అడవి బిడ్డల ఆక్రోశం!

ప్రకృతిని ఆరాధిస్తారు. అందులోనే మమేకమై జీవిస్తారు. నిజాయతీపరులు, అమాయకులు ఆదివాసీలు. వారికి వ్యవసాయమే జీవనాధారం. డబ్బుతో పెద్దగా అవసరం లేకుండా స్వయంసమృద్ధిగా జీవితాలు సాగిస్తున్నారు.

Published : 31 Jul 2022 01:18 IST

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

ప్రకృతిని ఆరాధిస్తారు. అందులోనే మమేకమై జీవిస్తారు. నిజాయతీపరులు, అమాయకులు ఆదివాసీలు. వారికి వ్యవసాయమే జీవనాధారం. డబ్బుతో పెద్దగా అవసరం లేకుండా స్వయంసమృద్ధిగా జీవితాలు సాగిస్తున్నారు. ఆ చిన్న ప్రపంచంలోకి ఆక్రమణదారులు ప్రవేశించి అలజడులు సృష్టించారు. వలస చట్టాలు గిరిజనుల బతుకులను చిందరవందర చేశాయి. అధికారుల అకృత్యాలతో అడవి బిడ్డలు అల్లాడిపోయారు. వడ్డీల విషవలయాల్లో చిక్కుకున్నారు. భూములు కోల్పోయి దిక్కులేని వారయ్యారు. ఆ దారుణ దీనావస్థలో నుంచి మొదలైన అసంతృప్తి తీవ్రమైన పోరాటాలు, తిరుగుబాట్లుగా మారింది. ఈ పరిణామ క్రమాల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి.


గిరిజన భూముల అన్యాక్రాంతం

ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కలిగి ఉండి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో నివసించే జన సమూహాన్ని తెగ అంటారు. గిరిజన తెగ అంటే ప్రధాన సమాజానికి దూరంగా అడవుల్లో, కొండలపై జీవించే జన సమూహం. చారిత్రకంగా పరిశీలిస్తే భారతదేశంలో అనాదిగా నివసించిన మొదటి సమాజ సభ్యులు గిరిజనులే. అందుకే వారిని ఆదివాసీలు అని కూడా అంటారు. భారత రాజ్యాంగంలోని అయిదు, ఆరు షెడ్యూళ్లలో గిరిజనుల ప్రాంతాలను షెడ్యూల్డ్‌ ప్రాంతాలుగా, అక్కడ నివసించే ఆదివాసీలను షెడ్యూల్డ్‌ తెగలుగా పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాలు విస్తారమైన సహజ వనరులను కలిగి ఉంటాయి. వారి ప్రధాన వృత్తులు పోడు వ్యవసాయం, పశుపోషణ, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణ (తేనె, చింతపండు, జిగురులు, ఉసిరి, నేరేడు పండ్లు). వీరికి వ్యవసాయ భూమితో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. వ్యవసాయ భూములను వారసత్వ సంపదగా భావిస్తారు. భూమిని వాణిజ్యపరంగా వెలకట్టరు. జీవన విధానంలో దాన్నో అంతర్భాగంగా చూస్తారు. గిరిజనుల జీవన విధానం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటుంది. (ఉదా: వృక్షాలు, పాములు, అటవీ సంపదను పూజించడం, వన్యజీవులతో కలిసి జీవించడం)

గిరిజనులు సాదాసీదాగా జీవించే కల్మషం లేని అమాయక ప్రజలు. లాభాపేక్ష లేకుండా అవసరాల మేరకే వారి ఆర్థికవ్యవస్థ పరిమితమై ఉంటుంది. వీరి పేదరికాన్ని, నిరక్షరాస్యతను, అమాయకత్వాన్ని, నిజాయతీని ఆసరాగా చేసుకొని గిరిజనేతరులు అనేక రకాలుగా దోపిడీకి పాల్పడి, వారి భూములను ఆక్రమించుకోవడాన్నే గిరిజన భూముల పరాయీకరణ లేదా అన్యాక్రాంతం అంటారు.

ఆంగ్లేయులు రాకముందు గిరిజనులు స్వయంప్రతిపత్తి, స్వయంసమృద్ధి కలిగి ఉండేవారు. బ్రిటిష్‌ పాలనలో వచ్చిన అటవీ చట్టాల వల్ల వారు తమ జీవనాధారమైన భూములను కోల్పోయారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో తమ ప్రత్యేక జీవన విధానాన్నీ కోల్పోవాల్సి వచ్చింది. గిరిజనేతరులతో పాటు అటవీ అధికారులు, కలప వ్యాపారులు, పరిసర ప్రాంతాల భూస్వాములు, వడ్డీ వ్యాపారులు వీరిని నిరంతరం దోపిడీ చేస్తూవచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం ఖనిజ వనరుల వెలికితీతకు గనులను విస్తరించడం, అటవీ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుచేయడం, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ అటవీ విధానాల ద్వారా గిరిజనుల భూములను నిర్బంధంగా సేకరించింది. దాంతో వారు తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆ దోపిడీలను ఎదిరించి పోరాటాలు చేయాల్సి వచ్చింది. గిరిజనుల సాగు భూమిని రిజర్వు ఫారెస్టులో విలీనం చేయడంతో వారు తమ పోడు వ్యవసాయ భూములను కోల్పోయారు. సంక్లిష్టమైన రెవెన్యూ పాలనా వ్యవస్థలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, అటవీ అధికారులు గిరిజనుల పట్ల దోపిడీ వైఖరి అవలంబించారు. ఫలితంగా తమ ఆవాసాల్లో ప్రకృతి వనరులైన నీరు, అడవి, భూమి (జల్‌-జంగల్‌-జమీన్‌)పై వారు తమ ఆధిపత్యాన్ని కోల్పోవడంతో తీవ్రమైన అశాంతికి గురై తిరుగుబాట్లు చేశారు.


ఒక విష వలయం

గిరిజనులు తమ రోజువారీ అవసరాల కోసం పొరుగున మైదాన ప్రాంతాల్లోని వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి డబ్బు, వస్తు రూపేణా అప్పులు తీసుకుంటారు. అసలుతో పాటు వడ్డీ తడిసిమోపెడై అప్పు తీర్చలేక భూమిని తనఖా పెడతారు. ఆ తర్వాత తీసుకున్న మరికొంత అప్పునూ చెల్లించలేక తనఖా భూమిని వడ్డీ వ్యాపారులకే చౌకగా అమ్మేస్తుంటారు. ఈ విధంగా భూములు అన్యాక్రాంతమై వ్యవసాయ వృత్తిని కోల్పోతున్నారు. చివరికి తమ భూముల్లోనే వ్యవసాయ కూలీలుగా మారినప్పుడు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

ఇంద్రవెల్లి ప్రతిఘటన (1981)

గిరిజన భూముల అన్యాక్రాంతంపై, వారి ఇతర సమస్యలపై చర్చించేందుకు రైతు కూలీ సంఘం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి గ్రామంలో 1981, ఏప్రిల్‌ 20న బహిరంగ సభ జరపాలని నిర్ణయించింది. పోలీసులు ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. ఈ విషయం తెలియని చుట్టుపక్కల గిరిజనులు సభకు హాజరయ్యేందుకు తరలివచ్చిన సమయంలో పోలీసులతో ఘర్షణ జరిగింది. అది క్రమంగా తీవ్రమై పోలీసు కాల్పులకు దారితీసింది. అందులో 13 మంది గిరిజనులు మరణించినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. స్వాతంత్య్రానంతరం దేశంలో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. దాంతో భూస్వాములు, వడ్డీవ్యాపారుల దోపిడీ, ప్రభుత్వ అధికారుల అకృత్యాలకు వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాలు పోరాటాలకు వేదికలయ్యాయి.

చట్టాలతో రక్షణ

గిరిజన భూముల అన్యాక్రాంతాన్ని నిషేధించేందుకు స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం అనేక చట్టాలను రూపొందించింది. గిరిజనాభివృద్ధికి పలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. వారికి తగిన రక్షణలు కల్పించేందుకు భారత రాజ్యాంగంలో అయిదు, ఆరు షెడ్యూళ్లను చేర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్‌ చట్టం - 1959’ను రూపొందించారు. ఈ చట్టాన్ని పటిష్ఠంగా అమలుపరిచేందుకు 1970లో సవరించారు. 2006లో భారత ప్రభుత్వం ‘ది షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ ట్రెడిషనల్‌ ఫారెస్ట్‌ డ్వెల్లర్స్‌ రికగ్నిషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రైట్స్‌’ చట్టాన్ని రూపొందించింది. ఇది అటవీ హక్కుల చట్టం- 2006గా ప్రసిద్ధి చెందింది. దీని ప్రధాన లక్ష్యం అనాదిగా అడవుల్లో జీవించే గిరిజనులు, సంప్రదాయ అటవీవాసులకు వ్యవసాయం కోసం ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా నాలుగు హెక్టార్ల భూమిని కేటాయించడం. అటవీ ఉపఉత్పత్తులపై గిరిజనులకు హక్కు కల్పించడం. దాంతో పాటు అడవుల నిర్వహణను వారికే అప్పగించాలని చట్టం నిర్దేశించింది.


తెలంగాణలో గిరిజన తిరుగుబాట్లు

తెలంగాణ సామాజిక, సాంస్కృతిక నిర్మాణంలో ఆదివాసీలకు కీలక పాత్ర ఉంది. 2011 జనగణన ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా శాతం 9.08 (తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ప్రకారం గిరిజన జనాభా 9.34%). రాష్ట్రంలో ప్రధాన గిరిజన తెగలు గోండులు, కోయలు, గొత్తి కోయలు, కొండరెడ్లు, కొల్లాం, ప్రధాన్‌ నాయక్‌ పోడ్‌, అంథ్‌, ఎరుకల, యానాది, లంబాడ మొదలైనవి. ప్రతి తెగకు విభిన్న ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. గిరిజన తిరుగుబాట్లు దేశవ్యాప్తంగా 19వ శతాబ్దంలోనే ప్రారంభమయ్యాయి. తెలంగాణలో రాంజీ గోండు, కుమురం భీం తిరుగుబాట్లు ప్రధానమైనవి.


రాంజీ గోండు: తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా గిరిజనులు రాంజీ గోండు నాయకత్వంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1836-60 మధ్యకాలంలో తిరుగుబాటు చేశారు. ఆంగ్లేయులను ముప్పుతిప్పలు పెట్టారు. బ్రిటిష్‌ ప్రభుత్వం రాంజీ గోండును బంధించి ఉరి తీసి, తిరుగుబాటును అణచివేసింది. ఈ పోరాటం గిరిజనుల్లో తిరుగుబాటు ఆలోచనా ధోరణిని మరింత ప్రేరేపించింది.


కుమురం భీం: ఆసిఫాబాదు ప్రాంతానికి చెందిన గోండు ఆదివాసీ నాయకుడు కుమురం భీం. వంశపారపర్యంగా వస్తున్న తమ పోడు వ్యవసాయ భూములను వడ్డీ వ్యాపారులు, ప్రభుత్వ అధికారుల కారణంగా కోల్పోయాడు. దాంతోపాటు అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారుల అకృత్యాలు ఎక్కువవడంతో గోండులు, కొల్లాం ఆదివాసులతో కలిసి నిజాం అధికారులపై తిరుగుబాటు చేశాడు. సంప్రదాయ ఆయుధాలతో నిజాం ప్రభుత్వంపై గొరిల్లా దాడులతో యుద్ధం ప్రకటించాడు. వీరిని ప్రత్యక్షంగా ఎదుర్కోలేని నిజాం సైన్యం మోసపూరితంగా స్థావరాలపై దాడి చేసింది. కుమురం భీం తో పాటు మిగిలిన తిరుగుబాటుదారులపై కాల్పులు జరిపి చంపేసింది. ఆ విధంగా కుమురం భీం తిరుగుబాటు ముగిసింది.

కుమురం భీం తిరుగుబాటు నిజాం ప్రభుత్వాన్ని కుదిపివేసింది. నాటి నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ (ఏడో నిజాం) అప్పటి ఆదిలాబాద్‌ జిల్లాలోని గోండు ఆదివాసీల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంత్రోపాలజిస్టు క్రిస్టఫర్‌ వి.ఫ్యూరర్‌ హైమన్‌డార్ఫ్‌ను నియమించాడు. ఇతడు గోండు ఆదివాసీల మధ్యనే జీవిస్తూ, వారిలో అక్షరాస్యత పెంపొందించి, సమస్యల పరిష్కారానికి ఎనలేని సేవ చేశాడు. అందుకే క్రిస్టఫర్‌ను గోండులు నేటికీ ఆరాధ్య దైవంగా భావిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని