కుడిఎడమల్లో కొన్ని నియమాలు!

స్విచ్‌ వేయగానే భూమిలోని నీళ్లను లాగి ఇంటిపై ట్యాంకులో పోసేస్తుంది ఒక మోటార్‌. నిప్పులేకుండా వంట వండేస్తుంది ఇంకో ఇండక్షన్‌ స్టవ్‌. ఎవరో వచ్చారు తలుపు తీయమని పిలుస్తుంది మరో ఎలక్ట్రిక్‌ కాలింగ్‌బెల్‌. ఇవన్నీ చేసేపనులు వేరైనా, వాటి వెనుక పనిచేసే సూత్రం మాత్రం ఒకటే.

Published : 03 Aug 2022 02:04 IST

జనరల్‌ స్టడీస్‌ - ఫిజిక్స్‌


స్విచ్‌ వేయగానే భూమిలోని నీళ్లను లాగి ఇంటిపై ట్యాంకులో పోసేస్తుంది ఒక మోటార్‌. నిప్పులేకుండా వంట వండేస్తుంది ఇంకో ఇండక్షన్‌ స్టవ్‌. ఎవరో వచ్చారు తలుపు తీయమని పిలుస్తుంది మరో ఎలక్ట్రిక్‌ కాలింగ్‌బెల్‌. ఇవన్నీ చేసేపనులు వేరైనా, వాటి వెనుక పనిచేసే సూత్రం మాత్రం ఒకటే. దానికి సంబంధించి శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన నియమాలను, నిత్యజీవిత అనువర్తనాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.

విద్యుదయస్కాంత ప్రేరణ నియమాలు
విద్యుత్‌ వల్ల ఏర్పడే అయస్కాంత ఫలితాలు, అయస్కాంతం వల్ల ఏర్పడే విద్యుత్‌ ఫలితాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని విద్యుదయస్కాంత శాస్త్రం అంటారు. విద్యుత్‌, అయస్కాంతం పరస్పరం ప్రేరేపించుకుంటాయి. ఈ ప్రక్రియను విద్యుదయస్కాంత ప్రేరణ అంటారు.


ఆయిర్‌స్టెడ్‌ నియమం

విద్యుత్‌ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుందని 1820లో ఆయిర్‌స్టెడ్‌ అనే శాస్త్రవేత్త నిరూపించాడు. దీన్ని ఆయిర్‌స్టెడ్‌ నియమం అంటారు.  తర్వాత భౌతిక శాస్త్రవేత్తలు విద్యుత్‌, అయస్కాంతత్వం వేర్వేరు కాదు, అవి ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయనే నిర్ధారణకు వచ్చారు.
అదేవిధంగా ఆయిర్‌స్టెడ్‌ నియమం ప్రకారం చలనంలో ఉన్న ఆవేశ కణాలు విద్యుత్‌, అయస్కాంత క్షేత్రాలను ఉత్పత్తి చేస్తాయని అర్థమవుతుంది. నిశ్చల స్థితిలోని ఆవేశ కణాలు విద్యుత్‌ క్షేత్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తాయి.


ఆంపియర్‌ కుడి చేయి నిబంధన

ఈ నిబంధన విద్యుత్‌ ప్రవహిస్తున్న వాహకం చుట్టూ ఏర్పడిన ప్రేరిత అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది. దీని ప్రకారం కుడి చేయి బొటనవేలు విద్యుత్‌ ప్రవహిస్తున్న దిశలో ఉండే విధంగా వాహకాన్ని పట్టుకుంటే, మిగిలిన నాలుగు వేళ్లు ముడుచుకునే దిశ వాహకం చుట్టూ ఏర్పడిన అయస్కాంతక్షేత్ర దిశను తెలియజేస్తుంది.
కుడి చేయి నిబంధన నుంచి సవ్యదిశలో విద్యుత్‌ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అభిముఖం దక్షిణ ధ్రువంలా ప్రవర్తిస్తుంది. అదేవిధంగా అపసవ్య దిశలో విద్యుత్‌ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అభిముఖం ఉత్తర ధ్రువంలా ప్రవర్తిస్తుంది. విద్యుత్‌ ప్రవాహ దిశను ధనావేశ ప్రవాహ దిశగా పరిగణిస్తారు.

ఫ్లెమింగ్‌ ఎడమ చేయి నిబంధన
విద్యుత్‌ ప్రవహిస్తున్న వాహకాన్ని బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు దానిపై కలిగే బల దిశను ఈ నిబంధన తెలియజేస్తుంది. దీని ప్రకారం ఎడమ చేయి చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేళ్లను ఒకదానికొకటి లంబంగా ఉంచినట్లయితే చూపుడు వేలు బాహ్య అయస్కాంత క్షేత్ర దిశను, మధ్య వేలు విద్యుత్‌ ప్రవాహ దిశను, బొటనవేలు వాహకంపై కలిగే బలదిశను తెలియజేస్తాయి. విద్యుత్‌ మోటార్‌లు ఈ నిబంధన ప్రకారం పనిచేస్తాయి.


ఫారడే నియమం

దీనినే న్యూమన్‌ నియమం అంటారు. ఇందులో విద్యుత్‌ ప్రవాహం లేని ఒక వలయంలోకి మారుతున్న అయస్కాంత క్షేత్రం ప్రవేశిస్తే దానిలో విద్యుత్‌ ప్రవాహం ప్రేరేపితమవుతుంది.  
అనువర్తనాలు: * విద్యుత్‌ మోటార్‌లు, జనరేటర్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఎలక్ట్రిక్‌ ఫ్యాన్‌లు, మిక్సర్‌ గ్రైండర్‌లు పనిచేయడం.
* మైక్రోఫోన్‌లు, లౌడ్‌స్పీకర్‌లు, ఎలక్ట్రిక్‌ కాలింగ్‌ బెల్‌లు పనిచేయడం.
* ఇండక్షన్‌ స్టవ్‌లు పనిచేసే సూత్రం.
* రేడియోలు, టేపు రికార్డర్‌లు, సెక్యూరిటీ చెక్‌ పనిచేయడం.


ఫ్లెమింగ్‌ కుడిచేయి నిబంధన
ఈ నియమం వాహకంలో ప్రేరేపితమయ్యే విద్యుత్‌ ప్రవాహదిశను తెలియజేస్తుంది. దీని ప్రకారం కుడిచేయి బొటనవేలు, చూపుడువేలు, మధ్య వేళ్లను ఒకదానికొకటి లంబంగా ఉంచితే, బొటనవేలు బలదిశను, చూపుడు వేలు ప్రయోగించిన అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తే మధ్యవేలు ప్రేరిత విద్యుత్‌ ప్రవాహదిశను తెలియజేస్తుంది. జనరేటర్‌లు ఈ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి.
లెంజ్‌ నియమం
వాహకంలో ప్రేరేపితమైన విద్యుత్‌ ప్రవాహ దిశ ఎల్లప్పుడూ దానికి కారణమైన దాన్ని వ్యతిరేకించే దిశలో ఏర్పడుతుంది. ఈ నియమం శక్తి నిత్యత్వ నియమాన్ని తెలియజేస్తుంది. దీన్నే ఫారడే రెండో నియమం అని కూడా అంటారు.
స్వయం ప్రేరణ: ఒక వాహక సంవృత పరిపథం ద్వారా విద్యుత్‌ ప్రవహిస్తున్నప్పుడు ఆ విద్యుత్‌ ప్రవాహం వల్ల అదే వాహకంలో ప్రేరిత విద్యుత్‌ పుట్టడాన్ని స్వయంప్రేరణ అంటారు. దీని గురించి వివరించే భౌతికరాశి స్వయం ప్రేరణ గుణకం లేదా స్వయం ప్రేరకత్వం.
అన్యోన్య ప్రేరణ: ఒక చుట్టలోని విద్యుత్‌ మార్పు వల్ల దగ్గరలోని మరో తీగచుట్టలో విద్యుత్‌ ప్రేరేపితమయ్యే ప్రక్రియను అన్యోన్య ప్రేరణ అంటారు. దీన్ని వివరించే భౌతికరాశి అన్యోన్య ప్రేరణ గుణకం లేదా అన్యోన్య ప్రేరకత్వం.
*  స్వయం ప్రేరకత్వం, అన్యోన్య ప్రేరకత్వాలకు ళీ.ఖి. ప్రమాణాలు హెన్రీ లేదా వోల్ట్‌.సెకన్‌/ఆంపియర్‌ లేదా వెబర్‌/ఆంపియర్‌

ట్రాన్స్‌ఫార్మర్‌ లేదా పరివర్తకం
ఏకాంతర వోల్టేజ్‌ (ఏసీ వోల్టేజ్‌)ను పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగించే సాధనాన్ని ట్రాన్స్‌ఫార్మర్‌ అంటారు.అది అన్యోన్య ప్రేరణ అనే సూత్రంపై ఆధారపడి పని చేస్తుంది. ఏకాంతర వలయంలో మాత్రమే పనిచేస్తుంది. ఏసీ వోల్టేజ్‌ను పెంచే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆరోహణ పరివర్తకం లేదా స్టెప్‌-అప్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అంటారు. దీనిలో కరెంట్‌ విలువ తగ్గుతుంది. దీన్ని ఎక్కువగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల వద్ద ఉపయోగిస్తారు. ఏసీ వోల్టేజ్‌ను తగ్గించే ట్రాన్స్‌ఫార్మర్‌ను అవరోహణ పరివర్తకం లేదా స్టెప్‌-డౌన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అంటారు. దీనిలో కరెంట్‌ విలువ పెరుగుతుంది. దీన్ని ఎక్కువగా సబ్‌స్టేషన్‌ల వద్ద ఉపయోగిస్తారు. ఏ రకమైన ట్రాన్స్‌ఫార్మర్‌లో అయినా విద్యుత్‌ సామర్థ్యం స్థిరంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని