పీహెచ్‌డీ ఉంటే చాలు!

జీవిత లక్ష్యాలను సాధించాలంటే పీహెచ్‌డీ ఉండాలి! అయితే ఇది మనందరికీ తెలిసిన Ph.D. కాదు! మరేమిటి? P.H.D. పి అంటే ప్యాషన్‌ (తీవ్ర అభిరుచి), హెచ్‌ అంటే హంగర్‌ (ఆకలి/ తపన), డి అంటే డిసిప్లిన్‌ (క్రమశిక్షణ).

Published : 27 Jul 2022 00:56 IST

జీవిత లక్ష్యాలను సాధించాలంటే పీహెచ్‌డీ ఉండాలి! అయితే ఇది మనందరికీ తెలిసిన Ph.D. కాదు! మరేమిటి? P.H.D. పి అంటే ప్యాషన్‌ (తీవ్ర అభిరుచి), హెచ్‌ అంటే హంగర్‌ (ఆకలి/ తపన), డి అంటే డిసిప్లిన్‌ (క్రమశిక్షణ).

ప్యాషన్‌: ‘చేసే పనిని ప్రేమిస్తున్నానా.. లేదా’ అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. దీనికి సమాధానం ‘అవును’ అయితే ఇష్టంగా పనిచేయగలుగుతారు. మార్టిన్‌ లూథర్‌కింగ్‌ ఇదే విషయాన్ని వివరిస్తూ.. ‘ఒక స్వీపర్‌ రోడ్లను ఊడిస్తే.. మైకెలేంజిలో పెయింటింగ్‌లా.. షేక్‌స్పియర్‌ కవిత్వంలా గొప్పగా ఉండాలి’ అంటారు. విద్యార్థులు అంతగా ఆసక్తితో చదవాలి. ఆపై ఇష్టమైన వృత్తినే ఎంచుకోవాలి. ఒకవేళ అలాకాకపోయినా చేసే పనిని ఇష్టంతో చేయాలి.

హంగర్‌: లక్ష్య సాధన కోసం ఆకలితో ఆత్రంగా ఎదురుచూడాలి. దాన్ని అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఒకసారి ఒక యువకుడు సోక్రటీస్‌ను కలిసి తనకు జ్ఞానాన్ని బోధించమంటాడు. అప్పుడు సోక్రటీస్‌ అతడిని నదికి తీసుకెళ్లి హఠాత్తుగా అతడి తలను నీటిలో ముంచి ఉంచుతాడు. ఆ యువకుడికి ఏం జరుగుతుందో అర్థంకాక గింజుకుంటూ గాలి పీల్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తాడు. ఆ తర్వాత.. ‘తలను నీటిలో ముంచినప్పుడు దేని కోసం ప్రయత్నించావ’ని అడుగుతాడు సోక్రటీస్‌. ‘గాలి కోసం’ అని బదులిస్తాడా యువకుడు. ‘అంతే తీవ్రంగా జ్ఞానం కోసం ప్రయత్నిస్తే తప్పకుండా దొరుకుతుంది’ అని వివరిస్తాడు సోక్రటీస్‌.
విద్యాభ్యాసంలోనూ, కెరియర్‌ తీర్చిదిద్దుకోవటంలోనూ అంతటి తపన అవసరం.

డిసిప్లిన్‌: సాధించాలనే తపన ఎంత ఉన్నా క్రమశిక్షణ లేకపోతే ఫలితం ఉండదు. దారి పొడవునా ఎన్నో అవరోధాలున్నా క్రమశిక్షణతో వాటిని అధిగమించగలగాలి. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన జిమ్నాస్ట్‌ని ఒక ఇంటర్వ్యూలో... ‘మీ విజయ రహస్యం ఏంట’ని అడిగారు. అప్పుడామె.. ‘ఇష్టమైనప్పుడు ఆటను సాధన చేశాను. అలాగే ఇష్టంలేనప్పుడూ సాధన ఆపకుండా కొనసాగించాను’ అని చెప్పింది. విజయానికి క్రమశిక్షణ అంటే అదీ! మనలో చాలామంది ఎప్పటి పాఠాలను అప్పుడు చదవకుండా వాయిదా వేస్తుంటారు. అలాకాకుండా చదువులో రాణించాలంటే క్రమశిక్షణతో కృషి చేయడం ఎంతో ముఖ్యం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు