జాతిని ఏకం చేసి.. జాతీయతను చాటి!

బ్రిటిష్‌ వలస పాలకుల దోపిడీలపై తిరగబడిన భారతీయులు రకరకాల పోరాటాలు జరిపారు. ఎక్కడికక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకొని స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఉమ్మడి కార్యాచరణ, సైద్ధాంతిక ఏకత్వం, మార్గదర్శనం లేకపోవడంతో ఆ పోరాటాల ఫలితాలు పరిమితంగా ఉండేవి.

Published : 02 Aug 2022 01:55 IST

ఆధునిక భారతదేశ చరిత్ర

బ్రిటిష్‌ వలస పాలకుల దోపిడీలపై తిరగబడిన భారతీయులు రకరకాల పోరాటాలు జరిపారు. ఎక్కడికక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకొని స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఉమ్మడి కార్యాచరణ, సైద్ధాంతిక ఏకత్వం, మార్గదర్శనం లేకపోవడంతో ఆ పోరాటాల ఫలితాలు పరిమితంగా ఉండేవి. ఈ దశలో అందరి ఆశలను, ఆశయాలను సాధించే లక్ష్యంతో ఒక ఉన్నతస్థాయి వేదిక ఏర్పడింది. అదే భారత జాతీయ కాంగ్రెస్‌. ప్రజల్లో జాతీయ భావాన్ని రగిలించి, స్వాతంత్య్ర సమరం వైపు నడిపించడంలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్‌ ఆవిర్భావం, అంతకు ముందు ఉన్న సంస్థల గురించి అభ్యర్థులు తెలుసుకోవాలి.


భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం పూర్వం ఉన్న సంస్థలు

భారత జాతీయవాదం అనేక శక్తుల కలయిక ఫలితంగా ఉద్భవించింది. ఇందుకు కొన్ని శక్తులు బీజం వేస్తే మరికొన్ని పోషించి రూపుదిద్దాయి. కొన్ని లక్ష్య నిర్దేశం చేసి మార్గం ఏర్పరిచాయి. 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనతో జాతీయవాదానికి, భారతీయుల రాజకీయ పోరాటాలకు ఒక జాతీయ వేదిక ఏర్పడింది. అయితే కాంగ్రెస్‌కు ముందు కూడా దేశంలో స్థానికంగా కొన్ని సంస్థలు ఏర్పాటై, బ్రిటిష్‌ పాలనలో భారతీయులకు జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రజలను చైతన్యపరుస్తూ ఉద్యమాలు నిర్వహించాయి. వీటికి పరిపూర్ణ రూపంగా కాంగ్రెస్‌ ఆవిర్భవించింది.  కలకత్తాలో మొదట 1838లో వెలిసిన సంస్థ ‘ల్యాండ్‌ హోల్డర్స్‌ సొసైటీ’. దీన్ని జమీందారీ అసోసియేషన్‌ అనేవారు. ద్వారకానాథ్‌ ఠాగూర్‌, దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ లాంటివారు దీన్ని స్థాపించారు. ఈ సంస్థ బెంగాల్‌ ప్రావిన్స్‌లో జమీందారుల హక్కుల రక్షణ, వారి ప్రయోజనాల కోసం ఏర్పడింది. 1843లో జార్జ్‌ థామ్సన్‌ కలకత్తాలో స్థాపించిన ‘బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సొసైటీ’ మరిన్ని విస్తృత ప్రయోజనాల కోసం అంటే భారతీయుల ఇక్కట్లను ఇక్కడి ప్రభుత్వం దృష్టికి, అలాగే బ్రిటన్‌లోని ఆంగ్లేయుల దృష్టికి తీసుకెళ్లడానికి ఉద్దేశించింది. ఆ తర్వాత ల్యాండ్‌ హోల్డర్స్‌ సొసైటీ, బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సొసైటీలు 1851లో ఏకమై ‘బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’గా అవతరించాయి. దీని స్థాపకులు దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌, రాధాకాంత్‌ దేవ్‌, ప్రసన్నకుమార్‌ ఠాగూర్‌ తదితరులు. ఆంగ్ల విద్యావకాశాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని, కంపెనీ ఉన్నతోద్యోగాల్లో భారతీయులను నియమించాలని ఈ అసోసియేషన్‌ ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చింది. ఆ ప్రయత్నాలు కొంతవరకు 1853 చార్టర్‌ చట్టంలో ప్రతిబింబించాయి. 1852లో బొంబాయి నేటివ్‌ అసోసియేషన్‌ను జగన్నాథ్‌ శంకర్‌ సేథ్‌ స్థాపించగా, అదే ఏడాది మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ను గాజుల లక్ష్మినరసు చెట్టి, సి.మొదలియార్‌ స్థాపించారు. ఈ రెండు సంస్థలు కౌన్సిళ్లలో భారతీయుల సంఖ్య పెంచాలని, ఆధునిక విద్యావ్యాప్తి చేయాలని, ఉన్నత ఉద్యోగాల్లో  భారతీయులను నియమించాలని కోరాయి. ఇలాంటి సంస్థలు దేశవ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో ఏర్పడ్డాయి. వీటిలో విద్యావంతులే ముఖ్యపాత్ర పోషించారు. తదనంతరం భారతీయ విద్యావంతులు, బ్రిటిష్‌ పాలన నిజస్వరూప స్వభావాలు, దాని దుష్పరిణామాలను అర్థం చేసుకున్నారు. క్రమంగా బ్రిటిష్‌ విధానాల పట్ల విమర్శనాత్మక వైఖరి అవలంబించారు.

దాదాభాయ్‌ నౌరోజీ 1866లో లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్‌ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ శాఖలు బొంబాయి, మద్రాసు వంటి నగరాల్లో ఏర్పాటయ్యాయి. భారతీయుల సమస్యలు బ్రిటిష్‌ ప్రజల దృష్టికి తెచ్చి, వారిని భారతదేశానికి అనుకూలంగా మార్చడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. భారతదేశ పేదరికానికి మూలకారణం బ్రిటిషర్ల పాలనే అని చెప్పిన మొదటి వ్యక్తి నౌరోజీ. 1870లో మహారాష్ట్రలోని పూనాలో ఎం.జి.రనడే, వాసుదేవ్‌జోషి లాంటివారు కలిసి ‘పూనా సార్వజనీక సభ’ స్థాపించారు. ఈ సంస్థ బొంబాయి ప్రావిన్స్‌లో సంస్కరణలు కావాలని ప్రభుత్వాన్ని కోరుతూ రాజకీయ చైతన్యం కలిగించింది. 1872లో ఆనంద మోహన్‌బోస్‌ లండన్‌లో ఇండియన్‌ సొసైటీని స్థాపించి భారతీయులకు ఉన్నత ఉద్యోగాలు ఇవ్వాలని, పాలనలో సంస్కరణలు తేవాలని కోరాడు. 1884లో ఆనందాచార్యులు,  జి.సుబ్రహ్మణ్యం, వీరరాఘవాచార్యులు వంటి ఔత్సాహికులు ‘మద్రాసు మహాజన సభ’ను స్థాపించారు. 1885లో ఫిరోజ్‌ షా మెహతా, కె.టి.తెలాంగ్‌, బద్రుద్దీన్‌ త్యాబ్జీ వంటి రాజకీయ ప్రముఖులు ‘బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌’ను స్థాపించి పాలనా విధానాలను, శాసన నిర్మాణ తీరును విమర్శించేవారు. ఆనాటి బెంగాల్‌కు చెందిన విద్యావంతులైన యువకుల్లో బ్రిటిష్‌ పాలన పట్ల అవగాహన, చైతన్యం కలిగించినవారిలో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద మోహన్‌ బోస్‌ ముఖ్యులు. వీరు 1876లో ఇండియన్‌ అసోసియేషన్‌ స్థాపించారు. ఈ సంస్థ సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు గరిష్ఠ వయసు పెంపు, పరీక్షలో సంస్కరణలు కోరుతూ ఆందోళన ప్రారంభించింది. దీనికి విద్యావంతులు, ఇతర వర్గాల ప్రజల మద్దతు కూడగట్టేందుకు సురేంద్రనాథ్‌ దేశమంతటా పర్యటించాడు. కౌలుదారుల హక్కుల పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం కూడా ఆందోళనలు నిర్వహించాడు. ఈ విధంగా 1838 నుంచి 1885లో కాంగ్రెస్‌ స్థాపన వరకు దేశంలో అనేక సంస్థలు ఆవిర్భవించాయి. ఇవన్నీ చాలావరకు వర్గ ప్రయోజనాల కోసం నెలకొల్పినవే. వాటిలో సభ్యత్వం కూడా స్థానిక ప్రాంతాలకే పరిమితమైంది. కానీ ఆ సంస్థలన్నీ దేశ ప్రజల్లో రాజకీయ చైతన్యం కలిగించడంలో కీలకపాత్ర పోషించాయి.పాశ్చాత్య విద్యలో విద్యావంతులైన సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనందమోహన్‌ బోస్‌, ఉమేష్‌చంద్ర బెనర్జీ, దాదాభాయ్‌ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా, కె.టి.తెలాంగ్‌, ఎం.జి.రనడే లాంటి ప్రముఖులు అఖిల భారత స్థాయిలో ఒక సంస్థ ఉండాల్సిన అవసరాన్ని గుర్తించారు.

దేశానికంతటికీ ప్రాతినిధ్యం వహించే సంస్థ అవసరాన్ని గుర్తించి, రాజకీయ చైతన్యంతో ఉన్న నాయకుల ఆశలకు ఒక నిర్దిష్ట రూపం కల్పించినవారు ఆంగ్లేయుడైన రిటైర్డ్‌ సివిల్‌ సర్వెంట్‌ అలెన్‌ ఓక్టావియన్‌ హ్యూమ్‌ (ఏఓ హ్యూమ్‌). విద్యావంతులైన భారతీయుల అభిప్రాయాలను ప్రతిబింబించే అఖిలభారత సంస్థ ఏర్పాటుకు హ్యూమ్‌ కృషి చేశాడు. భారత రాజకీయ నాయకులందరినీ కూడగట్టి 1885లో భారతీయ జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. ఆనాటి రాజప్రతినిధి (గవర్నర్‌ జనరల్‌) లార్డ్‌ డఫ్రిన్‌. 1885, డిసెంబరు 28న 72 మంది సభ్యులతో ఉమేష్‌ చంద్ర బెనర్జీ అధ్యక్షతన బొంబాయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాల ప్రాంగణంలో కాంగ్రెస్‌ చరిత్రాత్మక తొలి సమావేశం జరిగింది. ఆ సభకు దిన్‌షా వాదా, దాదాభాయ్‌ నౌరోజీ, ఫిరోజ్‌ షా మెహతా, పి.రంగయ్య నాయుడు, సి.ఆనందాచార్యులు, కేశవ పిళ్లై లాంటి ప్రముఖులు హాజరయ్యారు. 1885లో ఆవిర్భవించిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు 1886లో కలకత్తాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన, 1887లో మద్రాసులో బద్రుద్దీన్‌ త్యాబ్జీ అధ్యక్షతన జరిగాయి. కాంగ్రెస్‌ అచిరకాలంలోనే భారత ప్రజల ఆశలకు ప్రతిరూపమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని