Published : 12 Aug 2022 02:26 IST

కోతలతో.. చేరవేతలతో!

ప్రపంచ భూగోళశాస్త్రం

అఖాతాలు, లోయలు, సరస్సులు, జలపాతాలు, జలసంధులు, కొండకోనలు, దీవులు, ద్వీపకల్పాలన్నీ రకరకాల మార్గాల్లో ఏర్పడిన భూస్వరూపాలు. శిలావరణంపై అంతర, బాహ్య బలాలు జరిపిన చర్యల ఫలితాలు. వీచే గాలి, ప్రవహించే నీరు, కరిగి పడే మంచు, తీరాలను తాకే అలల వల్ల సంభవించే కోతలు, శైథిల్యాల చేరవేతలతో రూపొందినవి. భూమి పుట్టినప్పటి నుంచి ఈ క్రమక్షయ, నిక్షేపణలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిపై అవగాహన పెంచుకుంటే జాగ్రఫీని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.


క్రమక్షయ భూస్వరూపాలు

భూ ఆవిర్భావం నుంచి క్రమంగా శిలావరణ ఉపరితల దృశ్యాలపై అనేక అంతర్జనిత బలాలు (భూకంపాలు, అగ్నిపర్వతాల లాంటివి), బహిర్జనిత బలాలు (నదులు, పవనాలు, సముద్ర ప్రవాహాలు, అంతర్భూజలం, సముద్ర తరంగాలు) ఒకదానితో ఒకటి పరస్పరం వ్యతిరేక దిశలో పనిచేస్తూ ఉంటాయి. వీటి ఫలితంగానే భూఉపరితలంపై అనేక రకాల మూడో తరం భూస్వరూపాలు ఏర్పడ్డాయి. వాటినే క్రమక్షయ భూస్వరూపాలు (erosional landforms) అంటారు.

నదీ ప్రవాహాలతో ఏర్పడేవి

ఉష్ణమండల, సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో నదీ ప్రవాహాల క్రమక్షయ, నిక్షేపణ చర్యల వల్ల వాటి ప్రవాహ మార్గంలో వివిధ రకాల భూస్వరూపాలు ఏర్పడతాయి.

V - ఆకారపు వలయం: నదీ ప్రవాహమార్గంలో పక్కకోత కంటే అధోముఖ (downward) కోత ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి లోయలు ఏర్పడతాయి. ఉదా: హిమాలయ నదులు

గార్జ్‌లు: నదుల కోత వల్ల V ఆకారపు లోయల అంచులు కోతకు గురై నిటారుగా ఉన్న గోడలు కలిగిన గార్జ్‌లు అనే భూస్వరూపాలు ఏర్పడతాయి. ఉదా: గోదావరి నదికి ఉన్న బైసన్‌ గార్జ్‌

అగాధదరులు: V ఆకారపు లోయలు క్రమేణా కోతకు గురై అతిలోతైన లోయలుగా మారతాయి. అవే అగాధదరులు. వీటి గోడలు నిటారుగా ఉండి 2 లేదా 3 కి.మీ. లోతు కలిగి ఉంటాయి. ఉదా: ఉత్తర అమెరికాలో కొలరాడో నది ఏర్పరిచే గ్రాండ్‌ కాన్యాన్‌

నదీ జలపాతం: లోయ అడుగుభాగం విభిన్న శిలలతో ఉన్నప్పుడు మృదువైన శిలలు కోతలకు  గురై నదుల ప్రవాహ దిశ ఒక్కసారిగా పతనం  చెంది జలపాతాలు ఏర్పడతాయి.
ఉదా: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన జలపాతం ఏంజల్‌. ఇది వెనెజువెలాలోని ఒరినాకో నదిపై ఉంది. అతిపెద్దదైన నయాగరా జలపాతం అమెరికాలోని సెయింట్‌ లారెన్స్‌ నది(ఇరి, ఒంటారియా సరస్సుల మధ్య)పై  కెనడా, న్యూయార్క్‌ మధ్యలో ఉంది.

మోనాడ్‌ నాక్స్‌: క్రమక్షయ కారకాల వల్ల ఒక భూస్వరూపం పెనిప్లేన్‌ స్థితికి చేరకముందు అక్కడక్కడ మిగిలి ఉన్న అవశిష్టాలు లేదా చిన్నచిన్న గుట్టలే మోనాడ్‌ నాక్స్‌.

నదీ వంకరలు (మియాండర్స్‌): ప్రవాహ మార్గంలో వక్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వక్రమార్గాన్ని విడిచిపెట్టి నది తిన్నగా ప్రవహించడం వల్ల ఆ వక్రతలు సరస్సులుగా మారిపోతాయి. అవే నదీ వంకరలు. ఇవి ఎద్దు అడుగు రూపంలో ఉండటంతో ఆక్స్‌ బౌ సరస్సులుగా పేర్కొంటారు.

హిమానీనదాలతో...

ఉన్నత అక్షాంశ ప్రాంతాల్లో హిమానీనద క్రమక్షయ, నిక్షేపణ చర్య వల్ల ఈ భూస్వరూపాలు ఏర్పడతాయి. హిమానీనదాలనే మంచు నదులు అంటారు. పర్వత వాలును అనుసరించి భూగురుత్వాకర్షణ శక్తి వల్ల కిందకు జాలువారే మంచు సమూహాన్నే హిమానీనదం అంటారు.

హిమక్షేత్రాలు: నిరంతరం హిమపాతం జరిగి మంచుతో నిండిన ప్రాంతాలు.

హిమరేఖ: హిమక్షేత్రాల కింది సరిహద్దు.

ఐస్‌బర్గ్‌: హిమానీనదం సముద్రంలో చేరేటప్పుడు దాని అగ్రభాగం ముక్కలుగా విడిపోయి నీటిలో తేలియాడే మంచుగడ్డలు.

అవలాంచ్‌: భూఉపరితలంపై పడే అధిక బరువు ఉన్న మంచు ఖండాలు.

* ప్రపంచంలోనే అతిపెద్ద హిమానీనదం అంటార్కిటికా ఖండంలోని బియర్డ్‌ మోరే.

రోచ్‌ మాటినే: ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతాల్లో హిమానీనదాల కోత వల్ల పెద్ద బండరాళ్లు చిత్ర విచిత్రంగా ఆకారాన్ని సంతరించుకుంటాయి. ఇవి కూర్చున్న గొర్రెల మంద ఆకృతిని పోలి ఉంటే ‘షీప్‌ రాక్స్‌’ లేదా ‘రోచ్‌ మాటినే’ అంటారు.
గీ - ఆకారపు లోయలు: హిమానీనదాల కోతలతో ఈ రకమైన లోయలు ఏర్పడతాయి.  ఉదా: అమెరికాలోని సెయింట్‌ లారెన్స్‌ లోయ

డ్రమ్లిన్లు (Drumlins): ఇది హిమానీనదాలతో నిక్షేపితమైన భూస్వరూపం. కొన్ని మీటర్ల ఎత్తున్న శిలాఖండాలు, గులకరాళ్లు, ఇసుకలతో కూడి బోర్లించిన పడవ లేదా బోర్లించిన చెంచా లేదా బోర్లించిన కోడిగుడ్ల గంప ఆకృతిలో ఉంటాయి. వీటిని ఆకాశం నుంచి చూస్తే పరుగెత్తే మోటారు వాహనంలా ఉంటాయి.

ఎస్కర్లు: హిమానీనదాలతో నిర్మితమైన సన్నని పొడవైన రిడ్జ్‌లు. ఇవి ఇసుక, గ్రావెల్‌తో పొరలు, పొరలుగా నిర్మితమై సర్పాకృతిలో రైలు మార్గం వేయడానికి వేసిన గట్ల మాదిరి ఉంటాయి.

శుష్క, అర్ధశుష్క శీతోష్ణస్థితి ఉన్న ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో క్రమక్షయ, నిక్షేపణ చర్యల వల్ల,  ఏదైనా భౌగోళిక ప్రాంతం సున్నపురాయి శిలలతో ఏర్పడి ఉన్నచోట అంతర్భూజల చర్య వల్ల, తీరాన్ని తాకే సముద్ర అలల తాకిడి వల్ల తీర ప్రాంత భూభాగాల్లో రకరకాల భూస్వరూపాలు ఏర్పడతాయి.

తృతీయ భూస్వరూపాలు

ద్వీపం: అన్నివైపులా నీటితో ఆవరించి ఉన్న భూభాగమే ద్వీపం. ఉదా: శ్రీలంక, గ్రీన్‌లాండ్‌, గ్రేట్‌ బ్రిటన్‌

ద్వీపకల్పం: మూడువైపులా నీరు, ఒకవైపు భూభాగంతో ఉన్న భూ స్వరూపాన్ని ద్వీపకల్పం అంటారు. ఉదా: అరేబియా, భారతదేశం

భూసంధి: రెండు భూభాగాలను కలుపుతూ, రెండు జలభాగాలను వేరుచేసే సన్నని భూభాగాన్ని భూసంధి అంటారు. ఉదా: పనామా, సూయజ్‌  భూసంధులు

అగ్రం: చివరికొన సముద్రంలోనికి చొచ్చుకొనిపోతే ఆ కొనను అగ్రం అంటారు. ఉదా: ఆఫ్రికా ఖండపు చివరికొన గుడ్‌హోప్‌ అగ్రం, భారత్‌ చిట్టచివరి కొన కన్యాకుమారి అగ్రం

ఎడారి: అత్యల్ప వర్షపాతం, అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాన్ని ఎడారి అంటారు. ఉదా: సహారా, థార్‌, కలహరి

నది: పర్వతాలు, పీఠభూములు, మైదానాల మీదుగా సహజంగా ప్రవహించే జీవ లేదా అశాశ్వత జలప్రవాహాన్ని నది అంటారు.

లోయలు: సన్నని లోతైన భూతలాన్ని లోయలు అంటారు. ఇవి నదులు, హిమానీనదాల క్రమక్షయం వల్ల ఏర్పడతాయి. ఉదా: కృష్ణానదీ లోయ

పగులు లోయ: భూఅంతర్భాగంలోని బలాల వల్ల భూపటలంపైన ఉన్న రెండు సమాంతర భ్రంశాల (Delusions) మధ్య ఉన్న భాగం కిందికి జారడం వల్ల ఏర్పడిన లోయను పగులు లోయ అంటారు. ఉదా: నర్మద, తపతి నదులు ప్రవహించే లోయలు

అగాధదరి: నదీ ప్రవాహం కోత వల్ల నిట్రమైన పార్శ్వాలతో ఏర్పడిన లోతైన లోయను అగాధదరి అంటారు. ఉదా: అమెరికాలోని కొలరాడో అగాధదరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని