ఆ గొలుసులో ఉత్పత్తిదారులు.. విచ్ఛిన్నకారులు!

భూమండలంపై ప్రతి జీవి ఆహారానికి మూలాధారం సూర్యుడి నుంచి లభించే శక్తి ప్రవాహం. దాని సాయంతో పత్రహరితం తయారై శాకాహార, మాంసాహార జీవులకు తిండి లభిస్తోంది. ఇందుకోసం శిలావరణం,  వాతావరణం, జలావరణాలను చక్రీయంగా 

Published : 25 Jul 2022 03:27 IST

జనరల్‌ స్టడీస్‌ - పర్యావరణ అంశాలు

భూమండలంపై ప్రతి జీవి ఆహారానికి మూలాధారం సూర్యుడి నుంచి లభించే శక్తి ప్రవాహం. దాని సాయంతో పత్రహరితం తయారై శాకాహార, మాంసాహార జీవులకు తిండి లభిస్తోంది. ఇందుకోసం శిలావరణం,  వాతావరణం, జలావరణాలను చక్రీయంగా  అనుసంధానం చేస్తూ ఆవరణ వ్యవస్థ కొన్ని ముఖ్యమైన విధులను నిర్వహిస్తోంది. పర్యావరణం అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వాటిపై అవగాహన కలిగి ఉండాలి.


ఆవరణ వ్యవస్థ విధులు

ప్రతి జీవికి నిరంతరం మనుగడ కల్పించడమే ఆవరణ వ్యవస్థ ప్రధాన విధి. ఆవరణ వ్యవస్థలోని జీవ, నిర్జీవ అనుఘటకాల మధ్య జరిగే చర్య, ప్రతి చర్యలను ఆవరణ వ్యవస్థ విధి నిర్వహణ అంటారు. దీని సమగ్ర విధి నిర్వహణ కింది అంశాల ద్వారా జరుగుతుంది.


ఉత్పాదన

ఒక ప్రమాణ కాలం, వైశాల్యంలో ఆవరణ వ్యవస్థ నుంచి శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఉత్పత్తిదారులు (వృక్షజాతులు) తయారుచేసిన జీవ ద్రవ్యరాశి ఉత్పత్తి రేటును ఉత్పాదన అంటారు. వృక్ష, జంతు జాతుల ఉత్పాదనను ‘ఉత్పాదన ఆవరణ శాస్త్రం’ (ప్రొడక్షన్‌ ఎకాలజీ) అంటారు. మొత్తం ఉత్పాదనకు కావాల్సిన కర్బన పదార్థాల పునరాభివృద్ధి రేటును ‘టర్నోవర్‌’ అంటారు.

ప్రాథమిక ఉత్పాదన: ఒక నిర్ణీత ఆవరణ వ్యవస్థలోని ఉత్పత్తిదారులు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారుచేసుకునే పిండి పదార్థాలకు అవసరమైన సౌర వికిరణ శక్తి విలువల రేటును ప్రాథమిక ఉత్పాదన అంటారు.
ద్వితీయ ఉత్పాదన: నిర్ణీత ఆవరణ వ్యవస్థ నుంచి అభివృద్ధి  చెందిన వినియోగదారుల పోషక స్థాయుల్లోని శక్తి విలువల  రేటును ‘ద్వితీయ ఉత్పాదన’ అంటారు.


శక్తి ప్రవాహం

సూర్యుడి నుంచి భూమి వైపు ప్రసరించే సౌరశక్తిని సూర్యపుటం అంటారు. దీనిలో 51% మాత్రమే భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఈ శక్తిని జీవ, నిర్జీవ అనుఘటకాల ద్వారా శిలావరణం, వాతావరణం, జలావరణం మధ్య జీవ, భూరసాయన వలయాల ద్వారా చక్రీయంగా థర్మోడైనమిక్‌ సూత్రాలకు అనుగుణంగా బదిలీ చేయడం ఆవరణ వ్యవస్థ మరొక ముఖ్య విధి.


విచ్ఛిన్నత విధి

ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులుగా పిలిచే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లాంటి సూక్ష్మజీవులు వృక్ష, జంతు జీవజాతుల మృత కళేబరాలు, విసర్జకాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విచ్ఛిన్నత వల్ల సంక్లిష్ట కర్బన పదార్థాలు సరళ అకర్బన పదార్థాలుగా మారి భూవాతావరణంలో విలీనమవుతాయి.


జీవావరణ అనుక్రమం

ఏదైనా ఆవరణ వ్యవస్థలో కాలం, ప్రాంతాన్ని బట్టి  శీతోష్ణస్థితిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఒక జీవ సమాజ స్థానంలో మరొక జీవ సమాజం ఆక్రమించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. ఇది నెమ్మదిగా, అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ చివరకు స్థిరమైన జీవ సమాజం ఉన్న ఒక సమాజ ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. దీన్ని పరాకాష్ఠ జీవ సమాజం అంటారు.

* జీవావరణ అనుక్రమం కింది దశల్లో జరుగుతుంది.

అనాచ్ఛాదన: నేల స్థితి, జీవ సంబంధ, శీతోష్ణ కారకాల వల్ల ఒక భౌగోళిక ప్రాంతంలో అనేక మార్పులు వస్తాయి. దీంతో ఒకప్పటి వృక్ష, జంతు జాతులు నశించి ఆ ప్రదేశం క్రమంగా ఎలాంటి జీవజాతులు లేని బంజరు భూమిగా మారడమే అనాచ్ఛాదనం.

దురాక్రమణ: గాలి, నీటి ద్వారా కొన్ని విత్తనాలు, సిద్ధ బీజాలు లాంటివి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొట్టుకుపోతాయి. కొన్ని జంతు జాతులు కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లి స్థిరపడటమే దురాక్రమణ.

జాతుల మధ్య పోరాటం: ఒక ప్రాంతంలో జాతుల జనాభా పెరగడంతో ఆవాస, ఆహార కొరత ఏర్పడుతుంది. జాతుల మధ్య పోరాటం జరిగి చివరకు కొన్ని జాతులు అక్కడి నుంచి తరలిపోతాయి.
ప్రతిస్పందన: ఒక ప్రాంతంలో ఆధిపత్యం సాధించి స్థిరపడిన జాతులు పర్యావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం లేదా పర్యావరణానికి అనుకూలంగా తమ విధులను మార్చుకుంటూ మనుగడ సాగించడం.


ఆహార గొలుసు  

ఆవరణ వ్యవస్థలో ఒక జీవి మరొక జీవిని తినడం, ఆ జీవి ఇంకో జీవికి ఆహారంగా మారడం జరుగుతుంది. ఈ విధంగా ఉత్పత్తిదారుల నుంచి పరాకాష్ఠ వినియోగదారులకు శక్తి, ఆహార పదార్థాలు రేఖీయంగా బదిలీ కావడంతో ఏర్పడిన నిర్మాణమే ‘ఆహార గొలుసు’. ఇది విచ్ఛిన్నకారులతో అంతమవుతుంది. ఆహార గొలుసులో మొదటి పోషక స్థాయిలో ఉత్పత్తిదారులు, అంతిమ పోషక స్థాయిలో విచ్ఛిన్నకారులు ఉంటాయి.

గడ్డిమైదాన ఆహార గొలుసు: గడ్డి-->మిడత-->కప్ప-->పాము-->గద్ద
ఆకురాల్చే అడవుల ఆహార గొలుసు: గడ్డి-->కుందేలు-->నక్క-->తోడేలు-->పులులు/సింహాలు
చిట్టడవి ఆవరణ ఆహార గొలుసు: గడ్డి-->కుందేలు-->గద్ద  
మానవ నిర్మిత ఆహార గొలుసు: గడ్డి-->గొర్రెలు/మేకలు-->మానవులు
మంచినీటి ఆహార గొలుసు: వృక్ష ప్లవకాలు-->జంతు ప్లవకాలు-->చిన్న చేపలు-->పెద్ద చేపలు-->కొంగలు
సముద్ర ఆవరణ ఆహార గొలుసు: వృక్ష ప్లవకాలు-->జంతు ప్లవకాలు-->చిన్న చేపలు-->పెద్ద చేపలు-->తిమింగలాలు/మొసళ్లు  

ఆహారపు వల: జీవులు వాటి ఆవాసాలు, ఆహారపు వనరులను కోల్పోయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆహారాన్ని పొందే ప్రయత్నం చేస్తాయి. ఆవరణ వ్యవస్థలోని గొలుసులను ఆక్రమిస్తాయి. అప్పుడు ఆహారపు గొలుసులు పరస్పరం అనుసంధానమై ఏర్పడే వల లాంటి క్రియాత్మక నిర్మాణాన్ని ఆహారపు వల లేదా ఆహారపు జాలం అంటారు.


https://tinyurl.com/mrxjn5fu


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

క అధ్యాయం చదవగానే దానికి సంబంధించి ఏదైనా టెస్ట్‌ రాయాలి. కనీసం నమూనా ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. అప్పుడే సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది. లేకపోతే మరచిపోయే అవకాశం ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని