శిథిలమవుతూ.. సమం చేస్తూ!

ఎవరో శ్రద్ధగా సర్దిపెట్టినట్లు ఉంటాయి కొన్ని శిలలు. పనిగట్టుకొని సమం చేసినట్లు ఏర్పడతాయి ఇంకొన్ని నేలలు. యంత్రంతో చిత్రిక పట్టినట్లు గుండ్రంగా తయారవుతాయి ఎన్నో రాళ్లు. వీచే గాలి, కరిగే మంచు, ప్రవహించే నీరు వీటికి కారణాలంటే విచిత్రంగా అనిపిస్తుంది.

Published : 04 Aug 2022 03:47 IST

జనరల్‌ స్టడీస్‌  
ప్రపంచ భూగోళశాస్త్రం

ఎవరో శ్రద్ధగా సర్దిపెట్టినట్లు ఉంటాయి కొన్ని శిలలు. పనిగట్టుకొని సమం చేసినట్లు ఏర్పడతాయి ఇంకొన్ని నేలలు. యంత్రంతో చిత్రిక పట్టినట్లు గుండ్రంగా తయారవుతాయి ఎన్నో రాళ్లు. వీచే గాలి, కరిగే మంచు, ప్రవహించే నీరు వీటికి కారణాలంటే విచిత్రంగా అనిపిస్తుంది. పైనుంచి చేతులతో నెట్టినట్లు సముద్రాల్లో నీటిమట్టం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఆ నిర్వాకం సూర్యచంద్రులదే అంటే నమ్మాల్సిందే. ఈ ఆసక్తికరమైన అంశాలను జాగ్రఫీ అధ్యయనంలో భాగంగా తెలుసుకుంటే పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది.


వికోషీకరణం

భూస్వరూపాల నిర్మాణం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. దీనిపై బాహ్య బలాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. అంతర బలాలు  (Endogenetic forces) భూభాగాన్ని ఉత్థానపరిస్తే (uplift), బాహ్య బలాలు ఈ ఉత్థాన భాగాలను శైథిల్యం, క్రమక్షయం అనే ప్రక్రియల ద్వారా సమం చేస్తాయి. ఇలా శిలలను శిథిలం చేయడం, భూఉపరితలాన్ని సమం చేసే ప్రక్రియను వికోషీకరణం (Denudation) అంటారు. శిలాశైథిల్యం, క్రమక్షయం అనే రెండు రకాలుగా వికోషీకరణం కనిపిస్తుంది.


శిలాశైథిల్యం

భూ పటలంలోని శిలలు వాతావరణంలోని భౌతిక, రసాయన కారణాల వల్ల కృశించి శిథిలమవటాన్ని శిలాశైథిల్యం అంటారు. ఇది శబ్దరహితంగా, గమనరహితంగా, వేగరహితంగా జరిగే నిరంతర ప్రక్రియ. ఇది శిలల కాఠిన్యంపైన, వాటి భౌతిక, రసాయనిక సంఘటనలపైన ఆధారపడి ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల శిలాపదార్థాల రవాణా జరగదు.

ప్రభావితం చేసే అంశాలు: శిలాశైథిల్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో శిలా స్వభావం (Nature of rock), శీతోష్ణస్థితి (Climate), కాలం (Time) ముఖ్యమైనవి.

* శిలాశైథిల్యాన్ని తిరిగి రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

ఎ) భౌతిక లేదా యాంత్రిక శిలాశైథిల్యం: శిలల రసాయనిక సంఘటనంలో ఎలాంటి మార్పు లేకుండా కేవలం శిలలు భౌతికంగా శిథిలం కావడాన్ని భౌతిక శిలాశైథిల్యం అంటారు. దీనికి కారణాలు ఉష్ణోగ్రతల్లో మార్పులు, మంచు, జంతు, వృక్షాల వల్ల కలిగే ఒత్తిడి. ఉష్ణోగ్రత తారతమ్యాల వల్ల జరిగే భౌతిక శిలాశైథిల్యం ఎక్కువగా భూమధ్యరేఖా, ఎడారి ప్రాంతాల్లో జరుగుతుంది. ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో మంచు వల్ల శిలాశైథిల్యం సంభవిస్తుంది.

బి) రసాయనిక శిలాశైథిల్యం: శిలల రసాయనిక సంఘటనంలో మార్పులు రావడం వల్ల జరిగే శైథిల్యాన్ని రసాయనిక శిలాశైథిల్యం అని పిలుస్తారు. ఇది ఎక్కువగా అధిక వర్షపాతం, సున్నపురాయి ఉండే భౌగోళిక ప్రాంతాల్లో జరుగుతుంది. భూమధ్యరేఖ ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉంటుంది.


క్రమక్షయం

శిలాశైథిల్యం వల్ల శిలల పైభాగంలో ఏర్పడిన శైథిల్య పదార్థాన్ని (Regolith) పవనాలు, నదులు, హిమానీనదాలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి రవాణా చేస్తాయి. ఈ రవాణా జరిగేటప్పుడు శిలా పదార్థం మరింత ఎక్కువ శైథిల్యం అవుతుంది. దీన్నే క్రమక్షయం అంటారు.


అపదళనం: శిలలపై పొరలు లోపలి భాగం కంటే వేడెక్కి పొరలు పొరలుగా ఊడిపోయి గుండ్రని రాళ్లుగా మారితే అలాంటి శిలాశైథిల్యాన్ని అపదళనం (Exfoliation) అంటారు. అపదళనం వల్ల గుండ్రంగా మారిన శిలలను టార్స్‌ (Tors) అంటారు. ఇది అధికంగా గ్రానైట్‌ శిలలో జరుగుతుంది. ఇవి ఎక్కువగా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో కనిపిస్తాయి.

* ఉష్ణోగ్రత అధికంగా ఉండే శుష్క శీతోష్ణస్థితి, ఎడారి ప్రాంతాల్లో భౌతిక శిలాశైథిల్యం ఎక్కువగా జరుగుతుంది. వర్షపాతం, ఆర్ద్రత అధికంగా ఉన్న  ఆర్ద్ర శీతోష్ణస్థితి ప్రాంతంలో రసాయనిక శిలాశైథిల్యం అధికంగా కనిపిస్తుంది. ధ్రువ ప్రాంతాలు, అధిక అక్షాంశ ప్రాంతాల్లో మంచు వల్ల జరిగే భౌతిక శైథిల్యం ఏర్పడుతుంది.

రిగోలిత్‌: శిలలు శైథిల్యం చెందినప్పుడు శైథిల్యం చెందిన పదార్థం శిలల ఉపరితలంపై ఒక మృదువైన పొరగా ఏర్పడుతుంది. దీన్నే రిగోలిత్‌ అంటారు.

ఆధార శిల: రిగోలిత్‌ కింద ఉండే శైథిల్యానికి గురికాని దృఢమైన శిలనే ఆధార శిల (Bedrock) అంటారు.


పోటుపాట్లు

సముద్ర నీటి మట్టం పెరగడాన్ని పోటు, తగ్గడాన్ని పాటు అంటారు. వీటినే ఆటుపోట్లు అని కూడా వ్యవహరిస్తారు. ఇవి రావడానికి కారణం సూర్యచంద్రుల గురుత్వాకర్షణ బలాలు. పోటుకు, పాటుకు మధ్య కాలవ్యవధి 6 గంటల 13 నిమిషాలు ఉంటుంది. పోటుకు, పోటుకు అలాగే పాటుకు, పాటుకు మధ్య 12 గంటల 26 నిమిషాల వ్యవధి ఉంటుంది. పోటుకు, పాటుకు మధ్య పెరిగి తగ్గిన నీటి వ్యత్యాసాన్ని వేలా పరిమితి అంటారు. ఈ సమయంలో వచ్చే తరంగాలను వేలా తరంగాలు అంటారు. ఇవి నాలుగు రకాలు. 1) పర్వ వేలా తరంగాలు, 2) లఘువేలా తరంగాలు, 3) విషవత్తు వేలా తరంగాలు 4) ఆయనాంత తరంగాలు.

లాభాలు:

* పోటు ఉంటే జాలర్లు సముద్రం నుంచి బయటకు వస్తారు. పాటు ఉంటే సముద్రంలోకి వెళతారు.

* నదులు సముద్రాల్లో కలిసేటప్పుడు అవి తీసుకొచ్చిన నిక్షేపాలు ఖండ తీరపు అంచుల్లో పేరుకుపోకుండా తీరపు వాలులోకి తీసుకెళ్లి తీరాన్ని శుభ్రం చేస్తాయి.

* పోటు, పాటులపైన ఆధారపడిన ఓడరేవులో ఇవి బాగా సహకరిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని