ప్రాజెక్టును బియాస్‌, సట్లెజ్‌ లింక్‌ సమీపంలో పంజాబ్‌లోని దౌలదర్‌ దగ్గరున్న పోంగ్‌ వద్ద నిర్మించారు. దీన్ని మహారాణా ప్రతాప్‌ సాగర్‌ అంటారు. ఇది పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. రాజస్థాన్‌కు నీరు అందించే ఇందిరాగాంధీ కాలువను హరికే బ్యారేజీ నుంచి తవ్వారు.

హీరాకుడ్‌ ప్రాజెక్టు: దీన్ని ఒడిశాలోని సంబల్‌పూర్‌ నగరానికి 15 కి.మీ. ఎగువన మహానదిపై నిర్మించారు. ఇది ప్రపంచంలోనే పొడవైన ప్రాజెక్టు (4801 మీ.). మహానది, ఇబ్‌ నది కలిసేచోట ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీన్ని 1948లో మొదలుపెట్టగా 1957లో పూర్తయింది.
చంబల్‌ లోయ ప్రాజెక్టు: ఇది మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల ఉమ్మడి ప్రాజెక్టు. దీంట్లో గాంధీసాగర్‌ డ్యామ్‌ (మధ్యప్రదేశ్‌), రాణా ప్రతాప్‌సాగర్‌ డ్యామ్‌ (రాజస్థాన్‌), జవహర్‌ సాగర్‌ (రాజస్థాన్‌), కోటా బ్యారేజీ (రాజస్థాన్‌) ఉన్నాయి.
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు:  దీన్ని కృష్ణానదిపై నల్గొండ జిల్లాలోని నందికొండ గ్రామం దగ్గర నిర్మించారు. ఇది ప్రపంచంలో అతిపెద్ద, ఎత్తయిన రాతి ఆనకట్ట.  1955, డిసెంబరు 10న శంకుస్థాపన చేయగా 1967, ఆగస్టు 4న పూర్తయింది. పూర్తిగా భారతసాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించడం దీని ప్రత్యేకత. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం నీటిపారుదల, విద్యుదుత్పత్తి.

శ్రీశైలం ప్రాజెక్టు: దీన్ని కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద కృష్ణానదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం జలవిద్యుత్తు ఉత్పత్తి. దీనికి కుడి కాలువ (ఎస్‌ఆర్‌బీసీ), ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ఉన్నాయి.
శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు: పోచంపాడు ప్రాజెక్టు అని కూడా అంటారు. దీన్ని నిజామాబాద్‌ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు. దీనికి మొదటి దశలో కాకతీయ కాలువ, లక్ష్మీకాలువ, సరస్వతి కాలువ నిర్మించగా, తదనంతరం, ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరద కాలువ నిర్మాణం జరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్టు: దీన్ని గోదావరి నదిపై పూర్వ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును రీ-డిజైన్‌ చేసి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ దగ్గర నిర్మించారు. ఇది అతిపెద్ద ఎత్తిపోతల పథకం (లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు). దీన్ని 2016లో మొదలుపెట్టి 2019లో పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు 7 లింకులు, 28 ప్యాకేజీలు, 500 కిలోమీటర్ల దూరం, 1800 కిలోమీటర్ల పొడవైన కాలువలతో 13 జిల్లాలకు నీటిని అందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని