పసిప్రాయంపై పనిభారం!

లేత చేతులు రాళ్లు కొడుతున్నాయి. పాలుగారే వయసు ప్రమాదకర పరిస్థితుల్లో పరిశ్రమల్లో పనిచేస్తోంది. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. బట్టీల్లో బండ చాకిరికి బలైపోతోంది. చదువు లేదు.

Updated : 24 Jul 2022 03:43 IST

సమాజ నిర్మాణం, సమస్యలు

ప్రజావిధానాలు/పథకాలు

లేత చేతులు రాళ్లు కొడుతున్నాయి. పాలుగారే వయసు ప్రమాదకర పరిస్థితుల్లో పరిశ్రమల్లో పనిచేస్తోంది. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బీడీలు చుడుతోంది. బట్టీల్లో బండ చాకిరికి బలైపోతోంది. చదువు లేదు. ఆటలు లేవు. సరైన పోషకాహారం అందదు. పిల్లలు శ్రామిక యంత్రాలుగా మారిపోయిన సామాజిక దురవస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అందులోనూ మన దేశంలో మరీ తీవ్రమైన పరిస్థితి. ఇందుకు కారణాలు, ఏయే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ బాలలు ప్రమాదకర వృత్తుల్లో ఉన్నారు? వీరి విముక్తికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి.


బాలకార్మికులు

పుట్టుక నుంచి కౌమారం వరకు బాల్యం. బంగారు భవిష్యత్తుకు పునాది పడే దశ. ఈనాటి బాలలే రేపటి భారత నిర్మాణ సారథులు. అలాంటి వారిని చదువులకు, ఆటలకు దూరం చేసి శ్రామిక యంత్రాలుగా మార్చడాన్ని బాలకార్మిక వ్యవస్థ అంటారు. సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల కొంతమంది బాలలు కార్మికులుగా మారుతున్నారు.  ఈ వ్యవస్థను వివిధ సంస్థలు, ప్రభుత్వాలు పలు రకాలుగా నిర్వచించాయి.
అత్యధికం ఇక్కడే: ప్రపంచంలోనే అత్యధిక బాలకార్మికులు ఉన్న దేశం భారత్‌ అని యూనిసెఫ్‌ తాజా నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం బాలకార్మికుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా ఉంది. దేశంలో 6 - 14 ఏళ్ల వయసున్న పిల్లలు 18.5 కోట్లు. వీరిలో 5.5 కోట్ల మందికి చదువు లేదు. దేశంలో 5 ఏళ్ల లోపు పిల్లల్లో 7.5 కోట్ల మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.


దేశంలో బాలకార్మిక వ్యవస్థ

భారత ప్రభుత్వం మొదటిసారిగా పిల్లల సంరక్షణ కోసం బాలల హక్కుల అంతర్జాతీయ పత్రాన్ని అనుసరించి 1974, ఆగస్టులో ఒక జాతీయ సిద్ధాంతాన్ని ప్రకటించింది. దీని ప్రకారం జాతీయ నమూనా సర్వేలో (ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఒ. 2004-2005) దేశంలో 90 లక్షల మంది బాలకార్మికులున్నట్లు గుర్తించారు. నాటి సర్వేలో అత్యధికంగా బాలకార్మికులున్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (22.8%), మహారాష్ట్ర (13.2%).
* 2009-10 ఎన్‌.ఎస్‌.ఎస్‌.ఒ. ప్రకారం 5 - 14 ఏళ్లలోపు వయసున్న బాలకార్మికుల సంఖ్య 49.83 లక్షలు. ఈ సర్వే ప్రకారం దేశంలో అత్యధికంగా బాలకార్మికులున్న రాష్ట్రాలు ఉత్తరాఖండ్‌ (35.62%), రాజస్థాన్‌ (8.14%), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (4.7%).

* యూనిసెఫ్‌, ప్రణాళికా సంఘం ప్రకారం 43% మంది బాలబాలికలు 8వ తరగతిలోపే బడి మానేస్తున్నారు.

* ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఫ్రీ ట్రేడ్‌ యూనియన్‌ సర్వే ప్రకారం భారత్‌లో 6 కోట్ల మంది బాలకార్మికులున్నారు. దేశంలో అత్యధిక బాలకార్మికులున్న ప్రాంతం శివకాశి (తమిళనాడు). అత్యధిక బాలకార్మికులున్న నగరం ముంబయి.

* 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లో బాలకార్మికులు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఉత్తర్‌ప్రదేశ్‌ (8,96,301), మహారాష్ట్ర (4,96,916). అత్యల్పంగా ఉన్న రాష్ట్రాలు సిక్కిం (2704), మిజోరం (2793). బాలకార్మికులు అత్యధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు దిల్లీ (26,473), చండీగఢ్‌ (3135). అత్యల్పంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు డామన్‌ అండ్‌ డయ్యూ (774), లక్షద్వీప్‌ (28).
కారణాలు:

* పేదరికం  

* నిరుద్యోగం/తక్కువ ఆదాయం

* నిరక్షరాస్యత - అజ్ఞానం

* అతితక్కువ జీవనప్రమాణం  

* సామాజిక వెనుకబాటుతనం

* సామాజిక ఆర్థిక కారణాలు


ఏయే వృత్తుల్లో?

ప్రధానంగా కొన్ని రకాల వృత్తుల్లో బాలకార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారని అంచనా వేశారు.
అగ్గిపెట్టెలు, టపాసుల పరిశ్రమ: దాదాపు 50 వేల మంది పిల్లలు (3.5 సంవత్సరాలు మొదలు 15 సంవత్సరాల్లోపు వారు) తమిళనాడులోని శివకాశి పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారని అంచనా. వీరు రోజులో 12 గంటలు చీకటి గదుల్లోనే ఉంటూ పొటాషియం క్లోరైడ్‌, ఫాస్ఫరస్‌, జింక్‌ ఆక్సైడ్‌ లాంటి విషపూరిత రసాయనాల మధ్య పనులు చేస్తుంటారు.
గనులు, క్వారీలు: దాదాపు 20 వేల మంది (మేఘాలయ, మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం, కేరళలోని పలకల పరిశ్రమల్లో) పనిచేస్తున్నారు.
చేపల పరిశ్రమ: కేరళలోని క్విరాన్‌, కొచ్చి; తమిళనాడులోని కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో 35 వేల మంది పనిచేస్తున్నారు.
బీడీ పరిశ్రమ: తిరుచునాపల్లి, త్రిస్సూర్‌లో దాదాపు 7 వేల మంది పిల్లలున్నారు.
తాళాల పరిశ్రమ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అలీగఢ్‌లోని తాళాల పరిశ్రమలో దాదాపు 10 వేల మంది బాలకార్మికులున్నారు.
చేనేత పరిశ్రమ: కాంచీపురం, తిరువనంతపురంలో సుమారు 10 వేల మంది బాలకార్మికులు పనిచేస్తున్నారు. వెలుతురు, గాలి చొరబడని స్థలాల్లో పనిచేయడం వల్ల కంటి వ్యాధులకు గురవుతున్నారు.
తివాచీ పరిశ్రమ: జమ్మూకశ్మీర్‌లో 50 వేల మంది, రాజస్థాన్‌లో 12 వేల మంది బాలకార్మికులు పనిచేస్తున్నారు.


వీధి బాలలు

భారత్‌లోని వివిధ నగరాల వీధుల్లో పనులు చేస్తూ, అక్కడే నివసించే బాలలు వేల సంఖ్యలో ఉన్నారు. చెన్నైలో నిర్వహించిన ఒక సర్వేలో వీధిబాలల్లో 90% మంది తమ తల్లిదండ్రులతో కలిసి ఫుట్‌పాత్‌లపైనే నివసిస్తున్నారు. ఈ నగరంలోని వీధి బాలల్లో అత్యధికులు (22 శాతం) కూలీలుగా పనిచేస్తున్నారని తేలింది. దేశం మొత్తంమీద వీధిబాలల్లో 10.4% మంది హోటళ్లు, 9.6% మంది చెత్తసేకరణలో, 8% రిక్షా లాగుతూ, 7.1% పూలు అమ్ముతూ జీవిస్తున్నారు. వీరిలో 0.3% మంది వ్యభిచారంలోనూ ఉన్నారు. రోజుకు 10-12 గంటల పాటు పనిచేసినా, కడుపు నిండా తినడానికి ఇక్కట్లు పడుతూనే ఉన్నారు.
బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణం పేదరికం. రంగరాజన్‌ కమిటీ ప్రకారం 2011-12లో దేశంలో 29.5 శాతం జనాభా పేదరికంలో ఉంది. ప్రతి 10 మందిలో ముగ్గురు పేదలే. పెద్దలు పనిచేస్తున్నా కనీస అవసరాలు గడవని పరిస్థితితో ఆయా కుటుంబాల్లోని పసిపిల్లలు శ్రామికులుగా మారుతున్నారు. 2011-12 ప్రణాళికా సంఘం ప్రకారం 27 కోట్ల మంది (21.9%) ప్రజలు పేదరికంలో ఉన్నారు. పేదల సంఖ్యలో ఉత్తర్‌ప్రదేశ్‌ (5.98 కోట్లు), బిహార్‌ (3.58 కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.


వివిధ చట్టాలు

* ఫ్యాక్టరీల చట్టం - 1948

* తేయాకు తోటల కార్మికుల చట్టం - 1957

* గనుల చట్టం - 1952  

* హిందూ అడాప్షన్‌, మెయింటెనెన్స్‌ చట్టం - 1956

* మోటారు వాహనాల కార్మికుల చట్టం - 1961  
* బాలకార్మిక నిషేధ చట్టం - 1986  

* బాలన్యాయ చట్టం - 1986

* బాలల హక్కుల పరిరక్షణ చట్టం - 2005

* వెట్టిచాకిరి నివారణ చట్టం - 1976


ఆచరణాత్మక పరిష్కారాలు

* ఆశ్రమ పాఠశాలల ఏర్పాటు.  

* బ్రిడ్జ్‌ కోర్సు నిర్వహణ.

* అంగన్‌వాడీలు  

* ప్రాథమిక సదుపాయాల కల్పన  

* వృత్తి విద్య, శిక్షణ  

* పేదరికం, నిరక్షరాస్యత, పిల్లల వెట్టిచాకిరి మొదలైన సమస్యల గురించి సంపూర్ణ వివరాల సేకరణ.
* బడిబయట పిల్లల సంఖ్యను కచ్చితంగా తేల్చే సమగ్ర సర్వేలు నిర్వహించడం.

* బాలకార్మిక నిషేధ చట్టంతో పాటు, విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడటం.


రకరకాల పథకాలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికి రకరకాల పథకాలను ప్రవేశ పెట్టాయి.
చైల్డ్‌ లైన్‌ ప్రాజెక్టు: బాలల అవసరాలు గుర్తించి వారి హక్కులను పరిరక్షిస్తారు.
ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్కీమ్‌: బాలలు వివిధ రకాలైన దోపిడీలకు గురికాకుండా రక్షించేందుకు చర్యలు తీసుకుంటారు.
ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌: పోషకాహారం, ఆరోగ్య సౌకర్యాలను అందిస్తుంది.
సాక్ష్యం: బాలురలో లింగపరమైన సున్నితత్వాన్ని, అలాగే నైతిక ప్రవర్తనను పెంపొందిస్తుంది.
సర్వశిక్షా అభియాన్‌: ప్రాథమిక విద్యను అందిస్తుంది.
సబల: కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహారం సరఫరా.
బాలికా సమృద్ధి యోజన: బాలికా విద్యను ప్రోత్సహిస్తుంది.
బేటీ బచావో- బేటీ పఢావో: బాలికా విద్య, పోషకాహారం, లింగ వివక్షకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు.


నిర్వచనాలు

* 1989లో ఐక్యరాజ్య సమితి మొదటిసారిగా 18 ఏళ్ల లోపు పనిచేసే వారిని బాలకార్మికులుగా పేర్కొంది.
* భారత ఫ్యాక్టరీ చట్టం ప్రకారం 14 ఏళ్ల లోపు పనిచేసే పిల్లలను బాలకార్మికులుగా వ్యవహరిస్తారు.
* అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం 15 ఏళ్ల లోపు వయసుండి, పనిచేస్తున్న బాలబాలికలంతా బాలకార్మికులే.
* 1971 భారత ప్రభుత్వ జనాభా గణన ప్రకారం 15 ఏళ్ల లోపు పనిచేస్తున్న బాలలంతా బాలకార్మికులే.
యూనిసెఫ్‌ ప్రకారం: 5 - 11 సంవత్సరాల మధ్య వయసున్న వారు వారంలో కనీసం ఒక ఆర్థిక కార్యకలాపంలో పాల్గొన్నా లేదా 24 గంటలు ఇంటిపనుల్లో, 12-14 గంటల పాటు ఆర్థిక కార్యకలాపాల్లో, 42 గంటలు గృహకృత్యాల్లో పాల్గొంటే వారిని బాలకార్మికులుగా గుర్తించింది.


ముఖ్యమైన సంవత్సరం, తేదీలు

అంతర్జాతీయ బాలల సంవత్సరం - 1979
ప్రపంచ బాలల దినోత్సవం - జూన్‌ 1
ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం - జూన్‌ 12
అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం - నవంబరు 20
భారత్‌లో బాలల హక్కుల దినోత్సవం - నవంబరు 14
బాలల సంరక్షణ దినోత్సవం - నవంబరు 7


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని