జీవజాలం.. జలాధారం!

సముద్రాలు, నదులు, కాలువలు, సరస్సులు, హిమనీనదాలు, మంచు, గాలిలోని నీటి ఆవిరి సహా  భూమండలంపై నీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అది జలావరణం కిందికే వస్తుంది.  ఎన్నో రకాల జీవరాశులు ఇందులో మనుగడ సాగిస్తుంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడం,

Published : 08 Aug 2022 03:35 IST
జనరల్‌ స్టడీస్‌  
పర్యావరణ అంశాలు

సముద్రాలు, నదులు, కాలువలు, సరస్సులు, హిమనీనదాలు, మంచు, గాలిలోని నీటి ఆవిరి సహా  భూమండలంపై నీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా అది జలావరణం కిందికే వస్తుంది.  ఎన్నో రకాల జీవరాశులు ఇందులో మనుగడ సాగిస్తుంటాయి. పర్యావరణాన్ని పరిరక్షించడం, వాతావరణాన్ని సమతౌల్యం చేయడంలో ఈ ఆవరణ వ్యవస్థ అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఈ అంశాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.


జలావరణ వ్యవస్థ

ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో జీవ, నిర్జీవ కారకాల మధ్య శక్తి, పోషకాల మార్పిడి జీవ, భూ రసాయన వలయాల వల్ల జరుగుతుంది. ఇలాంటి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. జలం ఆవాసంగా ఉన్న ఆవరణ వ్యవస్థను జలావరణ వ్యవస్థ అంటారు. దీన్ని మూడు రకాలుగా విభజించవచ్చు.

మంచినీటి ఆవరణ వ్యవస్థ: మంచినీటిలో లవణీయత తక్కువగా ఉంటుంది (5% కంటే తక్కువ).
ఉదా: సరస్సులు, కొలనులు/చెరువులు, నీటి బుగ్గలు, నదులు.

సముద్ర ఆవరణ వ్యవస్థ: సముద్ర నీటిలో లవణీయత అత్యధికంగా (35% కంటే ఎక్కువ) ఉంటుంది. వీటిలో నివసించే జీవజాతుల వ్యవస్థ ప్రత్యేకమైంది.
ఉదా: సముద్రాలు, మహాసముద్రాలు

పరివర్తన ఆవరణ వ్యవస్థ: దీనిలో లవణీయత మధ్యస్థంగా (5% - 35%) ఉంటుంది. ఎస్ట్యురీలు, లాగూన్లు, సముద్ర వెనుక జలాలు, మాంగ్రూవ్స్‌లలో నివసించే జీవజాతులు దీని కిందకు వస్తాయి.

ప్రభావితం చేసే అంశాలు

సూర్య కాంతి: సమస్త జీవరాశికి మూలాధారమైన సూర్యకాంతి సాధారణంగా జలాల ఉపరితలం నుంచి 200 మీటర్ల లోతు వరకు మాత్రమే ప్రసరిస్తుంది. ఈ కాంతి ప్రసరించే లోతును బట్టి వృక్ష, జంతుజాలాల ఉనికి ఆధారపడి ఉంటుంది.

జలాల పారదర్శకత: నీటి పారదర్శకతను తగ్గించే బంకమన్ను, పూడికలు, వృక్ష ప్లవకాల వల్ల నీరు బురదమయమవుతుంది. నీటి పారదర్శకత తగ్గిన మేరకు లోతుకు వెళ్లే కొద్దీ కాంతి ప్రసరణ తగ్గుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గి జలావరణ వ్యవస్థ ఉత్పాదనా సామర్థ్యం తగ్గిపోతుంది.

ఉష్ణోగ్రత: పరిసర ఉష్ణోగ్రత మార్పులకు నీరు చాలా నెమ్మదిగా ప్రభావితమవుతుంది. అంటే నీటి ఉష్ణోగ్రత నెమ్మదిగా పెరుగుతుంది లేదా తగ్గుతుంది. అందువల్ల జలచర జీవరాశులకు ఉష్ణోగ్రతా సహనస్థాయి పరిధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నీటి ఉష్ణోగ్రతలో ఏ మాత్రం మార్పు వచ్చినా జలచర జీవరాశుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.

వివిధ మండలాలు

కొలను ఆవరణ వ్యవస్థ అనేది ఒక స్వయంసమృద్ధ జీవనాధార వ్యవస్థ. తీరం నుంచి లోతుకు వెళ్లే కొద్దీ జీవజాతుల ఆవాసాన్ని బట్టి దీన్ని వివిధ మండలాలుగా విభజించవచ్చు.

యూఫోటిక్‌ మండలం: ఇది జలాల ఉపరితల ప్రాంతం. ఇక్కడ సూర్యకాంతి సమృద్ధిగా ప్రసరించడం వల్ల కిరణజన్యసంయోగక్రియ రేటు అధికంగా ఉంటుంది. మొక్కల శ్వాసక్రియ చర్య కూడా ఎక్కువే. ఆక్సిజన్‌ పుష్కలంగా లభిస్తుంది.

లిట్టోరల్‌ మండలం: దీన్ని వేలాంచల మండలం అంటారు. ఇది తీరానికి దగ్గరగా ఉండి లోతు తక్కువగా ఉన్న ప్రాంతం. ఇక్కడ కాంతి అడుగు భాగం వరకు చేరుతుంది. అందువల్ల కిరణజన్య సంయోగక్రియ అధికంగా జరిగి ఆక్సిజన్‌ సమృద్ధిగా లభిస్తుంది. ఈ ప్రాంతంలో పెరిగే మొక్కల వేర్లు నీటి అడుగు భాగంలో ఉంటాయి. వాటి పత్రాలు నీటి ఉపరితలంపై తేలియాడుతుంటాయి.

ఉదా: నీటి లిల్లీలు, నీటిలో పూర్తిగా మునిగి ఉన్న మొక్కలు హైడ్రిల్లా, వృక్ష ప్లవకాలు లాంటి డయాటమ్స్‌, జంతు ప్లవకాలైన డాఫ్నియా రోటిఫెర్‌లు లాంటివి జీవిస్తాయి. మొక్కలను అంటిపెట్టుకునే నత్తలు, కీటక డింభకాలు, హైడ్రాలు నివసిస్తాయి. వేలాంచల అడుగు భాగంలో సంచరించే జీవులను బెంథాస్‌ జీవులు అంటారు.ఉదా: ఎర్రటి అనెలిడ్‌లు, క్రే చేపలు

లిమ్నెటిక్‌ మండలం: ఇది తీరానికి దూరంగా ఉండే జలాశయ ప్రాంతం. కొలనులో అతిపెద్ద మండలం. కాంతి సమృద్ధిగా లోపలికి వెళ్లగలిగే ప్రాంతం వరకు ఇది కొనసాగుతుంది. ఈ మండలంలో సమయానుకూలంగా ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ లభ్యతలు వేగంగా మారుతుంటాయి. ఈ ప్రాంతం ఉపరితల జలానికే పరిమితం. సరస్సు అడుగు భాగం వరకు లిమ్నెటిక్‌ మండలం విస్తరించదు. దీని కింద ప్రొఫండల్‌ మండలం ఉంటుంది. లిమ్నెటిక్‌ మండలంలో యూగ్లినాయిడ్స్‌, డయాటమ్స్‌, ఆకుపచ్చని శైవలాలు లాంటి స్వయంపోషక జీవులు అధికంగా నివసిస్తాయి. వీటితోపాటు జంతుప్లవకాలు, చేపలు, కప్పలు, నీటి సర్పాలు లాంటి వినియోగదారులూ జీవిస్తాయి. వేలాంచల మండలం, ప్రొఫండల్‌ మండలాలను వేరుచేస్తూ ఉన్న ఊహాజనిత రేఖను పరిహర మండలం లేదా కాంతి పరిహర మండలం అంటారు. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ రేటు, శ్వాసక్రియ రేటు సమానంగా ఉంటాయి.

ప్రొఫండల్‌ మండలం: ఇది లిమ్నెటిక్‌ మండలానికి కిందనున్న లోతయిన నీటి ప్రదేశం. ఈ ప్రాంతంలో కాంతి ప్రసరణ ఉండదు. ఈ నీటిలో ఆక్సిజన్‌ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇందులో కిరణజన్యసంయోగక్రియ జరిపే జీవులు ఉండవు. ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరిపే, కుళ్లిన ఆహార పదార్థాలను తినే విచ్ఛిన్నకారులు/పూతికాహార (డెట్రిటస్‌)జీవులు ఉంటాయి.

సరస్సు జీవావరణ వ్యవస్థ

జలావరణ వ్యవస్థల్లో సరస్సు జీవావరణ వ్యవస్థ ఒక ఉన్నత స్థాయి జీవావరణ వ్యవస్థ. ఇందులో జీవగోళంలో మాదిరి అన్ని విధులూ జరుగుతాయి. సౌరశక్తి సహాయంతో స్వయం పోషకాలు అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మారుస్తాయి. విచ్ఛిన్నకారులు చనిపోయిన జీవులను విచ్ఛిన్నం చేసి పోషక పదార్థాలు, ఖనిజాలు విడుదల చేయడం, అది తిరిగి స్వయంపోషకాల ద్వారా వినియోగంలోకి రావడం లాంటి ప్రక్రియలన్నీ జరుగుతాయి.

చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థ

తేమ, బురదతో కూడిన క్షార స్వభావం ఉన్న ప్రాంతాల్లో భౌమ, జల వనరుల మధ్య ఏర్పడిన సంక్లిష్ట ఆవరణ వ్యవస్థనే చిత్తడి ప్రాంత ఆవరణ వ్యవస్థగా పిలుస్తారు. ఇవి విలక్షణమైన జీవజాతులకు నిలయాలు. వలస పక్షులకు అనువైన ప్రదేశాలు. పోషకాల పరిమాణాన్ని పెంపొందిస్తాయి. కలుషిత జలాలను శుద్ధి చేస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని