సంపూర్ణం నుంచి.. సంకీర్ణం వరకు!

అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు నిర్దేశంలో దేశపాలన సాగుతుంది. అందులో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులుండే లోక్‌సభ అత్యంత కీలకం. దీనికి పోటీపడిన రాజకీయపార్టీలు, సాధించిన సీట్లు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన నాయకులు, మధ్యంతర ఎన్నికల

Published : 21 Jul 2022 00:47 IST

భారత రాజ్యాంగం, రాజకీయాలు 

అత్యున్నత శాసనవ్యవస్థ పార్లమెంటు నిర్దేశంలో దేశపాలన సాగుతుంది. అందులో ప్రత్యక్షంగా ఎన్నికైన సభ్యులుండే లోక్‌సభ అత్యంత కీలకం. దీనికి పోటీపడిన రాజకీయపార్టీలు, సాధించిన సీట్లు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన నాయకులు, మధ్యంతర ఎన్నికల విశేషాలను పోటీ పరీక్షల కోసం అభ్యర్థులు తెలుసుకోవాలి. తొలి విడతగా తొమ్మిది లోక్‌సభల ఎన్నికల వివరాలను పరిశీలిస్తే పార్టీలు పొందిన మెజారిటీ తీరు సంపూర్ణం నుంచి సంకీర్ణం దిశగా సాగినట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలు - ప్రత్యేకతలు

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు 17 సార్లు లోక్‌సభకు నిష్పక్షపాతంగా, సమర్థంగా ఎన్నికలు నిర్వహించింది. భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎన్నికల సంఘం కీలకపాత్ర పోషిస్తుంది.
 1) 1952
మొదటి లోక్‌సభ ఎన్నికలు 1951 - 52లో జరిగాయి. ఈ ఎన్నికల నిర్వహణకు నాలుగు నెలల సమయం పట్టింది. 21 సంవత్సరాలు నిండిన వయోజనులందరికీ ఓటుహక్కు కల్పించారు. నాటికి మన దేశ ఓటర్ల సంఖ్య సుమారు 17.3 కోట్లు. ఈ ఎన్నికల్లో 489 స్థానాలకు 17,500 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తొలి లోక్‌సభ ఎన్నికలను ‘చీకటిలో ముందుకు దూకడంగా’ విమర్శకులు పేర్కొనగా, ‘విశ్వాసంతో కూడిన చర్య’ అని ఆశావహులు అభివర్ణించారు.

* నమోదైన పోలింగ్‌ 46%, ఎన్నికైన మహిళలు 22 మంది.

* లోక్‌సభ పదవీకాలం 1952, ఏప్రిల్‌ నుంచి 1957 ఏప్రిల్‌ వరకు.

* మొదటి లోక్‌సభకు స్పీకర్‌గా గణేశ్‌వాసుదేవ మౌలాంకర్, డిప్యూటీ స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్‌ వ్యవహరించారు.

* పదవిలో ఉండగా మరణించిన తొలి స్పీకర్‌ జి.వి.మౌలాంకర్‌

* మొదటి లోక్‌సభ నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

 2) 1957
రెండో లోక్‌సభ ఎన్నికలు 1957లో జరిగాయి. కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 371 స్థానాలు, కమ్యూనిస్టులు 27 స్థానాలు గెలుపొందారు. నమోదైన పోలింగ్‌ 48%. ఎన్నికైన మహిళల సంఖ్య 27. స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్, డిప్యూటీ స్పీకర్‌గా సర్దార్‌ హుకంసింగ్‌ వ్యవహరించారు. సభా నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఈ లోక్‌సభ 1957, మే నుంచి 1962, మార్చి వరకు కొనసాగింది.

3) 1962
మూడో లోక్‌సభ ఎన్నికలు 1962లో జరిగాయి. కాంగ్రెస్‌ 361, కమ్యూనిస్టులు 29, జనసంఘ్‌ 14 స్థానాలు గెలుపొందాయి. పోలింగ్‌ 55% నమోదైంది. 34 మంది మహిళలు ఎన్నికయ్యారు. స్పీకర్‌గా సర్దార్‌ హుకంసింగ్, డిప్యూటీ స్పీకర్‌గా ఎస్‌.వి.కృష్ణమూర్తి వ్యవహరించారు. 1962 ఏప్రిల్‌ నుంచి 1967 మార్చి వరకు సభ పదవీకాలం. సభా నాయకుడిగా జవహర్‌లాల్‌ నెహ్రూ మూడోసారి ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1964లో నెహ్రూ మరణించడంతో లాల్‌బహదూర్‌ శాస్త్రి లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని కొనసాగించారు. శాస్త్రి ప్రధాని పదవిలో ఉండగానే తాష్కెంట్‌లో మరణించారు.

* ఈ లోక్‌సభ కాలంలోనే 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక ఏర్పడి సీపీఐ(ఎం), సీపీఐ ఏర్పాటయ్యాయి.

4) 1967
నాలుగో లోక్‌సభ ఎన్నికలను 1967లో నిర్వహించారు. కాంగ్రెస్‌ 283, జనసంఘ్‌ 35, సీపీఐ 23, సీపీఐ(ఎం) 19 స్థానాలు గెలిచాయి. 61% పోలింగ్‌ నమోదైంది. 31 మంది మహిళలు ఎన్నికయ్యారు. స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి వ్యవహరించారు. 1969లో ఆయన రాజీనామా చేయడంతో గురుదయాళ్‌ సింగ్‌ ధిల్లాన్‌ స్పీకర్‌ అయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా కాదిల్‌కర్‌ వ్యవహరించారు. లోక్‌సభ నాయకురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. 1969లో కాంగ్రెస్‌ పార్టీలో చీలిక ఏర్పడి కాంగ్రెస్‌(ఓ), కాంగ్రెస్‌ (ఆర్‌) గా ఏర్పాటయ్యాయి. 1967 మార్చి నుంచి 1970 డిసెంబరు వరకు ఈ లోక్‌సభ పదవీకాలం కొనసాగింది. ఈ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయి, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్‌ మొదటిసారిగా కేంద్రంలో మైనార్టీ ప్రభుత్వాన్ని కొనసాగించింది.

5) 1971

దేశంలో మొదటిసారిగా 1971లో అయిదో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఇది మధ్యంతర ఎన్నికల ద్వారా ఏర్పడిన మొదటి లోక్‌సభ. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 352, భారతీయ జనసంఘ్‌ 22, సీపీఐ 23, సీపీఐఎం 25 స్థానాలు గెలుపొందాయి. 55% పోలింగ్‌ నమోదైంది. ఎన్నికైన మహిళలు 22 మంది. ఈ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ‘గరీబీ హఠావో’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ‘ఇందిరాకో హఠావో - భారత్‌కో బచావో’ అనే నినాదంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. లోక్‌సభా నాయకురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటుచేశారు. లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ‘సంపూర్ణ విప్లవాని’కి పిలుపునిచ్చారు.

* ఈ సభాకాలంలోనే 19 రాజ్యాంగ సవరణ చట్టాలు (ఆర్టికల్‌ 24 నుంచి 42 వరకు) జరిగాయి. పత్రికలపై ఆంక్షలు, రాజకీయ నాయకుల నిర్బంధాలు కొనసాగాయి.

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని 5 నుంచి 6 ఏళ్లకు పొడిగించింది. 1971లో ఇందిరాగాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన విధానంలో అధికార దుర్వినియోగం జరిగిందని, ఆమె ఎన్నిక చెల్లదని 1975లో అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఆయుధంగా మలచుకున్న ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపట్టాయి.

* 5వ లోక్‌సభ పదవీకాలం 1971 మార్చి నుంచి 1977 జనవరి వరకు కొనసాగింది. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక కాలం అంటే 5 సంవత్సరాల 10 నెలల 6 రోజులు కొనసాగిన లోక్‌సభ ఇదే. ఈ కాలంలోనే న్యాయస్థానాలకు ఉన్న న్యాయసమీక్షాధికారంపై పరిమితులు విధించారు. నాటి లోక్‌సభకు స్పీకర్‌గా గురుదయాళ్‌ సింగ్‌ ధిల్లాన్‌ వ్యవహరించారు. ఈయన 1975లో రాజీనామా చేయడంతో బలిరాం భగత్‌ స్పీకర్‌ అయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా జి.జి.స్వాల్‌ వ్యవహరించారు.

6) 1977
జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, సంస్థా కాంగ్రెస్‌లు ‘జనతా పార్టీ’గా ఏర్పడి పోటీ చేశాయి. ‘ప్రజాస్వామ్య కాంగ్రెస్‌’ అనే కొత్త పార్టీ ఏర్పడి జనతా పార్టీకి మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో జనతా పార్టీ 295, కాంగ్రెస్‌ (ఐఎన్‌సీ) 154, సీపీఐ 7, సీపీఐ(ఎం) 22 స్థానాలు సాధించాయి. కాంగ్రెస్‌ తొలిసారిగా కేంద్రంలో అధికారాన్ని కోల్పోయింది. ఈ ఎన్నికల్లో 60% పోలింగ్‌ నమోదైంది. 19 మంది మహిళలు ఎన్నికయ్యారు.

* జనతా పార్టీకి చెందిన మొరార్జీ దేశాయ్‌ లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై 1977లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇది కేంద్రంలో తొలి సంకీర్ణ, కాంగ్రెసేతర ప్రభుత్వం. 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో, చరణ్‌సింగ్‌ ఆ పదవిని చేపట్టారు. అయితే 4 నెలల వ్యవధిలోనే పదవిని కోల్పోయారు. 6వ లోక్‌సభ స్పీకర్‌గా తొలుత నీలం సంజీవరెడ్డి, ఆయన రాజీనామా అనంతరం కె.ఎస్‌.హెగ్డే స్పీకర్‌గా వ్యవహరించారు. డిప్యూటీ స్పీకర్‌గా జి.మురహరి విధులు నిర్వహించారు. ఈ లోక్‌సభ పదవీకాలం 1977 మార్చి నుంచి 1979 ఆగస్టు వరకు కొనసాగింది. ‘ప్రధాన ప్రతిపక్ష పార్టీ’గా గుర్తింపు పొందాలంటే లోక్‌సభ సభ్యుల సంఖ్యలో 10% స్థానాలు పొందాలని చట్టం ద్వారా నిర్దేశించారు. లోక్‌సభలో తొలి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కాంగ్రెస్‌కు చెందిన వై.బి.చవాన్‌ గుర్తింపు పొందారు.

7) 1980

ఏడో లోక్‌సభకు 1980లో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 353, సీపీఐ 10, సీపీఐ(ఎం) 37, జనతా పార్టీ 31 స్థానాలు గెలుపొందాయి. నమోదైన పోలింగ్‌ 57% కాగా ఎన్నికైన మహిళల సంఖ్య 28. ‘ఇందిరాకో బులావో - దేశ్‌కో బచావో’ అనే నినాదంతో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను ఆకర్షించి భారీ విజయం సాధించింది. ఇందిరాగాంధీ లోక్‌సభా నాయకురాలిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా జి.లక్ష్మణ్‌ వ్యవహరించారు. ఈ లోక్‌సభ 1980, జనవరి నుంచి 1984 డిసెంబరు వరకు కొనసాగింది. ఈ కాలంలోనే ఇందిరాగాంధీ 1984లో పంజాబ్‌లో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంపై ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’ సైనిక చర్యకు ఆదేశింశారు. 1984, అక్టోబరు 31న ఆమెÅ హత్యకు గురయ్యారు. అనంతరం రాజీవ్‌గాంధీ ప్రధాని పదవి చేపట్టారు. ఇందిరాగాంధీ హత్యానంతరం దిల్లీలో సిక్కుల ఊచకోత జరిగింది.

8) 1984

కాంగ్రెస్‌ 414 స్థానాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా, ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 30 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2,  సీపీఐ 6, సీపీఐ(ఎం) 22, జనతా పార్టీ 10 స్థానాలు గెలుపొందాయి. రాజీవ్‌గాంధీ లోక్‌సభా నాయకుడిగా ఎన్నికై ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. మొదటిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, 30 స్థానాలు గెలుపొందిన తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.

* రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం, 1988 ద్వారా వయోజన ఓటు హక్కు కనీస వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు, 65వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ సభ కాలంలోనే రాజీవ్‌గాంధీ బోఫోర్స్, ఫెయిర్‌ఫాక్స్‌ కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌ 64%, ఎన్నికైన మహిళలు 44 మంది. స్పీకర్‌గా బలరాం జక్కర్, డిప్యూటీ స్పీకర్‌గా ఎం.తంబిదొరై వ్యవహరించారు. ఈ లోక్‌సభ పదవీకాలం 1984, డిసెంబరు నుంచి 1989 నవంబరు వరకు కొనసాగింది. 1987లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ‘ముస్లిం మహిళల వివాహం, విడాకుల చట్టం’ను రూపొందించింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఉన్న వి.పి.సింగ్‌ తన పదవికి రాజీనామా చేసి 1988లో జనతాదళ్‌ పార్టీని స్థాపించారు.

9) 1989

తొమ్మిదో లోక్‌సభకు 1989లో ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ 197, జనతాదళ్‌ 143, బీజేపీ 85, సీపీఐ 12, సీపీఐ(ఎం) 33 స్థానాలు గెలుపొందాయి. నమోదైన పోలింగ్‌ 62%. ఎన్నికైన మహిళల సంఖ్య 27. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాకపోవడంతో ‘హంగ్‌ పార్లమెంట్‌’ ఏర్పడింది. ‘నేషనల్‌ ఫ్రంట్‌’ పేరుతో కూటమి ఏర్పాటైంది. జనతాదళ్‌ పార్టీకి చెందిన వి.పి.సింగ్‌ను లోక్‌సభా నాయకుడిగా ప్రభుత్వం కొలువుతీరింది. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చాయి. 11 నెలల అనంతరం బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో వి.పి.సింగ్‌ ప్రభుత్వం లోక్‌సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం వీగిపోవడంతో ఆయన ప్రధాని పదవి కోల్పోయారు. అనంతరం జనతాదళ్‌ పార్టీకే చెందిన చంద్రశేఖర్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ అనతికాలంలోనే ఆ ప్రభుత్వం కూడా పతనమైంది. ఈ లోక్‌సభ పదవీకాలం 1989 డిసెంబరు నుంచి 1991 మార్చి వరకు కొనసాగింది. స్పీకర్‌గా రబీ రే, డిప్యూటీ స్పీకర్‌గా శివరాజ్‌ పాటిల్‌ వ్యవహరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని