మనిషి మేధకు మించి!

అధిక వేగం, భారీ ఎత్తున సమాచారం నిల్వ, కచ్చితమైన విశ్లేషణ, ఒకేసారి అనేకమంది ఉపయోగించుకునే వీలు, శాస్త్రీయ పరిశోధన, మనిషి కంటే వేగంగా క్రోడీకరణ, విశ్లేషణ వంటి వాటిని సునాయాసంగా చేయగలిగిన ఎలక్ట్రానిక్‌ పరికరమే సూపర్‌ కంప్యూటర్‌. ఆధునిక కాలంలో ఔషధాల అభివృద్ధి, పరిశోధనల్లోనూ ఇవే కీలకం.

Published : 14 Aug 2022 02:29 IST

జనరల్‌స్టడీస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ

అధిక వేగం, భారీ ఎత్తున సమాచారం నిల్వ, కచ్చితమైన విశ్లేషణ, ఒకేసారి అనేకమంది ఉపయోగించుకునే వీలు, శాస్త్రీయ పరిశోధన, మనిషి కంటే వేగంగా క్రోడీకరణ, విశ్లేషణ వంటి వాటిని సునాయాసంగా చేయగలిగిన ఎలక్ట్రానిక్‌ పరికరమే సూపర్‌ కంప్యూటర్‌. ఆధునిక కాలంలో ఔషధాల అభివృద్ధి, పరిశోధనల్లోనూ ఇవే కీలకం. విపత్తులనూ ముందే అంచనా వేసే సామర్థ్యమూ వాటికి ఉంటుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సూపర్‌ కంప్యూటర్ల గురించి అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి.

సూపర్‌ కంప్యూటర్లు
సూపర్‌ కంప్యూటర్‌ అనేది అధిక ప్రాసెసింగ్‌ వేగం కలిగిన ఎలక్ట్రానిక్‌ పరికరం. దీనికి సాధారణ కంప్యూటర్‌ కంటే అధిక కంప్యూటింగ్‌ సామర్థ్యం ఉంటుంది. అధికవేగం, భారీమెమొరీ దీని ప్రత్యేకత. సూపర్‌ కంప్యూటర్ల పనితీరును ఫ్లాప్స్‌ (ఫ్లోటింగ్‌ పాయింట్‌ ఆపరేషన్స్‌ పర్‌ సెకండ్‌)తో కొలుస్తారు. దీన్ని మెగా ఫ్లాప్స్‌, గిగా ఫ్లాప్స్‌, టెరా ఫ్లాప్స్‌, పెటా ఫ్లాప్స్‌, ఎక్సా ఫ్లాప్స్‌, జిట్టా ఫ్లాప్స్‌, యొట్టా ఫ్లాప్స్‌గా సూచిస్తారు.
అనువర్తనాలు: - పెద్దమొత్తంలో చేసే కంప్యూటర్‌ సిమ్యులేషన్స్‌కు ఉపయోగపడుతుంది - ఎక్కువ మొత్తంలో ఏర్పడుతున్న సమాచార విశ్లేషణ (బిగ్‌ డేటా అనాలసిస్‌) - బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాలు - రక్షణ రంగ అనువర్తనాలు  - భూకంపాల విశ్లేషణ - విపత్తు నిర్వహణ - ఔషధ రంగ అభివృద్ధి - వివిధ రంగాల్లో పరిశోధన - కంప్యుటేషనల్‌ కెమిస్ట్రీ - కంప్యుటేషనల్‌ మెటీరియల్‌ సైన్స్‌, నానో మెటీరియల్స్‌ - మాలిక్యులర్‌ డైనమిక్స్‌ - వాతావరణాన్ని అంచనా వేయడం - వాతావరణ నమూనాలను రూపొందించడం - ఎయిరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ - కంప్యుటేషనల్‌ బయాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌ - అణురంగం - ఖగోళ భౌతిక శాస్త్రం - ప్రభుత్వ రంగ సమాచారం నిల్వ, విశ్లేషణ - పట్టణ రంగ వాతావరణ సమస్యలు

భారతదేశంలో..
సూపర్‌ కంప్యూటర్ల అభివృద్ధికి మొదటిసారిగా బెంగళూరులోని నేషనల్‌ ఏరో స్పేస్‌ లేబొరేటరీ ఫ్లోసాల్వర్‌ ప్రాజెక్టును ప్రారంభించింది.
సీ-డాక్‌: సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డాక్‌) అనేది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌లో పరిశోధన అభివృద్ధికి ఉపయోగపడే సంస్థ. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ అండ్‌  ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. సీ- డాక్‌ పరిశోధనా కేంద్రాలు పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా, మొహాలి, ముంబయి, దిల్లీ, పట్నా, నోయిడా, తిరువనంతపురం నగరాల్లో ఉన్నాయి. ఈ సంస్థ భారత్‌లో రెండు సూపర్‌ కంప్యూటర్‌ కేంద్రాలను నెలకొల్పింది. అవి నేషనల్‌ పరమ్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ ఫెసిలిటీ (ఎన్‌పీఎస్‌ఎఫ్‌) - పుణె, సీ-డాక్‌ టెరాస్కేల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ ఫెసిలిటీ (సీటీఎస్‌ఎఫ్‌) - బెంగళూరు. భారతదేశంలో మొదటి సూపర్‌ కంప్యూటర్‌ అయిన పరమ్‌-8000ను 1990లో సీ-డాక్‌ తయారుచేసింది. దీని సామర్థ్యం ఒక గిగా ఫ్లాప్‌. ప్యార్‌లల్‌ మిషన్‌ అనే పదానికి సంక్షిప్తంగా పరమ్‌ అనే పేరు పెట్టారు. పరమ్‌-8000 కంటే మెరుగైన పరమ్‌-8600ను 1992లో, పరమ్‌-9000ను 1994లో సీ-డాక్‌ తయారు  చేసింది.

సీ-డాక్‌  పరమ్‌ సిరీస్‌ సూపర్‌ కంప్యూటర్లు:
1998లో పరమ్‌-10000: దీని సామర్థ్యం 100 గిగా ఫ్లాప్స్‌.
2002లో పరమ్‌ పద్మ: దీని సామర్థ్యం 1 టెరా ఫ్లాప్‌. ఇది 2003 ప్రపంచ సూపర్‌ కంప్యూటర్‌ ర్యాంకుల్లో 171వ ర్యాంకు సాధించింది.
2008లో పరమ్‌ యువ: దీని సామర్థ్యం 54 టెరా ఫ్లాప్స్‌. 2008 ప్రపంచ సూపర్‌ కంప్యూటర్‌ ర్యాంకుల్లో 69వ స్థానం సాధించింది.
2013లో పరమ్‌ యువ-2: దీని సామర్థ్యం 529 పెటా ఫ్లాప్స్‌. ఇది 2013 ప్రపంచ సూపర్‌ కంప్యూటర్‌ ర్యాంకుల్లో 44వ స్థానం పొందింది.
పరమ్‌ కాంచన్‌జంగా: దీని సామర్థ్యం 15 టెరా ఫ్లాప్స్‌. దీన్ని ఎన్‌ఐటీ-సిక్కింలో ఉపయోగిస్తున్నారు.   సీ-డాక్‌, కేంద్ర కమ్యూనికేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌  టెక్నాలజీ సంయుక్తంగా ఏర్పాటు  చేశాయి.

వివిధ సంస్థల వద్ద ఉన్న సూపర్‌ కంప్యూటర్లు:
విర్గో - ఐఐటీ మద్రాస్‌లో ఉంది. ఇది 2012 ప్రపంచ సూపర్‌ కంప్యూటర్‌ ర్యాంకుల్లో 364వ స్థానం సాధించింది. అనుపమ్‌ - బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో ఉంది. ఇది మాలిక్యులార్‌ డైనమిక్స్‌ సిమ్యులేషన్‌, క్రిస్టల్‌ స్ట్రక్చర్‌ అనాలసిస్‌, గామా కిరణాల సిమ్యులేషన్‌ లాంటి వాటికి   ఉపయోగపడుతుంది. బార్క్‌ సంస్థ 2005లో రూపొందించిన మరొక సూపర్‌ కంప్యూటర్‌ అనుపమ్‌ అమేయ. సాగా - విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌లో ఉంది.పేస్‌ - ప్రాసెసర్‌ ఫర్‌ ఏరో డైనమిక్‌ కంప్యుటేషన్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ అనేది పేస్‌ పూర్తి పేరు. దీన్ని డీఆర్‌డీవోకు చెందిన అనురాగ్‌ (అడ్వాన్స్‌డ్‌ న్యూమరికల్‌ రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ గ్రూప్‌) అభివృద్ధి చేసింది. కంప్యుటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌, వాహన రంగం, విమానాల డిజైన్‌ వంటి వాటికి వాడుతున్నారు.
నిరీతి - కంప్యుటేషనల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీ, పుణె.
ఆదిత్య - ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రోపికల్‌ మెటియోరాలజీ, పుణె. దీని వద్ద ఉన్న మరో కంప్యూటర్‌ ప్రత్యూష్‌. ఇది 2018లో ప్రపంచ సూపర్‌ కంప్యూటర్లలో 39వ ర్యాంకు సాధించింది.
విక్రమ్‌ 100 - ఫిజికల్‌ రిసెర్చ్‌ లేబొరేటరీస్‌, అహ్మదాబాద్‌.
పరమ్‌ ఇషాన్‌- సామర్థ్యం 250 టెరాఫ్లాప్స్‌, ఐఐటీ గువాహటి.
మిహిర్‌ - నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌, నోయిడా. ఇది 2018 ప్రపంచ సూపర్‌ కంప్యూటర్లలో 66వ ర్యాంకు సాధించింది.

నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌
నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ (ఎన్‌ఎస్‌ఎమ్‌) వ్యవధి 2015-2022. కేటాయించిన నిధులు రూ.4,500 కోట్లు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ దీనికి మార్గనిర్దేశం చేశాయి. ఈ మిషన్‌ను  అమలుపరుస్తున్న సంస్థలు సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌. దీనిలో భాగంగా వివిధ పరిశోధనా సంస్థలు, విద్యాలయాల్లో సూపర్‌ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తారు.
ఎన్‌ఎస్‌ఎమ్‌లోని మూల స్తంభాలు: - మౌలిక వసతులు    - సూపర్‌ కంప్యూటర్ల అనువర్తనాలు - పరిశోధనా అభివృద్ధి - మానవ వనరులను పెంపొందించడం

నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ (ఎన్‌కేఎన్‌)లో భాగంగా సూపర్‌ కంప్యూటర్‌లతో నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ గ్రిడ్‌ను ఏర్పరుస్తారు. ఎన్‌కేఎన్‌ అన్ని సంస్థల కంప్యూటర్లను కలుపుతుంది. నేషనల్‌ సూపర్‌ కంప్యూటింగ్‌ మిషన్‌ డిజిటల్‌ ఇండియా,  మేక్‌ ఇన్‌ ఇండియాను ప్రోత్సహించి, సమర్థిస్తుంది.

ఎన్‌ఎస్‌ఎమ్‌లో భాగంగా నిర్మించిన సూపర్‌ కంప్యూటర్లు:
పరమ్‌ బ్రహ్మ - సామర్థ్యం 850 టెరా ఫ్లాఫ్స్‌. ఇండియన్‌   ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌, పుణె. పరమ్‌ సాంగనాక్‌ - 1.3 పెటాఫ్లాప్స్‌, ఐఐటీ కాన్పుర్‌. పరమ్‌ శక్తి -  1.66 పెటా ఫ్లాప్స్‌, ఐఐటీ ఖరగ్‌పుర్‌. పరమ్‌ ప్రవేగ - 3.3 పెటా ఫ్లాప్స్‌. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, బెంగళూరు. దీన్ని 2022 జనవరిలో ప్రారంభించారు. పరమ్‌ సిద్ధి ఏఐ - ఇది అధిక సామర్థ్యం ఉన్న కంప్యూటింగ్‌, కృత్రిమ మేధ కలిగిన కంప్యూటర్‌. సామర్థ్యం 5.267 పెటా ఫ్లాప్స్‌. పరమ్‌ గంగా -  1.66  పెటా ఫ్లాప్స్‌, ఐఐటీ రూర్కీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని