Published : 06 Aug 2022 05:34 IST

ఎక్కడి నుంచి.. ఎక్కడికైనా!

తెలంగాణ భూగోళశాస్త్రం

అస్సాం టీ పక్కనే పచారీ షాపులో దొరుకుతుంది. కొరియాలో తయారైన కారు ఎదురు వీధిలోనే అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. దుబాయి సెంటు ఇంటికే తీసుకొచ్చి విక్రయిస్తారు. ఇలా ఎన్నో వస్తువులు ఎక్కడెక్కడో ఉత్పత్తి అయ్యి ఇక్కడికి చేరుతుంటాయి. ఆ విధంగా అవసరమైన, నాణ్యమైన సరకులను సరసమైన ధరలకు సరైన సమయంలో అందించే అద్భుత వ్యవస్థ రవాణా రంగం. ఆర్థిక ప్రగతిలో అత్యంత కీలమైన  అలాంటి అవస్థాపన సౌకర్యాలకు సంబంధించిన మౌలికాంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోసం తెలుసుకోవాలి.

రవాణా

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత మౌలిక సౌకర్యాల కల్పనలో రవాణా రంగం కీలకపాత్ర పోషిస్తోంది. పారిశ్రామికీకరణ, ఆర్థిక ప్రగతి జరగాలంటే మౌలిక సౌకర్యాలతో పాటు రవాణాను అభివృద్ధి పరచడం ఎంతో అవసరం. వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయడమే రవాణా. ఉత్పత్తి సంస్థల నుంచి వస్తువులను వినియోగదారులకు అందించడం దాని ప్రధాన లక్ష్యం. రోడ్డు, రైల్వేలు, జల, వాయు మార్గాల ద్వారా రవాణా జరుగుతుంది.


రోడ్లపై..

సామాన్య ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైన రవాణా విధానం ఇది. మొత్తం ప్రయాణికులు, వస్తువుల రవాణాలో 80 శాతం రోడ్డు మార్గంలోనే జరుగుతుంది. దేశంలో మొదట 1943 నాగ్‌పుర్‌ అభివృద్ధి ప్రణాళిక ద్వారా రోడ్లను నాలుగు రకాలుగా విభజించారు.

ఎ) జాతీయ రహదారులు: రెండు రాష్ట్ర రాజధానుల మధ్య ప్రధాన జిల్లాలు, రేవు పట్టణాలను కలిపే రహదారులను జాతీయ రహదారులు అంటారు. ఇవి కేంద్రం అధీనంలో ఉంటాయి. తెలంగాణలో 2019-20 నాటికి మొత్తం జాతీయ రహదారుల సంఖ్య 24. వీటి పొడవు 3,910 కి.మీ.

* ఎన్‌హెచ్‌ - 44: మహారాష్ట్ర సరిహద్దు నుంచి ఆదిలాబాద్‌ - నిర్మల్‌ - రామాయంపేట - చేగుంట, హైదరాబాద్‌ - జడ్చర్ల - ఏపీ సరిహద్దు వరకు ఉంది (519.64 కి.మీ.). ఇది రాష్ట్రంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి.

* ఎన్‌హెచ్‌ - 163: హైదరాబాద్‌, భువనగిరి, జనగాం - వరంగల్‌-వెంకటాపురం - ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు వరకు (306 కి.మీ.)

* ఎన్‌హెచ్‌ - 65: కర్ణాటక సరిహద్దు నుంచి జహీరాబాద్‌ - హైదరాబాద్‌ - సూర్యాపేట - ఏపీ సరిహద్దు (291.7 కి.మీ.)

* ఎన్‌హెచ్‌ - 150: కర్ణాటక సరిహద్దు యాదగిర్‌ నుంచి తెలంగాణ సరిహద్దు కృష్ణ రోడ్‌ (ఎన్‌హెచ్‌ 167) వరకు  (12.24 కి.మీ.)

* ఎన్‌హెచ్‌ - 61: మహారాష్ట్ర సరిహద్దు నర్సాపూర్‌ - నిర్మల్‌ మధ్య 57.30 కి.మీ. ఉంది.

* హైదరాబాద్‌ చుట్టూ నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఎన్‌ఓఆర్‌ఆర్‌) 158 కి.మీ. పొడవు, 150 మీ. వెడల్పు (రైట్‌ ఆఫ్‌ వే- ఆర్‌ఓడబ్ల్యూ)తో మొత్తం 19 ఎగ్జిట్స్‌ (దారుల)ను కలిగి ఉంది. దీన్ని 2013లో ప్రారంభించారు. ఔటర్‌ తరహాలోనే సుమారు 340 కి.మీ. పొడవైన రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ ప్రక్రియ మొదలైంది.

* దేశంలో పొడవైన ఫ్లైఓవర్‌ ‘పీవీ నర్సింహారావు ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే’ను హైదరాబాద్‌లో మెహిదీపట్నం - ఆరాంఘర్‌ (శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌) మధ్య 11.6 కి.మీ. పొడవుతో నిర్మించారు.

బి) రాష్ట్ర రహదారులు: రాష్ట్ర, జిల్లా రహదారులు రోడ్లు, భవనాల మంత్రిత్వశాఖ (ఆర్‌ అండ్‌ బీ) ఆధ్వర్యంలో ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 27,652 కి.మీ. పొడవున ఈ రోడ్లు విస్తరించి ఉన్నాయి. ఇందులో 2,149 కి.మీ. రాష్ట్ర రహదారులు, 12,071 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, 13,350 కి.మీ. ఇతర జిల్లా రహదారులున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 24 రాష్ట్ర రహదారులు ఉన్నాయి.

ఎస్‌హెచ్‌ - 1: రాష్ట్రంలో పొడవైన స్టేట్‌ హైవే. ఇది హైదరాబాద్‌ నుంచి మేడ్చల్‌, సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల వరకు (237కి.మీ.)ఉంది.

ఎస్‌హెచ్‌ - 9 జనగాం - చేర్యాల - దుద్దెడ 46.5 కి.మీ.లతో రాష్ట్రంలో అతి చిన్న రాష్ట్ర రహదారి.

సి) పంచాయతీరాజ్‌ రోడ్లు (గ్రామీణ రోడ్లు): రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఇంజినీరింగ్‌ మంత్రిత్వ శాఖ (పీఆర్‌ఈడీ) నిర్వహణలో ఉంటాయి. ప్రస్తుతం దీని కింద 69,844 కి.మీ. పొడవైన రోడ్లు ఉన్నాయి. ఇందులో తారు (బీటీ), సిమెంట్‌ (సీసీ) రోడ్లు 29,287 కి.మీ., కంకర (ఎమ్‌టీ) రోడ్లు 9,894 కి.మీ., మట్టి, ఇసుక రోడ్లు కలిపి 30,662 కి.మీ. ఉన్నాయి.

రాష్ట్రంలో 2020-21 గణాంకాల ప్రకారం 1,07,871 కి.మీ. పొడవున రోడ్లు ఉన్నాయి. అందులో 62.37% గ్రామీణ రోడ్లు, 25.65% రాష్ట్ర రహదారులు, 3.62% జాతీయ రహదారులు, 8.36% జీహెచ్‌ఎమ్‌సీ రోడ్లు ఉన్నాయి. రోడ్ల సాంద్రతను పరిశీలిస్తే 2020-21 ప్రకారం తెలంగాణలో ప్రతి చ.కి.మీ.కు 96 కి.మీ.లు ఉండగా, హైదరాబాద్‌లో గరిష్ఠంగా 4,154 కి.మీ. ఉన్నాయి. జిల్లాల వారీగా అత్యధిక రోడ్ల సాంద్రత వరంగల్‌ (130 కి.మీ./చ.కి.మీ.), కరీంనగర్‌ (121 కి.మీ./చ.కి.మీ.), ఖమ్మం (114 కి.మీ./చ.కి.మీ.)లో ఉండగా, అత్యల్ప సాంద్రత ములుగు (38 కి.మీ./చ.కి.మీ.), భద్రాద్రి (53 కి.మీ./చ.కి.మీ.), కుమురం భీమ్‌ (61 కి.మీ./చ.కి.మీ.) జిల్లాల్లో ఉంది.

* ప్రస్తుతం టీఎస్‌ఆర్‌టీసీలో 3 జోన్లు, 10 రీజియన్లు, 97 బస్‌ డిపోలు, 9,732 బస్సులు, 48,532 మంది ఉద్యోగులు ఉన్నారు.


రైళ్ల ద్వారా..

సామాన్య ప్రజలకు, పర్యాటకులకు రైలు రవాణా అనుకూలమైంది. రాష్ట్రంలో మొదటి రైలు మార్గం 1874లో నిజాం కాలంలో సికింద్రాబాద్‌ నుంచి వాడి (గుల్బర్గా) మధ్య 189 కి.మీ. పొడవున వేశారు. తర్వాత 1886లో సికింద్రాబాద్‌ - కాజీపేట మీదుగా విజయవాడ మార్గాన్ని పూర్తిచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,822 కి.మీ. పొడవైన రైలు మార్గం, 237 రైల్వేస్టేషన్లు ఉన్నాయి. 10 రైల్వే జంక్షన్లు ఉన్నాయి. రైల్వే శుభ్రతలో హైదరాబాద్‌-17, సికింద్రాబాద్‌-42, వరంగల్‌-51 ర్యాంకుల్లో ఉన్నాయి. మొత్తం 149 రైల్వేస్టేషన్లలో వైఫై సౌకర్యం ఉంది. 1966 అక్టోబరు 2న సికింద్రాబాద్‌ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఏర్పడింది.
మెట్రో రైల్‌: హైదరాబాద్‌లో కాలుష్య నివారణ, ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో 72 కి.మీ. పొడవు, 3 కారిడార్లతో మొత్తం 66 స్టేషన్లు ఉన్నాయి.

కారిడార్‌-1 రెడ్‌ లైన్‌: మియాపూర్‌ - ఎల్‌బి నగర్‌ మధ్య 29.87 కి.మీ., 27 స్టేషన్లు.

కారిడార్‌-2 గ్రీన్‌ లైన్‌: జేబీఎస్‌ పరేడ్‌గ్రౌండ్‌ - ఎంజీబీఎస్‌ మధ్య 9.6 కి.మీ., 9 స్టేషన్లు.

కారిడార్‌-3 బ్లూ లైన్‌: నాగోల్‌ - రాయ్‌దుర్గ్‌ మధ్య 28 కి.మీ., 23 స్టేషన్లు.

* 2022లో ప్రతిపాదించిన మెట్రో రైలు మార్గాలు

లైన్‌-1 రెడ్‌ లైన్‌: మియాపూర్‌ - లక్డీకాపూల్‌ - 22 కి.మీ.

లైన్‌-2 బ్లూ లైన్‌: రాయ్‌దుర్గ్‌ - రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌ - 31 కి.మీ.

లైన్‌-3 బ్లూ లైన్‌: నాగోల్‌ - ఎల్‌బి నగర్‌ -  5 కి.మీ.


వాయు యానంలో..

అత్యంత దూరాలను తక్కువ సమయంలో చేరుకోవడానికి వాయు రవాణా ఉపయోగపడుతుంది. ఇది విలాసవంతమైనది, ఖరీదైనది. రాష్ట్రంలో తొలి ఎయిర్‌పోర్ట్‌ను 1930లో మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ వరంగల్‌ మామునూర్‌ వద్ద నిర్మించారు. ఇండో-చైనా యుద్ధ సమయంలో ప్రభుత్వ విమానాలకు హ్యాంగర్‌గా పనిచేసింది. ఇది 1981 వరకు సేవలందించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు రకాల విమానాశ్రయాలున్నాయి.

అంతర్జాతీయ విమానాశ్రయం: రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌. దీని నిర్మాణాన్ని రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌లో 2008 మార్చిలో ప్రారంభించారు. ఇది దేశంలో తొలి గ్రీన్‌ఫీల్డ్‌, పీపీపీ ఎయిర్‌పోర్ట్‌. ఇందులో జీఎంఆర్‌ 63%, తెలంగాణ 13%, కేంద్రం 13%, మలేషియాకు 11% వాటాలు ఉన్నాయి.

డొమెస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌: ఇది బేగంపేట (సికింద్రాబాద్‌)లో ఉంది. దీన్ని వీఐపీ ఎయిర్‌పోర్ట్‌ అంటారు

మిలటరీ ఎయిర్‌పోర్ట్‌: హకీంపేట - మేడ్చల్‌, దుండిగల్‌ - మేడ్చల్‌

ప్రైవేట్‌ ఎయిర్‌పోర్ట్‌: రామగుండం - పెద్దపల్లి (ఆదిత్య బిర్లా)

సాధారణ ఎయిర్‌పోర్ట్‌: మామునూర్‌ - వరంగల్‌, నిజామాబాద్‌ - నిజామాబాద్‌ జిల్లా, కొత్తగూడెం - భద్రాద్రి (ప్రతిపాదిత), నాదర్‌గుల్‌ - రంగారెడ్డి.


జల మార్గంలో..

దీని ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో సరకు రవాణా చేయవచ్చు. కాలుష్య రహితమైంది. తెలంగాణకు సముద్ర జలమార్గాలు లేవు. గోదావరి-కృష్ణా నదుల మధ్య అంతఃస్థలీయ నీటి మార్గాలున్నాయి. దేశంలో ప్రస్తుతం 111 జాతీయ జలమార్గాలు (నేషనల్‌ వాటర్‌ వేస్‌-ఎన్‌డబ్ల్యూ) ఉన్నాయి. ఇందులో జాతీయ జలమార్గం-4 అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు మధ్య ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య భద్రాచలం-రాజమహేంద్రవరం, విజయవాడ - వాజీరాబాద్‌ (నాగార్జునసాగర్‌), నాగార్జునసాగర్‌ - శ్రీశైలం మధ్య స్టీమర్లు, తెప్పల ద్వారా ప్రయాణం జరుగుతోంది.

* అంతఃస్థలీయ జలరవాణా కోసం కేంద్రం నాలుగు భూపరివేష్టిత డ్రైపోర్ట్‌లను ప్రతిపాదించింది.

1) జహీరాబాద్‌ డ్రైపోర్ట్‌ - ఎన్‌హెచ్‌ 65

2) భువనగిరి డ్రైపోర్ట్‌ - ఎన్‌హెచ్‌ 163

3) జడ్చర్ల డ్రైపోర్ట్‌ - ఎన్‌హెచ్‌ 44

4) దామరచర్ల డ్రైపోర్ట్‌ - ఎస్‌హెచ్‌ 02

2021 నీతి ఆయోగ్‌ సూచీ ప్రకారం ఎగుమతి సంసిద్ధత  భూపరివేష్టిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం 47.92 మార్కులతో అయిదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో హరియాణా (53),  ఉత్తర్‌ప్రదేశ్‌ (51.09), మధ్యప్రదేశ్‌ (51.03), పంజాబ్‌ (50.99) తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని